వెన్నెముకకు దెబ్బతగిలిన తరువాత జీవితం ఎలా ఉంటుందంటే

ఫొటో సోర్స్, NIALL MCCANN
- రచయిత, స్మితా ముందాసద్
- హోదా, హెల్త్ ప్రజెంటర్, బీబీసీ రేడియో 4
ఆయన వేదిక మీద మాట్లాడుతూ అపానవాయువు వదిలితే ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతున్నారు.
‘‘అప్పుడు నేను లండన్‌లో ఒక వేదిక మీద మాట్లాడుతున్నా. అక్కడున్న వారికి ముందే నా కడుపు ఉబ్బరం సమస్య గురించి చెప్పాను’’ అని నియాల్ మెకాన్ తెలిపారు.
2016లో తనకు జరిగిన ఒక స్పీడ్ ఫ్లయింగ్ యాక్సిడెంట్ గురించి ముందే ఆయన ప్రేక్షకులకు చెప్పారు.
ఆ ప్రమాదంలో బ్రెకాన్ బీకాన్స్ పర్వతాలను 50 ఎంపీహెచ్ వేగంతో ఢీకొనడంతో తన బ్లాడర్ (మూత్రాశయం), బోవెల్ (పేగు), లైంగిక అవయవాలు దెబ్బతిన్నాయని తెలిపారు.
‘‘ఇక అప్పటినుంచి ఇలా జరుగుతూనే ఉంది. అందరూ చప్పట్లు కొట్టడం మొదలెట్టారు’’ అని ఆయన చెప్పారు.
బీబీసీ రేడియో 4 ఇన్‌సైడ్ హెల్త్ కార్యక్రమానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ కోసం మేం అతన్ని కలిశాం.
కార్యక్రమం అంతటా తన యాక్సిడెంట్ గురించి, వెన్నెముకకు జరిగిన సర్జరీ, కోలుకున్న తీరు గురించి ఆయన చాలా సరదాగా, సానుకూలంగా మాట్లాడారు.
బ్లాడర్, బోవెల్, సెక్సువల్ ప్రాబ్లమ్స్ వంటి బహిరంగంగా ఎక్కువగా మాట్లాడని సున్నిత సమస్యలతో జీవించడం ఎలా ఉంటుందనే అంశం గురించి కూడా ఆయనతో మేం మాట్లాడి తెలుసుకున్నాం.
ఈ సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడటం తనకు సంతోషంగా ఉందని నియాల్ అన్నారు.
‘‘ఇలాంటి అంశాలపై ఒక ముద్ర వేస్తారు. కానీ, అలా చేయకూడదు. బహిరంగంగా వీటి గురించి మాట్లాడటం వల్ల ఇతరులకు సహాయపడొచ్చు’’ అని నియాల్ చెప్పారు.
సాధారణంగా వెన్నెముకకు గాయమైతే పక్షవాతానికి దారితీస్తుందని, ఈ విషయంలో ఇతరులతో పోల్చితే తాను చాలా అదృష్టవంతుడినని ఆయన అన్నారు.
ప్రజలు రహస్యంగా వ్యవహరించే కొన్ని అంశాల గురించి తాను బహిరంగంగా మాట్లాడాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, NIALL MCCANN
‘హీరోలా చేద్దామనుకున్నా’
దాదాపు ఎనిమిదేళ్ల కిందట ఒక రోజున స్పీడ్ ఫ్లయింగ్ చేసేందుకు నియాల్ సిద్ధమయ్యారు.
స్పీడ్ ఫ్లయింగ్ కాస్త పారాగ్లైడింగ్ లాగే ఉంటుందని, కాకపోతే ఒక కొండపై నుంచి పరిగెత్తుతూ వెళ్లి నేల మీద దిగాల్సి ఉంటుందని నియాల్ చెప్పారు.
ఈ సాహస క్రీడలో అప్పుడప్పుడే అడుగుపెట్టిన తాను ఆరోజు మాత్రం హీరో అయ్యేందుకు ప్రయత్నించానని అన్నారు.
ఎగురుతూ వెళ్లి ప్రమాదవశాత్తూ బ్రీకాన్ బేకాన్స్ పర్వతాలను గట్టిగా ఢీకొన్నట్లు నీల్ చెప్పారు.
ఆ ప్రమాదం తర్వాత కార్డిఫ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ ఆసుపత్రిలో 38 రోజులు ఉన్నట్లు, వెన్నెముకకు ఆపరేషన్లు జరిగినట్లు చెప్పారు. కాలు కదపడం నుంచి నడక వరకు మళ్లీ కొత్తగా నేర్చుకోవాల్సి వచ్చిందని అన్నారు.
ఆయన మెదడు నుంచి శరీరానికి సమాచారాన్ని తీసుకెళ్లే వెన్నుపాము నాడులకు ఎంత నష్టం జరిగిందనే అంశంపై అప్పుడు చాలా ఆందోళన పడ్డారు. ఒకవేళ ఈ నాడులు దెబ్బతింటే పక్షవాతంతో సహా చాలా రకాల సమస్యలు తలెత్తవచ్చు.
కానీ, నీల్ వెన్నెముక విరగడం కాకుండా చీరుకుపోవడంతోనే ఆగిపోవడంతో ఆయన వేగంగా కోలుకునే అవకాశం ఏర్పడింది.

ఫొటో సోర్స్, NIALL MCCANN
ఆసుపత్రిలో ఆయన చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత రిలేషన్‌షిప్‌లోనే కాకుండా చాలా అంశాల్లో సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది.
