పిల్లలు పుట్టాక కూడా ప్రెగ్నెన్సీకి ముందున్న శరీరాకృతి పొందడం ఎలా? మహిళలపై ఇలాంటి ఒత్తిడి ఎందుకు?

తల్లి, పాప

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మహిళలు చాలా మంది డెలివరీ తర్వాత ‘నా శరీరం మళ్లీ మునపటి లాగా మారుతుందా’, ‘మునపటి లాగా నేను కనిపిస్తానా? అని అని డాక్టర్లను అడుగుతూ ఉంటారు.

గర్భవతిగా ఉన్నప్పుడు, డెలివరీ తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. అది శారీరకంగానైనా, మానసికంగానైనా.

శ్రేయా సింగ్(పేరు మార్చాం) 2012లో తొలిసారి తన కూతురికి జన్మనిచ్చిన తర్వాత, ఎక్కువగా తినొద్దు, బరువు పెరిగిపోతావు అంటూ బంధువులందరూ ఆమెకు సలహాలు చెప్పేవారు.

డెలివరీ తర్వాత శ్రేయా సింగ్ బరువు.. గర్భవతి కావడానికి ముందు కంటే 25 కేజీలు పెరిగింది.

శ్రేయాకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు. ఆమెకు 2012లో మొదటి కూతురు, 2021లో రెండో కూతురు పుట్టారు. రెండు డెలివరీలు కూడా సాధారణ కాన్పులే.

బరువు పెరగడం

ఫొటో సోర్స్, Getty Images

‘ఎక్కువగా తినకు, బరువు పెరుగుతావు’

మొదటి కూతురు పుట్టిన తర్వాత, తాను శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు శ్రేయా సింగ్ బీబీసీ ప్రతినిధి పాయల్ భుయాన్‌కు చెప్పారు.

‘‘ఇప్పుడు నన్ను చూస్తుంటే, నేను బాగున్నట్టు మీకనిపించవచ్చు. కానీ, డెలివరీ సమయంలో ‘థర్డ్ డిగ్రీ వజైనల్ టియర్‘ను ఎదుర్కొన్నాను. దాన్నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది’’ అని శ్రేయా సింగ్ చెప్పారు. (పిల్లల్ని కనే సమయంలో యోనికి, మలద్వారానికి చుట్టూ ఉన్న కణజాలానికి గాయం ఏర్పడుతుంది దీన్నే వజైనల్ టియర్ అంటారు)

‘‘అదే సమయంలో నాకు పగుళ్లు కూడా ఏర్పడ్డాయి. అది చాలా నొప్పిగా అనిపించేది. బాత్‌రూమ్‌కు వెళ్లాలన్న ఆలోచన వస్తే చాలు వణుకు వచ్చేది’’ అని శ్రేయా సింగ్ ఆనాటి రోజులను గుర్తుకు చేసుకున్నారు.

వీటన్నంటితో పాటు, శ్రేయా సింగ్ నడుము నొప్పిని కూడా బాగా భరించింది. ఇన్ని సమస్యలను ఎదుర్కొనే సమయంలో, ఎక్కువగా తినకు, బరువు పెరిగిపోతావంటూ బంధువులు, స్నేహితులు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. దీనిపై ఏం అనాలో కూడా తనకు తెలిసేది కాదన్నారు శ్రేయా సింగ్.

శ్రేయా సింగ్‌కు మొదటి దానితో పోలిస్తే రెండో కాన్పు కాస్త తేలికైంది. ఎందుకంటే, రెండో కాన్పు సమయంలో ఆమె మానసికంగా సిద్ధమయ్యారు.

ప్రెగ్నెన్సీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

శారీరక, మానసిక సమస్యలు

డెలివరీ తర్వాత అందరు మహిళలూ ఈ సమస్యలన్నీ ఎదుర్కొనకపోయినప్పటికీ, వారి శరీరంలో గర్భం దాల్చడానికి ముందు, గర్భవతి అయిన తర్వాత చాలా మార్పులు వస్తాయి.

ఉదాహరణకు, గర్భిణిగా ఉన్న సమయంలో శరీరంలో కలిగే హార్మోనల్ మార్పుల వల్ల, శరీరంలో ఎక్కువ కొవ్వు నిల్వలు అవసరం పడతాయి.

పెల్విక్ ఫ్లోర్ సాగుతుంది. పాలిచ్చే తల్లి శరీరంలోని పోషకాలు బిడ్డకు పాల ద్వారా అందుతూ ఉంటాయి. ఈ విషయాన్నింటిన్నీ తీసుకుంటే, డెలివరీ తర్వాత పూర్తిగా ఆరోగ్యకరంగా మారేందుకు ఏ మహిళకైనా కాస్త సమయం పడుతుంది.

గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత చాలా సమస్యలను మహిళలు ఎదుర్కొంటున్నారని నోయిడాలోని మదర్‌హుడ్ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ కర్ణిక తివారి బీబీసీ ప్రతినిధి పాయల్ భుయాన్‌తో అన్నారు.

