పాకిస్తాన్: 7 వేల మంది మిస్సింగ్, 50 మందే అంటున్న తాత్కాలిక ప్రధాని.. వారంతా ఏమైనట్లు?

ఫొటో సోర్స్, SAMMI DEEN BALOCH
- రచయిత, కెల్లీ ఎన్‌జీ
- హోదా, బీబీసీ న్యూస్
పాకిస్తాన్‌లో వచ్చే వారం ఎన్నికలు జరగనుండడంతో అక్కడ రాజకీయ వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి.
కానీ, నిరుడు డిసెంబర్‌లో వందలాది మంది పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నిరసనలకు దిగారు. కానీ, అవి రాజకీయ వ్యవహారాలకు సంబంధించినవి కావు.
నిరసనకారుల్లో సమ్మి దీన్ బలూచ్ అనే యువతి లామినేషన్ చేసిన తన తండ్రి ఫొటోను పట్టుకుని ఉన్నారు.
ఆమె తన తండ్రి ఎక్కడున్నారో, ఏమయ్యారో తెలుసుకునేందుకు 14 ఏళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
అసలు ఆయన బతికే ఉన్నారా?
బలవంతంగా తీసుకెళ్లినపోయిన తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం బలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి దాదాపు 1000 మైళ్ల దూరం నడిచి వచ్చిన నిరసనకారులకు 26 ఏళ్ల సమ్మి దీన్ బలూచ్ నాయకత్వం వహించారు.
వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఫిరంగులు వాడారు. దాదాపు 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎప్పుడూ ఉద్రిక్తతలు తలెత్తే బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఇలాంటి నిరసనలు నిత్యకృత్యమే. అయితే, ఈ నిరసనల్లో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు.
పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో ఉండే బలూచిస్తాన్‌లో ఎన్నో ఏళ్లుగా జాతీయవాద తిరుగుబాట్లు జరుగుతున్నాయి.
తాము బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాడుతున్నట్లు వేర్పాటువాద మిలిటెంట్లు చెబుతున్నారు.
తిరుగుబాటును అణచివేసేందుకు పాకిస్తాన్ భద్రతా దళాలు తమ వారిని బలవంతంగా లాక్కెళ్లి, హింసించి, చంపేశారని నిరసనకారులు చెబుతున్నారు. వారిలో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఇస్లామాబాద్ అధికారులు ఖండించారు.
గత ఇరవై ఏళ్లలో ఇలాంటి అదృశ్యాలు వేల సంఖ్యలో జరిగాయని చెబుతున్నారు.
బలవంతంగా లాక్కెళ్లడాన్ని నిర్బంధం, అపహరణ, లేదా అధికార వర్గాలు స్వేచ్ఛను హరింపజేసే మరో రూపంగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

ఫొటో సోర్స్, BALOCH YAKJEHTI COMMITTEE
ఆచూకీ దొరకదు..
సమ్మికి 11 ఏళ్ల వయసులో ఆమె తండ్రి దీన్ మహ్మద్ బలూచ్‌ను బలవంతంగా లాక్కెళ్లిపోయారు.
2009లో బలూచిస్తాన్ నైరుతి ప్రాంతంలోని ఓ ఆస్పత్రిపై సాయుధ దళాలు దాడి చేశాయి. ఆ సమయంలో షిఫ్ట్‌లో డాక్టర్‌గా విధుల్లో ఉన్నప్పుడు ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి.
''ఇప్పటి వరకూ ఆయనకు ఏమైందో తెలియదు. వితంతువుని అయ్యానా కాదా అనేది కూడా మా అమ్మకు తెలియదు. అసలు ఆయనను ఎందుకు తీసుకెళ్లారో కూడా ఇప్పటికీ తెలియదు'' అని సమ్మి బీబీసీతో చెప్పారు.
2004 నుంచి ఇలా అదృశ్యమైన ఘటనలకు సంబంధించి సుమారు 7,000 కేసులు నమోదయ్యాయని బలూచిస్తాన్‌లో అదృశ్యమైన వారి కుటుంబ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ 'వాయిస్ ఫర్ బలూచ్ మిస్సింగ్ పర్సన్స్' తెలిపింది.