‘‘మొదట్లో నేను ఇతరులపై పూర్తిగా ఆధారపడిపోయాను. కనీసం, నా అంతట నేను టాయ్‌లెట్‌లోకి కూడా వెళ్లలేకపోయాను’’ అని ఆయన చెప్పారు.
భార్య, తల్లి, సోదరుడు ఆయనకు అన్ని విధాలుగా సహాయపడ్డారు.
‘‘పెళ్లి ప్రమాణాల్లో ఇవేవీ లేవు. అయినప్పటికీ ఎలాంటి ఫిర్యాదు చేయకుండా నాకు సహాయం చేసింది నా భార్య’’ అని ఆయన చెప్పారు.
బాత్రూంలో మళ్లీ తన పనులు తానే చేసుకునేలా ప్రేరేపించిన ఒక నిర్ధిష్ట ఘటన గురించి ఆయన వివరించారు.
నర్సు అయిన తన అత్తగారు ప్రమాదం జరిగిన తర్వాత కొద్ది వారాలకు తమ వద్దకు రావాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.
‘‘నర్సుగా ఆమె చాలామందికి బాత్రూంలో సహాయపడి ఉంటారు. కానీ, నాక్కూడా ఆమె అలా చేయాలని నేను కోరుకోలేదు’’ అని ఆయన అన్నారు.
జోకుల్ని పక్కనబెడితే, పేగులపై నియంత్రణ కోల్పోయి జీవించడం నేర్చుకోవడం అంత సులభం కాదని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, NIALL MCCANN
మూత్ర విసర్జనకు ట్యూబ్
కాలం గడిచిన కొద్దీ ఇలాంటివన్నీ తరచుగా మారిపోయాయి.
తన వల్ల తనవారు ఇబ్బంది పడుతుంటే బాధగా అనిపించిందని, తన పనులన్నీ తానే చేసుకోవడం నేర్చుకున్నానని అన్నారు.
ప్రతీ క్షణం చాలా జాగ్రత్తగా ఉంటానని ఆయన చెప్పారు.
‘‘ఉదాహరణకు, తనను ఆడించమంటూ నా కూతురు నాదగ్గరికి వస్తే, నేను నా పేగులను ఎప్పుడు శుభ్రం చేసుకున్నానో గుర్తు చేసుకుంటా. లేకపోతే ఆమెను పైకి ఎగరేసినప్పుడు పేగుల్లోనిది బయటకు వచ్చే ప్రమాదం ఉంది’’ అని అన్నారు.
వెన్నుపాములోకి నరాలకు దెబ్బతగలడం వల్ల అందరిలా అతను మూత్ర విసర్జన చేయలేరు. వెన్నుపాము గాయలైన వారికి ఇది సాధారణం.
బ్లాడర్‌ను ఖాళీ చేయడానికి ఆయన ఇంటర్‌మిటెంట్ క్యాథెటర్ అనే ఒక ట్యూబ్‌ను ఉపయోగిస్తారు.
వెన్నెముకకు అయ్యే గాయాలు బ్లాడర్, పేగుల్లో శాశ్వత ఇబ్బందుల్ని కలిగిస్తాయనే విషయం చాలా మందికి తెలియదని ఆయన భావిస్తున్నారు. సెక్స్ గురించి మరింత తక్కువగా మాట్లాడతారని అన్నారు.
పాత విషయాలే మళ్లీ కొత్తగా
వెన్ను సమస్యలున్న ఒక్కో రోగి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కొందరికి స్ఖలనం సమస్యలు ఉండొచ్చని ఆయన చెప్పారు.
‘‘జీవితాన్ని మార్చేసిన ప్రమాదం నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీ వైవాహిక జీవితం మళ్లీ కొత్తగా మొదలవుతుంది’’ అని ఆయన అన్నారు.
మొదట్లో మెట్లు ఎక్కడంలో ఇబ్బంది కారణంగా తాను కిందే పడుకున్నట్లు చెప్పారు.
‘‘తర్వాత మెట్లు ఎక్కగలిగినప్పుడు నాలో మిశ్రమ భావాలు కలిగాయి. కొత్త విషయం నేర్చుకున్నట్లుగా అనిపించింది. జీవిత భాగస్వామితో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే మనకు ఏది పనిచేస్తుందో తెలుసుకొని వాటిని ప్రయత్నించడమే ఉత్తమం. ఈ ప్రక్రియలో కాస్త నిరాశ, ఇబ్బంది కలుగుతాయి. కానీ, అవతలి వ్యక్తి కూడా మీ గురించి ఆలోచిస్తూ మీకు తగినట్లుగా నడుచుకుంటే పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. నా భార్య చాలా సహనంతో ఉంటూ నాకు చాలా సహకరించారు’’ అని ఆయన వివరించారు.
పిల్లలు కనడం చాలా కష్టమని నియాల్‌ను ముందే హెచ్చరించారు. కాబట్టి ఆ జంట వెంటనే ఐవీఎఫ్ కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
తనకు ప్రమాదం జరిగిన మూడేళ్ల తర్వాత ఫోబ్ జన్మించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.
తన కోలుకోవడంలో ఎన్నో ఇబ్బందులు అనుభవించానని, అయితే వాటి గురించి మాట్లాడటం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.
‘‘చాలామంది తమ వల్ల కాదని అనుకుంటారు. కానీ, నేను అలా కాదు. ఇలా అన్నింటి గురించి మాట్లాడటం ఇతరులకు కాస్త ఉపకరిస్తుందని ఆశిస్తున్నా’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















