వెన్నునొప్పి తగ్గడానికి పనికొచ్చే చికిత్సలేమిటి? ఫలితమివ్వని పద్ధతులేమిటి? నడుముకు బెల్ట్ వాడడం వల్ల ప్రయోజనం లేదా

వెన్నునొప్పి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నడుము నొప్పికి సిఫార్సు చేసిన చికిత్సల్లో మసాజ్ ఒకటి
    • రచయిత, ఆండ్రీ బీర్నాత్
    • హోదా, బీబీసీ న్యూస్ బ్రెజిల్

వెన్నునొప్పి, ముఖ్యంగా నడుము ప్రాంతంలో వచ్చే నొప్పి చాలా సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్య.

చాలామందిని ఈ నొప్పి వేధిస్తుంటుంది. రోజువారీ జీవితంపై ప్రభావం చూపే ఆ నొప్పి గురించి మనకు ఎంత తెలుసు?

ఒకవేళ మీకు ఇప్పటివరకు ఈ నొప్పి రాకపోయి ఉంటే ఏదో ఒకరోజు మీరు ఈ బాధను అనుభవించే అవకాశం ఉంది.

చాలా వైకల్యాలకు లో బ్యాక్ పెయిన్ ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్ధరిస్తోంది. ఈ నొప్పి వల్ల రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని చెబుతోంది.

2020లో దాదాపు 13 మందిలో ఒకరు కనీసం ఒక్కసారైన ఈ సమస్యతో బాధపడ్డారు. 1990తో పోలిస్తే ఈ సమస్య 60 శాతం పెరిగింది.

రాబోయే దశాబ్దాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతూనే ఉంటుందని, 2050 నాటికి 84 కోట్ల మంది దీని బారిన పడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది.

వెన్నునొప్పి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దాదాపు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో వెన్ను నొప్పి బారిన పడతారు. చాలా సందర్భాల్లో ఇది తీవ్రమైనది కాదు

ఈ సమస్య వ్యక్తులపైనే కాకుండా సమాజంపై కూడా ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. ఈ మేరకు 2023 డిసెంబర్‌లో క్రానిక్ లో బ్యాక్ పెయిన్ (వరుసగా మూడు నెలలకు మించి ఉండే నొప్పి) చికిత్సకు సంబంధించి తొలిసారిగా మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులు ఈ మార్గదర్శకాలను ఆమోదించారు. వెన్నునొప్పి సమస్యకు చికిత్స చేసేటప్పుడు నిజంగా ఏది పనిచేస్తుంది? ఏది పనిచేయదు అనే అంశాలపై శాస్త్రీయ ఆధారాలను ఈ నిపుణులు విశ్లేషించారు.

వెన్నునొప్పి చికిత్సకు ఏది పనిచేస్తుంది?

డబ్ల్యూహెచ్‌వో ప్రకారం, లో బ్యాక్ పెయిన్‌కు సానుకూల ఫలితాలను ఇచ్చే చికిత్సలు ఇవి

  • ప్రామాణిక అవగాహన, కౌన్సిలింగ్
  • నిర్మాణాత్మక శారీరక వ్యాయామ విద్య కార్యక్రమం
  • ఆక్యుపంక్చర్, ఇతర సూది చికిత్స పద్ధతులు
  • స్పైనల్ మ్యానిపులేటివ్ థెరపీ (ఒక రకమైన మసాజ్)
  • మసాజ్
  • బిహేవియర్ థెరపీ
  • కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఒక రకమైన మానసిక చికిత్స)
  • సాధారణ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఔషధాలు (ఐబుప్రోఫెన్, డైక్లోఫెనాక్ వంటివి)
  • శరీరంపై రాసే ఆయింట్‌మెంట్‌లు
  • సమగ్ర బయోఫిజికల్ కేర్
వెన్నునొప్పి

ఫొటో సోర్స్, Getty Images

ఏవి పనిచేయవు

వెన్నునొప్పికి పెద్దగా పనిచేయవని నిపుణులు భావించిన చికిత్సా విధానాలనూ డబ్ల్యూహెచ్‌వో తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

  • ట్రాక్షన్ (వెన్నెముక నుంచి ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగించే పరికరాలు, పద్ధతులు)
  • ఆల్ట్రాసౌండ్ చికిత్స
  • ట్రాన్స్‌క్యుటేనియస్ ఎలక్ట్రికల్ న్యూరోస్టిములేషన్ (టీఈఎన్‌ఎస్)
  • నడుముకు సపోర్టునిచ్చే బెల్టులు
  • సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్‌ యాంటీ డిప్రెసెంట్స్
  • స్కెలెటల్ మజిల్ రిలాక్సంట్స్
  • కోర్టికోస్టెరాయిడ్ తరగతి మందులు
  • ఇంజెక్షన్ చేసే మత్తుమందులు
  • డెవిల్స్ క్లా, హెర్బల్ మెడిసిన్
  • యాంటీ ఒబెసిటీ మందులతో బరువు తగ్గడం
వెన్నునొప్పి

ఫొటో సోర్స్, Getty Images

సరైన అధ్యయనాలు లేని చికిత్సలు

వెన్నునొప్పిని తగ్గించడంలో సరిగ్గా పనిచేస్తాయా లేదో కచ్చితంగా తెలుసుకోవడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేని చికిత్సల గురించి కూడా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