బలవంతపు అదృశ్యాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో 2024 జనవరి నాటికి 2,724 యాక్టివ్ కేసులను నమోదు చేసింది. అయితే, కేవలం 50 మంది మాత్రమే కనిపించకుండా పోయారని పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాన మంత్రి ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
బలవంతపు అదృశ్యాలను నేరంగా పరిగణించే బిల్లును పాకిస్తాన్ పార్లమెంట్ (నేషనల్ అసెంబ్లీ) 2021లో ఆమోదించింది, కానీ అది ఇంకా అమల్లోకి రాలేదు. అలాంటి అదృశ్యాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోర్టు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అయితే, అవన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
బలూచ్ జాతీయవాదం గురించి, బలూచ్ భూభాగంపై హక్కుల గురించి మాట్లాడుతున్న వారిపై వేర్పాటువాదులు, ఇబ్బందులు సృష్టించేవారిగా ప్రభుత్వం ముద్రవేసింది.
కానీ, ఇటీవలి సంవత్సరాల్లో బలవంతంగా అదుపులోకి తీసుకున్న బలూచ్ ప్రజల్లో చాలా మందికి సాయుధ గ్రూపులతో సంబంధం లేదని జర్నలిస్ట్ తాహా సిద్దిఖీ చెబుతున్నారు.
''కొన్నిసార్లు కేవలం అనుమానంతో, కొన్నిసార్లు బలూచిస్తాన్‌లోని పాకిస్తాన్ అనుకూల గ్రూపులు అందించిన తప్పుడు సమాచారంతో'' అధికారులు వారిని నిర్బంధిస్తున్నారని ఆయన చెప్పారు.
నిందితులను నిరంకుశంగా నిర్బంధించవద్దని, అధికారులు చట్టప్రకారం వ్యవహరించాలని ఆందోళనకారులు కోరుతున్నారు.
"వాళ్లు ఏదైనా తప్పు చేసి ఉంటే వారిని కోర్టులో హాజరుపరచండి. ఇలాంటి బలవంతపు అదృశ్యాలు మా కుటుంబాలను క్షోభకు గురిచేస్తున్నాయి. 2009 నుంచి నా జీవితమే మారిపోయింది. మమ్మల్ని మానసిక హింసకు గురిచేశారు. అసలు మా జీవితం ఏంటో మాకే తెలియడం లేదు. ఇది చాలా బాధాకరం" అని సమ్మి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మహరంగ్ బలూచ్, ఈమె గత ఏడాది లాంగ్ మార్చ్(భారీ నిరసన ప్రదర్శన) నిర్వహించారు. ఇప్పటికి రెండుసార్లు అరెస్టయ్యారు. "బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేతను ప్రపంచం దృష్టిని తీసుకెళ్లాలి" అని ఆశిస్తున్నట్లు మహరంగ్ బలూచ్ బీబీసీతో చెప్పారు. ఆమెకు 30 ఏళ్లు. ఆమె బలూచ్ ప్రతిఘటన ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
2009లో తన తండ్రి అబ్దుల్ గఫార్ లాంగోవ్‌ను భద్రతాధికారులు తీసుకెళ్లారని, రెండేళ్ల తర్వాత చిత్రహింసలకు గురై ఒంటినిండా గాయాలతో ఆయన మృతదేహం కనిపించిందని ఆమె చెప్పారు. 2017లో ఆమె సోదరుడిని మూడు నెలల పాటు నిర్బంధించారు.
"బలూచిస్తాన్‌లో బలవంతపు అదృశ్యాలు, చట్టవిరుద్ధమైన హత్యలు భయంకరంగా పెరిగాయి. ఇప్పటికీ చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. కొందరిని సీక్రెట్ సెల్స్‌లో నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన తర్వాత విడుదలు చేసి ఉండొచ్చు. కానీ, వారి మానసిక, శారీరక పరిస్థితి అసలేం బాలేదు'' అని ఆమె చెప్పారు.
తనను కిడ్నాప్ చేస్తారేమోనన్న భయంతో పాకిస్తాన్ నుంచి పారిపోయినట్లు లండన్‌లో నివాసముంటున్న బలూచ్ వ్యక్తి ఒకరు చెప్పారు.
"పాకిస్తానీ సైన్యం బలూచిస్థాన్ పౌరులపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రావిన్స్‌లో బంగారు గనులు, ఇతర సహజ వనరులు ఎన్నో ఉన్నప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి బలూచ్ ప్రజలకు ఎలాంటి వనరులూ అందడం లేదు. కొన్నిచోట్ల కనీసం తాగునీరు కూడా లేదు'' అని ఆయన బీబీసీతో చెప్పారు. తన వివరాలు గోప్యంగా ఉంచాలని ఆయన కోరారు.
