విజయ్: ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ ఎందుకు పెట్టారు? అప్పట్లో ఆయన సినిమాలు చిక్కుల్లో ఎందుకు పడ్డాయి?

నటుడు విజయ్

ఫొటో సోర్స్, AGS

ప్రముఖ తమిళ నటుడు విజయ్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. పార్టీ పేరు- తమిళగ వెట్రి కళగం. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాగే ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వడం లేదని ప్రకటించారు.

2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని విజయ్ ప్రకటించారు.

పార్టీని ప్రకటిస్తూ విజయ్ ఏం చెప్పారు? విజయ్ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? తలైవా, మెర్సెల్, కత్తి లాంటి ఆయన సినిమాలు గతంలో చిక్కుల్లో ఎందుకు పడ్డాయి?

నటుడు విజయ్

ఫొటో సోర్స్, VIJAY MAKKAL IYAKKAM / YOUTUBE

విజయ్ ప్రకటనలోని ముఖ్యాంశాలు

‘‘మీ అందరికీ తెలిసినట్టు ‘విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్’ అనేక సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను చాలా ఏళ్ళుగా నిర్వహిస్తోంది. అయితే కేవలం ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పు సంపూర్ణంగా రాదు. అందుకోసం రాజకీయ అధికారం అవసరం’’ అని విజయ్ తన ప్రకటనలో చెప్పారు.

ఆయన ప్రకటనలోని ప్రధానాంశాలు ఇవీ:

‘‘ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఎలా ఉందో మీ అందరికీ తెలిసిందే. అధికార దుర్వినియోగం, అవినీతి ఓ పక్క, విభజన రాజకీయ సంస్కృతి మరోపక్క. కులం, మతం కింద మన ప్రజలను విడగొడుతున్నారు. ఇవి మన ఐక్యతకు, ప్రగతికి ఆటంకాలుగా మారాయి.’’

‘‘నిజానికి ప్రజలందరూ ప్రత్యేకించి తమిళనాడులో రాజకీయాలలో స్వార్థరహితమైన, పారదర్శకమైన, కులరహితమైన, లంచాలు లేని, సమర్థవంతమైన, దార్శనికత ఉన్న పరిపాలన కావాలని కోరుకుంటున్నారు.’’

‘‘అన్నింటికన్నా ముఖ్యంగా అది భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలి. తమిళ ప్రజల హక్కుల ఆధారంగా ఉండాలి. పుట్టుకతో అందరూ సమానమే అనే సూత్రం ఆధారంగా ఉండాలి. అటువంటి మౌలిక రాజకీయ మార్పే మొదటి ప్రాధాన్యం. అలాంటి రాజకీయ వ్యవస్థ మాత్రమే ప్రజల ప్రేమను పొందగలుగుతుంది. ప్రజల శక్తి మాత్రమే అటువంటి దానిని సాధ్యం చేయగలదు.’’

విజయ్

ఫొటో సోర్స్, Instagram/Actor Vijay

ఫొటో క్యాప్షన్, విజయ్ తన సినిమా కార్యక్రమాల్లోరాజకీయాలు మాట్లాడుతుంటారు.

‘అదే నా చిరకాల కోరిక’

తన తల్లిదండ్రుల తరువాత తనను ఇంతటివాడిని చేసిన తమిళ ప్రజలకు సేవ చేయాలనేది తన చిరకాల కోరిక అని విజయ్ చెప్పారు.

‘‘ఈ రోజు రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నాం. దీని నమోదు కోసం భారత ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేస్తున్నాం. 2024 జనవరి 25న చెన్నైలో జరిగిన పార్టీ జనరల్ కమిటీ, కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిని, కార్యవర్గాన్నిఎన్నుకున్నారు. అలాగే పార్టీ రాజ్యాంగాన్ని, బైలాను ఆమోదించారు. లాంఛనంగా పార్టీ జనరల్ అసెంబ్లీ సభ్యులందరూ దీనిని ఆమోదించారు’’ అని ఆయన తెలిపారు.

పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, జెండా, గుర్తు, తమిళనాడును ప్రగతిపథంలో పయనించడానికి కావాల్సిన కార్యాచరణ ఏమిటనేది పార్లమెంటరీ ఎన్నికల తరువాత ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

నటుడు విజయ్

ఫొటో సోర్స్, VIJAY MAKKAL IYAKKAM

సినిమాలు ఇక ఆపేస్తారా?

