మియన్మార్ సరిహద్దుల్లో కంచె వేయాలని భారత్ ఎందుకు అనుకుంటోంది, ఇది సాధ్యమేనా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
మియన్మార్ సరిహద్దులో కంచె వేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వారం రోజుల కిందట ప్రకటించారు.
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు చేసుకున్నామని, అదే తరహాలో మియన్మార్ సరిహద్దులో కూడా 1,643 (1,020 మైళ్లు) కిలోమీటర్ల మేర కంచె ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్ సరిహద్దుతో పోలిస్తే ఇది రెండింతలు పొడవైనదని ఆయన అన్నారు.
రెండు దేశాల సరిహద్దుల్లోని ప్రజలు, సరిహద్దు వెంట ఇరుదేశాల పరిధిలో, 16 కిలోమీటర్లలోపు ఎలాంటి వీసా లేకుండా రాకపోకలు సాగించేలా ఆరేళ్ల కిందట చేసుకున్న ఒప్పందాన్ని కూడా సమీక్షించనున్నట్లు అమిత్ షా చెప్పారు.
ఈ కంచె ఎప్పటిలోగా పూర్తవుతుంది, దానిని ఎలా నిర్మించనున్నారనే విషయాలపై కొంత సమాచారం అందించారు.
అయితే, ఈ కంచె నిర్మాణంలో చాలా సవాళ్లున్నాయి. పర్వత ప్రాంతాల్లో కంచె నిర్మాణం అసాధ్యమని కొందరు నిపుణులు చెబుతున్నారు. భారత్ ప్రణాళికలు సరిహద్దు ప్రాంతంలోని ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, పొరుగు దేశాలతో ఉద్రిక్తతలను పెంచుతాయని అంటున్నారు.
ప్రధానంగా రెండు కారణాల నేపథ్యంలో మియన్మార్ సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరంల మీదుగా కంచె వేయాలనే యోచనకు వచ్చినట్లు కనిపిస్తోంది.
మొదటిది, 2021 ఫిబ్రవరి సైనిక తిరుగుబాటు అనంతరం మియన్మార్‌లో పెరిగిన అల్లర్లు భారత్‌కు ముప్పుగా మారడం. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, మియన్మార్‌లో అల్లర్ల కారణంగా దాదాపు 20 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఇటీవల భారత్‌కు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న చిన్ రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణం పలెట్వాను స్వాధీనం చేసుకున్నట్లు కొద్దివారాల కిందట మియన్మార్ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
రెండోది, మియన్మార్‌తో దాదాపు 400 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోన్న మణిపుర్‌లో గతేడాది చెలరేగిన జాతి హింస. మెజార్టీ మెయితీ, మైనార్టీ గిరిజన వర్గమైన కుకీల మధ్య రేగిన హింసలో దాదాపు 170 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఫొటో సోర్స్, AFP
ఈ ఘర్షణల వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని, మణిపుర్ బీజేపీ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉన్న అక్రమ వలసదారుల గురించి ప్రస్తావించింది. ''మియన్మార్ నుంచి వచ్చి మణిపుర్‌లో స్థిరపడిన గసగసాల సాగుదారులు, డ్రగ్స్ వ్యాపారులు హింసకు ఆజ్యం పోశారు'' అని పేర్కొంది.
''భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి'' అని గత జూలైలో మియన్మార్ సైనిక ప్రభుత్వ విదేశాంగ మంత్రి థాన్ స్వీకి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలియజేశారు.
''సరిహద్దు వద్ద ఉద్రిక్తతలకు కారణమయ్యే చర్యలను నివారించాలి'' అన్నారు. అలాగే, మానవ అక్రమ రవాణా, మాదవ ద్రవ్యాల అక్రమ రవాణా గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
''తూర్పు సరిహద్దు వైపు నుంచి పొంచివున్న రెండు ప్రమాదాల కారణంగా భారత్ కంచె వేయాలనే యోచనకు వచ్చినట్లు భావించొచ్చు'' అని అమెరికన్ థింక్ ట్యాంక్ విల్సన్ సెంటర్‌కి చెందిన మైకేల్ కుగెల్‌మన్ అభిప్రాయపడ్డారు.
''సరిహద్దు ప్రాంతాలపై మియన్మార్ ఘర్షణల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు ఇప్పటికే ఇబ్బందికరమైన పరిస్థితులున్న మణిపుర్‌లోకి మియన్మార్ నుంచి శరణార్ధులు భారీగా తరలివచ్చే ముప్పును నివారించాలని అనుకుంటోంది'' అని కుగెల్‌మన్ బీబీసీతో చెప్పారు.
