రజినీకాంత్‌ను ‘సంఘీ’ అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, తమిళనాడులో జరుగుతున్న రగడ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా ‘లాల్ సలామ్’ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక సందర్భంగా తన తండ్రి ‘సంఘీ కాదు’ అని ఆయన కుమార్తె ఐశ్వర్య అన్నారు. ఐశ్వర్య ఈ సినిమాకు నిర్మాత కూడా.
కానీ దీనిపై బీజేపీ జాతీయ మహిళా నేత వణతి శ్రీనివాసన్ మాట్లాడుతూ ‘సంఘీ’ అయినందుకు గర్వపడాలన్నారు.
దీనిపై రజినీకాంత్ కూడా ‘సంఘీ’ అనే పదం చెడ్డదేమీ కాదని చెప్పారు.
ఈ’ నేపథ్యంలో అసలు సంఘీ అంటే ఏమిటి,. దీనిని దర్పానికి ప్రతీకగా వాడొచ్చా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
దీనిపై బీబీసీ పలువురు విద్యావేత్తలతో మాట్లాడింది.

ఫొటో సోర్స్, LYCA PRODUCTION/X
అసలేం జరిగింది?
సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను సామాజిక మాధ్యమాలలో అనేక అంశాలలో విమర్శిస్తుంటారు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దును రజినీకాంత్ సమర్థించడం, ట్యుటికోరన్ కాల్పుల సంఘటనలో నిరసనకారులను సంఘ వ్యతిరేక శక్తులని వ్యాఖ్యానించడం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్ళపై పడటం, రామ మందిర ప్రారంభోత్సవం రోజున అయోధ్యకు వెళ్ళడం తదితర అంశాలపై తమిళనాడులో ఆయన విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో జనవరి 26వ తేదీన ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్’ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక జరిగింది.
ఈ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ భాయ్ అనే పాత్ర పోషించారు.
ఈ వేడుకలో ఐశ్వర్య మాట్లాడుతూ ‘‘ మా నాన్నను సంఘీ అని పిలుస్తున్నారని విని నాకు కోపం వచ్చింది. రజినీకాంత్ సంఘీ కాదు. ఆయనే సంఘీ అయి ఉంటే లాల్ సలామ్ చిత్రంలో నటించేవారు కాదు’’ అని చెప్పారు.
ఆయనో మానవతా వాది. ఆయన కాకుండా మరెవరూ ఈ సినిమాలో ఇంత ధైర్యంగా నటించి ఉండేవారు కాదు. మీరు ఏ మతానికి సంబంధించినవారు అనేదాంతో సంబంధం లేకుండా ఓ రజినీ అభిమానిగా ఈ సినిమా మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది అని తెలిపారు.
అనంతరం ఐశ్వర్య వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు వణతి శ్రీనివాసన్‌ను అడగ్గా, సంఘీగా ఉండటాన్ని గర్విస్తానని చెప్పారు.
‘‘బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసేవారు, వ్యతిరేక భావనలు ఉన్నవారు ఎప్పటి నుంచో మమ్మల్ని తక్కువ చేయడానికి సంఘీ అనే పదం వాడుతున్నారు. ఇది చాలా కాలం నుంచి సాగుతోంది’’ అని చెప్పారు.
‘‘అసలు సంఘీ అంటే ఏమిటి? సంఘీ అంటే నిజమైన దేశ భక్తులు. దేశ ప్రయోజనాల విషయంలో వారు రాజీపడరు. మీరు మమ్మల్ని సంఘీ అని పిలిస్తే కచ్చితంగా మేం గర్విస్తాం’’ అని తెలిపారు.
జనవరి 29న విమానాశ్రయంలో రజినీకాంత్‌ను ఇదే విషయంపై అడిగినప్పుడు ‘‘సంఘీ అనేపదం తప్పు పదమేమీ కాదు. మా అమ్మాయి సరిగ్గానే మాట్లాడింది. మా అమ్మాయి ఉద్దేశంలో నేనొక ఆధ్యాత్మక వాదిని. అలాంటప్పుడు నన్ను సంఘీ అని మాత్రమే ఎందుకు అంటారనేది ఆమె ప్రశ్న’’ ఆని ఆయన వివరణ ఇచ్చారు.

