పుట్టినప్పుడే విడిపోయిన కవలలు, టిక్‌టాక్ వీడియోతో కలిశారు..

కవలలు ఆమీ, ఆనో

ఫొటో సోర్స్, BBC/ WOODY MORRIS

ఫొటో క్యాప్షన్, కవలలు ఆమీ, ఆనో
    • రచయిత, ఫే నర్సు, వూడీ మోరిస్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఆమీ, ఆనో ఇద్దరు కవలలు. వారు పుట్టిన వెంటనే తల్లి నుంచి వేరు చేసి రెండు వేర్వేరు కుటుంబాలకు అమ్మేశారు.

టిక్‌టాక్ వీడియో, ఓ టీవీ టాలెంట్ షో కారణంగా చాలా ఏళ్ల తరువాత వీళ్లిద్దరూ కలుసుకోగలిగారు.

జార్జియాలోని ఆస్పత్రుల నుంచి దొంగతనమై, అమ్ముడుపోయిన వేల మంది పిల్లల్లో ఈ అక్కాచెల్లెళ్లు ఉన్నారని గుర్తించారు.

లీప్జిగ్‌లో ఒక హోటల్ గదిలో ఆమీ చాలా ఆందోళనగా ఉన్నారు.

‘‘నాకు చాలా భయం వేస్తుంది, నిజంగా చాలా భయంగా ఉంది’’ అని వణుకుతూ చెప్పారు. ‘‘వారమంతా నేను నిద్రపోలేదు. మాకు ఏం జరిగిందో తెలుసుకునేందుకు చివరిగా దొరికిన అవకాశం ఇది’’ అని ఆమీ తెలిపారు.

ఆమె సోదరి ఆనో, చైర్‌లో కూర్చుని తన ఫోన్‌లో టిక్‌టిక్ వీడియోలు చూస్తున్నారు. ‘‘మమ్మల్ని అమ్మిన మహిళ ఈమే కావొచ్చు’’ అని కళ్లు పెద్దవి చేసి చెప్పారు. ఆనోకి కూడా భయంగానే ఉంది. కానీ, ఎలా స్పందించాలో తెలియడం లేదు.

తమ సుదీర్ఘ ప్రయాణానికి ఇది ముగింపు అని ఆ అక్కాచెల్లెళ్లు చెప్పారు. ఇంతకాలం తమను వేధించిన చిక్కుముడిని విప్పడానికి చివరి ఆధారాన్ని కనుగొనేందుకు వారు జర్మనీ వచ్చారు.

తమకు జన్మనిచ్చిన తల్లిని కలిసేందుకు జర్మనీకి వచ్చిన వారు తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా గత రెండు సంవత్సరాలుగా వారికేం జరిగిందో తెలుసుకునేందుకు తాము ప్రయత్నించినట్లు ఈ అక్కాచెల్లెళ్లు చెప్పారు.

నిజం బయటికి వచ్చినప్పుడు, దశాబ్దకాలంగా జార్జియాలో తమ లాగా ఎంతో మంది పిల్లల్ని ఆస్పత్రి నుంచి దొంగలించి అమ్మేశారని వారు తెలుసుకున్నారు.

అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు అధికారికంగా ప్రయత్నాలు చేపట్టినప్పటికీ, బాధ్యులను మాత్రం గుర్తించలేకపోయారు.

తల్లిని కలిసిన కవలలు ఆమీ, ఆనో

ఫొటో సోర్స్, BBC/ WOODY MORRIS

ఫొటో క్యాప్షన్, తల్లిని కలిసిన కవలలు ఆమీ, ఆనో

ఒకే పోలికలున్న కవలలు

ఆమీ, ఆనోలకు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఒకరి గురించి మరొకరికి తెలిసింది.

ఆమీ ఖ్వితియా నల్ల సముద్రానికి దగ్గర్లో తన అమ్మమ్మ ఇంట్లో కూర్చుని తనకు ఎంతో ఇష్టమైన టీవీ ప్రొగ్రామ్ జార్జియా గాట్ టాలెంట్‌ను చూస్తున్నప్పుడు, అచ్చం తనలాగే ఉన్న ఒక బాలిక డ్యాన్స్ చేయడం కనిపించింది. ముఖం మాత్రమే కాదు, ఆమె రూపురేఖలన్ని పూర్తిగా తనలాగే ఉన్నాయి.

