చిన్న పిల్లలకు ‘స్కిన్ కేర్’ ఉత్పత్తులు వాడితే సమస్యలే: డెర్మటాలజిస్టులు

- రచయిత, అన్నాబెల్ రాక్హామ్
- హోదా, బీబీసీ హెల్త్ రిపోర్టర్
చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఎనిమిదేళ్ల వయస్సు పిల్లలలో పెరుగుతున్న ట్రెండ్, కోలుకోలేని చర్మ సమస్యలకు దారితీస్తుందని బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ డెర్మటాలజిస్ట్స్ హెచ్చరిస్తోంది.
తమ అభిమాన ఇన్‌ఫ్ల్యుయెన్సర్స్ ఆయా ప్రోడక్టులను ఉపయోగిస్తున్నట్లు యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో పిల్లలు చూసి కొనివ్వాలంటూ తల్లిదండ్రులను అడుగుతున్నారు.
కానీ ఈ ప్రోడక్టుల్లో చాలా వరకు హానికరమైన 'ఎక్స్‌ఫోలియేటింగ్' యాసిడ్స్ ఉండటంతో వాటిని పెద్దలు మాత్రమే వాడాలని చెబుతారు. ఈ యాసిడ్స్ కారణంగా శరీరంలో అలర్జీ, తామరలు వస్తుంటాయి.
సాదీ అనే ఎనిమిదేళ్ల బాలిక సోషల్ మీడియాలో ఇన్‌ఫ్ల్యుయెన్సర్స్ చర్మ సంరక్షణ వీడియోలను చూసింది.
ఆమె ముఖ్యంగా బబుల్ కంపెనీ నుంచి వచ్చిన ఒక ప్రోడక్ట్‌కు ఆకర్షితురాలైంది. "మీరు దాన్ని నొక్కితే పువ్వు ఆకారంలోకి వస్తుంది" అని దాని గురించి సాదీ బీబీసీతో చెప్పింది.

రంగురంగుల ప్యాకింగ్‌తో ఆకర్షణ
అమెరికా బ్రాండ్ 'డ్రంక్ ఎలిఫెంట్' ప్యాకేజింగ్‌ని సాదీ చాలా ఇష్టపడింది, ఆ సంస్థ లిప్ బామ్‌ల నుంచి మాయిశ్చరైజర్‌ల వరకు రకరకాల ప్రోడక్ట్స్ అమ్ముతుంటుంది.
స్కిన్ కేర్ పట్ల పిల్లలు ఆసక్తి చూపించడం, సోషల్ మీడియా, స్నేహితుల ప్రభావం గురించి పలువురు తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ బీబీసీని సంప్రదించారు.
డ్రంక్ ఎలిఫెంట్ అనేది ప్రకాశవంతమైన రంగురంగుల ప్యాకేజింగ్, కార్టూన్-జంతువుల లోగోతో ఆన్‌లైన్ చర్మ సంరక్షణలో తరచుగా కనిపించే బ్రాండ్‌లలో ఒకటి.
ఎక్కువగా అమ్ముడుపోయే వాటిలో చాలా వరకు భారత కరెన్సీ ప్రకారం 6 వేలకు పైగా ఖరీదు చేస్తాయి. ఈ ప్రోడక్టులలో ఆల్ఫా, బీటా హైడ్రాక్సీ యాసిడ్‌లు, విటమిన్-ఏ డెరివేటివ్ రెటినోల్ వంటి ఎక్స్‌ఫోలియేటర్‌లు ఉంటాయి.
సోషల్ మీడియాలో నియంత్రణ లేని స్కిన్‌కేర్ వీడియోలు, కథనాలు దర్శనమిస్తున్నాయి. 'డైలీ రొటీన్', 'గెట్ రెడీ విత్ మీ' వంటి వీడియోలకు లక్షల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి.
పిల్లలు హానికరమైన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నట్లుగా కనిపించే టిక్‌టాక్ వీడియోలను స్కిన్‌కేర్ యూట్యూబర్లు వ్యాప్తి చేస్తున్నారు.

‘పిల్లలను దూరంగా ఉంచండి’
అమెరికాలోని సెఫోరా, ఉల్టా వంటి బ్యూటీ స్టోర్‌లకు పిల్లలు వెళ్తే అక్కడి టెస్టర్‌లను దుర్వినియోగం చేస్తారని, అలాగే ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చిన వెంటనే వాళ్లు తీసుకెళతారని అక్కడి వర్కర్లు చెబుతున్నారు.
వీటిలో ముఖ్యంగా డ్రంక్ ఎలిఫెంట్ చాలా ప్రజాదరణ పొందిన బ్రాండ్.
"యాసిడ్‌లు, రెటినోల్స్‌తో కూడిన మా శక్తిమంతమైన ఉత్పత్తులకు పిల్లలు, యువత దూరంగా ఉండండి" అని డ్రంక్ ఎలిఫెంట్ వ్యవస్థాపకుడు టిఫనీ మాస్టర్‌సన్ సోషల్ మీడియాలో చెప్పాల్సి వచ్చింది.
"వారి చర్మానికి ఈ పదార్థాలు అవసరం లేదు" అని టిఫనీ చెప్పారు. దీనిపై స్పందనకు డ్రంక్ ఎలిఫెంట్‌ను బీబీసీ సంప్రదించింది.
తన స్నేహితులు ప్రోడక్టులు కొనేశారని తెలిసిన సాదీ వాటిని కొనాలంటూ తల్లి లూసీని అడుగుతోంది. తల్లి అంగీకరించకపోవడంతో కుటుంబంలోని ఇతరులను అడగడం మొదలుపెట్టింది సాదీ.
ఆ ప్రోడక్టుల కారణంగా సాదీ చర్మం ఎర్రగా, దురదగా మారిందని లూసీ తెలిపారు. అందుకే కూతురు ఆ ప్రోడక్టులు వాడకుండా చేశారు లూసీ.
"పిల్లలకు అన్నీ వివరించడం కష్టం" అని లూసీ, బీబీసీతో అంటున్నారు.
"సాదీ స్నేహితులతో కలిసి స్కిన్ కేర్ పాటిస్తుంది, అలా చేయకపోతే ఏదో కోల్పోయినట్లు భావిస్తుంది" అని లూసీ తెలిపారు.
చర్మ సంరక్షణపై తనకూ ఆసక్తి ఉన్నప్పటికీ, సాదీ అడిగే కొన్ని బ్రాండ్‌ల గురించి ఎప్పుడూ వినలేదని లూసీ గుర్తు చేస్తున్నారు.
సాదీకి చిన్న వయసులోనే సోషల్ మీడియా వద్దనుకొని టిక్ టాక్ నుంచి దూరంగా ఉంచారు తల్లి. అయితే యూట్యూబ్‌లో వారికి వీడియోలు సులభంగా దొరుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'ఇన్‌ఫ్ల్యుయెన్సర్లనే నమ్ముతున్నారు'
"ఎనిమిదేళ్ల పాప అందరికంటే ఎక్కువగా ఇన్‌ఫ్ల్యుయెన్సర్లను నమ్మితే, ఆమెకు చర్మ సంరక్షణపై మనం అవగాహన కల్పించడం చాలా కష్టం" అని లూసీ అంటున్నారు.
"ఆమె నా చిన్న కూతురు, ఈ వయసులో తన చర్మ సంరక్షణ గురించి నేను చింతించాల్సి వస్తుందనుకోలేదు. ఆమెకు బాల్యం దూరమైనట్లుగా ఉంది'' అని అన్నారు.
చర్మ సంరక్షణ గురించి పిల్లలు సమాచారం పొందవచ్చని, కానీ, తప్పుడు సమాచారం కాదని పీడియాట్రిక్ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ టెస్ మెక్‌ఫెర్సన్ అన్నారు
"ఇవి యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు. పాత చర్మానికి తగినవి కావచ్చు కానీ, పిల్లలకు సరిపోవు'' అని టెస్ బీబీసీతో చెప్పారు.
"అవి ఏ వయసులోని వారి చర్మానికైనా ఇబ్బంది కలిగించేవే. ముఖ్యంగా యువ చర్మానికి ప్రమాదకరమైనవి. సున్నితమైన చర్మం ఉన్న పిల్లలకు సమస్యలనూ కలిగిస్తాయి. వాటిలో చాలా వరకు సువాసనగా ఉంటాయి, కొన్నింటితో అలర్జీలూ రావచ్చు" అని అన్నారు టెస్.
'డబ్బు ఖర్చు చేయవద్దు'
ప్రోడక్టుల ప్యాకింగ్ రంగురంగులుగా, ప్రకాశవంతంగా ఉండటంతో పిల్లలు ఆకర్షితమవుతున్నారని బ్రిటిష్ డెర్మటాలజిస్ట్స్ అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ మెక్‌ఫెర్సన్ తెలిపారు.
పిల్లల చర్మ సమస్యలను పరిష్కరించాలనుకుంటే తల్లిదండ్రులు డాక్టర్ లేదా చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలని మెక్‌ఫెర్సన్ సూచిస్తున్నారు.
"మీరు ఖరీదైన ఉత్పత్తుల కోసం డబ్బు ఖర్చు చేయవద్దు, పరిపూర్ణమైన చర్మాన్ని వెతికితే ఫలితం ఉండదు, ఎందుకంటే అలాంటిది లేదు" అని చెప్పారు.
స్కిన్ కేర్ ప్రోడక్టులను దుకాణాలలో లేదా ఆన్‌లైన్‌లో కొనడానికి వయస్సు పరిమితులు లేవు.
బ్రిటన్‌లో పిల్లల కోసం చర్మ సంరక్షణ బ్రాండ్‌లను నిల్వ చేసిన అనేక మంది రిటైలర్‌లను బీబీసీ సంప్రదించింది.
యువ కస్టమర్లు, వారి తల్లిదండ్రులకు నిర్దిష్ట సమాచారం తెలియజేయడానికి స్టోర్‌లో మరో 2,500 మంది బ్యూటీ స్పెషలిస్ట్‌లకు శిక్షణ ఇస్తున్నట్లు బూట్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ధోర్డో: ఎడారి మధ్యలోని ఈ గుజరాత్ గ్రామానికి లక్షల మంది టూరిస్టులు ఎందుకు వస్తున్నారు?
- అయోధ్య: శ్రీరాముడిని గెలిపించిన 'రామ్‌లల్లా' ఎవరో తెలుసా?
- చిప్స్, కూల్ డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉంటుంది, పూర్తిగా మానేయాలా? ఎంత తినొచ్చు
- శుభ్‌మన్ గిల్, అశ్విన్, షమీ, స్మృతి మంధానకు బీసీసీఐ అవార్డులు.. పురస్కారాలు పొందిన క్రీడాకారుల జాబితా ఇదే
- సుభాష్‌చంద్రబోస్: ‘మై డార్లింగ్, నువ్వు నా హృదయరాణివి’ అంటూ బోస్ ఎవరికి ప్రేమలేఖలు రాశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