‘‘అంతిమంగా రాజకీయాలు నాకు మరో ఉపాధి కాదు. అది ప్రజల కోసం చేసే పవిత్రమైన పని. రాజకీయాలలో ఎత్తు పల్లాలు తెలుసు. ఇందుకోసం నేను చాలా కాలం నుంచి సిద్ధమవుతున్నాను. మనలోని చాలా మంది నుంచి పాఠాలు కూడా నేర్చుకున్నాను. అందుకే రాజకీయాలనేవి నాకు హాబీ కాదు. నాకు అదో ప్రగాఢమైన కోరిక. పూర్తిగా ఇందులో లీనమైపోవాలనుకుంటున్నాను. ఇందుకోసం నేను ఇప్పటికే ఒప్పుకొన్న ఒక సినిమాను పూర్తిచేస్తాను. తరువాత పూర్తిగా రాజకీయాలలోకి వచ్చేస్తాను. నేను ఎప్పటికీ ప్రజలకు రుణపడి ఉంటాను’’ అని విజయ్ ఆ ప్రకటనలో తెలిపారు.

ఈ లోగా స్వచ్ఛంద కార్యకర్తలను పార్టీ కార్యక్రమాలకు తగినట్టుగా మార్చడం, పార్టీని బలోపేతం చేయడం, బాధ్యతగల వారిని పార్టీ నాయకులుగా ఎన్నుకునే పని మొదలవుతందని చెప్పారు.

‘‘2024 పార్లమెంటు ఎన్నికలలో మేం నిలబడటం లేదు, మేం ఎవరికీ మద్దతు ఇవ్వడంలేదు. ఇది పార్టీ సర్వసభ్య సమావేశంలోనూ, కార్యవర్గ సమావేశంలోనూ తీసుకున్న నిర్ణయం’’ అని విజయ్ స్పష్టం చేశారు.

నటుడు విజయ్

ఫొటో సోర్స్, PIB ARCHIVE

విజయ్ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది?

2006 జనవరి 12న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ దిల్లీలో ప్రత్యేక పొంగల్ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ముందుగా ఈ స్టాంప్‌ను నటుడు విజయ్ అందుకున్నారు. అప్పటి సమాచార, సాంకేతిక శాఖ మంత్రి దయానిధి మారన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ప్రభుత్వ కార్యక్రమమే అయినప్పటికీ విజయ్‌పై రాజకీయ వెలుగులు పడటం మొదలైంది అప్పుడే.

2009లో విజయ్ తన అభిమాన సంఘాల పేర్లను విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌గా మార్చారు. ఇందుకోసం ఓ ప్రత్యేక జెండాను కూడా తయారుచేశారు. అభిమానుల ద్వారా రక్తదానం, అన్నదాన శిబిరాల నిర్వహణ మొదలుపెట్టారు.

అప్పట్లో ‘విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్’ విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉండేది.

విజయ్‌కు రాజకీయ గుర్తింపు తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ద్వారా వచ్చిందంటారు సీనియర్ జర్నలిస్ట్ దారసు శ్యామ్.

‘‘విజయ్ రాజకీయాలు తన తండ్రి నుంచే మొదలయ్యాయి. ఎస్ఏ చంద్రశేఖర్ ఓ ద్రవిడ ఆలోచనాశీలి. 1990లో విజయ్‌కాంత్‌తో కలిసి ఎస్ఏ చంద్రశేఖర్ రాజకీయాల్లోకి రావాల్సి ఉంది. కానీ ఆయన రాజకీయంగా అడుగు ముందుకు వేయలేదు’’ అని ఆయన తెలిపారు.

నటుడు విజయ్

ఫొటో సోర్స్, VIJAY MAKKAL IYAKKAM / YOUTUBE

ఫొటో క్యాప్షన్, విజయ్ నటించిన కావలన్ సినిమా 2011లో రాజకీయ జోక్యం కారణంగా చిక్కుల్లో పడింది.

తమిళనాడులో ‘తలైవా’ విడుదల ఎందుకు ఆలస్యమైంది?