చుట్టుపక్కల వారు, బంధువులు కూడా ఆమీ తల్లికి ఫోన్ చేసి, ఆమీ ఎందుకు వేరే పేరుతో డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొంటోందని అడిగారు.

ఆమీ ఈ విషయాన్ని తన కుటుంబానికి చెప్పినప్పుడు, వారు ఏమీ ఆలోచించలేదు. ‘‘మనుషులను పోలిన మనుషులు ఉంటారని’’ వాళ్ల అమ్మ కొట్టిపారేశారు.

ఏడేళ్ల తర్వాత 2021 నవంబర్‌లో ఆమీ ఒక వీడియోను టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. దానిలో నీలం రంగు జుట్టు, తన కనుబొమ్మపై ఆభరణాన్ని కుట్టించుకున్న వీడియో షేర్ చేశారు.

ఈ వీడియోను ఆమీకి 320 కిలో మీటర్ల దూరంలో టిబ్లీసీలో ఉంటున్న ఆనో సర్టానియా చూశారు.

కనుబొమ్మకు కుట్టించుకున్న ఆభరణం ద్వారా ఆమెను గుర్తించాలని ఆనో చాలా ప్రయత్నించారు. కానీ, కనుగొనలేకపోయారు. దీంతో, యూనివర్సిటీ వాట్సాప్ గ్రూప్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసి, ఎవరైనా సాయం చేయగలరా? అని కోరారు. ఆమీ గురించి తెలిసిన ఒక వ్యక్తి, వారిని ఫేస్‌బుక్ ద్వారా కనెక్ట్ అయ్యేలా చేశారు.

అప్పుడు వెంటనే ఆమీకి కొన్నేళ్ల క్రితం జార్జియా గాట్ టాలెంట్ షోలో చూసిన అమ్మాయి ఆనోనే కదా అని గుర్తొచ్చింది.

‘‘ఎంతో కాలంగా నీ కోసం వెతుకుతున్నా’’ అంటూ ఆమీ మెసేజ్ చేసింది. ‘‘నేను కూడా’’ అంటూ ఆనో మెసేజ్ చేసింది.

ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మాట్లాడున్నాక వారిలో చాలా అంశాలు ఒకే విధంగా ఉన్నాయని గుర్తించారు.

జనన ధ్రువీకరణ పత్రాల ప్రకారం మాత్రం పశ్చిమ జార్జియాలోని కిర్టిస్కీ ప్రసూతి ఆస్పత్రిలో వీరిద్దరూ పుట్టినట్లు ఉంది. ప్రస్తుతం, ఈ ఆస్పత్రి లేదు. వీరి పుట్టిన తేదీల మధ్యలో రెండు వారాల తేడా ఉంది. వీరు అక్కాచెల్లెళ్లు కాదు. కవలలకు తక్కువేం కాదు. చాలా వరకు ఒకే విధంగా ఉన్నారు.

ప్రసూతి ఆస్పత్రి

ఫొటో సోర్స్, BBC/ WOODY MORRIS

ఇద్దరూ ఒకే సంగీతాన్ని ఇష్టపడతారు. డ్యాన్స్ చేస్తారు. ఒకే హెయిర్ స్టయిల్ ఉంది. వీరిద్దరికీ వంశపారపర్యంగా వచ్చిన కండరాల వ్యాధి డైస్ప్లాషియా ఉన్నట్లు తెలుసుకున్నారు.

ఇద్దరూ కలిసి ఏదో ఒక రహస్యాన్ని చేధిస్తున్నట్లు భావించారు. ‘‘ప్రతిసారి ఆనో గురించి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకున్నప్పుడు, అది నాకు వింతగా అనిపించింది’’ అని ఆమీ తెలిపారు.

ఆ తర్వాత వారిద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, టిబ్లీసీలోని రుస్తావెల్లీ మెట్రో స్టేషన్‌కు వచ్చారు. అక్కడే ఆమీ, ఆనో ఒకరినొకరు తొలిసారి చూసుకున్నారు.

‘‘అద్దంలో నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది. ఒకే ముఖం, ఒకే స్వరం. ఆ తర్వాత తెలిసింది మేమిద్దరం కవలలం అని. నాకు కౌగలించుకోవడం నచ్చదు. కానీ, ఆమీని నేను గట్టిగా హత్తుకున్నాను’’ అని ఆనో చెప్పారు.

