ఇన్ఫెక్షన్ల వల్ల ‘ఏజింగ్’ వేగంగా ఉంటుందా?

టెలోమీర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇన్ఫెక్షన్ల బారిన పడిన వారి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పనితీరుపై అధ్యయనాలు జరిగాయి.
    • రచయిత, రాక్వెల్ బెహార్, అమండా ఫెర్నాండెజ్, మరియా జిమెంజ్
    • హోదా, బీబీసీ ముండో

మనం ఇన్ఫెక్షన్ బారిన పడిన ప్రతిసారి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా మారి, మనల్ని రక్షించేందుకు పోరాడుతుంది. అలా క్రమంగా శక్తిని కోల్పోతుంది.

తాజా పరిశోధనల ప్రకారం ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల బారిన పడిన వారి ‘బయోలజికల్ వయసు’ సాధారణ వయసు కన్నా ఎక్కువ ఉంటుంది.

అలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల బారిన పడిన 40 ఏళ్ల వయసున్న వ్యక్తిలోని రోగనిరోధక వ్యవస్థ 60 ఏళ్ల వయసున్న వ్యక్తిలో ఉన్నట్లుగా మారడమనేది అసాధారణమేమీ కాదని చెప్పొచ్చు.

అయితే, వైరస్ మన వయసును ప్రభావితం చేస్తుందా?

అది అర్థం చేసుకోవడానికి మనం మన తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యు వ్యవస్థ గురించి, క్రోమోజోములు అంటే, ఎక్స్ ఆకారంలో నాలుగు చేతులు ఉన్నట్లుగా కనిపించే సూపర్ డీఎన్ఏ వ్యవస్థ గురించి చెప్పుకోవాలి.

ముఖ్యంగా, ప్రతి క్రోమోజోన్ చివరన హెల్మెట్ లాంటి ఆకారంలో ఉండే నిర్మాణాల గురించి కూడా చెప్పుకోవాలి. వీటిని టెలోమీర్స్ అని పిలుస్తాం.

క్రోమోజోములు వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతి కణం నుంచి పునర్విభజన జరిగినప్పుడు క్రోమోజోముల చివరన ఉండే టెలోమీర్స్ నిడివి తగ్గుతూ వస్తుంది. దీనినే టెలోమీర్స్ తగ్గుదల అని చెప్తారు..

టెలోమీర్ అంటే?

‘టెలోమీర్’ పదం గ్రీకు మూలాల నుంచి పుట్టింది. టెలోమీర్ అంటే ‘చివరి భాగం’ అనే అర్థం వస్తుంది.

క్రోమోజోముల చివరన ఉండే టెలోమీర్స్ దళసరిగా ఉండే క్రోమోజోములు విచ్ఛిన్నం లేదా దెబ్బతినకుండా వాటి రక్షణలో కీలకంగా ఉంటాయి.

మరోలా చెప్పాలంటే, హెల్మెట్ల వంటి టెలోమీర్స్ రక్షణగా లేకపోతే క్రోమోజోములు విచ్ఛిన్నమవడం లేదా వేరవడం వంటివి జరిగే ప్రమాదముంది.

మన శరీరంలో ఉండే కణాలు మన పుట్టుక నుంచి మరణం వరకు ఒకేలా ఉండవు. ఎప్పటికప్పుడు పునర్విభజనకు గురవుతూ ఉంటాయి. ఒక కణం నుంచి రెండు కణాలు మారడం, వాటి నుంచి మరికొన్ని కణాలు రావడం.. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

ప్రతి కణంలోనూ 23 జతల క్రోమోజోములు ఉంటాయన్న విషయం మనకు తెలుసు.

ప్రతి కణం నుంచి పునర్విభజన జరిగినప్పుడు క్రోమోజోముల చివర ఉండే టెలోమీర్స్ నిడివి తగ్గుతూ వస్తుంది. దీనినే టెలోమీర్స్ తగ్గుదల అని చెప్తారు..

అలా నిర్దిష్టమైన విభజనల తర్వాత టెలోమీర్స్ నిడివి తగ్గిపోయి, వాటి పనితీరును సక్రమంగా నిర్వర్తించలేవు. ఆ ఫలితంగా ఆ క్రోమోజోమ్ నిర్మాణం కొంచెం కొంచెంగా విచ్ఛిన్నమవుతుంది. చివరికి కణాల పునర్వివిభజన శక్తిని కోల్పోతాయి.

ఆ లెక్కన టెలోమీర్స్ ఆ నిర్దేశిత కణం ఎన్ని పునర్విభజనలు జరిపే సామర్థ్యం ఉందో నిర్దేశించగలవు.

అందుకే యువకుల్లో కన్నా వృద్ధుల్లో టెలోమీర్స్ నిడివిలో తరుగుదల ఎక్కువ ఉంటుంది.

అలా వయసు పెరిగే కొద్దీ టెలోమీర్స్ ప్రభావితమవుతాయి. అవే కాకుండా, ఇతర కారణాలు అంటే జాతి, ఒత్తిడి, లింగ బేధం, పోషకాహారం, వ్యాధుల బారిన పడటం వంటి కారకాలు కూడా టెలోమీర్స్‌ నిడివిలో తరుగుదలపై ప్రభావం చూపుతుంటాయి.

టెలోమీర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్ల బారిన పడే వారిలో రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది.

‘ఇమ్యూన్ ఏజింగ్’ అంటే ఏమిటి?

రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలు హానికరమైన సూక్ష్మజీవులను ఎదుర్కొన్న సందర్భంలో భారీగా పునర్విభజనలు జరిపి, ఆ సూక్ష్మజీవులను నాశనం చేసే వరకు పోరాడతాయి.

ఆ లెక్కన ఇన్ఫెక్షన్ బారిన పడిన ప్రతిసారీ రోగ నిరోధక కణాలు భారీ పునర్విభజనలు జరుపుతాయి. ఆ ఫలితంగా టెలోమీర్ల నిడివిలో తరుగుదల ఏర్పడి, క్రమంగా రోగనిరోధక కణాలు తమ శక్తిని కోల్పోతాయి. మరో విధంగా చెప్పాలంటే, రోగనిరోధక కణాల వయసు పెరిగినట్లే. దీనిని ఇమ్యూన్ ఏజింగ్ అని చెప్తారు.

ఓ వ్యక్తి జీవిత కాలంలో ఎక్కువ ఇన్ఫెక్షన్ల బారిన పడితే, ఆ వ్యక్తి శరీరంలో ఎక్కువశాతం టెలోమీర్లు నిడివిలో తరుగుదల ఏర్పడుతుంది. ఫలితంగా రోగనిరోధక కణాల శక్తి తగ్గిపోతుంది. నిపుణులు దీనిని ‘వైరస్ కలిగించే వృద్ధాప్యం’గా చెప్తారు.

అధ్యయనాల్లోనూ హెచ్ఐవీ, ఎప్‌స్టీన్-బార్ వైరస్, హెపటైటిస్ సీ వైరస్ వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడిన రోగుల్లో ఇతర రోగాల బారిన పడిన వారితో పోలిస్తే, వైరస్ ఇన్ఫెక్షన్లు సోకిన వారిలో రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన టెలోమీర్స్‌ ఎక్కువగా తగ్గిపోయినట్లు తేలింది.

కోవిడ్ బారిన పడిన వారిలోనూ ఇదే పరిస్థితి కనిపించిందని పరిశోధకులు చెప్పారు.

ఆ లెక్కన చూస్తే, మొదట చెప్పినట్లుగా సహజ వయసు కన్నా బయోలజికల్ వయసు ఎక్కువగానే ఉంటుంది.

క్రోమోజోములు

ఫొటో సోర్స్, THE CONVERSATION

ఫొటో క్యాప్షన్, క్రోమోజోముల చివరన ఉన్న హెల్మెట్ల వంటి ఆకారాలను టెలోమీర్లు అంటారు.

వ్యాక్సీన్ తీసుకున్నా పెద్ద మార్పు కనిపించదు

టెలోమీర్ల నిడివిలో తరుగుదల, ఇమ్యూన్ ఏజింగ్ వల్ల శరీరంలోని కణాలు ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని కోల్పోతాయి. దానివల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ.

అందువల్లే ఇన్ఫెక్షన్ల బారిన పడ్డ వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. టీకాలు తీసుకున్నా వారిలో గణనీమైన మార్పు కనిపించదు. ఎందుకంటే, వ్యాక్సీన్ ప్రభావవంతంగా పనిచేయాలంటే, చురుకైన రోగనిరోధక వ్యవస్థ అవసరం.

టెలీమర్స్ నిడివిలో తరుగుదల వల్ల మరో సమస్య కూడా ఉంది. పనితీరు క్రియాశీలకంగా లేకపోవడంతో దెబ్బతిన్న కణజాలం పునరుత్పత్తి కావడం సాధ్యం కాదు. ఆ ఫలితంగా రోగుల్లో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదముంది.

వైరల్ ఇన్ఫెక్షన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్యూన్ ఏజింగ్ వల్ల ఇతర పరిణామాలు ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి.

ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు

ఇమ్యూన్ ఏజింగ్ వల్ల ఇతర పరిణామాలు కూడా ఉన్నాయి.

శ్వాసకోశ, యూరినరీ ఇన్ఫెక్షన్లు, ఎండోకార్డిటిస్ ఇన్ఫెక్టివ్ (ఎండోకార్డియమ్ ఇన్ఫెక్షన్), సెప్సిస్ (రక్తంలో బ్యాక్టీరియా), క్యాన్సర్, అల్జీమర్స్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

ఆటో ఇమ్యూన్ వ్యాధులంటే రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేయడం.

ఇన్ఫెక్షన్లు ఇమ్యూన్ ఏజింగ్‌కు దారి తీయడమే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడే ప్రమాదాలను పెంచుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.

టెలోమీర్ల తగ్గుదలకు ఇన్ఫెక్షన్లు, వృద్ధాప్యానికి గల సంబంధంపై మరింత లోతైన పరిశోధనలు అవసరమని అధ్యయన ఫలితాలు చెప్తున్నాయి.

అంతేకాక, టెలీమర్ల తగ్గుదలను నియంత్రించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

(వ్యాసకర్తలు రాక్వెల్ బెహర్ లాగరెస్, అమండా, మరియా ఏంజెల్స్‌లు నేషనల్ సెంటర్ ఆఫ్ మైక్రోబయాలజీ కార్లొస్ III హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధకులు)

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)