కల్తీ పసుపుతో గుండె, మెదడు, కిడ్నీ, కాలేయంపై ఎఫెక్ట్.. దీనిని ఎలా గుర్తించాలి?

ఫొటో సోర్స్, istock
- రచయిత, రుచితా పుర్బియా
- హోదా, బీబీసీ కోసం
భారతీయ వంటకాలతో పాటు వైద్యంలోనూ పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సీడెంట్, యాంటీసెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి.
పచ్చి పసుపు బంగారం రంగులో ఉంటుందని మీకు తెలుసా? పసుపు కొనేటప్పుడు దాని రంగును చూస్తారు. కానీ, తయారీదారులు కొన్నిసార్లు కృత్రిమ రంగులను వాడుతూ వినియోగదారుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు.
మీరు వంటల్లో వాడుతున్న పసుపులో కల్తీ జరిగిందా, లేదా అనేది ఎలా గుర్తించాలి? నాణ్యమైన పసుపును ఎలా గుర్తించాలి? కల్తీ పసుపు ఎలా తయారవుతుంది? ఈ అంశాలపై నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, ISTOCK
పసుపును ఎలా కల్తీ చేస్తారు? ఎలా గుర్తించాలి?
అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపుకు భారీ డిమాండ్ ఉంది. అందుకే ఎక్కువ లాభాలు పొందడం కోసం పసుపును తరచుగా కల్తీ చేస్తుంటారు. స్టార్చ్, కర్కుమిన్, సింథటిక్, కృత్రిమ రంగులతో పసుపును కల్తీ చేస్తారు.
పసుపు కల్తీ గురించి అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ మాజీ ఆహార విశ్లేషకుడు అతుల్ సోనీతో బీబీసీ మాట్లాడింది. ఈ రంగంలో ఆయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది.
పసుపు ఉత్పత్తి ఖర్చును తగ్గించాలనే ప్రధాన లక్ష్యంతోనే కల్తీ చేస్తారని ఆయన చెప్పారు. మూడు రకాలుగా పసుపును కల్తీ చేస్తారని తెలిపారు.
‘‘మొదటి పద్ధతిలో స్టార్చ్‌ను వాడతారు. దీనికోసం గోధుమ, బియ్యం పిండిని ఉపయోగిస్తారు.
రెండో పద్ధతిలో నాణ్యమైన పసుపులో నాసిరకాన్ని కలుపుతారు. లాభాల కోసం ఇలా చేస్తుంటారు.
మూడో పద్ధతిలో కృత్రిమ రంగులు వాడతారు. ఎందుకంటే రంగును చూసే వినియోగదారులు పసుపు నాణ్యతను అంచనా వేస్తారు.
మంచి పసుపు ముదురు పసుపు రంగులో ఉండదు. కానీ, వినియోగదారులకు ఈ విషయం తెలియదు. కృత్రిమ రంగులో లెడ్ క్రోమేట్ ఉంటుందనే సంగతి కూడా వారికి తెలియదు’’ అని అతుల్ వివరించారు.
మరో కల్తీ విధానం గురించి ఆయన వివరిస్తూ, ‘‘నూనెలో కరిగే రంగుల వాడకం ద్వారా పసుపు ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. ఆరోగ్యానికి ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే- వీటిలో క్యాన్సర్ కారకాలు ఉంటాయి. దీర్ఘకాలం వాడటం వల్ల ఇది క్యాన్సర్‌కు దారి తీయొచ్చు’’ అని చెప్పారు.
కల్తీ గురించి అవగాహన కల్పించడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పసుపు నాణ్యతను ఎలా తనిఖీ చేయాలో కూడా వివరించారు.
‘‘పసుపు రంగును చూసి కల్తీ జరిగిందా, లేదా అనేది ఎవరూ చెప్పలేరు. నాణ్యత గురించి తెలుసుకోవాలనుకునే వినియోగదారులు 100 రూపాయలు వెచ్చిస్తే సరిపోతుంది.
సంబంధిత ప్రభుత్వ ప్రయోగశాలల్లో పసుపు నాణ్యతను తనిఖీ చేయాలి. ఆ ప్రయోగశాల నుంచి వచ్చే నివేదిక ఆధారంగా పసుపు కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ కల్తీ జరిగితే తయారీదారుపై కేసు వేయవచ్చు’’ అని అతుల్ తెలిపారు.
