నవాజ్ షరీఫ్: ‘కింగ్ ఆఫ్ కమ్‌బ్యాక్స్’గా పేరున్న ఈయన మళ్లీ పాక్ ప్రధాని అవుతారా?

నవాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌కు మూడుసార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించిన నవాజ్ షరీఫ్ గత ఏడాదే ప్రవాసం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికల్లో ఆయన ఫ్రంట్ రన్నర్.

పాకిస్తాన్ రాజకీయాల్లో గత 30 ఏళ్లుగా ఆయన ఆధిపత్యం ఉన్నప్పటికీ, షరీఫ్ మళ్లీ ముందువరుసలోకి రాగలరని ఊహించినవారు కొద్దిమందే.

అవినీతి కేసులో దోషిగా తేలడంతో ఆయన చివరి పదవీకాలం ముగిసింది. అంతకుముందు ఆయన ప్రభుత్వం మిలిటరీ తిరుగుబాటు కారణంగా కూలిపోయింది.

అయినప్పటికీ, అనేక నాటకీయ పరిణామాల నడుమ ఆయన మరోసారి విజయవంతంగా పునరాగమనం చేసేలా కనిపిస్తున్నారు.

‘‘తదుపరి ప్రీమియర్ అయ్యేందుకు ఆయనే అగ్ర నాయకుడు. విస్తృతంగా పాపులారిటీ ఉన్నందుకు కాదు, రాజకీయ క్రీడలో తన ముక్కలను ఆయన సరిగ్గా వాడినందుకు ఇప్పుడు ఈ స్థానంలో నిలిచారు’’ అని విల్సన్ సెంటర్ థింక్ టాంక్ దక్షిణాసియా డైరెక్టర్, విశ్లేషకుడు మైకేల్ కుగెల్‌మాన్ అన్నారు.

షరీఫ్‌ ప్రధాన ప్రత్యర్థి, గతంలో మిలిటరీ మద్దతు ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీపై దేశం అంతటా పరిమితులు ఉన్నాయి.

షరీఫ్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2013లో నవాజ్ షరీఫ్‌కు చాలా పాపులారిటీ దక్కింది

ఆయన కథ ఏంటి?

షరీఫ్‌ను పునరాగమన రారాజు (కింగ్ ఆఫ్ కమ్‌బ్యాక్స్) అని పిలవొచ్చు. గతంలో కూడా ఆయన కచ్చితంగా ఇలాగే చేశారు.

రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు 1999లో సైనిక తిరుగుబాటు కారణంగా నవాజ్ షరీఫ్ పదవీచ్యుతుడు అయ్యారు. తర్వాత, 2013 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఘనంగా పునరాగమనాన్ని చాటుకున్నారు. రికార్డు స్థాయిలో మూడోసారి పాకిస్తాన్ ప్రధాని అయ్యారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం నుంచి మరో ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికవడం 1947 తర్వాత అదే మొదటిసారి.

కానీ, నవాజ్ షరీఫ్ చివరి పదవీకాలంలో చాలా తిరుగుబాట్లు ఎదురయ్యాయి. రాజధాని ఇస్లామాబాద్‌లో ఆరునెలల పాటు ప్రతిపక్షాల ఆందోళనతో మొదలైన తిరుగుబాట్లు అవినీతి ఆరోపణల్లో కోర్టు విచారణలతో ముగిసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో 2017 జులైలో సుప్రీం కోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

నవాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, EPA

పాకిస్తాన్‌లోని ఒక కోర్టు 2018 జులైలో ఆయనను అవినీతి కేసులో దోషిగా తేల్చుతూ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ, రెండు నెలల తర్వాత ఆయన విడుదల అయ్యారు. తుది తీర్పు పెండింగ్‌లో ఉన్నందున శిక్షను కోర్టు సస్పెండ్ చేయడంతో ఆయన బయటకు వచ్చారు.

అయితే, 2018 డిసెంబర్ నాటికి మరో అవినీతి కేసులో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడటంతో మరోసారి జైలు పాలయ్యారు. ఈసారి సౌదీ అరేబియాలోని స్టీల్ మిల్స్‌లో కుటుంబ యాజమాన్యానికి సంబంధించి ఈ ఏడేళ్ల జైలు శిక్ష పడింది.

యూకేలో తనకు వైద్య చికిత్స అవసరమని వాదిస్తూ ఆయన బెయిల్ పొందారు. 2019లో బెయిల్ లభించడంతో లండన్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఒక విలాసవంతమైన ఫ్లాట్‌లో నాలుగేళ్ల పాటు ప్రవాసం ఉండి గత అక్టోబర్‌లోనే తిరిగొచ్చారు.

గత 35 ఏళ్లుగా పాకిస్తాన్‌లోని అగ్ర రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరిగా ఉన్నారు.

ముషారఫ్

ఫొటో సోర్స్, AFP

తొలినాళ్లు

నవాజ్ షరీఫ్ 1949లో లాహోర్‌లోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబంలో జన్మించారు. ఒక అర్బన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

పాకిస్తాన్‌ను 1977-1988 వరకు పాలించిన మిలిటరీ లీడర్ జనరల్ జియా ఉల్ హక్ అనుచరుడు షరీఫ్. 1998లో పాకిస్తాన్ మొదటి అణు పరీక్షలకు ఆదేశించిన నేతగా పాకిస్తాన్ బయట ఆయనకు గుర్తింపు ఉంది.

జియా ఉల్ హక్ మిలిటరీ ప్రభుత్వం తొలినాళ్లలో, 1985-1990 మధ్య పంజాబ్ ప్రావిన్సుకు ఆర్థికమంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో షరీఫ్‌కు జాతీయ గుర్తింపు వచ్చింది.

1990లో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి ప్రతిపక్ష నేత బెనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా 1993లో ఆయనను తొలగించారు.

ఉక్కు పరిశ్రమల సమ్మేళనం ఇత్తేఫాక్ గ్రూప్ యజమానిగా ఆయన దేశంలోని సంపన్న పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా నిలిచారు.

షరీఫ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో సంబరాలు చేసుకుంటోన్న షరీఫ్ లాయర్లు, మద్దతుదారులు

సైనిక తిరుగుబాటు

1997లో మళ్లీ ప్రధానమంత్రి అయ్యాక షరీఫ్ రాజకీయ రంగాన్ని శాసించేలా కనిపించారు. ఆర్మీని మినహాయించి దేశంలోని అన్ని ప్రధాన సంస్థలపై పట్టు సాధించారు.

అప్పుడు పార్లమెంట్‌లో ప్రతిపక్షాలతో విసుగుచెందిన ఆయన షరియా చట్టాన్ని అమలు చేయడానికి వీలు కల్పించే ఒక రాజ్యాంగ సవరణను ఆమోదించడానికి ప్రయత్నించారు. ఆర్మీని నియంత్రించేందుకు ప్రయత్నించారు.

కానీ, 1999లో ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టిన ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్, పాకిస్తాన్‌లో మిలిటరీ ప్రభావాన్ని నియంత్రించడానికి ఏ రాజకీయ నాయకుడైనా ప్రయత్నిస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో చూపించారు.

షరీఫ్‌ను హైజాకింగ్, తీవ్రవాదం ఆరోపణలపై అరెస్ట్ చేసి జీవితఖైదు విధించారు. అవినీతికి పాల్పడ్డారని చెబుతూ రాజకీయ కార్యకలాపాల నుంచి జీవితకాల నిషేధం విధించారు.

కానీ, సౌదీ మధ్యవర్తిత్వం కారణంగా ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు జైలుకు వెళ్లకుండా బయటపడగలిగారని చెబుతారు. షరీఫ్‌తో పాటు ఆయన 40 మంది కుటుంబ సభ్యులను పదేళ్ల పాటు సౌదీ అరేబియాకు బహిష్కరించారు.

షరీఫ్‌ను అధికారం నుంచి తప్పించినప్పుడు పాకిస్తానీలు గొప్ప ఉపశమనంగా భావించారని ఆ సమయంలో బీబీసీ ఇస్లామాబాద్ ప్రతినిధి ఓవెన్ బెన్నెట్ జోన్స్ చెప్పారు.

నవాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

అవినీతి ఆరోపణలు

2007లో పాకిస్తాన్‌కు తిరిగొచ్చేవరకు ఆయన రాజకీయ జీవితం నెమ్మదించింది.

తర్వాత ప్రతిపక్షంలో ఓపికగా ఆయన వ్యవహరించారు. 2008 ఎన్నికల్లో అతని పీఎంఎల్-ఎన్ పార్టీ పార్లమెంట్‌లో నాలుగింట ఒక వంతు సీట్లను గెలుచుకుంది.

2013 ఎన్నికల్లో విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

2013లో అధికారంలోకి వచ్చాక ఇమ్రాన్ ఖాన్ పార్టీ నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో షరీఫ్ రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ ఇస్లామాబాద్‌లో పీటీఐ పార్టీ ఆరు నెలల పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది.

మిలిటరీకి చెందిన ఐఎస్‌ఐ ఏజెన్సీలోని కొందరు అధికారుల ప్రోద్భలంతోనే ఈ ఆందోళనలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

భారత్‌తో వాణిజ్య సంబంధాలను విస్తరించకుండా నిరోధించేలా షరీఫ్ మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మిలిటరీ ఈ పని చేసిందని విశ్లేషకులు భావిస్తారు.

ఆధునిక మౌలిక సదుపాయాలతో, అవినీతి పట్ల కఠినంగా ఉండే ప్రభుత్వ వైఖరితో పాకిస్తాన్‌ను ఆసియా టైగర్‌గా మారుస్తానంటూ తన మూడో పదవీకాలంలో ఆయన హామీ ఇచ్చారు.

కానీ, దేశంలో సమస్యలు పెరిగిపోయాయి. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లోని కొన్ని ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి.

