విశాఖపట్నం:ధోనీ హెలీకాప్టర్ షాట్‌లను పరిచయం చేసిన ఈ స్టేడియం పిచ్ బ్యాటర్ల పాలిట స్వర్గమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నంలో ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. జైస్వాల్ 290 బంతుల్లో 209 పరుగులు సాధించాడు. అతనికిది తొలి ఇంటర్నేషనల్ డబుల్ సెంచరీ.
జైస్వాల్ డబుల్ సెంచరీతో విశాఖ క్రికెట్ స్టేడియం ‘టీమిండియా సెంటిమెంట్ గ్రౌండ్’ అని మరోసారి రుజువైందని క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ గతంలో భారత్ ఆడిన రెండు టెస్ట్ మ్యాచుల్లో కూడా సెంచరీలు, డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. దీంతో విశాఖ క్రికెట్ గ్రౌండ్‌కు ఉన్న బ్యాటింగ్ ప్యారడైజ్ అనే పేరు మరోసారి రుజువైందని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సెంచరీలకు కేరాఫ్ విశాఖ స్టేడియం
జైస్వాల్ డబుల్ సెంచరీతో విశాఖలో భారత బ్యాటర్లు చేసిన సెంచరీలపై క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే టీమిండియా ఈ స్టేడియంలో ఎలాంటి విజయాలు నమోదు చేసింది? వంటి విషయాలపై కూడా చర్చ జరుగుతోంది.
విశాఖలో క్రికెట్ సంబంధించిన వివరాలను క్రికెట్ కోచ్, ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఇన్‌ఛార్జ్ విజయ్‌కుమార్‌తో బీబీసీ మాట్లాడింది. విశాఖ స్టేడియం అంటేనే బ్యాట్స్‌మెన్‌కు ప్యారడైజ్ లాంటిదని, ఇక్కడ దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక టీం నుంచి సెంచరీ నమోదవుతుంటుందని ఆయన చెప్పారు. అయితే ఎక్కువగా టీమిండియా ఆటగాళ్లే ఇక్కడ సెంచరీలు కొట్టారని విజయ్‌కుమార్ చెప్పారు.
విశాఖ స్టేడియంలో టీమిండియాకు సెంటిమెంట్ కూడా ఉందని, ఇక్కడ సెంచరీ చేసిన వారు భారత క్రికెట్‌లో స్టార్స్‌గా ఎదిగారని, అందుకు ఉదాహరణే ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ అని గుర్తుచేశారు.
2005లో పాకిస్తాన్ పై విశాఖలో జరిగిన వన్డే మ్యాచ్‌లో 148 పరుగులు చేసిన ధోనికి ఆ మ్యాచే తన కెరీర్‌కు కిక్ స్టార్ట్ ఇచ్చిందని, ఆ తర్వాత తన కెరియర్‌లో వెనుదిరిగి చూసుకోలేదని, ఆ రోజు వైజాగ్‌లో ధోని బ్యాటింగ్‌ను క్రికెట్ అభిమానులు మర్చిపోలేరని విజయ్‌కుమార్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండు డబుల్ సెంచరీలు ఇక్కడే..
ఇప్పటివరకు విశాఖలో జరిగిన టెస్ట్ మ్యాచుల్లో పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, యశస్వీ జైస్వాల్ సెంచరీలు నమోదు చేశారు. విశాఖలో తొలి టెస్ట్ సెంచరీని పుజారా 2016లో ఇంగ్లాడ్ పై నమోదు చేశారు.
విశాఖలో మయాంక్, జైస్వాల్ డబుల్ సెంచరీలు చేయగా, పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సెంచరీలు కొట్టారు. రోహిత్ శర్మ ఒక టెస్ట్‌లో మొదటి, రెండో ఇన్సింగ్స్‌లలో సెంచరీలు చేశాడు.
