క్లస్టర్ హెడేక్స్: ‘‘తలనొప్పి తట్టుకోలేక తలను గోడకేసి బాదుకుంటా’’, అప్పుడెలా అనిపిస్తుందంటే?

డారెన్
ఫొటో క్యాప్షన్, ఎడమ కన్ను నుంచి నీరు కారడంతో ఈ తలనొప్పి మొదలవుతుంది
    • రచయిత, ఏంజీ బ్రౌన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డారెన్ ఫ్రాంకిష్ 17 ఏళ్లుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు. నొప్పిని తట్టుకోలేక ఆయన గట్టిగా అరవడం, తలను గోడకేసి బాదుకోవడం వంటివి చేస్తారు.

ఒక బేస్‌బాల్ బ్యాట్‌తో తలపై గట్టిగా కొడుతున్నట్లుగా, కత్తితో కంట్లో పొడుస్తున్నట్లుగా ఆ నొప్పి ఉంటుందని 53 ఏళ్ల డారెన్ చెప్పారు. ఆయన ఎడిన్‌బ్రా‌లో ఉంటారు.

దీన్ని క్లస్టర్ తలనొప్పి అని పిలుస్తారు. మానవులను ప్రభావితం చేసే అత్యంత బాధాకరమైన పరిస్థితులలో ఒకటిగా దీన్ని భావిస్తారు.

‘‘లాక్‌డౌన్ సమయంలో నేను నడుస్తూ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ దారిలో బస్సు వస్తే దాని కింద పడిపోవాలని అనుకోవడం నాకు గుర్తుంది. కాబట్టి దీన్ని ఎందుకు ‘సూసైడ్ హెడేక్ ’ అని అంటారో నాకు తెలుసు’’ అని బీబీసీ స్కాట్లాండ్ న్యూస్‌తో ఆయన చెప్పారు.

డారెన్ ఫ్రాంకిష్ ఒక హార్టికల్చరల్ ఇంజినీర్.

‘‘మళ్లీ తలనొప్పి ఎప్పుడు వస్తుందో అనే భయంతో బతుకుతున్నా. ఈ భయం నా ప్రాణాల్ని తీసేస్తుంది. ఎప్పుడైనా ఈ తలనొప్పి రావొచ్చనే సంగతి నాకు తెలుసు. ఇదో మానసిక హింస. అందుకే నేను చాలా భయపడుతున్నా’’ అని ఆయన వివరించారు.

డారెన్
ఫొటో క్యాప్షన్, 37 ఏళ్ల వయస్సులో డారెన్ ఫ్రాంకిష్ తొలిసారి క్లస్టర్ తలనొప్పి బారిన పడ్డారు

15 నిమిషాల నుంచి 3 గంటల పాటు ఈ నొప్పి ఉంటుంది. రోజులో ఏడు లేదా ఎనిమిది క్లస్టర్లుగా వస్తుంటుంది. అందుకే వీటిని ‘క్లస్టర్ హెడేక్స్’ అని పిలుస్తారు.

కానీ, డారెన్ 12 గంటల పాటు ఉండే నొప్పిని కూడా భరించారు.

తలకు ఎడమ వైపున, కంటి పైనుంచి ఈ నొప్పి ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు.

‘‘నా ఎడమ కన్ను ఎర్రబారడం మొదలవుతుంది. తర్వాత నీరు కారుతుంది. ముక్కు మూసుకుపోతుంది. తలలో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది’’ అని ఆయన తెలిపారు.

‘‘ఈ నొప్పిని భయంకరమైనదని చెప్పొచ్చు. ఒక బేస్‌బాల్ బ్యాట్‌తో బలమంతా ఉపయోగించి ఎవరో కొట్టినట్లుగా ఉంటుంది. ఎడమ కన్నుపై నుంచి కత్తితో లోపలికి గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంది. చాలా చిరాకుగా ఉంటుంది. కొన్నిసార్లు శారీరకంగా అనారోగ్యంగా ఉంటుంది. దిండును పెట్టుకొని గట్టిగా అరుస్తా. గోడకు లేదా గట్టిగా ఉండే మరోదానికి తలను బాదుకుంటా. వెలుతురును చూడటం తట్టుకోలేక గదిలో చీకటి చేసుకొని అందులోనే ఉంటాను’’ అని ఆయన వివరించారు.

కంటి నుంచి విపరీతంగా నీరు కారుతుండటం వల్ల డారెన్ కొన్నిసార్లు ఎడమ కంటికి క్లాత్‌ను చుట్టుకొని వాకింగ్‌కు వెళ్తుంటారు.

‘‘ఈ నొప్పి వచ్చినప్పుడు నేను ఎవరితోనూ మాట్లాడలేను’’ అని ఆయన చెప్పారు.

ఇటీవలి కాలంలో ఈ రకమైన తలనొప్పులు తరచుగా వస్తున్నాయని, ఎక్కువ సమయం పాటు అలాగే ఉంటున్నాయని ఆయన అన్నారు.

గత మే నెలలో రెండు సార్లు 12 గంటల చొప్పున నొప్పి రావడంతో ఆయన ఎడిన్‌బ్రాలోని రాయల్ ఇన్‌ఫర్మరీ ఏ అండ్ ఈ విభాగంలో రెండు రాత్రులు ఉన్నారు.

‘‘ఇప్పటివరకు నేను అనుభవించిన వాటిలో ఈ రెండు సార్లు వచ్చిన నొప్పి చాలా భయంకరమైనది, దారుణమైనది’’ అని ఆయన అన్నారు.