మంచి బ్రాండ్‌కు చెందిన పసుపునే కొనాలని ఆయన సూచించారు.
‘‘ఒక మంచి కంపెనీ తమ ఉత్పత్తులు విక్రయించడానికి అగ్‌మార్క్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి అనుమతి పొందుతుంది. ఉత్పత్తుల్లో కల్తీ జరిగినట్లు అనుమానం వస్తే తయారీదారుపై కేసు వేయొచ్చు. మార్కెట్లో విడిగా లభించే పసుపు, మసాలాలను కొనకూడదు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
లెడ్ క్రోమేట్ అంటే ఏంటి?
పసుపుకు ముదురు బంగారు రంగును ఇవ్వడానికి లెడ్ క్రోమేట్ అనే రసాయనాన్ని వాడతారు.
సీసం (లెడ్), క్రోమియం అనే రెండు లోహాల మిశ్రమం నుంచి లెడ్ క్రోమేట్ తయారవుతుంది. రంగు కోసం ఈ రసాయాన్ని వాడతారు.
పసుపులోని కర్క్యూమినాయిడ్స్ వల్ల పసుపుకు ఔషధ గుణాలతో పాటు సహజ పసుపు రంగు వస్తుంది.
పసుపు బరువును పెంచడానికి కూడా లెడ్ క్రోమేట్‌ను ఉపయోగిస్తారు. గ్రైండింగ్, ప్యాకేజింగ్ సమయంలో దీన్ని కలుపుతారు.

ఫొటో సోర్స్, Getty Images
లెడ్ క్రోమేట్ దుష్ప్రభావాలు ఏమిటి?
ప్రపంచంలో అత్యధిక విషపూరిత సీసం కేసులు భారత్‌లో ఉన్నాయని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నివేదిక తెలిపింది.
లెడ్ క్రోమేట్ వల్ల మూత్రపిండాలు, మెదడుపై దుష్ప్రభావాలు ఉంటాయని పరిశోధకులు హెచ్చరించారు. చిన్నారుల మెదడు ఎదుగుదలకు ఇది ఆటంకం కలిగిస్తుంది.
లెడ్ పాయిజనింగ్ వల్ల చిన్నారుల మేధో సామర్థ్యాలపై జీవితకాల ప్రభావం ఉండొచ్చు.
2018లో అమెరికన్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ హెల్త్ కంపెనీ ‘ప్యూర్ ఎర్త్’ పరిశోధకులు- తొలిసారి భారత్‌లోని బిహార్ ప్రజల రక్త నమూనాలను పరీక్షించారు. కొందరి రక్తంలో మోతాదుకు మించి సీసం స్థాయులు ఉన్నాయని ఆ పరీక్షల్లో గుర్తించారు.
దాదాపు ప్రతీ ఇంటిలోని పసుపు నమూనాల్లో అధిక మోతాదులో సీసం ఉన్నట్లు తాము గుర్తించామని ప్యూర్ ఎర్త్‌కు చెందిన సందీప్ దహియా తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సీసం వల్ల నాడీ వ్యవస్థకు ప్రమాదం: నీతి ఆయోగ్
దీర్ఘకాలం పాటు సీసం తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. ఇది నాడీ వ్యవస్థకు ప్రమాదాన్ని కలిగిస్తుందని, కాలేయం(లివర్), కిడ్నీ, మెదడు, రక్తంలో సీసం కలిసిపోయి వ్యాధులకు కారణమవుతుందని వెల్లడించింది.
తలనొప్పి, మతిమరుపు, బలహీనత, మలబద్ధకం, ఎనీమియా, వాపు, కడుపునొప్పి వంటి స్వల్పకాలిక లక్షణాలు కలుగుతాయి.
సీసం శరీరంలోకి ప్రవేశిస్తే తర్వాత అది రక్తం, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, ఎముకలు, దంతాలు వంటి అవయవాల్లోకి చేరి, పేరుకుపోతుంది.
అధిక శాతం సీసం మలమూత్రాల ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
గర్భంతో ఉన్న సమయంలో ఎముకల్లోని సీసం రక్తంతో కలిసిపోతుంది. తర్వాత గర్భంలోని పిండాన్ని చేరుతుంది.
సీసం కారణంగా శరీరంలోని అనేక వ్యవస్థలు ప్రభావితమవుతాయి.
చిన్నారులు, గర్భిణులకు ఇది మరింత ప్రమాదకరం.