ఈ విషయంపై వారు కుటుంబ సభ్యులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే వారికి నిజం తెలిసింది.

2002లో వారాల వ్యవధిలో వీరిని పెంచిన కుటుంబాలు విడివిడిగా దత్తతు తీసుకున్నట్లు తెలిసింది.

ఆనోకి కూడా తన కుటుంబం విషయంలో బాధగా, కోపంగా అనిపించింది.

ఆ తర్వాత వారిద్దరూ తెలుసుకున్న సమాచారంలో, కవలల జనన ధ్రువీకరణ పత్రాల్లో పేర్కొన్న తేదీలు, సమాచారమంతా తప్పుడువని అర్థమైంది.

తనకి పిల్లలు పుట్టనప్పుడు, స్థానిక ఆస్పత్రిలో ఎవరూ వద్దనుకున్న ఒక అనాథ పాప ఉందని తన స్నేహితులు చెప్పిందని ఆమీ తల్లి తెలిపారు. డాక్టర్లకు డబ్బులు చెల్లించి దత్తత తెచ్చుకుని పెంచుకున్నట్లు చెప్పారు. ఆనో తల్లి కూడా ఇదే కథనాన్ని చెప్పారు.

ఈ ఇద్దరు కవలలని, ఇదంతా చట్టవిరుద్ధంగా సాగిందని కనీసం వీరి కుటుంబాలకూ తెలియదు.

తమునా ముసెరిడ్జ్

ఫొటో సోర్స్, BBC/ WOODY MORRIS

ఫొటో క్యాప్షన్, కన్న తల్లిదండ్రులను, పిల్లల్ని కనుగొనడం కోసం ఫేస్‌బుక్ గ్రూప్‌ను ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ తమునా ముసెరిడ్జ్

డబ్బుల కోసం తమ కన్నతల్లిదండ్రులు అమ్ముకున్నారా? అని ఈ కవలలు ఆలోచించకుండా ఉండలేకపోయారు.

తమ కన్నతల్లి ఎక్కడుందో వెతకాలని ఆమీ అనుకున్నారు. కానీ, ఆనోకు ఏం అర్థం కావడం లేదు.

‘‘మనకు ద్రోహం చేసిన వ్యక్తిని ఎందుకు కలవాలనుకుంటున్నావు?’’ అని ఆనో ప్రశ్నించారు.

పుట్టినప్పుడే చట్టవిరుద్ధంగా దత్తతు ఇచ్చినట్లు భావిస్తున్న పిల్లల్ని జార్జియా కుటుంబాలతో తిరిగి కలిపే ఫేస్‌బుక్ గ్రూప్‌ను ఆమీ కనుగొన్నారు. వారి కథనాన్ని ఆ పేజీపై పోస్ట్ చేశారు.

ఈ పోస్టు చేసిన తర్వాత ఒక జర్మనీ అమ్మాయి ఆమీని సంప్రదించారు. జార్జియాలోని కిర్టిస్కీ ప్రసూతి ఆస్పత్రిలో తన తల్లి 2002లో ఇద్దరు కవలకు జన్మనిచ్చిందని, కానీ, ఆస్పత్రి వర్గాలు అప్పట్లో పిల్లలు చనిపోయారని చెప్పారని ఆ జర్మనీ అమ్మాయి అమీకి చెప్పారు. కానీ, దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా తమకు పరిచయమైన అమ్మాయి తన చిన్న చెల్లెలు అని డీఎన్ఏ పరీక్షలో వెల్లడైంది. తమ కన్నతల్లి ఆజాతో కలిసి జర్మనీలో ఉంటున్నట్లు ఆమీ, ఆనో తెలుసుకున్నారు.

ఆమీకి కన్న తల్లి ఆజాను కలుసుకోవాలని ఉంది. కానీ, ఆనో అలా కాదు, తల్లిని కలుసుకుని నిజం తెలుసుకునేందుకు అంత ఆసక్తి లేదు. ఎందుకంటే, ‘‘ ఈమె నిన్ను అమ్మిన వ్యక్తి. ఆమె ఎప్పటికీ నిజం చెప్పదు’’ అని ఆనో వాదించారు. కానీ, ఆమీకి తోడుగా తల్లిని కలిసేందుకు జర్మనీ వెళ్లారు ఆనో.