అయితే, ఈ వాదనలపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
మణిపుర్‌లో ఘర్షణలకు మియన్మార్ నుంచి కుకీ శరణార్థుల భారీగా పెరగడమే కారణమని మణిపుర్ ప్రభుత్వం అంటుండగా, రాష్ట్రంలో మియన్మార్ నుంచి వచ్చిన వలసదారులు గతేడాది ఏప్రిల్ చివరి నాటికి 2,187 మంది మాత్రమేనని అదే ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి.
''మియన్మార్ నుంచి భారీగా అక్రమ వలసలు జరిగాయనేది తప్పు. కుకీలు విదేశీయులు, వలసదారులు, మణిపుర్‌కి చెందిన వారు కాదు, ఇటీవల కుకీల ప్రతిఘటనకు మియన్మార్ నుంచి మద్దతు లభిస్తోందనే వాదనలకు మద్దతుగానే ఈ ప్రచారం జరుగుతోంది'' అని మియన్మార్‌కి భారత మాజీ రాయబారి గౌతమ్ ముఖోపాధ్యాయ చెప్పారు.
''ఆ వాదనలకు పెద్దగా ఆధారాలు కూడా లేవు. కుకీలు మణిపుర్‌లో తరాలుగా జీవిస్తున్నారు. స్వేచ్ఛా ఉద్యమ కాలంలో వాణిజ్య ప్రయోజనాలు పొందిన మెయితీ పాటు అన్నివర్గాలకూ మేలు కలిగింది.''
''వలసల నియంత్రణకు సరిహద్దు కంచె అవసరం లేదు కానీ, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని భారతీయ తిరుగుబాటు గ్రూపులు మియన్మార్ సరిహద్దు గ్రామాలు, పట్టణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయి'' అని ఆ ప్రాంతంలో గతంలో పనిచేసిన మాజీ సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. పేరు బయటికి చెప్పేందుకు ఆయన ఇష్టపడలేదు.
వేర్పాటువాద తిరుగుబాట్లతో ఈశాన్య ప్రాంతం కొన్ని దశాబ్దాలుగా అల్లకల్లోలంగా ఉంది. సాయుధ దళాలకు సోదాలు, సీజ్ చేసే అధికారం కల్పించడం, అలాంటి ఆపరేషన్ల సమయంలో సామాన్యులు ప్రాణాలు కోల్పోతే, అందుకు కారణమైన సైనికులను రక్షించేలా తీసుకొచ్చిన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) వివాదాస్పదమైంది.
మియన్మార్‌లో దాక్కున్న భారత తిరుగుబాటుదారులు సులభంగా సరిహద్దులు దాటి ''దోపిడీ, హింసాత్మక కార్యక్రమాలు'' చేసే అవకాశం ఉందని ఆ అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
సరిహద్దులో కంచె వేయడంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
భారత్ - మియన్మార్ మధ్య చారిత్రక, మతపరమైన, భాషాపరమైన, సాంస్కతిక సంబంధాలున్నాయి. దాదాపు 20 లక్షల మంది భారతీయులు మియన్మార్‌లో నివసిస్తున్నారు. ఇది భారత్ 'లుక్ ఈస్ట్' విధానం ద్వారా ఆర్థిక సంబంధాలను ఇతోధికంగా ప్రోత్సహిస్తోంది.
ఈ విధానంలో భాగంగా రోడ్లు, ఉన్నత విద్య, దెబ్బతిన్న పగోడాల పునర్నిర్మాణం వంటి అభివృద్ధి పనుల కోసం మియన్మార్‌కు భారత్ 2 బిలియన్ డాలర్లు (సుమారు 16,627 కోట్ల రూపాయలు) అభివృద్ధి సాయంగా అందిస్తోంది. అందులో ఎక్కువ శాతం గ్రాంట్ల రూపంలోనే మంజూరు చేస్తోంది.
ప్రధానంగా భారత్, మియన్మార్ సరిహద్దు ఒకే రకమైన జాతులను, సంస్కృతులను కూడా విభజిస్తోంది. మిజోరాంలోని మిజోలు, మియన్మార్‌కు చెందిన చిన్‌లు ఒకే జాతికి చెందిన దాయాదులు. వారి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా క్రైస్తవులు ఎక్కువగా ఉండే మియన్మార్‌లోని చిన్ రాష్ట్రం, మిజోరాం సరిహద్దును పంచుకుంటున్నాయి.