వేరే దేశాలకు వెళ్లిపోయినప్పటికీ కొందరు బలూచ్ యాక్టివిస్టులు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనలు జరిగాయి. 2020 డిసెంబర్‌లో యాక్టివిస్ట్ కరీమా బలూచ్ మృతదేహం కెనడాలోని టొరంటోలోని అంటారియో సరస్సు సమీపంలో కనిపించింది. అదే ఏడాది ప్రారంభంలో స్వీడన్‌లో ఉంటున్న, బలూచిస్తాన్ టైమ్స్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా పనిచేసిన పాకిస్తానీ జర్నలిస్ట్ సాజిద్ హుస్సేన్ స్టాక్‌హోమ్ సమీపంలోని నదిలో శవమై కనిపించారు. ఈ రెండు మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆయా దేశాల అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
వనరుల దోపిడీ
ఇటీవల జనవరిలో ఇరాన్ వైమానిక దాడులతో బలూచిస్తాన్ ప్రపంచం దృష్టికి వచ్చింది. ఆ దాడులు ఇరాన్‌లోని సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లలో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దారితీశాయి.
బలూచ్ మిలిటెంట్లే లక్ష్యంగా దాడులు చేసినట్లు రెండు దేశాలూ చెబుతున్నాయి.
చారిత్రకపరంగా ఇరాన్, అఫ్గానిస్తాన్‌లలోని కొంత భూభాగంతో పాటు భారీ విస్తీర్ణం కలిగిన ప్రాంతాన్ని బలూచిస్తాన్‌గా పిలిచేవారు.
పాకిస్తాన్, ఇరాన్ రెండింటిలోనూ ఉన్న బలూచ్ గ్రూపులు స్వతంత్ర బలూచిస్తాన్ కోసం దశాబ్దాలుగా పోరాటం కొనసాగిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ వనరులను దోచుకుంటూ, ఆ ప్రాంత అభివృద్ధిని విస్మరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
చైనా నిధులతో చేపట్టిన బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ 'చైనా - పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్'లోనూ ఇది కీలకం. అయితే, ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు కూడా బలూచ్ ప్రజలకు అందవని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.
''పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్‌లో షాట్‌లుగా పిలిచే పంజాబీ రాజకీయ ప్రముఖుల పట్ల ప్రావిన్స్ అంతటా నిరుత్సాహం, నిరాశ వ్యక్తమవుతోంది'' అని లండన్ యూనివర్సిటీ పరిధిలోని ఎస్వోఏఎస్ సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన బుర్జిన్ వాగ్మార్ అన్నారు.
పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే బలూచిస్తాన్ వివాదం పరిష్కారానికి నోచుకోవడం లేదని నిరసనకారులు, పరిశీలకులు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికలు బలూచ్ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయని వారు అనుకోవడం లేదు. పైగా ఓటు హక్కును కోల్పోతామేమోనని భయపడుతున్నారు.
''బలూచిస్తాన్‌లోని నియోజకవర్గాల్లో బలూచ్ కాని అభ్యర్థులను పోటీకి నిలబెడుతున్నారు. ఇది ఇప్పటికే నిరాదరణకు గురవుతున్న వర్గాన్ని మరింత దూరం చేస్తుంది'' అని సిద్దఖీ అన్నారు.
ఈ ఎన్నికలు బలూచ్‌లకు అంత ముఖ్యమైనవేమీ కాదని మహరంగ్ అన్నారు.
"ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మానవ హక్కుల ఉల్లంఘనలు, చట్టవిరుద్ధ హత్యలు బలూచిస్తాన్‌లో కొనసాగుతూనే ఉంటాయి. ఇది ప్రభుత్వానికి నిజంగా ఎప్పుడూ ఆందోళన కలిగించలేదు" అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పిల్లలు పుట్టాక కూడా ప్రెగ్నెన్సీకి ముందున్న శరీరాకృతి పొందడం ఎలా? మహిళలపై ఇలాంటి ఒత్తిడి ఎందుకు?
- మోదీని ఎదుర్కోవడానికి ఏర్పాటైన 'ఇండియా' కూటమికి అసలు సమస్య కాంగ్రెస్సేనా
- IND vs ENG: సర్ఫరాజ్ ఖాన్‌కు ఈసారీ దక్కని అవకాశం, రజత్ పటీదార్‌కు చోటు
- స్నో లెపర్డ్స్: భారత్‌లో వీటి సంఖ్య ఎంత? ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి?
- ‘చదువైనా మానేస్తాం కానీ, హిజాబ్‌ను వదిలేయం’ అంటున్న ముస్లిం విద్యార్థినులు.. రాజస్థాన్‌లో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం















