షార్క్ ఎటాక్: యువతి కాళ్లను కొరికేసి లాక్కెళ్లడానికి ప్రయత్నించిన సొరచేప

షార్క్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టిఫనీ టర్న్‌బుల్
    • హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ

సాయంత్రం వేళ సరదాగా ఈత కొడుతున్న యువతిపై షార్క్ దాడి చేయడంతో తీవ్రగాయాలైన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.

సిడ్నీ హార్బర్‌లోని ఒక ప్రైవేట్ వార్ఫ్(జెట్టీ) వద్ద సోమవారం సాయంత్రం యువతి ఈత కొడుతుండగా షార్క్ ఆమెపై దాడి చేసింది. ఆమె కాలిపై కరవడంతో తీవ్రగాయాలయ్యాయి.

యువతి కేకలు విన్న వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని, ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు.

తీవ్రగాయాల పాలైన ఆ 20 ఏళ్ల యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

షార్క్ బయాలజిస్టులు యువతిపై ఎలాంటి షార్క్ దాడి చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

''సాయంత్రం 8.00 గంటల(9.00 జీఎంటీ) సమయంలో కిటికీలో నుంచి దూరంగా అరుపులు వినిపించాయి'' అని ఆమె పొరుగున నివాసముంటున్న మైకేల్ పోర్టర్ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో చెప్పారు.

జెట్టీలోని ఎలిజబెత్ బే చివర్లో ఆమె నిచ్చెనకు వేలాడుతూ ఉండడం ఆయన గమనించారు.

''ఆమె నిచ్చెన ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది, కానీ ఆమె కాలికి తీవ్రగాయమైంది, ఆమె వెనకంతా ఎర్రగా రక్తం కనిపించింది'' అని పోర్టర్ చెప్పారు.

పశువైద్యురాలైన తన భార్య, ఆ యువతికి ప్రథమ చికిత్స చేశారని, రక్తస్రావాన్ని ఆపేందుకు కట్టుకట్టారని మరో స్థానికుడు చెప్పారు.

''ప్రాథమికంగా రక్తస్రావం జరగకుండా కట్టుకట్టాం. కానీ ఆమె ఎముక విరిగిపోయి, చాలా తీవ్రగాయాలయ్యాయి'' అని ఆయన ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌తో చెప్పారు.

సిడ్నీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిడ్నీ హార్బర్‌లో షార్క్ దాడులు చాలా అరుదు

ఈత కొట్టే సమయంలో జెట్టీ కింద తరచుగా షార్క్‌లు కనిపిస్తుంటాయని మరో ప్రత్యక్ష సాక్షి సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కి చెప్పారు.

''ఏదో టైమ్ బాలేక జరిగిన ఘటనగా భావిస్తున్నా'' అని ఆమె అన్నారు.

సిడ్నీ హార్బర్‌ బుల్‌షార్క్‌ల ఆవాసం. అయినప్పటికీ ఇలాంటి దాడులు చాలా అరుదు. 2009లో కౌంటర్ టెర్రరిజం ఎక్సర్‌‌సైజ్‌లో పాల్గొన్న మాజీ నేవీ డైవర్ పాల్ డి గెల్డర్ షార్క్ దాడిలో చేయి, కాలు కోల్పోయారు.

ప్రపంచంలో అమెరికా తర్వాత ఆస్ట్రేలియాలోనే షార్క్ దాడులు ఎక్కువ. అయితే, అందులో తీవ్రమైనవి చాలా అరుదు.

ఆస్ట్రేలియన్ షార్క్ ఇన్సిడెంట్ డేటాబేస్ ప్రకారం, 2023లో 14 షార్క్ దాడి ఘటనలు జరిగాయి. వాటిలో నాలుగు తీవ్రమైనవి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)