స్నో లెపర్డ్స్: భారత్‌లో వీటి సంఖ్య ఎంత? ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి?

 స్నో లెపర్డ్స్, హిమాలయాలు, ఇండియా

ఫొటో సోర్స్, SAPI/WILDLIFE INSTITUTE OF INDIA

ఫొటో క్యాప్షన్, దేశం స్నో లెపర్డ్స్ సంఖ్యను తెలుసుకునేందుకు తొలిసారి సర్వే నిర్వహించిన ఇండియా
    • రచయిత, మెరిల్ సెబాస్టెయిన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో 718 స్నో లెపర్డ్స్ ఉన్నాయని దేశంలో తొలిసారి నిర్వహించిన సర్వే తేల్చిందని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది.

ఈ లెక్కన చూస్తే ప్రపంచంలోని మొత్తం స్నో లెపర్డ్స్‌లో 10-15 శాతం ఇండియాలోనే ఉన్నాయి.

స్నో లెపర్డ్స్- వల్నరబుల్(ముప్పును ఎదుర్కొంటున్న) జంతువుల జాబితాలో ఉన్నట్లు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ చెబుతోంది.

ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అభివృద్ధి పేరుతో వీటి ఆవాసాలను ధ్వంసం చేయడం పెరిగింది.

‘స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్‌మెంట్ ఇన్ ఇండియా’ పేరుతో చేపట్టిన ఈ సర్వేను 2019-2023 వరకు నిర్వహించారు.

అంతర్జాతీయంగా స్నో లెపర్డ్స్ సంఖ్యను తేల్చేందుకు ‘పాపులేషన్ అసెస్‌మెంట్ ఆఫ్ ద వరల్డ్స్ స్నో లెపర్డ్స్‌’లో భాగంగా ఈ సర్వే చేపట్టారు.

దేశంలో హిమాలయ ప్రాంతాల్లో ఇవి నివసించే దాదాపు లక్షా 20 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సర్వే చేపట్టారు.

“ఈ జంతువుల గురించి దేశంలో ఇటీవలి సంవత్సరాల వరకు స్పష్టమైన లెక్కలు లేవు” అని పర్యావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

స్నో లెపర్డ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాతావరణ మార్పుల వల్ల స్నోలెపర్డ్స్ ఆవాసాలకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించడంలో ఈ సర్వే సహాయ పడుతుంది.

స్నో లెపర్డ్స్‌ లెక్కల కోసం చేపట్టిన సర్వే వాటికి ఆవాసంగా ఉన్న హిమాలయ పర్వతాల్లో 70 శాతం ప్రాంతంలో కొనసాగింది.

జమ్మూ-కశ్మీర్, లద్దాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఈ సర్వే జరిగింది.

కెమెరా చిత్రాల ఆధారంగా 214 వేర్వేరు స్నో లెపర్డ్స్‌ను గుర్తించారు. లెపర్డ్స్ గుర్తులు, సేకరించిన ఇతర డేటా ఆధారంగా వీటి సంఖ్య 718 ఉంటుందని సర్వేయర్లు తేల్చారు

హిమాలయ జీవావరణంలో కీలకమైన వేటాడే జీవులు ఇవి. ఇవి ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి తాజా సర్వే ముఖ్యమైనది.

స్నో లెపర్డ్స్ సంఖ్య పర్యావరణ సమతౌల్యానికి కీలకం. వాతావరణ మార్పుల వల్ల వాటి ఆవాసాలకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించడంలో ఈ సర్వే సహాయ పడుతుంది.

స్నో లెపర్డ్స్ ఉండే ప్రాంతాల్లో 70 శాతం భూమికి ఎలాంటి రక్షణ లేదని, ఇది ఈ జంతువులకు చాలా ప్రమాదకరంగా ఉందని నివేదిక తెలిపింది.

‘‘ఇవి దీర్ఘకాలం జీవించాలంటే వీటిని తరచూ పర్యవేక్షించడం అవసరం’’ అని నివేదిక చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)