‘‘గర్భవతిగా ఉన్నప్పుడు, పిండం పెరిగేటప్పుడు అవసరమైన స్పేస్ కోసం బ్లాడర్‌పై ఒత్తిడి పడుతుంది. గర్భకోశానికి ముందు యురినరీ బ్లాడర్ ఉంటుంది. దాని వెనుక పేగులు ఉంటాయి. చాలా కేసుల్లో బ్లాడర్‌పై ఒత్తిడి పెరుగుతున్నప్పుడు, వారు మూత్రాన్ని ఆపుకోలేరు. కొన్నిసార్లు పైల్స్ కూడా వస్తుంటాయి’’ అని ఆమె చెప్పారు.

‘‘అదే సమయంలో, గర్భకోశానికి వెనుకాలున్న పేగులపై ఒత్తిడి పడటం వల్ల, యాసిడిటీ కలుగుతుంది లేదా మలబద్ధకం ఏర్పరుడుతుంది’’ అని డాక్టర్ కర్ణిక తివారి అన్నారు.

పిల్లలు పుట్టిన తర్వాత..

  • గర్భకోశం తిరిగి సాధారణ స్థితికి వచ్చే సరికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుంది. ఆ సమయంలో కొన్నిసార్లు కడుపు నొప్పి వస్తుంది.
  • చాలా మంది మహిళలకు శక్తి అంత ఉండదు. చాలా త్వరగా అలసగా భావిస్తుంటారు.
  • గర్భవతిగా ఉన్నప్పుడు శరీరంలో వచ్చే మార్పుల వల్ల ఎముకలు స్థానం మారుతుంది. డెలివరీ తర్వాత, మళ్లీ ఎముకలు వాటి స్థానానికి వస్తుంటాయి. దీంతో, చాలా మంది మహిళలు నడుపు నొప్పిని ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ సమస్య జీవితకాలం ఉంటుంది.
మహిళ ఎక్సర్‌సైజ్

ఫొటో సోర్స్, Getty Images

‘వావ్! ముందు ఎలాగున్నావో అలానే కనిపిస్తున్నావు’

‘‘2018లో నా డెలివరీ తర్వాత, కొన్ని నెలలకే ‘వావ్! నువ్వు అచ్చం ముందులాగానే కనిపిస్తున్నావు’ అంటూ చాలా మంది అనేవారు’’ అని బ్రిటన్‌లోని యార్క్‌షైర్‌లో నివసిస్తున్న షారోన్ ఓక్లీ బీబీసీ ఫ్యూచర్‌తో చెప్పారు.

మునపటి లాగానే షారోన్ కనిపిస్తున్నప్పటికీ, వాస్తవం దానికి భిన్నంగా ఉంది. డెలివరీ తర్వాత షారోన్ బరువు చాలా తగ్గిపోయారు. శారీరకంగా ఆమె అత్యంత క్లిష్టమైన రోజులను ఎదుర్కొన్నారు.

డెలివరీ అయిన ఆరు నెలలకే స్ట్రోలర్‌(చిన్న పిల్లల్ని తీసుకెళ్లేది)లో తన కొడుకును పెట్టుకుని షారోన్ కెనడాలో జాగింగ్‌కు వెళ్లేవారు. ఆ సమయంలో, యురిన్ లీక్ అవ్వడం పెరిగింది. మూత్రం విషయంలో ఆమె నియంత్రణను కోల్పోయారు.

‘‘డెలివరీ అయిన తర్వాత ఆమెకి ఎలా ఉంది అనే దాని కంటే ఎలా కనిపిస్తుందనే దాన్ని చూసి ఒక నిర్ణయానికి రావడం మన సమాజంలోని మనుషుల్లో విచిత్రమైన విషయం’’ అని షారోన్ అన్నారు.

‘‘నేను చూడటానికి బాగానే ఉన్నాను. కానీ, డెలివరీ సమయంలో అయిన నొప్పులతో ఇప్పటికీ నేను బాధపడుతున్నాను. డెలివరీ తర్వాత నా శరీరంలో ఈ మార్పులు వచ్చాయి అని నేను చెప్పాలా?’’ అని ప్రశ్నించారు.

ఎన్నో నెలల పాటు పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచన మేరకు నడుచుకోవడంతో కాస్త పరిస్థితి ఇప్పుడు మెరుగైంది. షారోన్ పెల్విక్ ఫ్లోర్‌కు చెందిన కండరాలు చాలా బలహీనపడ్డాయి. అవి మళ్లీ సాధారణ స్థితికి రాలేదు. దీనివల్ల, బ్లాడర్ లీక్ సమస్యను షారోన్ ఎదుర్కొన్నారు.

ఐదేళ్ల తర్వాత ప్రస్తుతం ఆమె కాస్త మెరుగయ్యారు. కానీ, కొన్నిసార్లు ఇప్పటికీ యురిన్ లీక్ సమస్యను షారోన్ ఎదుర్కొంటున్నారు. అందుకే ఆమె ఎప్పుడూ తన వెంట అదనంగా అండర్‌గార్మెంట్స్‌ను పెట్టుకుంటారు. దీనివల్ల చాలా సార్లు ఉద్యోగాన్ని వదిలేయాలని కూడా ఆమె అనుకున్నారు.