2016లో విశాఖలో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 167, పూజరా 119 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత 2019లో విశాఖలో రెండో టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో జరిగింది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఫస్ట్ ఇన్సింగ్స్‌లో 176, సెకండ్ ఇన్సింగ్స్‌లో 127 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లోనే మయాంక్ అగర్వాల్ 215 పరుగులు చేశాడు. ఇది విశాఖలో నమోదైన తొలి డబుల్ సెంచరీ.
ఆ తర్వాత ప్రస్తుతం ఇంగ్లండ్ టీంతో జరుగుతున్న టెస్టు విశాఖలో జరుగుతున్న మూడో టెస్టు. ఈ టెస్టులో ఇప్పటికే యశస్వీ జైస్వాల్ 209 పరుగులు చేసి తన తొలి డబుల్ సెంచరీ చేశాడు. ఇది విశాఖ గ్రౌండ్‌లో నమోదైన రెండో డబుల్ సెంచరీ.
ఇప్పటీ వరకు విశాఖలో టీమిండియా తరపున టెస్టుల్లో నాలుగు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. భారత ఆటగాళ్లే కాకుండా మరో ఇద్దరు బ్యాటర్లు ఇక్కడ సెంచరీలు చేశారు.
2019లో భారత్‌తో జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు డీన్ ఎల్గర్ (160), డీకాక్ (111) నమోదు చేశారు. వీటిని కలుపుకొంటే విశాఖలో మొత్తం 8 టెస్ట్ సెంచరీలు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
రికార్డులకు వేదికగా విశాఖ
విశాఖలో మొత్తం 14 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో మూడు వన్ టౌన్‌లో ఉన్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కాగా, మిగతా 11 మ్యాచ్‌లు ఏసీఏ-వీసీడీఏ స్టేడియంలో జరిగాయి. ప్రస్తుతం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మ్యాచ్‌లు జరగడం లేదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం 2003 నుంచి అందుబాటులోకి రాగా, తొలి మ్యాచ్ 2005లో జరిగింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ మ్యాచ్‌లోనే ధోని 148 పరుగులు చేసి ధనాధన్ ధోనిగా పేరు పొందారు. అంతేకాదు ధోనీ ‘హెలికాప్టర్ షాట్’ ఈ మ్యాచ్ ద్వారానే అభిమానులకు పరిచయమైంది.
విశాఖలో జరిగిన 14 మ్యాచుల్లో టీమిండియా 10 గెలిచింది. మరో మూడు ఓడిపోగా, ఒకటి టై అయ్యింది. 2001లో ఆస్ట్రేలియాతో, 2013లో వెస్టీండీస్‌తో, 2023లో అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో భారత్ ఓడిపోయింది. 2018లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ టైగా (321 స్కోర్) ముగిసింది.
విశాఖలో జరిగిన ఈ 14 వన్డే మ్యాచుల్లో మొత్తంగా 15 సెంచరీలు వచ్చాయి. అందులో ఇండియా 8, ఇతర జట్ల నుంచి 7 నమోదయ్యాయి. భారత్ తరపున 1994లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో నవజ్యోత్ సిద్ధు సింగ్ (114 నాటౌట్) తొలి సెంచరీ నమోదు చేశాడు.
విశాఖలో అత్యధిక స్కోరు రోహిత్ శర్మది. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 159 పరుగులు చేశాడు ఈ హిట్‌మ్యాన్. 2018లో విశాఖలో కోహ్లీ వెస్టిండీస్‌పై చేసిన సెంచరీతో (157), వన్డేల్లో 10 వేల పరుగులు మైలు రాయిని అందుకున్నాడు.
ఇక విశాఖలో విదేశీ జట్ల తరపున మహేలా జయవర్దనే (101), మ్యాథ్యూ హెడెన్ (111), షై హోప్ 123 నాటౌట్ , మైకేల్ క్లార్క్ (111 నాటౌట్) సెంచరీలు చేశారు.
