కారు గ్యారేజీలో న్యూక్లియర్ మిసైల్ రాకెట్, ఇన్నేళ్లుగా అతను ధైర్యంగా ఎలా ఉన్నాడంటే....

న్యూక్లియర్ మిసైల్

ఫొటో సోర్స్, BELLEVUE POLICE DEPARTMENT

ఫొటో క్యాప్షన్, అది డగ్లస్ ఏఐఆర్-2 జెనీ రాకెట్ అని నిర్ధరించారు.
    • రచయిత, మాక్స్ మట్జా
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికాలోని ఓ గ్యారేజీలో రాకెట్ లాంఛర్ దొరికిందని, ఇది ఒక పాత న్యూక్లియర్ మిసైల్ రాకెట్ అని వాషింగ్టన్ పోలీసులు తెలిపారు.

ఒహియోలోని మిలిటరీ మ్యూజియానికి ఈ రాకెట్‌ను విరాళంగా ఇస్తామని బెల్లేవ్ నివాసి ఒకరు చెప్పడంతో మ్యూజియం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో బెల్లేవ్ నగర పోలీసులు బాంబ్ స్క్వాడ్‌ను తీసుకొని, దాత ఇంటికి వెళ్లారు. బాంబ్ స్క్వాడ్ ఆ వస్తువును పరిశీలించి, అది డగ్లస్ ఏఐఆర్-2 జెనీ ( అంతకు ముందు MB-1 అని పిలిచే వారు) రాకెట్ అని నిర్ధరించింది.

ఇది న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకెళ్లేలా రూపొందిన గైడెడ్ ఎయిర్-టు-ఎయిర్ రాకెట్ అని తెలిపారు. మిసైల్‌కు ఎలాంటి వార్‌హెడ్‌ అమర్చి లేదని, అందుకే దానితో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.

అమెరికా

ఫొటో సోర్స్, BELLEVUE POLICE DEPARTMENT

ఫొటో క్యాప్షన్, అమెరికా మిలటరీ ఆ పరికరాన్ని తీసుకెళ్లడానికి సమ్మతి తెలపలేదు.

అసలేం జరిగింది?

ఓహియోలోని డేటన్‌లోని ఎయిర్‌ఫోర్స్ మ్యూజియం నుంచి తమకు బుధవారం కాల్ వచ్చిందని పోలీసు శాఖ తెలిపింది.

ఈ పరికరం "ప్రాథమికంగా రాకెట్‌‌లో ఇంధనం నిల్వ చేసే గ్యాస్ ట్యాంక్" అని బెల్లేవ్ పోలీసు అధికారి సేథ్ టైలర్ బీబీసీతో చెప్పారు.

ఇదంత సీరియస్ కాదని, పైగా అది తుప్పు పట్టిందని టైలర్ తెలిపారు.

''ఇదొక తుప్పు పట్టిన లోహపు ముక్క. అయినా ఎందుకు మీడియాకు ఈ వార్తను విడుదల చేస్తున్నామని మా బాంబ్ స్క్యాడ్ మెంబర్స్ కూడా నన్ను అడిగారు'' అని టైలర్ తెలిపారు.

ఘటన గురించి పోలీసు అధికారి మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. ''మీడియా కవరేజీ ఇష్టపడని దాత కూడా మా నుంచి కాల్ వస్తుందని ఊహించలేదు. అంతేకాదు ఈ విరాళం గురించి మ్యూజియం సిబ్బంది కూడా పోలీసులకు చెబుతామని ఆయనతో అనలేదు. అయితే, ఆ పరికరం పరిశీలించడానికి ఆయన సహకరించారు, అది సురక్షితమని నిర్దరించుకున్నాం'' అని టైలర్ అన్నారు.

ఇందులో అణు వార్‌హెడ్ ఉండవచ్చని అధికారులు భావించలేదు. అందుకే సియాటెల్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో, లక్షన్నర జనాభా ఉన్న ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించాల్సిన అవసరం కూడా రాలేదు.

ఆ రాకెట్ ఎక్కడిది?

ఈ రాకెట్ ఈ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి ఒక ఎస్టేట్ కొనుగోలు సందర్భంగా దీన్ని కూడా కొనుగోలు చేసినట్లు దాత పోలీసులకు వివరించారు.

పోలీసులు దీన్ని పరిశీలించి ఇది పేలుడు అవకాశం లేని ఒక పాతకాలపు వస్తువుగా గుర్తించారు.

‘‘ఇది పని చేయని స్థితిలో ఉంది. మిలిటరీ వాళ్లు కూడా దీనిని తమకు ఇవ్వమని అడగ లేదు. కాబట్టి దీన్ని రిస్టోర్ ( పాత రూపానికి తీసుకురావడం) చేసుకోవడానికి అతనికే వదిలేస్తున్నాం. రిస్టోర్ చేశాక మ్యూజియంలో పెట్టుకోవచ్చు’’ అని పోలీసులు వెల్లడించారు.

సియాటెల్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం, కోల్డ్ వార్ సమయంలో ఈ రాకెట్‌ను అమెరికా, కెనడాలు ఉపయోగించాయి.

1957లో దీన్ని తొలిసారి ఉపయోగించారని, 1962 నుంచి ఇలాంటి రాకెట్ల తయారీ ఆగిపోయిందని ఆ పత్రిక వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)