2016లో పనామా పేపర్ల లీకేజీతో ఆయనకు కొత్త ముప్పు ఎదురైంది. వీటిలోని అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

సెంట్రల్ లండన్‌లోని ఒక అప్‌మార్కెట్ ఏరియా అపార్ట్‌మెంట్లలో ఆయన కుటుంబ యాజమాన్యానికి సంబంధించిన ఆరోపణలు, ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి దారి తీసిన మనీ ట్రయల్స్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తనపై వచ్చిన అన్ని ఆరోపణలను నవాజ్ షరీఫ్ ఖండించారు. ఇవన్నీ రాజకీయ అభియోగాలను వ్యాఖ్యానించారు.

2018 జులై 6న పాకిస్తాన్‌లోని ఒక కోర్టు ఆయన అవినీతికి పాల్పడినట్లు నిర్ధారిస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష ప్రకటించినప్పుడు ఆయన లండన్‌లో ఉన్నారు. అప్పుడు అనారోగ్యంతో ఉన్న ఆయన భార్యకు లండన్‌లో చికిత్స జరుగుతోంది.

షరీఫ్ కూతురు, అల్లుడు కూడా దోషులుగా తేలారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, REUTERS

అవకాశాలు

ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నందున నవాజ్ షరీఫ్ లండన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

కానీ, ఇమ్రాన్ ఖాన్ పాలనకాలం కూడా అల్లకల్లోలంగా సాగింది. మిలిటరీతో ఆయన సంబంధాలు చెడిపోయాయి.

2022లో పార్లమెంట్‌ అవిశ్వాస తీర్మాణంలో ఓడిన ఇమ్రాన్ ఖాన్ పదవీ నుంచి తప్పుకోవడంతో నవాజ్ షరీఫ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించారు.

ఇమ్రాన్ ఖాన్ పతనం తర్వాత నుంచి షరీఫ్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తూ రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

2023 అక్టోబర్‌లో పునరాగమనం చేశారు. అతన్ని పదవీచ్యుతున్ని చేసిన మిలిటరీ మళ్లీ స్వాగతించడంతో ఆయనపై ఉన్న కేసులన్నీ కరిగిపోయాయి.

ఒకవేళ పార్టీ అత్యధిక ఓట్లతో గెలిస్తే తిరిగి అధికారాన్ని చేపట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు.

అయితే, పాకిస్తాన్ ఆర్థిక దుస్థితికి షరీఫ్ కారణమంటూ ఆయనపై ఆయన పార్టీపై అక్కడ వ్యతిరేకత ఉంది. అవినీతి ఆరోపణలతో షరీఫ్ ప్రతిష్ట కూడా మసకబారింది.

నవాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

నాలుగోసారి ప్రధాని అవుతారా?

పాకిస్తాన్ రాజకీయాల్లో ఇది కల్లోల సమయం. మూడుసార్లు ప్రధానిగా చేసిన అనుభవంతో తనను తాను అనుభవజ్ఞుడైన నాయకుడిగా షరీఫ్ చెప్పుకుంటున్నారు.

ఆర్థిక వ్యవస్థను స్థిరీకరిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు.

‘‘అనుభవం, స్థిరత్వం తమకు ఓట్లు తెచ్చిపెడతాయని షరీఫ్ మద్దతుదారులు నమ్ముతున్నారు’’ అని కుగెల్‌మాన్ చెప్పారు.

కానీ, విశ్లేషకుల్లో బిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చక్కదిద్దాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ సమస్యలతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నియంత్రించే మిలిటరీ కూడా అక్కడ ఉంది.

విదేశాల్లో ఉన్నప్పుడు నవాజ్ షరీఫ్ తరచుగా సాయుధ బలగాలకు వ్యతిరేకంగా గొంతెత్తేవారు.

దేశంలోని రాజకీయ అస్థిరతకు ఆయన ముఖ్యంగా ఐఎస్‌ఐ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ హెడ్, మాజీ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను నిందించారు. వీటిని వారు ఖండించారు.

దేశ న్యాయవ్యవస్థను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. న్యాయమూర్తులు కుమ్మక్కయ్యారని చెబుతూ బోగస్ కేసులకు తాను బాధితుడిగా మారినట్లు వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ వల్లే ప్రధానమంత్రులెవరూ పదవీకాలం పూర్తిచేయలేకపోయారని ఆరోపించారు.

రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోబోమంటూ చెబుతోన్న పాకిస్తాన్ మిలిటరీ ఇప్పటివరకు షరీఫ్ లేదా ఇమ్రాన్ లేదా మరో ఇతర రాజకీయ నేతకు మద్దతుగా ఏమీ చెప్పలేదు.

రాజకీయాల్లో తిరిగి రావడానికి షరీఫ్ సైన్యంతో ఒప్పందం చేసుకున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

‘‘స్వదేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆయనకు చాలా చట్టపరమైన ఉపశమానాలు దక్కాయి. దీన్నిబట్టే ఆయనకు మిలిటరీ మద్దతు ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు’’ అని కుగెల్‌మాన్ అన్నారు.

‘‘పాకిస్తాన్‌లో మీరో రాజకీయ నాయకుడు అయితే, మీవెనుక సైన్యం ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)