రూ.33 వేల కోట్లు పెట్టి అమెరికా నుంచి ఈ డ్రోన్లను భారత్ ఎందుకు కొంటోంది? వీటిని ఎక్కడ వాడతారు?

 గగనతల రక్షణ ఏర్పాట్లు

ఫొటో సోర్స్, GA-ASI.COM

ఇండియాకు 31 ఆర్మ్‌డ్ ‘ఎంక్యూ-9బీ’ డ్రోన్‌లను అమ్మే ఒప్పందానికి అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది.

ఈ డ్రోన్లతోపాటు వీటికి అమర్చే క్షిపణులు, ఇతర నిఘా పరికరాలను కూడా భారత్‌కు అందివ్వనున్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది.

సుమారు రూ. 33 వేల కోట్ల (నాలుగు బిలియన్ డాలర్ల) విలువైన ఈ ఒప్పందంపై చాలా ఏళ్లుగా భారత్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి.

సైనిక అవసరాల కోసం ఈ డ్రోన్‌ల కొనుగోలుపై భారత్ 2018 నుంచి ప్రత్యేక ఆసక్తి కనబరిచింది. ఎట్టకేలకు జో బైడెన్ ప్రభుత్వం నుంచి ఆమోదం పొందింది.

అయితే, ఆయుధాల కొనుగోళ్లలో రష్యాకు దగ్గరవుతున్న భారత్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నంగా అమెరికా ఆమోదాన్ని చూస్తున్నారు.

డ్రోన్ల కొనుగోలుకు అమెరికా సమ్మతి లభించడంతో భారత్‌కు పెద్ద అడ్డంకి తొలగిందనే చెప్పొచ్చు.

ఎందుకంటే ఈ ఒప్పందానికి సమ్మతి తెలపాలంటే, ‘‘అమెరికాలో సిక్కు వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర’’పై భారత్ దర్యాప్తు చేయాలని అమెరికా చట్టసభ సభ్యులు గత సంవత్సరం డిమాండ్ చేశారు.

అయితే, హత్య కుట్ర విచారణకు సంబంధించి అమెరికా ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో తమ వైఖరిని మార్చుకున్నామని డెమొక్రటిక్ ఎంపీ బెన్ కార్డిన్ చెప్పారు.

ఆయన అమెరికా సెనేట్ ఫారన్ అఫైర్స్ కమిటీ చీఫ్‌‌.

"హత్య కుట్ర విషయంలో దర్యాప్తు జరగాలని, భారత్‌లో కూడా ఇలాంటి కార్యకలాపాలకు జవాబుదారీతనం ఉండాలని అమెరికా చెప్పింది" అని బెన్ కార్డిన్ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ గత సంవత్సరం అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు, ఒప్పందాన్ని వేగవంతం చేయాలని కోరారని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

మోదీ, బైడెన్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (ఫైల్)

ఒప్పందం కింద ఏమేం ఇస్తారు?

డ్రోన్ల విక్రయ ఒప్పందాన్ని ఆమోదిస్తూ అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ గురువారం అక్కడి పార్లమెంటులో ప్రకటన చేసింది.

ఈ డ్రోన్ల కాంట్రాక్ట్‌ను 'జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్' కంపెనీకి అప్పగించినట్లు పెంటగాన్ తెలిపింది.

ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌కు 31 సాయుధ ఎంక్యూ -9బీ స్కైగార్డియన్ డ్రోన్‌లు, కమ్యూనికేషన్, నిఘా పరికరాలు అందించనున్నారు.

వీటిలో 170 ఏజీఎం-114ఆర్ హెల్‌ఫైర్ క్షిపణులు, చిన్న వ్యాసం గల 310 లేజర్ బాంబ్‌లు, కచ్చితత్వంతో పనిచేసే గ్లైడ్ బాంబులు కూడా ఉన్నాయి.

డ్రోన్

ఫొటో సోర్స్, GA-ASI.COM

ఎంక్యూ-9బీ సామర్థ్యాలు ఏమిటి?

''ఎంక్యూ-9బీ మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్, దీనిని రిమోట్‌ సాయంతో ఎగురవేయవచ్చు, నియంత్రించవచ్చు'' అని డ్రోన్ తయారీ సంస్థ 'జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్' తెలిపింది.

అలాంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లను రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (ఆర్‌పీఎస్) అంటారు.

దూరం నుంచి ఈ డ్రోన్‌ను ఆపరేట్ చేసే పైలట్ సాధారణ విమానం నుంచి చూసినట్లే ప్రతిదీ చూడగలరు. ఇది ఆధునిక రాడార్ వ్యవస్థ, సెన్సార్లతో ఉంటుంది. దానికదే టేకాఫ్, ల్యాండ్ అవుతుంది. దీనిని శాటిలైట్ సహాయంతో నియంత్రించవచ్చు, అన్ని రకాల వాతావరణాల్లో పగలైనా రాత్రైనా 40 గంటలకు పైగా ప్రయాణిస్తుంది.

