కాఫీ ఒక్కసారిగా ఆపేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులు ఏమిటి?

కాఫీ తాగుతున్న ఇద్దరు వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆడమ్ టేలర్
    • హోదా, ది కన్వర్జేషన్

కెఫీన్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా వినియోగించే సైకోయాక్టివ్(మనసుపై ప్రభావం చూపే) పదార్థం.

మీరు కాఫీ లేదా టీ తాగకపోయినా, కెఫీన్‌ను మీరు క్రమం తప్పకుండా తీసుకుంటూనే ఉంటారు. అదెలాగంటే- మనం తీసుకునే చాలా పదార్థాల్లో, సోడా నుంచి కోల్డ్ మెడిసిన్, చాకోలెట్ వరకు ప్రతిదానిలో ఎంతో కొంత కెఫీన్ ఉంటుంది.

కెఫీన్‌ తీసుకున్నప్పుడు, మీ శరీరం దాన్ని వేగంగా గ్రహిస్తుంది. రెండు గంటల్లోగా మీ శరీరంలో దీని ప్రభావం చూపుతుంది. శరీరం నుంచి కెఫీన్ పదార్థం బయటికి వెళ్లేందుకు కనీసం తొమ్మిది గంటల సమయం పడుతుంది. నీళ్లలో, కొవ్వులో ఇది తేలికగా కరిగిపోతుంది. శరీరంలో ఉన్న అన్ని కణజాలాలోకి ఇది చొచ్చుకుని వెళ్లగలదు.

ఈ కారణంతోనే కెఫీన్ వల్ల శరీరంలో వచ్చే ప్రభావం ఏంటి? ఎందుకు శరీరంలో వివిధ భాగాలను ఇది ప్రభావితం చేయగలదు వంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కాఫీ

ఫొటో సోర్స్, Getty Images

పెద్దవారు రోజులో 400 మిల్లీగ్రాములకు మించి కెఫీన్ తీసుకోవద్దని పలు సూచనలున్నాయి.

పరిమితికి మించి కెఫీన్ తాగితే కండరాల వణుకు, తలనొప్పి, వికారం, వాంతి వచ్చేలా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు.

రోజుకు కొన్ని కప్పుల టీ లేదా కాఫీ తాగిన వారికి కూడా చిరాకుగా అనిపించడం, నిద్ర పట్టకపోడం, భయంగా అనిపించడం వంటి దుష్ఫ్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇటీవల కెఫీన్‌ వదిలిపెట్టే వారి సంఖ్య పెరుగుతూ ఉంది.

కాఫీ వదిలేయడం వల్ల మైగ్రేన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాఫీ వదిలేయడం వల్ల వచ్చే తలనొప్పి 9 రోజుల వరకు ఉంటుంది

మెదడు ఎలా పనిచేస్తుంది?

కాఫీ తాగకుండా వదిలేయడం వల్ల కూడా తలనొప్పి, అలసట రావొచ్చు. ఎందుకు ఇలా జరుగుతుందంటే- శరీరం ఈ పదార్థాన్ని అలవాటు చేసుకుని ఉంటుంది.

మెదడులో ఉండే అడెనోసిన్ అనే గ్రాహకానికి (రిసెప్టర్‌కు) కెఫీన్ అనుసంధానమై ఉంటుంది. కెఫీన్‌కు, మెదడుకి మధ్యనున్న ఈ సంబంధం వల్ల మనకు అలసట కాస్త ఆలస్యంగానే వస్తుంది.

కానీ, కాలం గడుస్తున్న కొద్దీ, కెఫీన్ తాగడం వల్ల మెదడులోని కణాలు మరిన్ని అడెనోసిన్ గ్రాహకాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సాధారణ అడెనోసిన్ గ్రాహకాలకు అనుసంధానమయ్యేలా చేస్తాయి.

మీరు కెఫీన్‌ను తీసుకోవడం మానేసినప్పుడు అత్యధికంగా ఉన్న అడెనోసిన్ గ్రాహకాల వల్ల, అలసట వస్తుంది. అంతకుముందు కంటే ఎక్కువ అలసటగా భావిస్తారు.

తలనొప్పుల పరంగా చూసుకున్నాఇలానే జరుగుతుంది. తలలో, మెడలో ఉన్న రక్తకణాలు కుంచించుకుపోయేందుకు ఈ పదార్థం కారణమవుతుంది. దీని వల్ల మెదడులోకి వెళ్లే రక్త సరఫరా తగ్గుతుంది.

కానీ, కెఫీన్ తాగడం ఆపేసిన 24 గంటల తర్వాత, మీ రక్తకణాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. మెదడులోకి రక్త సరఫరా పెరుగుతుంది. దీని వల్ల తలనొప్పి వస్తుంటుంది.

ఇలా కెఫీన్ తాగడం ఒక్కసారిగా ఆపేస్తే, ఆ తర్వాత మనకు కలిగే అసౌకర్యం తొమ్మిది రోజుల పాటు ఉంటుంది.

నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెఫీన్ తీసుకోవడం వల్ల సరిగ్గా నిద్ర ఉండకపోవచ్చు

సాయంత్రం కెఫీన్ తీసుకుంటే నిద్రపై ప్రభావం

అడెనోసిన్ గ్రాహకాలకు కెఫీన్ అనుసంధానమై ఉంటుంది కాబట్టి, దాన్ని మానేసినప్పుడు సాధారణంగానే కాస్త తలనొప్పి వస్తుంది.

మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం వేళల్లో కెఫీన్ తీసుకోవడం వల్ల అది నిద్రపై ప్రభావం చూపుతుంది. మనకు అలసట కలిగించే మెలాటోనిన్ అనే హార్మోన్ విడుదలను ఇది 40 నిమిషాల పాటు ఆలస్యం చేస్తుంది.

ఆ కారణంతోనే నిద్రకు భంగం ఏర్పడుతుంది. కెఫీన్ మొత్తంగా నిద్రా సమయాన్ని, గాఢ నిద్ర వ్యవధిని కూడా తగ్గించేస్తుంది.

దీని వల్ల తర్వాత రోజు కూడా మనకు అలసటగా అనిపిస్తుంది. కాస్త ఆలస్యంగా మేల్కొని ఉండేందుకు కెఫీన్‌ను మీరు తీసుకోవచ్చు. కానీ, ఇది తర్వాత మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

కెఫీన్‌ తీసుకోవడం మీరు ఆపివేస్తే, మీ నిద్ర మెరుగవుతుంది. 12 గంటల్లో ఈ ఫలితాలను చూసినట్లు కొన్ని ఆధారాలు నిరూపిస్తున్నాయి.

ఒత్తిడి, గందరగోళానికి గురయ్యే సంఘటనల పెరుగుదల కూడా కెఫీన్‌తో ముడిపడి ఉంటాయి.

కెఫీన్‌ను తగ్గించడం లేదా పూర్తిగా తీసుకోవడం మానేస్తే మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది మంచి నిద్ర వల్ల కావొచ్చు.

నిద్రలేమి, నిద్రకు భంగం కలగడం వల్ల మీకు చిరాకుగా, అలసటగా అనిపిస్తుంది. వివిధ మానసిక స్థితులను కలిగి ఉంటారు.

కెఫీన్‌ కలిసిన అడెనోసిన్ గ్రాహకాలు ఇతర న్యూరోట్రాన్స్‌మీటర్స్‌లో మార్పులకు కారణమవుతాయి. ఈ మార్పుల వల్ల ఒత్తిడి, ఆనందం, భయం వంటి భావనలు మనలో కలుగుతూ ఉంటాయి.

రక్తపోటు, హార్ట్ రేటు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రక్త పోటు, హార్ట్ రేటుపై కెఫీన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు అవసరం.

గుండెపై కెఫీన్ ప్రభావమెంత?

కెఫీన్ తీసుకోవడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల గుండెలో మంట, అజీర్తి కూడా తగ్గిపోతాయి.

కెఫీన్ మన కడుపులో యాసిడ్ ద్రవాలను చొప్పిస్తుంది. దీని వల్ల జీర్ణాశయ వ్యవస్థలో సమస్యలు కలుగుతాయి.

కెఫీన్‌ను వదిలేయడం వల్ల రక్తపోటు, హార్ట్‌ రేటు తగ్గుతుండొచ్చు. కానీ, దీని గురించి లోతుగా, స్పష్టంగా తెలుసుకోవడం కోసం మరిన్ని అధ్యయనాలు అవసరం.

ఎవరైనా ఎన్నో ఏళ్ల తరబడి కెఫీన్‌ను తీసుకుంటూ ఉంటే, వారి శరీరం దీనికి అలవాటు పడిపోతుంది. అప్పటి నుంచి నాడీ వ్యవస్థ, జీర్ణాశయం, గుండెపై ఉత్తేజకరమైన ప్రభావాలను కలగజేసే సరికొత్త కారకంగా ఇది మారిపోతుంది.

కెఫీన్ శరీరంలో కరిగేలా, జీవక్రియకు సంబంధించిన ఒక జన్యుపరమైన కారకం శరీరంలో భాగమవుతుంది. కొంత మంది వ్యక్తులు ఇతరుల కంటే ఎక్కువగా కెఫీన్‌కు ప్రభావితమవుతున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సినవసరం ఉంది.

పళ్లు మెరవడం

ఫొటో సోర్స్, Getty Images

కాఫీ మానేస్తే దంతాలు మెరుస్తాయి

కెఫీన్‌ను మీరు తీసుకోవడం మానేస్తే, మీ దంతాల్లో తెలుపుదనం పెరుగుతుంది. నేరుగా కెఫీన్ వల్ల ఇది జరగదు.

టీ, కెఫీన్‌లో ఉండే టానిస్ లాంటి పదార్థాల వల్ల ఇలా జరుగుతుంది. ఈ పదార్థాలు పళ్లపైనే ఉండిపోతాయి.

షుగర్ అనేది శక్తినిచ్చే పానీయం. ఇది మీ పళ్లను దెబ్బతీస్తుంది. పళ్లు దెబ్బతినకుండా కాపాడే లాలాజల ఉత్పత్తిని కెఫీన్ డ్రింక్‌లు తగ్గిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

కెఫీన్ తీసుకోవడం ఆపేస్తే మిఠాయిలు, పానీయాల రుచిని ఆస్వాదించే సామర్థ్యం మీలో పెరుగుతుంది. రుచిని గ్రహించే పదార్థాలపై కెఫీన్ తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటుంది.

కెఫీన్ వల్ల పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది

కెఫీన్ తాగడం వల్ల జీర్ణాశయంలో కండరాలపై ముఖ్యంగా పెద్ద పేగుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల పదేపదే మూత్ర విసర్జనకు వెళ్లాలనిపిస్తూ ఉంటుంది.

మల విసర్జన స్థిరత్వంలో కూడా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా మీరు ఎక్కువగా కెఫీన్‌ను తాగితే, శరీరం నీళ్లను గ్రహించే శక్తిపై అది ప్రభావం చూపుతుంది.

కెఫీన్ తేలికగా మూత్ర విసర్జన జరిగేలా చేస్తుంది. దీని వల్ల శరీరంలో మూత్ర ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

కిడ్నీలలో ఉండే అడెనోసిన్ గ్రాహకాలతో ఇది అనుసంధానమవ్వడంతో, మన శరీరంలో ఉండే సోడియం ప్రభావంలో మార్పులు తీసుకొస్తుంది. శరీరంలో నీటి నిలుపుదలను ప్రభావితం చేస్తుంది.

కెఫీన్ బ్లాడర్‌కు కూడా చిరాకు తెప్పిస్తుంది. దీని వల్ల పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాలనిపిస్తుంది. కెఫీన్ తగ్గించడం వల్ల మీరు పదేపదే బాత్‌రూమ్‌కి వెళ్లడం కూడా తగ్గుతుంది.

కాఫీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెఫీన్ వదిలేసేటప్పుడు, ఆ పదార్థాన్ని మొదటి నుంచి మీరెంత తీసుకుంటున్నారనేదాన్ని బట్టి దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది.

వినియోగం సమతుల్యంగా ఉండాలి

మీరు కెఫీన్‌ను మీ ఆహార పదార్థాల నుంచి తొలగించాలనుకుంటే, క్రమంగా తగ్గించుకుంటూ వెళ్లడం మంచిది.

కెఫీన్ తాగడం ఒక్కసారిగా ఆపివేస్తే, తలనొప్పి, అలసట వంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవచ్చు. కానీ, అవి రెండు నుంచి మూడు వారాలు మాత్రమే.

ఈ లక్షణాలు కూడా మీరు రోజులో ఎంత కెఫీన్ తీసుకునేవారు, ఎంత కాలంగా కెఫీన్ తీసుకుంటున్నారనే దాన్ని బట్టి ఉంటాయి.

(వ్యాసకర్త ఆడమ్ టేలర్ ఇంగ్లండ్‌లోని లాంకెస్టర్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ క్లినికల్ అనాటమీ స్టడీస్‌కు డైరెక్టర్, ప్రొఫెసర్. ‘ద కన్వర్జేషన్‌’లో ఈ కథనం ప్రచురితమైంది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)