ఫొటో సోర్స్, Ravisankar Lingutla
పసుపు ఎలా తయారవుతుంది?
పసుపు కొమ్ములను నెల రోజుల పాటు ఎండలో ఆరబెట్టి అందులోని తేమను తొలగిస్తారు.
ఆరబెట్టిన పసుపు కొమ్ములను పాలిష్ చేస్తారు. వాటిని ఒక డ్రమ్ములో వేసి చేతులతో లేదా మోటారు సహాయంతో తిప్పుతారు. తర్వాత పసుపుకొమ్ములోని పైభాగాన్ని తీసేస్తారు. ఆ తర్వాత దాన్ని పొడి చేస్తారు.
మసాలాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. గత తొమ్మిదేళ్లలో మసాలా ఎగుమతులు రెండింతలు పెరిగి రూ. 3,995 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES/MANUSAPON KASOSOD
2020లో ఏలూరులో ఏం జరిగింది?
సీసం లాంటి లోహాలు అధిక మోతాదులో శరీరంలోకి వెళ్తే అవి చూపే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో ఈ ఉదాహరణతో తెలుసుకోవచ్చు.
2020 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో సుమారు వెయ్యి మంది ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో బాలలు సహా అన్ని వయసుల వారు ఉన్నారు. బాధితుల్లో వికారం, వాంతులు, కళ్లలో మంటతోపాటు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించాయి. నలుగురు చనిపోయారు.
ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఈ అనారోగ్యానికి కారణం, తాగునీటిలో పురుగుమందుల అవశేషాలు ఉండటం అని వెల్లడించింది. ఎయిమ్స్, నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసర్చ్ సెంటర్(ఎన్‌ఈఈఆర్‌ఐ) ఈ ఘటనపై దర్యాప్తు చేసి, ఫలితాలను సమర్పించాయి.
మార్కెట్‌లో లభించే పాలలో అధిక స్థాయిలో సీసం ఉన్నట్లుగా ఎయిమ్స్ తన నివేదికలో తెలిపింది. భూగర్భజలాల్లో పాదరసం ఎక్కువగా ఉన్నట్లు ఎన్‌ఈఈఆర్‌ఐ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
పసుపు అతిపెద్ద ఉత్పత్తిదారు, వినియోగదారు భారత్
భారత్, బంగ్లాదేశ్, మియన్మార్ దేశాలు ప్రధానంగా పసుపు ఉత్పత్తి చేస్తాయి. వీటిలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారుగా ఉంది.
అమెరికాలోనూ చిన్నారుల రక్తంలో అధిక మోతాదులో సీసం ఉన్నట్లు గుర్తించారు. భారత్ నుంచి అమెరికా వెళ్లిన కుటుంబాల పిల్లల్లో లోహపు స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. అందుకే భారతీయ ఆహార పదార్థాల వాడకం మానేయాలని అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ సూచించింది.
బంగ్లాదేశ్ ప్రజల్లోనూ శరీరంలో లోహాల పరిమాణం వేగంగా పెరుగుతున్నట్లు 2019లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనంలో తేలింది.
బంగ్లాదేశ్ ప్రధాని దీన్నొక జాతీయ సమస్యగా ప్రకటించి, పసుపు నుంచి లోహాలను పూర్తిగా తీసేసేలా కఠిన నిబంధనల్ని రూపొందించారు. రెండేళ్లలో మార్కెట్‌లో కల్తీ పసుపు తయారీ, విక్రయాలను పూర్తిగా అడ్డుకొన్నారు. బంగ్లాదేశ్ ప్రయత్నాలను చూసి భారత్ నేర్చుకోవాలని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సూచించింది.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య: సెక్యులరిజం గీత చెరిగి పోతోందా, లౌకికవాదంపై రాజ్యాంగం, కోర్టులు ఏం చెప్పాయి..
- కుమారీ ఫుడ్ కోర్టు: తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింత చర్చ, రేవంత్ రెడ్డి జోక్యం చేసుకునే వరకు ఎందుకు వెళ్లింది?
- రజినీకాంత్‌ను ‘సంఘీ’ అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, తమిళనాడులో జరుగుతున్న రగడ ఏంటి?
- రూ.40 లక్షల ఇన్సూరెన్స్ కోసం శ్మశానం నుంచి శవాన్ని తెచ్చి ఎలా దొరికి పోయాడంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