2014 వెస్టీండీస్ ఇండియా మధ్య విశాఖలో జరగాల్సిన వన్డే మ్యాచ్ హుద్ హుద్ తుపాను కారణంగా రద్దయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images
టీ20ల్లో ‘నో సెంచరీ’
విశాఖలో జరిగిన వన్డే, టెస్ట్ మ్యాచుల్లో విజయాలు సాధించడంలోనూ, సెంచరీలు నమోదు చేయడంలోనూ ముందున్న భారత జట్టు టీ20లలో మాత్రం వెనుకబడింది.
విశాఖలో 4 టీ20 మ్యాచులు జరిగాయి. ఇందులో మూడు మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా, 2019లో అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడింది. అయితే 2023 నవంబర్‌లో జరిగిన టీ20 మ్యాచ్ లో అస్ట్రేలియాపై ఇండియా విజయం సాధించింది.
అయితే ఈ నాలుగు మ్యాచుల్లో భారత బ్యాటర్లు ఎవరూ సెంచరీలు నమోదు చేయలేక పోయారు. 2023 నవంబరులో అస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ చేసిన 80 పరుగులే భారత తరఫున అత్యధిక స్కోరు.
2023లో విశాఖలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ తరపున జాస్ ఇంగ్లీస్ సెంచరీ (110) కొట్టాడు. దీంతో విశాఖ స్టేడియంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ మ్యాచుల్లో (టెస్ట్, వన్డే, టీ20) సెంచరీలు నమోదైనట్లయింది.

ఫొటో సోర్స్, Getty Images
విశాఖలో మ్యాచ్‌లు 22.. సెంచరీలు 24
మొత్తంగా విశాఖ అన్ని ఫార్మెట్లు (టెస్ట్, వన్డే, టీ20) కలిపి 22 అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదిక కాగా, వీటిలో 14 వన్డేలు, మూడు టెస్టులు, 4 టీ20లు జరిగాయి. ఒక వన్డే మ్యాచ్ రద్దయింది. జరిగిన 21 మ్యాచుల్లో 24 సెంచరీలు నమోదయ్యాయి. అందులో టెస్టులో 8, వన్డేల్లో 15, టీ20లో 1 సెంచరీ నమోదయ్యింది. ఇందులో భారత్ తరపున మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి.
విశాఖలో మూడో టెస్ట్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ టెస్టు 6 తేదీ వరకు జరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాట్స్‌మెన్ ప్యారడైజ్: క్యూరేటర్ మల్లయ్య
విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంను బ్యాటర్ల ప్యారడైజ్ గా పిలుస్తారు. ఇక్కడ ఆయా జట్ల తరఫున అత్యధిక స్కోర్లు నమోదు కావడం, దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ నమోదు అవుతుండటంతో దీనికి ఆ పేరు వచ్చింది.
“విశాఖలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ బ్యాట్స్‌మెన్ కుదురుకుంటే చాలు పరుగుల వరద సృష్టించొచ్చు. ధోని, రోహిత్ శర్మ వంటి బ్యాటర్లు ఇక్కడ చేసిన పరుగులే అందుకు ఉదాహరణ. పైగా ఇక్కడి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. దీంతో బ్యాటర్లు తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. అందుకే దీనిని బ్యాట్స్‌మెన్ ప్యారడైజ్ అంటారు” అని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం క్యూరేటర్ మల్లయ్య చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- లాల్‌కృష్ణ అడ్వాణీ: పార్టీని రెండు సీట్ల నుంచి ప్రధాని పీఠం వరకు తీసుకొచ్చిన నేత
- అయోధ్య: సెక్యులరిజం గీత చెరిగి పోతోందా, లౌకికవాదంపై రాజ్యాంగం, కోర్టులు ఏం చెప్పాయి..
- కుమారీ ఫుడ్ కోర్టు: తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింత చర్చ, రేవంత్ రెడ్డి జోక్యం చేసుకునే వరకు ఎందుకు వెళ్లింది?
- రజినీకాంత్‌ను ‘సంఘీ’ అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, తమిళనాడులో జరుగుతున్న రగడ ఏంటి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