ఈ కవలలు వాడే ఫేస్‌బుక్ గ్రూప్ పేరు ‘వాడ్జెబ్’. దీని అర్థం జార్జియాలో ‘‘నేను వెతుకుతున్నాను’’ అని.

తమ పిల్లలు చనిపోయారని ఆస్పత్రి స్టాఫ్ చెప్పినట్లు తెలుపుతూ ఎంతో మంది తల్లులు ఈ ఫేస్‌బుక్ గ్రూప్‌లో పోస్టులు పెట్టారు. కానీ, ఆ తర్వాత ఆ మరణాలను రికార్డు చేయలేదని, వారి పిల్లలు బతికే ఉన్నారని తెలుసుకున్నారు.

ఇరినా ఒటారస్విలి

ఫొటో సోర్స్, BBC/ WOODY MORRIS

ఫొటో క్యాప్షన్, 1978లో కవలలకు జన్మనిచ్చిన ఇరినా ఒటారస్విలి

ఏళ్ల తరబడి సాగిన చైల్డ్ ట్రాఫికింగ్

ఆమీ, ఆనోలాగా ఎంతో మంది పిల్లలు ఈ ఫేస్‌బుక్ గ్రూప్‌లో కన్నతల్లిదండ్రుల కోసం పోస్టులు పెడుతున్నారు. ఈ ఫేస్‌బుక్ గ్రూప్‌లో 2,30,000 మందికి పైగా ఉన్నారు. డీఎన్ఏ వెబ్‌సైట్ల యాక్సస్‌తో.. జార్జియా చరిత్రలోని ఈ చీకటి అధ్యాయాన్ని వీరు బట్టబయలు చేస్తున్నారు.

ఈ గ్రూప్‌ను 2021లో తమునా ముసెరిడ్జ్ ఏర్పాటు చేశారు. తనని కూడా చిన్నప్పుడే కన్నతల్లిదండ్రుల నుంచి వేరుచేసి దత్తత ఇచ్చినట్లు తెలుసుకున్న తర్వాత ఫేస్‌బుక్‌లో ఈ గ్రూప్‌ను తెరిచారు. తమునా ఏర్పాటు చేసిన ఈ గ్రూప్ ద్వారా వేల మంది జీవితాలను ప్రభావితం చేసిన, ఏళ్ల తరబడి సాగిన చైల్డ్ ట్రాఫికింగ్(పిల్లల అక్రమ రవాణా విషయం) వెలుగులోకి వచ్చింది.

వందల కుటుంబాలు తిరిగి కలుసుకునేందుకు ఆమె సాయం చేశారు. జార్జియాలో 1950ల నంచి 2005 వరకు సాగిన దత్తత అక్రమ మార్కెట్‌ను తమునా బయటికి తీశారు.

వ్యవస్థీకృత నేరస్తుల ద్వారా ఈ బ్లాక్ మార్కెట్ సాగిందని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు అంటే ట్యాక్సీ డ్రైవర్ల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు చాలా మంది దీనిలో భాగమయ్యారని ఆమె కనుగొన్నారు.

‘‘ఊహించని స్థాయిలో ఈ నేరం జరిగింది. లక్ష మంది వరకు పిల్లల్ని దొంగతనం చేసి, అక్రమంగా అమ్మేశారు. ఇది చాలా సిస్టమాటిక్‌గా జరిగింది’’ అని తమునా తెలిపారు.

అయితే, తనని సంప్రదించిన పిల్లలు, తల్లిదండ్రులను బట్టి ఈ లెక్కలను విడుదల చేశానని తమునా తెలిపారు. కొందరికి డాక్యుమెంట్ల యాక్సస్ లేకపోవడం, కొందరు అసలు కనిపించకుండా పోవడంతో కచ్చితంగా ఎంత మంది పిల్లల్ని అక్రమంగా తరలించారో చెప్పడం కష్టంగా మారిందన్నారు.

పిల్లల మృతదేహాలను చూపించాలని ఆస్పత్రి వర్గాలను అడిగినప్పుడు, వారు మృతదేహాలను ఆస్పత్రి పరిసరాల్లో ఖననం చేసినట్లు చెప్పారని చాలా మంది తల్లిదండ్రులు తమునాకు చెప్పారు.