ఇది 2,155 కిలోల బరువుతో ప్రయాణించగలదు.

డ్రోన్

ఫొటో సోర్స్, GA-ASI.COM

ఎంక్యూ-9బీ డ్రోన్‌ను ఎక్కడ వాడతారు?

  • ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ
  • సరిహద్దులపై నిఘా
  • వైమానిక దాడులు చేయడం
  • సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు
  • విపత్తు సహాయక చర్యలలో సాయం
  • శాంతిభద్రతల నిర్వహణలో సాయం
  • మానవతా సహాయం అందించడం

ఎంక్యూ-9బీ స్కైగార్డియన్‌ డ్రోన్లను ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, పర్యావరణ, మానవతా కార్యకలాపాలు లాంటి వాటిలో ఎక్కువగా ఉపయోగించారు.

ఈ డ్రోన్ సాధారణ వాణిజ్య విమానాల మాదిరే ఎగురుతుంది, వీటిని సైన్యాలు లేదా ప్రభుత్వాలు వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తాయి.

దీనిని గూఢచర్యం, పరిశీలన, నిఘా (ఐఎస్ఆర్) కోసం ఉపయోగిస్తున్నారు.

డ్రోన్

ఫొటో సోర్స్, GA-ASI.COM

ఈ డ్రోన్లతో భారత్ ఏం చేస్తుంది?

శత్రు లక్ష్యాల (ఫైటర్ పైలట్‌ల యుద్ధ విమానాలు)పైకి క్షిపణులు, మందుగుండు సామగ్రిని ప్రయోగించగల సామర్థ్యం ఎంక్యూ-9బీ డ్రోన్లకు ఉంది.

ఈ డ్రోన్లకు నిఘా, పర్యవేక్షణ సామర్థ్యం ఉంది.

వీటిని ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (రాడార్ జామింగ్ ద్వారా శత్రు రాడార్, రేడియో వ్యవస్థల ప్రభావాన్ని తగ్గించడం), యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్ (ఉపరితల లక్ష్యాలను ధ్వంసం చేయడం), యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌ (సముద్రంలో చేసే ఆపరేషన్లు), మానవతా సహాయం, విపత్తు సహాయ చర్యలు, సర్చ్, రెస్క్యూ, గాలిలో ముందస్తు హెచ్చరికలతో పాటు సుదూర నిఘా కోసం ఉపయోగించవచ్చు.

అంతేకాకుండా డ్రగ్స్ స్మగ్లింగ్ లాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి కూడా ఈ డ్రోన్‌లను మోహరించవచ్చు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 31 డ్రోన్లలో 15 భారత నౌకాదళానికి, 8 ఆర్మీకి, మరో 8 వైమానిక దళానికి ఇవ్వనున్నారు.

డ్రోన్

ఫొటో సోర్స్, GA-ASI.COM

రెండు రకాల డ్రోన్లు

ఎంక్యూ9 సిరీస్‌లో అందుబాటులో ఉన్న రెండు రకాల (స్కై గార్డియన్, సీ గార్డియన్) డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత్ పరిశీలిస్తోందని సమాచారం.

సముద్రపు నిఘా కోసం సీ గార్డియన్ డ్రోన్లు ఎక్కువగా ఉపయోగిస్తారు, స్కై గార్డియన్ డ్రోన్లు భూ సరిహద్దుల రక్షణ కోసం మోహరిస్తారు.

2016లో మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ (ఎంటీసీఆర్)లో భారత్ అధికారిక సభ్యత్వం పొందినప్పటి నుంచీ ఈ డ్రోన్‌లను కొనాలనే చర్చ మొదలైందని రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేడీ బీబీసీ హిందీతో చెప్పారు.

భారత్ ఎంటీసీఆర్‌పై సంతకం చేయకపోతే, ఈ డ్రోన్లను పొందడం సాధ్యం కాదని తెలిపారు.

"ఎంటీసీఆర్‌పై సంతకం చేసిన కొద్దిసేపటికే ఈ సాయుధ డ్రోన్‌లను అందించాలంటూ భారత్ అమెరికాకు అభ్యర్థన లేఖ పంపింది. ఇప్పటివరకు అమెరికా ఈ డ్రోన్‌లను నాటో సభ్య దేశాలకు మాత్రమే అందించింది. కాబట్టి మొదటిసారి నాటోయేతర దేశానికి ఈ డ్రోన్లు అందబోతున్నాయి" అని రాహుల్ అన్నారు.

భారత్‌లో మానవ రహిత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే ప్రయత్నంలో ప్రధాన భాగమే ఈ డ్రోన్ల కొనుగోలు.

ఈ డ్రోన్ భారత్ తన సరిహద్దులపై నిఘా సామర్థ్యాన్ని పెంచడానికి, రాబోయే ముప్పులను మరింత సమర్థవంతంగా పసిగట్టడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.

అంతేకాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యంపై నిఘా ఉంచడానికి కూడా ఈ డ్రోన్‌లు ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)