బ్రీబీ ఐలాండ్: పందిని కాల్చేందుకు తవ్విన ఇసుక గుంటలో పడి ఆస్ట్రేలియన్ మృతి

జోస్ టేలర్

ఫొటో సోర్స్, GOFUNDME

ఫొటో క్యాప్షన్, ప్రమాదం జరిగిన సమయంలో టేలర్ స్నేహితులతో ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది.
    • రచయిత, హన్నా రిచీ
    • హోదా, బీబీసీ న్యూస్

ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి బీచ్‌ ఇసుకలో చేసిన రంధ్రంలో పడిపోవడంతో మరణించారని అక్కడి అధికారులు తెలిపారు.

శనివారం క్వీన్స్‌ల్యాండ్‌లో బ్రిబీ ద్వీపంలోని బీచ్ క్యాంప్‌గ్రౌండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

అక్కడ పందిని మంటల్లో కాల్చడానికి తవ్విన రంధ్రంలో జోష్ టేలర్ (23) ప్రమాదవశాత్తు పడిపోవడంతో, ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి, దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

గాయాల తీవ్రత ఎక్కువ ఉండటంతో టేలర్ గురువారం మరణించారని ఆయన కుటుంబం ప్రకటించింది. టేలర్ మరణానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, పూర్తి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదు.

"చాలామంది వ్యక్తులు అక్కడ ఉండొచ్చు, వాళ్లతో మాట్లాడాల్సి ఉంది" అని క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపారు.

బిబ్రీ ద్వీపం బీచ్

ఫొటో సోర్స్, ABC NEWS

15 మంది కలిసి బయటికి తీశారు

బ్రిస్బేన్‌కి ఉత్తరాన 65 కి.మీ దూరంలో ఈ బ్రిబీ ద్వీపం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో టేలర్ స్నేహితులతో ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది.

పారామెడిక్స్ ఘటనా స్థలానికి చేరుకోకముందు టేలర్‌కు 'వైల్డ్‌లైఫ్ రేంజర్లు' సీపీఆర్ చేశారని, అంతకుముందు ఆయనను ఇసుక నుంచి బయటికి తీసుకురావడానికి 15 మంది అవసరం పడిందని కొరియర్ మెయిల్ మీడియా తెలిపింది.

''ప్రమాదంలో తగిలిన గాయాలు చాలాపెద్దవి, అందుకే టేలర్ కోలుకోలేకపోయారు, వైద్యం అందించిన ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు'' అని ఆయన కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.

టేలర్ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం విరాళాల సేకరణ మొదలుపెట్టింది ఒక ఫండ్ రైజర్ గ్రూపు. ఇప్పటివరకు దాదాపు రూ.35 లక్షల వరకు అందాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)