డారెన్

ఫొటో సోర్స్, DOUG ARMAND/ GETTY IMAGES

క్లస్టర్ హెడేక్స్ అంటే ఏంటి?

క్లస్టర్ తలనొప్పులు అరుదైనవి. వెయ్యి మందిలో ఒకరిని ఈ నొప్పి వేధిస్తుంటుంది. యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు అంచనా.

తలనొప్పి కంటే ఇది చాలా తీవ్రమైనదని బ్రెయిన్ రీసెర్చ్ యూకే రీసెర్చి మేనేజర్ కేటీ మార్టిన్ అన్నారు.

‘‘డారెన్ వివరించినట్లుగా క్లస్టర్ అటాక్ వల్ల కలిగే నొప్పి భరించలేనిది. ఆ నొప్పిని తట్టుకోలేక ప్రజలు అరుస్తారు, గోడలకు తలను బాదుకుంటారు. బాధితులకు సమర్థవంతమైన ఉపశమనాన్ని అందించేందుకు కొత్త చికిత్సల కోసం అవసరమైన పరిశోధనల కోసం మేం నిధులు సమకూర్చుతున్నాం’’ అని కేటీ చెప్పారు.

ఈ తలనొప్పి మామూలుగా మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. బాధితులు 30 ఏళ్లు పైబడినవారై ఉంటారు.

నొప్పి వచ్చే తీరు మారుతుంటుంది. ఒక్కోసారి కొన్ని రోజుల వ్యవధిలో ఒకసారి నొప్పి వస్తే, కొన్నిసార్లు ఒకే రోజులో పలుమార్లు ఈ నొప్పి వస్తుంది. నొప్పి వచ్చిన ప్రతీసారి 15 నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు అది కొనసాగవచ్చు.

నొప్పితో పలుమార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి రావొచ్చు. ఇది ప్రజల జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. నిరుద్యోగానికి దారి తీస్తుంది.

దీనివల్ల డిప్రెషన్ వచ్చే ముప్పు మూడు రెట్లు పెరుగుతుంది. ఆత్మహత్య ఆలోచనలకు పురికొల్పుతున్నట్లుగా కూడా నివేదికలు వచ్చాయి.

డారెన్

వైద్యం లేదు

2007లో 37 ఏళ్ల వయస్సులో డారెన్‌కు తొలిసారి ఈ నొప్పి వచ్చింది.

‘‘ప్రేగ్‌లో నా కుటుంబంతో కలిసి హాలిడేలో ఉన్నప్పుడు నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్ లాంటి ఏదో తీవ్రమైన సమస్య వచ్చి ఉంటుందని నాకు అనిపించింది’’ అని డారెన్ చెప్పారు. ఆయనకు ఇద్దరు పిల్లలు.

అప్పటినుంచి ఆయనకు స్టెరాయిడ్స్, లిథియం సహా గుండె సంబంధిత మందులు, మూర్చకు ఇచ్చే ఔషధాలను సూచించారు.

‘‘నాకు మూర్చ లేదు. కానీ, వారు అన్ని రకాల ఔషధాలను నామీద ప్రయత్నిస్తున్నారు. ఏదీ పనిచేయడం లేదు. ఒక ఇంజెక్షన్ కూడా సిఫార్సు చేశారు. నొప్పి రాగానే ఆ ఇంజెక్షన్ వేసుకుంటా. కొన్నిసార్లు పనిచేస్తుంది’’ అని ఆయన చెప్పారు.

ఆయన అన్ని రకాల డైట్‌లను ప్రయత్నించారు. స్మోకింగ్, ఆల్కహాల్‌లను వదిలేశారు. అయినప్పటికీ ఆయనకు తలనొప్పి రావడం తగ్గలేదు.

‘‘చికిత్సలో భాగంగా తదుపరి దశలో నా తలలో ఒక నర్వ్ బ్లాక్‌ను ఇంజెక్ట్ చేయనున్నారు’’ అని ఆయన చెప్పారు.

స్థానిక మత్తుమందు కొద్దికాలం పాటు నరాలను మొద్దుబారేలా చేస్తుంది. స్టెరాయిడ్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల ఒక సంవత్సరం పాటు తలనొప్పిని తగ్గించవచ్చు.

‘‘ప్రమాదకరమైన ఈ చికిత్సను తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈ సూసైడ్ హెడేక్స్ కారణంగా నా జీవితం అంతా అతలాకుతలమైంది. ఆ నొప్పులతో అంతా సర్వనాశనం అవుతోంది. ఆ నొప్పి వచ్చినప్పుడు నేనేం చేయలేను. నా వైవాహిక జీవితాన్ని కూడా ఇది ప్రభావితం చేసింది. దీనివల్ల మేం విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. నా అరుపులు వింటూ నా పిల్లలు పెరుగుతుంటే నా మీద నాకే అసహ్యం వేసేది’’ అని ఆయన వివరించారు.

మెనింజైటిస్ వల్ల క్లస్టర్ తలనొప్పి వస్తుందని సూచించే కొన్ని ఆధారాలను డారెన్ చదివారు. రెండేళ్ల వయస్సులో ఒకసారి, 12 ఏళ్ల వయస్సులో మరోసారి ఆయన మెనింజైటిస్ బారిన పడ్డారు.

ప్రస్తుతానికి ఆయన ఈ తలనొప్పితోనే జీవించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)