విజయ్ నటించిన కావలన్ సినిమా 2011లో రాజకీయ జోక్యం కారణంగా చిక్కుల్లో పడింది. ఎన్నో ప్రయత్నాల తరువాత ఈ సినిమా విడుదలైంది. దీని ప్రభావం విజయ్‌పై తీవ్రంగా పడింది. దీని ఫలితంగానే 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ ఏఐఏడీఎంకేకు మద్దతు పలికింది.

ఏఐఏడీఎంకే ఎన్నికల్లో గెలవగానే, తమ వైపు నుంచి ఉడతా సాయం అందించామని విజయ్ బృందం చెప్పింది.

దీని తరువాత తలైవా చిత్రం కూడా రాజకీయ జోక్యంలో చిక్కుంది. ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లో విడుదలైంది కానీ తమిళనాడులో విడుదల కాలేదు. థియేటర్లకు బెదిరింపులు వచ్చాయి. ముఖ్యమంత్రి జయలలితను కలవడానికి విజయ్ ప్రయత్నించారు. కానీ ఆయనకు అవకాశం ఇవ్వకుండా తిప్పి పంపారు.

ఈ సందర్భంగా విజయ్ ఒక వీడియో విడుదల చేశారు. ‘‘మేం ముఖ్యమంత్రి అమ్మ(జయలలిత)ను కలవడానికి సమయం అడిగాం. త్వరలోనే టైమిస్తారనుకుంటున్నాను. వారు ఈ విషయంలో జోక్యం చేసుకుని ‘తలైవా’ విడుదలకు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని అందులో చెప్పారు.

‘ఏలే సమయమిదే’ అనే ట్యాగ్ లైన్ తీసేశాక ఆ సినిమా తమిళనాడులో విడుదలైంది.

లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన కత్తి సినిమాను విడుదల కానివ్వబోమని కొన్ని సంఘాలు హెచ్చరించాయి. అయితే తరువాత కత్తి సినిమా విడుదలైంది.

ఆ సినిమాలో- ‘‘గాలిని కూడా లంచగొండిగా మార్చే దేశమిది’’ అనే డైలాగ్ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

తరువాత మెర్సల్ (2017) చిత్రంలో జీఎస్టీ, ఆరోగ్య వ్యవస్థ గురించి విమర్శనాత్మకంగా విజయ్ చెప్పిన డైలాగులపై బీజేపీ నిరసనకు దిగింది.

సర్కార్ సినిమాలో ఉచిత పథకాలపై ఆయన చేసిన విమర్శ చర్చకు దారితీసింది.

దీంతోపాటు విజయ్ తన సినిమా కార్యక్రమాల్లోరాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టారు.

సర్కార్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో ‘‘ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు’’ అని విజయ్‌ను అడిగితే, ‘‘నేను ముఖ్యమంత్రిగా నటించను. నిజాయతీగా ఉంటాను’’ అని బదులిచ్చారు.

రాజకీయాలపై విజయ్ చేసే ప్రతి కామెంట్ ఆయన అభిమానులలో ఆశను, ఉత్తేజాన్ని నింపింది. తమిళనాడును ఏలడానికి విజయ్‌ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు అనేక ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు.

నటుడు విజయ్

ఫొటో సోర్స్, YOUTUBE/SONY MUSIC INDI

ఫొటో క్యాప్షన్, రాజకీయాలపై విజయ్ చేసే ప్రతి కామెంట్ ఆయన అభిమానులలో ఆశను, ఉత్తేజాన్ని నింపింది.

తండ్రితో విభేదాలు ఎందుకు?

విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ 2020లో ‘ఆల్ ఇండియా దళపతి విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్’ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

అయితే తన తండ్రి ప్రారంభించిన పార్టీతో తనకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని విజయ్ చెప్పారు. ఏ రాజకీయ సంస్థ అయినా తన ఫోటోనుగానీ, పేరునుగానీ వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

రాజకీయ కార్యకలాపాల్లోనూ, బహిరంగ సభలలోనూ తన ఫోటోలను, పేరును వాడకూడదంటూ ఎస్ఏ చంద్రశేఖర్‌, తల్లి శోభ, ఇతరులపై విజయ్ చెన్నై కోర్టులో కేసు వేశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)