అలాగే, సరిహద్దుకు రెండు వైపులా నాగాలు ఉన్నారు. మియన్మార్‌కి చెందిన చాలా మంది భారత్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని వాలంగ్‌కి చెందిన వేటగాళ్లు శతాబ్దాలుగా సరిహద్దు దాటి వస్తూపోతుంటారు.
దేశంలో అంతర్యుద్ధం కారణంగా పారిపోయి వచ్చిన 40 వేల మందికిపైగా శరణార్థులకు కేంద్రంలోని సమాఖ్య ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి మరీ మిజోరాం ఆశ్రయం కల్పించింది. అందులో పెద్ద ఆశ్చర్యం కూడా ఏమీలేదు.
''మియాన్మార్ సరిహద్దున నాగాలాండ్ ఉంది. అలాగే, నాగాలు రెండు వైపులా ఉన్నందున, వారి సమస్యల పరిష్కారంతో పాటు చొరబాట్లను నిరోధించే విషయంలో ఒక ఫార్ములా రూపొందించాల్సిన అవసరం ఉంది'' అని బీజేపీ మిత్రపక్షానికి చెందిన నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ఇటీవల అన్నారు.
అలాగే, పర్వతాలు, దట్టమైన అటవీ ప్రాంతం గుండా సరిహద్దులో కంచె వేసేందుకు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
''సరిహద్దు వెంట ఉన్న పర్వతాలు, సుదూర ప్రాంతాల గుండా కంచె వేయడం అసాధ్యం. ఇది బంగ్లాదేశ్ సరిహద్దులో ఏర్పాటు చేసిన కంచెలా కాదు'' అని మియన్మార్‌కి చెందిన ప్రముఖులు, నిపుణులు బెర్టిల్ లింటర్ నాతో చెప్పారు.
''కంచె వేయడం సాధ్యం కాదు, అందుకు సంవత్సరాలు పడుతుంది. కొన్నిచోట్ల కంచె నిర్మించినా, స్థానికులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతారు.'' అని అన్నారు.
అందులో సున్నితమైన దౌత్యపరమైన అంశం కూడా ఉంది. మియన్మార్‌తో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఈ సమయంలో భారత్ కంచె నిర్మాణం రెచ్చగొట్టే చర్య కూడా కావొచ్చని కుగెల్‌మన్ అభిప్రాయపడ్డారు.
''సరిహద్దు భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంకా ఇతర ప్రయోజనాల కోసం భారత్ అక్కడి సైనిక ప్రభుత్వం మద్దతు కోరుతోంది. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టును ఏకపక్షంగా కాకుండా, మియన్మార్‌తో సంప్రదించి కంచె ఏర్పాటు చేయడం ఉద్రిక్తతలను తగ్గిస్తుంది'' అన్నారు.
అంతిమంగా, ఈ చర్య భారత సరిహద్దు భద్రతా సవాళ్లను నొక్కిచెబుతోంది. రాజకీయ ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు, యుద్ధాలు, టెర్రరిజం వంటి వాటి కారణంగా ఇప్పటికే భారత్‌కు పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనాతో సరిహద్దు సమస్యలున్నాయి. భారత్‌తో పోలిస్తే మియన్మార్‌కు చైనాతో బలమైన ఆర్థిక సంబంధాలున్నాయి.
''భారత్ తన పొరుగు దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కృషి చేయడంతో పాటు చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో సరిహద్దు వివాదాలు స్వాగతించదగ్గవి కావు, కానీ వాటి నుంచి దూరంగా కూడా ఉండలేరు'' అని కుగెల్‌మన్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ప్యాకేజ్డ్ ఫుడ్: ‘ఒక్క బిస్కెట్ తగ్గినందుకు రూ.లక్ష పరిహారం’ ఇలాంటివి మీరూ పొందవచ్చు ఎలాగంటే...
- హాజి మలాంగ్: ‘ఈ దర్గాకు విముక్తి కల్పించి హిందువుల పరం చేయాలి’ అన్న వాదన ఎందుకు వినిపించింది, వివాదం ఏంటి?
- భారత్ vs ఇంగ్లండ్: గెలుపు వరకు వచ్చి టీమిండియా ఓటమికి ఇదే కారణమా... రోహిత్ శర్మ ఏం చెప్పాడు?
- ఐఎన్ఎస్ విశాఖపట్నం: 22 మంది భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై హుతీల క్షిపణి దాడి, స్పందించిన భారత నౌకాదళం
- ధోర్డో: ఎడారి మధ్యలోని ఈ గుజరాత్ గ్రామానికి లక్షల మంది టూరిస్టులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