కానీ, జార్జియా ఆస్పత్రుల పరిసరాల్లో అలాంటి సమాధులే లేవని తమునా గుర్తించారు. కొన్నిసార్లు తల్లిదండ్రులకు మార్చురీలో ఉంచిన మృతదేహాలను చూపించే వారని తెలుసుకున్నారు.

జార్జియాలో పిల్లల్ని కొనడం చాలా ఖరీదైన ప్రక్రియ. దీని కోసం ఒక ఏడాది జీతాన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కొంత మంది పిల్లల్ని అమెరికా, కెనడా, రష్యా, యుక్రెయిన్ కుటుంబాలకు కూడా అమ్మినట్లు తమునా గుర్తించారు.

2005లో జార్జియా తన దత్తత చట్టాలను మార్చింది. 2006లో యాంటీ ట్రాఫికింగ్ చట్టాలను బలోపేతం చేసి, చట్టవిరుద్ధమైన దత్తతలు జరగకుండా కఠినతరం చేసింది.

ఇరినా కూతురు నినో

ఫొటో సోర్స్, BBC/ WOODY MORRIS

ఫొటో క్యాప్షన్, తన అన్నలను ఖననం చేసిన బాక్సులను తెరిచి చూసిన ఇరినా కూతురు నినో

వారు చనిపోకపోతే, ఎక్కడున్నట్లు?

ఇరినా ఒటారస్విలి అనే మరో మహిళ కూడా తన పిల్లల కోసం వెతుకుతున్నారు. 1978లో జార్జియా కాకసస్‌ పర్వతాల్లోని దిగువన ఉన్న క్వారెలీలో ఉన్న ఒక ప్రసూతి ఆస్పత్రిలో ఆమె ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చారు.

ఆ పిల్లలు ఆరోగ్యకరంగానే ఉన్నారని డాక్టర్లు చెప్పారని, కానీ, ఎలాంటి కారణాలు చెప్పకుండా వారిని తనకు దూరంగా ఉంచారని తెలిపారు.

పుట్టిన మూడు రోజుల తర్వాత, ఇద్దరూ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారన్నారు. వారికి శ్వాసకోశ సంబంధమైన సమస్యలున్నాయని చెప్పినట్లు తెలిపారు.

ఇరినా, ఆమె భర్తకు ఏం అర్థం కాలేదు. ముఖ్యంగా సోవియట్ కాలంలో, అధికారులను ప్రశ్నించడానికి కూడా వీలు ఉండేది కాదు. దీంతో, వారు చెప్పిదంతా నిజమేనని ఇరినా నమ్మారు.

చనిపోయిన పిల్లల మృతదేహాలు తీసుకెళ్లి, ఖననం చేసేందుకు బాక్సులు తెచ్చుకోవాలని ఇరినాకు డాక్టర్లు చెప్పారు.

పిల్లల మృతదేహాలను ఉంచిన బాక్సులను తెరవవద్దని, చూస్తే తట్టుకోలేరని వైద్యులు వారికి చెప్పారు. వారి చెప్పినట్లే ఇరినా చేశారు.

కానీ, 44 ఏళ్ల తర్వాత ఇరినా కూతురు నినో.. తమునా ఫేస్‌బుక్ గ్రూప్‌ను చూశారు. ఆ తర్వాత ఇరినా కుటుంబానికి కూడా తమ పిల్లల మరణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అంటే నిజంగా నా అన్నలు చనిపోలేదా? అని ఇరినో కూతురు నినోకు సందేహం కలిగింది. నినో, ఆమె సోదరి నానా కలిసి తమ అన్నలను ఖననం చేశారన్న ప్రదేశాన్ని తవ్వాలని నిర్ణయించుకున్నారు.

‘‘నా గుండె వేగంగా కొట్టుకుంటోంది’’ అని నినో చెప్పారు. ‘‘ఖననం చేసిన బాక్సులను తెరిచిచూస్తే, దానిలో ఎముకలు కాకుండా, కేవలం ఎండిపోయిన కర్రలు మాత్రమే ఉన్నాయి. ఏడవాలో, నవ్వాలో మాకు అర్థం కాలేదు’’ అని నినో, నానా అన్నారు.

ఎంతో కాలంగా చనిపోయారని అనుకుంటున్న తన అన్నలు బతికే ఉన్నారని నినో, నానాలు భావిస్తున్నారు.