వీటిని సరైన చికిత్సలుగా పేర్కొనడానికి మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

  • రియాక్టివ్ బిహేవియర్ థెరపీ (ఒక రకమైన మానసిక చికిత్స)
  • కాగ్నిటివ్ థెరపీ (ఒక రకమైన మానసిక చికిత్స)
  • మైండ్‌ఫుల్‌నెస్, ఒత్తిడి తగ్గింపు పద్ధతులు
  • పారాసిటమాల్
  • బెంజోడైజిపెన్ తరగతి మందులు
  • గంజాయి (కానబీస్) ఆధారిత పద్ధతులు
  • ఆర్నికా ఆధారిత టోపికల్ పద్ధతులు
  • అల్లం/హెర్బల్ మెడిసిన్
  • తెల్ల కలువ ఆధారిత పద్ధతులు
  • నాన్-ఫార్మాకోలాజికల్ ఇంటర్‌వెన్షన్స్ ద్వారా శరీర బరువు నియంత్రణ

శాస్త్రీయ అధ్యయనాలు లేనప్పటికీ ఈ జాబితాలో కేవలం ఒక పద్ధతిని మాత్రమే మంచి చికిత్సగా పరిగణించారు. అదేంటంటే, వెన్నునొప్పి ఉన్న వ్యక్తుల కదలికకు సహాయపడే పరికరాలు.

వెన్నునొప్పి

ఫొటో సోర్స్, Getty Images

రోగ నిర్ధరణతో మొదలు

వెన్నునొప్పికి చాలా కారణాలు ఉంటాయని బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ రూమటాలజీ అధ్యక్షుడు డాక్టర్ మార్కో ఆంటోనియో అరౌజో రోచా లారెస్ అన్నారు.

‘‘చాలాసార్లు భంగిమ దీనికి కారణం అవుతుంది. పనిచేసేటప్పుడు శరీరభంగిమ, కొన్నిసార్లు మానసిక కారకాలు కూడా దీన్ని ప్రభావితం చేస్తాయి.

కొన్నికేసుల్లో క్యాన్సర్‌ లేదా మెటాస్టాసిస్‌కు ఇది సంకేతం కావొచ్చు’’ అని ఆయన చెప్పారు.

మెటాస్టాసిస్ అంటే వైద్యులు పేర్కొన్నదాని ప్రకారం, క్యాన్సర్ కణాలు మూలం నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. ఎముకల్లో ముఖ్యంగా వెన్నెముకలో ఇవి స్థిరపడతాయి.

రోజుల తరబడి ఈ నొప్పి తగ్గకపోతే, రోగ నిర్ధారణ కోసం వైద్యుని వద్దకు వెళ్లడం చాలా ముఖ్యం.

ముందుగా ఆసుపత్రిలో వైద్యుడు ప్రాథమికంగా పరిశీలించిన తర్వాత ఇంకా ఏమైనా అనుమానాలుంటే సీటీ, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలు అవసరమవుతాయని ఆర్థోపెడిక్, స్పైన్ సర్జన్ లుసియానో మిల్లర్ అన్నారు. ఆయన సావో పాలోని ఇసెరిటా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో పనిచేస్తారు.

‘‘లో బ్యాక్ పెయిన్‌తో బరువు తగ్గడం, కాళ్లు బలహీనపడటం, రెండు మూడు నెలలు గడిచినా నొప్పి తగ్గకపోవడం, క్యాన్సర్ చరిత్ర ఉన్న పిల్లలు, రోగులను ప్రభావితం కావడం ఇలాంటి సంకేతాలను చాలా తీవ్రమైనవిగా పరిగణిస్తాం’’ అని ఆయన చెప్పారు.

వెన్నునొప్పి

ఫొటో సోర్స్, ISTOCK

డబ్ల్యూహెచ్‌వో జారీ చేసిన సూచనలు క్రానిక్ లో బ్యాక్ పెయిన్‌ చికిత్సలను ప్రామాణీకరించడానికి సహాయపడినప్పటికీ ప్రతీ రోగి తమ పరిస్థితికి అనుగుణంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని బీబీసీ న్యూస్‌తో నిపుణులు చెప్పారు.

ఒకవేళ భావోద్వేగ కారకాల (ఎమెషనల్ ఫ్యాక్టర్స్)తో వెన్నునొప్పి వచ్చినప్పుడు సైకియాట్రిక్ మూల్యాంకనం, యాంటీడిప్రెసెంట్ డ్రగ్స్ అవసరం అవుతాయి.

అయితే, వెన్నునొప్పి నివారణకు మ్యాజిక్ ఫార్ములా ఏదీ లేదని వైద్యులు నొక్కి చెప్పారు. మందుల వల్ల కాస్త ఉపశమనం కలగవచ్చు. కానీ, రోజువారీ జీవన విధానంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు అందిస్తాయని అన్నారు.

‘‘పెద్దగా కదలకుండా ఉండే జీవన శైలి, ఒత్తిడి, ధూమపానం వంటి వాటి వల్ల కలిగే నొప్పులతో తరచుగా వైద్యుని వద్దకు వెళ్తారు.

నొప్పికి చికిత్స పొందడానికే పరిమితం కాకుండా నివారణ దిశగా మనం ఆలోచించాలి. సరైన భంగిమలో కూర్చోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, స్ట్రెచింగ్, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించడం వంటివి చేయాలి’’ అని మిల్లర్ సూచించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)