ఫొటో సోర్స్, RSS/X
సంఘీ అనే పదం ఎలా పుట్టింది?
ఓ ప్రైవేటు యూనివర్సిటీలో తమిళ విభాగ మాజీ అధిపతిగా పని చేసి, ప్రస్తుతం అదే యూనివర్సిటీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న తమిళరసిని సంఘీ అనే పదం గురించి చెప్పమని అడిగాం.
‘‘1951 అక్టోబరులో . శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రాష్ట్రీయ స్వయం సేవక్‌తో సంప్రదించి భారతీయ జన సంఘ్‌ను నెలకొల్పారు. భారతీయ జనసంఘ్ హిందీలో ‘ జన్‌సంఘ్’గా తెలుసు. ఆ పార్టీ సభ్యులందరూ తమని తాము సంఘీలుగా పిలుచుకుంటారు. ఆ పేరు వారికి వారుగా పెట్టుకున్నదే’’ అని తమిళరసి వివరించారు.
సంఘీ అనేపదం తమిళము, కాదు సంస్కృతమూ కాదు అని ఆయన తెలిపారు.
‘‘ప్రస్తుతం ఓ ప్రత్యేక భావజాలానికి సంబంధించిన పార్టీకి చెందినవారిని సంఘీగా చెబుతున్నారు. గతంలో సంఘ్‌లో పనిచేస్తున్నవారిని మాత్రమే సంఘీ అని పిలిచేవారు.’’ అని తెలిపారు.
కానీ ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో దీనిని ప్రత్యేకంగా వాడుతున్నారు. సంఘీ అనే పదాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారని రిటైర్డ్ తమిళ ప్రొఫెసర్ దిలీపన్ అన్నారు.
‘‘ఓ దశాబ్దం కిందట తమిళనాడులో అలాంటి పదమేదీ వాడుకలో లేదు. కనీసం తమిళ సాహిత్యంలో కూడా కనిపించదు’’ అని దిలీపన్ వివరించారు.
సంఘీ అనే పదానికి అర్థం ఏమిటని అడిగితే ‘‘మార్పులను అంగీకరించనివారే సంఘీ. అందుకే బీజేపీ దానిని చూసి గర్విస్తుంటుంది. తమ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉండేవారికి సంఘీ అనేపదం అవమానకరమైనదిగా కనిపిస్తుంది’’ దిలీపన్ తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బీజేపీ ఎందుకు గర్విస్తుంది?
తాను సంఘీ అయినందుకు గర్విస్తున్నట్టు బీజేపీకి చెందిన వణతి శ్రీనివాసన్ చెప్పారు.
దీనిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాసన్‌తో మాట్లాడాం.
సంఘీ అంటే స్నేహితుడనే అర్థం హనుమాన్ చాలీసాలో ఉందని, అందుకే తాము గర్విస్తామని చెప్పారు.
‘‘మహా వీర విక్రమ భజరంగి.. గుమతి నివార్ కే సంఘీ’’ అనే లైన్లను వివరిస్తూ ‘‘ తులసీదాస్ రామాయణాన్ని హిందీలో రాశారు. హనుమంతునిపై ఆయనకు ఉన్న భక్తి కారణంగా హనుమాన్ చాలీసా రాశారు. ఈ చాలీసాలో సంఘీ అనే పదం కనిపిస్తుంది. సంఘీ అనేపదం స్నేహితుడు అనే భావనతో కనిపిస్తుంది. అందుకే మేం గర్విస్తాం’’ అని శ్రీనివాసన్ చెప్పారు.

ఫొటో సోర్స్, AISHWARYA RAJINIKANTH/INSTAGRAM
సంఘీ పదం అవమానకరమైనదా?
సంఘీ అనేపదం అవమానకరంగా ఉపయోగిస్తున్నారా అని రచయిత మత్తిమారన్‌ను ప్రశ్నిస్తే సంఘీ అనేపదం వాడుకలోని ధ్వని దానిని అవమానకరమైన పదంలా చూపుతుందన్నారు.
‘‘సంఘీ అనే పదం ఎవరూ సృష్టించలేదు. సంఘీ అని పేరు ఎవరూ పెట్టిందీ కాదు. జనసంఘ్ నుంచి మొదలుపెడితే బీజేపీలోని సభ్యులు, దానికి అనుబంధంగా ఉండేవారందరూ తమను తాము సంఘీలని పిలుచుకుంటున్నారు’’ అని చెప్పారు.
కానీ ఇప్పుడు బీజేపీ మద్దతుదారులను, దానికి అనుబంధంగా ఉండేవారందరినీ పార్టీతోనూ, సంఘంతోనూ పనిలేకుండానే సంఘీ అని పిలుస్తున్నారని మత్తిమారన్ తెలిపారు.
‘‘ బీజేపీ,దాని అనుబంధ సంఘాలలో సభ్యులు కాకపోయినా, వారి సిద్ధాంతాలు, అభిప్రాయాలను మాట్లాడినప్పుడు, లేదా వారికి అనుకూలంగా నిలబడినప్పుడు వారిని గుర్తించడానికి సంఘీ అనే పదం వాడుతున్నారు అని ఆయన చెప్పారు.
గతంలో ఓ సంఘాన్ని తెలియజేసేందుకు వాడిన పదం ఇప్పుడు ఒక దృక్పథం ఉన్నవారందరినీ సంఘీ అని సూచించడానికి ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు.
బీజేపీని, దాని అనుబంధ సంస్థలను వ్యతిరేకించే సంస్థల్లో కూడా ఆ వైఖరి ఉన్న వ్యక్తులు ఉన్నారు. వారిని సంఘీగా గుర్తిస్తున్నారు అని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- క్యాష్‌లెస్ ఎవ్రీవేర్: హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఇకపై నెట్వర్క్ హాస్పిటల్స్‌లోనే కాదు, దేశంలో ఎక్కడైనా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్... 48 గంటల నిబంధన గుర్తుంచుకోండి
- పీతలకు ‘రక్షణ కవచం’గా బాటిల్ మూతలు.. హృదయం ముక్కలైందన్న శాస్త్రవేత్తలు
- సముద్రపు దొంగల నుంచి పాకిస్తాన్ నావికులను భారత నౌకాదళం ఎలా కాపాడింది?
- మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు అభిశంసనకు ప్రయత్నాలు, ఎన్నికైన మూడు నెలల్లోనే కీలక పరిణామాలు.. ఇండియానే కారణమా?
- ఒక్కో కప్ప రూ.83 వేలు.. 130 కప్పలను విమానంలో తరలించేందుకు యత్నించిన మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














