ఒక్కో కప్ప రూ.83 వేలు.. 130 కప్పలను విమానంలో తరలించేందుకు యత్నించిన మహిళ

కప్పలు

ఫొటో సోర్స్, BOGOTA ENVIRONMENT SECRETARY

ఫొటో క్యాప్షన్, ఎరుపు, పచ్చ, నీలం, పసుపు, నలుపు, గోధుమ వంటి రంగులలో ఈ కప్పలు కనిపిస్తుంటాయి
    • రచయిత, సోఫియా ఫెరీరా శాంటోస్
    • హోదా, బీబీసీ న్యూస్

బొగోటా విమానాశ్రయంలో తన లగేజీ బ్యాగులో 130 విషపూరిత కప్పలను తీసుకొని వెళ్తున్న ఒక మహిళను కొలంబియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళపై వన్యప్రాణుల అక్రమ రవాణా కింద అభియోగాలు నమోదు చేశారు.

ఈ కప్పలను చిన్నచిన్న డబ్బాలలో పెట్టుకుని వెళ్తుండగా సోమవారం పోలీసులు గుర్తించారు. అవి డీహైడ్రేట్ అయి, ఆ చిన్న డబ్బాలలో కుక్కి ఉన్నాయని అధికారులు చెప్పారు.

బ్రెజిల్‌కు చెందిన ఆ మహిళ, పనామా నుంచి సావో పౌలో నగరానికి వెళ్తున్నారు. దక్షిణ కొలంబియాకు చెందిన ఒక స్థానిక కమ్యూనిటీ తనకు బహుమతిగా ఈ కప్పలను ఇచ్చిందని ఆమె చెప్పారు.

స్థానిక పోలీసుల కథనం ప్రకారం- ఈ ఉభయచరాల(అంఫిబియాన్ల) ధర ఒక్కోటి వెయ్యి డాలర్ల వరకు అంటే భారతీయ కరెన్సీలో83 వేల పైన ఉంటుంది.

కప్పలు

ఫొటో సోర్స్, BOGOTA DEPARTMENT FOR THE ENVIRONMENT

ఫొటో క్యాప్షన్, చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో అక్రమంగా తరలిస్తున్న కప్పలను పట్టుకున్న కొలంబియా పోలీసులు

ఈ కప్పలను కలిగి ఉన్నందుకు 14,300 డాలర్లు వరకు అంటే రూ.11 లక్షలకు పైన జరిమానా ఉంటుందని బొగోటా పర్యావరణ కార్యదర్శి అడ్రియానా సోతో చెప్పారు.

హార్లెక్విన్ ఫ్రాగ్స్‌ను విషపూరితమైన కప్పలుగా(పాయిజన్-డార్ట్ ఫ్రాగ్స్) పిలుస్తుంటారు. వీటి పరిమాణం చేయి బొటనవేలు కంటే తక్కువగా ఉంటుంది.

ఈ కప్పల శరీర గ్రంథులు అత్యంత ప్రమాదకరమైన విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. చిన్న జంతువులను చంపేంత బలంగా ఇవి ఉంటాయి.

హార్లేక్విన్ ఫ్రాగ్స్ అంతరించిపోయే ప్రమాదమున్న జీవులుగా ఉన్నాయి. ఈక్వెడార్, కొలంబియా మధ్యలోని పసిఫిక్ తీర ప్రాంతంతో పాటు, తేమతో కూడిన అడవుల్లో, సెంట్రల్, సౌత్ అమెరికాలోని ఇతర దేశాలలో వీటిని చూడొచ్చు.

కప్పలు ఉంచిన ప్లాస్టిక్ డబ్బాలను సీజ్ చేసిన అధికారులు

ఫొటో సోర్స్, BOGOTA DEPARTMENT OF THE ENVIRONMENT

ఫొటో క్యాప్షన్, కప్పలు ఉంచిన ప్లాస్టిక్ డబ్బాలను సీజ్ చేసిన అధికారులు

అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రైవేట్ సేకరణకర్తలనుంచి ఈ కప్పలకు అత్యధిక డిమాండ్ ఉందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. అలాంటివారు తమ అభిరుచి మేరకు నిర్దిష్ట జీవులను, వస్తువులను సేకరిస్తుంటారు.

జీవ వైవిధ్యం అత్యధికంగా ఉన్న లాటిన్ అమెరికా, కొలంబియాలో వన్యప్రాణులను అక్రమంగా తరలించడం సర్వసాధారణం. ఉభయచరాలు, చిన్న క్షీరదాలు, షార్క్‌ల వంటి సముద్రపు జీవుల శరీర భాగాలు ఎక్కువగా అక్రమ తరలింపుకు గురవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)