కొండచిలువతో సముద్రంలో సర్ఫింగ్... వీడియో వైరల్, యజమానికి జరిమానా

కొండచిలువతో సర్ఫింగ్

ఫొటో సోర్స్, Nine News

    • రచయిత, టిఫనీ టర్న్‌బుల్
    • హోదా, బీబీసీ సిడ్నీ ప్రతినిధి

గోల్డ్ కోస్ట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు పామును తీసుకుని వాటర్ సర్ఫింగ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అది చివరికి వన్యప్రాణుల సంరక్షణ ఆధికారుల వద్దకు చేరింది. వారు ఆ వ్యక్తిని పట్టుకుని జరిమానా విదించారు.

హిగోర్ పియూజా అనే వ్యక్తి శివ అనే తన కొండ చిలువను తీసుకుని సర్ఫింగ్‌కు వెళ్ళడం చట్ట విరుద్ధమని అధికారులు చెప్పారు. సర్ఫింగా వీడియోతో పాపులర్ ఆయిపోయిన శివ, దాని యజమానికి ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. హిగోర్ తన ఆ కొండ చిలువను ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళి దాన్ని ప్రమాదంలో పడేశారని వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఆరోపించారు.

హిగోర్ ఫియూజా స్థానిక మీడియాలో కనిపించగానే క్వీన్స్ లాండ్స్ పర్యావరణ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంబించారు. గత వారం ఆయనకు 2,322 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే దాదాపు 1.20 లక్షల రూపాయల జరిమానా విధించారు.

“పెంపుడు ప్రాణులను జనం మధ్యలోకి తీసుకువెళ్ళడం వల్ల అవి అనవసరం ఒత్తిడికి లోనవుతాయి. దాంతో, ఆవి ఊహకందని విధంగా విచిత్రంగా ప్రవర్తించే ప్రమాదం ఉంది” అని వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారి జొనాథన్ మెక్ డోనల్డ్ ఓ ప్రకటనలో తెలిపారు.

పాములు సహజంగానే ప్రమాదకర జీవాలని, వాటికి నీటిలో ఈదడం వచ్చినా కూడా నీటికి దూరంగా ఉంటాయని ఆయన తెలిపారు.

“ఆ కొండ చిలువకు ఆ నీరు చాలా చల్లగా తగిలి ఉండవచ్చు. సీ స్నేక్స్‌ తప్ప మరే పాములైనా సముద్ర జలంలో సౌకర్యవంతగా ఉండలేవు” అని ఆయన అన్నారు.

అంతేకాదు, ఇలాంటి చర్యల వల్ల ప్రజా సంరక్షణ కూడా ప్రమాదంలో పడుతుందని, కొండ చిలువ మూలంగా స్థానిక జంతుజాలానికి ఏవైనా అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా అధికారులు వివరించారు.

కొండచిలువతో సర్ఫింగ్

ఫొటో సోర్స్, Nine News

అయితే, ఫియూజా అంతకు ముందు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, శివకు నీళ్ళంటే చాలా ఇష్టమని, గతంలో ఇలా తనతో కనీసం 10 సార్లు అది సర్ఫింగ్‌కు వచ్చిందని తెలిపారు.

“శివను నేను ఎప్పుడూ బీచ్‌కు తీసుకువెళ్తుంటాను. నీటిలో ఈదడమంటే దానికి చాలా ఇష్టం. అందుకే, ఏదో ఒకరోజు శివను సర్ఫింగ్‌కు తీసుకువెళ్ళాలని అనుకున్నాను” అని ఫియూజా ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన (ఏబీసీ)కి చెప్పారు.

శివకు ఏదైనా ఇష్టం లేకపోతే బుస కొడుతుందని, కానీ సర్ఫింగ్‌కు తీసుకువెళ్ళినప్పుడు అది బుస కొట్టలేదని, ఉల్లాసంగా ఉందని ఆయన చెప్పారు.

రెయిన్ బో బే మీద సర్ఫింగ్ చేసిన తొలి జంతువు శివ ఏమీ కాదు. డక్ అనే పేరున్న ఓ బాతు కూడా క్రమం తప్పకుండా ఈ బీచ్‌కు వస్తుంటుంది. ఆస్ట్రేలియా సర్ఫింగ్ చాంపియన్ స్టీఫ్ గిల్మోర్‌తో కలిసి అది అలల మీద పోటీ పడిందని చెబుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)