ప్రెగ్నెన్సీ సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

అందరిలో మాట్లాడకపోవడం

ఈ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు బహిరంగంగా మాట్లాడనప్పటికీ, శ్రేయా సింగ్, షారోన్ లాగా మన మధ్యన ఎంతో మంది మహిళలను గుర్తించవచ్చు.

డెలివరీ తర్వాత ఈ సమస్యలను మహిళలు భరిస్తున్నారనే లక్షణాలు మనకు కనిపించకపోవచ్చు. కానీ, 90 శాతం మహిళలు డెలివరీ తర్వాత పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్‌తో బాధపడుతున్నారు. పెల్విస్‌లోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవయవాలు వాటి సాధారణ స్థితి నుంచి కిందకి జారి, యోనిలోకి ఉబ్బుతాయి.

మూడింట ఒక వంతు మహిళలు మూత్రాన్ని ఆపుకోలేని సమస్యను ఎదుర్కొంటున్నారు.

డయాస్టాసిస్ రెక్టయి అంటే అబ్డామినల్ సెపరేషన్‌ 60 శాతం మంది మహిళలలో కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు, వారి పొట్ట కండరాలు సాగుతాయి. పిండం ఎదిగేందుకు మరింత స్పేస్‌ను కలగజేస్తాయి. ఆ తర్వాత, అవి మళ్లీ సాధారణ స్థితికి రాలేకపోవడమే ఇది.

దీంతో, డెలివరీ అయిన తర్వాత, మహిళల కడుపు చాలా మందిది ఎక్కువ కాలం సాగుతున్నట్లు ఉంటుంది. నడవడం, బరువున్న వస్తువులను ఎత్తడంలో మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.

ఎక్సర్‌సైజులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రీ-ప్రెగ్నెన్సీలో ఉన్నట్లు మారాలని ఒత్తిడి

అమ్మ అయిన వెంటనే మునపటి లాగా మారాలని అనుకోవడం, మహిళల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని దిల్లీలోని ఫోర్టిస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్ క్లినికల్, చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ భావన బార్మి బీబీసీ ప్రతినిధి పాయల్ భుయాన్‌కు చెప్పారు.

  • మహిళలపై ఇది ప్రతికూల ప్రభావం చూపవచ్చు. వారికి వారు అసమర్థులుగా భావిస్తుంటారు. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. బాధపడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు పోస్టు మార్టం డిప్రెషన్‌కూ గురవుతారు.
  • ప్రీ-ప్రెగ్నెన్సీ శరీరం కోసం(మునపటిలాగా మారేందుకు) చాలా సార్లు మహిళలు ఎక్కువ డైట్, ఎక్సర్‌సైజు చేస్తుంటారు. వీటి ప్రభావాలన్నింటిన్ని వారి శరీరమే భరించాల్సి ఉంటుంది. దీని వల్ల తల్లి, బిడ్డపై ఇద్దరిపై ప్రభావం చూపుతుంది.
  • ఈ ఒత్తిడితో చాలా సార్లు మహిళలు తమకు తాము సమాజానికి దూరంగా ఉంటారు. వారి శరీరాన్ని చూసుకుని ఇబ్బందికరంగా భావిస్తుంటారు. ఈ పరిస్థితితో మహిళలో ఒంటరితనం పెరుగుతుంది.

‘‘త్వరగా ప్రీ-ప్రెగ్నెన్సీ శరీరంలోకి మారాలనే తపన, కొత్తగా అమ్మ అయిన వారిలో ఒత్తిడిని పెంచుతుంది. ఒక మహిళ శరీరం, మరో మహిళ శరీరంతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇతరులతో పోలిస్తే వారి రికవరీ కూడా భిన్నంగానే ఉంటుంది’’ అని డాక్టర్ భావన బార్మి చెప్పారు.

ప్రెగ్నెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రీ-ప్రెగ్నెన్సీ శరీరంలోకి మారాలనే ఒత్తిడిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలన్నదే ప్రస్తుతం ప్రశ్న.

‘‘ఒకవేళ మీకు ఈ అనుమానం వస్తే, మీ డాక్టర్‌తో మాట్లాడండి‘‘ అని డాక్టర్ కర్నికా తివారి చెబుతున్నారు. ‘‘మీ ఆహారం విషయంలో శ్రద్ధ వహిస్తూనే, చురుకైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోండి’’ అని సూచిస్తున్నారు.

మహిళలు సొంతంగా తమ పరిమితులను ఏర్పాటు చేసుకోవాలని భావనా బార్మి చెప్పారు. ‘‘మీ బలాలను తెలుసుకోండి. పుస్తకాలు చదవండి. మీకు మీరుగా అవగాహన పెంచుకోండి. ఒంటరిగా ఉండొద్దు. సపోర్టు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోండి. మీ శరీరంలో వచ్చే మార్పులకు అసలు సిగ్గుపడొద్దు’’ అని డాక్టర్ భావనా బార్మి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)