సూట్‌కేసులో కర్ర పుల్లలు

ఫొటో సోర్స్, BBC/ WOODY MORRIS

ఫొటో క్యాప్షన్, సూట్‌కేసులో కర్ర పుల్లలు

2022లో పిల్లల అక్రమ రవాణాపై విచారణ

లీప్జిగ్‌ హోటల్‌లో ఉన్న ఆమీ, ఆనోలు తన తల్లిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె తన మనసును మార్చేసిందని ఆనో అన్నారు. గట్టిగా ఊపిరి పీల్చుకుని, తమ పక్క గదిలో వేచిచూస్తున్న కన్నతల్లి ఆజా వద్దకు వెళ్లారు.

ఆమీ గది తలుపు తీయగా, ఆనో ఆమెను అనుసరించారు. వారిని చూసిన ఆజా, గట్టిగా హత్తుకున్నారు. కొద్దిసేపు పాటు అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ముగ్గురిలో భిన్నమైన భావోద్వేగాలు ఉన్నాయి.

ఎన్నో ఏళ్ల తర్వాత కన్నతల్లిని బిడ్డలు, పిల్లల్ని తల్లి కలుసుకున్నారు. తల్లిని కలుసుకున్న ఆమీకి కన్నీళ్లు ఆగలేదు. ముగ్గురు ఒక దగ్గర కూర్చుని, మాట్లాడుకున్నారు. డెలివరీ తర్వాత ఆరోగ్యం బాగా క్షీణించిందని, కోమాలోకి వెళ్లినట్లు ఆజా తన కూతుర్లకు చెప్పారు.

కళ్లు తెరిచిన తర్వాత, పిల్లలు చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పాయని తెలిపారు. దీంతో, ఏం జరిగిందో కనీసం ఆజాకు కూడా తెలియదని ఆ అక్కాచెల్లెళ్లకు అర్థమైంది.

2022లో జార్జియా ప్రభుత్వం పిల్లల అక్రమ రవాణాపై విచారణను ప్రారంభించింది. ఈ విషయంపై బీబీసీ 40 మందికి పైగా వ్యక్తులతో మాట్లాడింది. కానీ, కేసులు చాలా పాతవని, అప్పటి డేటా చాలా వరకు పోయిందని అన్నారు.

ఫేస్‌బుక్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి సమాచారం సేకరించిన తమునా, ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి షేర్ చేశానని, కానీ, దీనిపై ప్రభుత్వం ఎప్పుడు నివేదికను విడుదల చేస్తుందో చెప్పలేదన్నారు.

పిల్లల అక్రమ రవాణాలో అసలేం జరిగిందో తెలుసుకోవడం కోసం నాలుగుసార్లు ప్రయత్నించారు.

వాటిలో 2003లో అంతర్జాతీయంగా పిల్లల అక్రమ రవాణా చేపట్టిన విచారణలో పలువురు అరెస్ట్ అయ్యారు. 2015లో జరిగిన మరో విచారణలో రుస్తావి ప్రసూతి ఆస్పత్రి జనరల్ డైరెక్టర్ అలెగ్జాండ్రే బరావ్‌కోవి అరెస్ట్ అయినట్లు జార్జియా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత, ఆయన నిర్దోషిగా విడుదలై బయటికి వచ్చినట్లు తెలిపాయి.

ఈ కేసులపై మరింత సమాచారం కోసం జార్జియా హోమ్ మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది. కానీ, డేటా సంరక్షణ కారణంతో వివరాలను బయటికి విడుదల చేయడం లేదని తెలిపింది.

తమునా ప్రస్తుతం మానవ హక్కుల న్యాయవాది లియా ముఖశవ్రియాతో కలిసి జార్జియా కోర్టులో బాధితుల తరఫున పోరాడుతున్నారు. వారి జనన ధ్రువీకరణ పత్రాల యాక్సస్ కల్పించాలని కోరుతున్నారు. జార్జియా చట్టాల కింద ప్రస్తుతం ఇది సాధ్యం కాకపోవచ్చు.

‘‘నేను ఏదో, ఎవరినో కోల్పోతున్నట్లు నాకెప్పుడూ అనిపించేది. కానీ ఆమీని కలుసుకున్న తర్వాత ఆ భావన పోయింది’’ అని ఆనో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)