‘ఆంధ్ర ఖజురహో’: మొదటి రాత్రికి ముందు కొత్త దంపతులు దర్శించుకునే ఆలయం - శ్రీకాకుళం జిల్లాలోని ఈ గుడి ప్రత్యేకతలు తెలుసా

మెళియాపుట్టి ఆలయం

ఫొటో సోర్స్, LakkojuSrinivas

ఫొటో క్యాప్షన్, మెళియాపుట్టిలోని వేణ గోపాల స్వామి ఆలయం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్లు కలిసి వెళ్లరు.

ఆ ఆలయమే ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి జంక్షన్‌లో ఉన్న పురాతన రాధావేణుగోపాల స్వామి ఆలయం.

ఆలయ నిర్మాణం, శిల్ప కళా సౌందర్యంలో ఎన్నో ప్రత్యేకతలున్న రాధావేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆంధ్రా ఖజురహో అని కూడా చెప్తుంటారు.

ఈ కారణంగానే ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ప్రాంతంలో కొత్తగా పెళ్లయిన చాలా జంటలు మొదట ఈ ఆలయానికి వచ్చాకే తమ తొలి రాత్రికి ఏర్పాట్లు చేసుకుంటారు.

ఈ ఆచారం ఇక్కడ 200 ఏళ్లుగా కొనసాగుతోంది. ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తిని కలిగించే చరిత్ర ఉంది.

మళియాపుట్టి

ఫొటో సోర్స్, LakkojuSrinivas

ఫొటో క్యాప్షన్, గోడలపైశిల్పాల సంపద

కళింగ నిర్మాణ శైలి

మెళియాపుట్టి ప్రధాన జంక్షన్‌లో ఉన్న రాధావేణుగోపాల స్వామి ఆలయం ప్రధాన రహదారికి అనుకునే ఉంటుంది.

రోడ్డుపై నుంచి చూస్తే రెండు ఆర్చిల మధ్య నుంచి చాలా సుందరంగా, ఆకర్షణీయంగా కనిపించింది.

ఆ ఆర్చిలను దాటి, విశాలమైన ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆలయ గర్భగుడికి దారి చూపుతూ ఉన్న రాతి మెట్ల నుంచి మొదలుకొని, ఆ ప్రాంగణమంతా శిల్ప సౌందర్యం కనిపిస్తుంది.

ఆలయం నాలుగు వైపులా గోడలపై విభిన్నమైన రాతి శిల్పాలు కనిపిస్తాయి. ఆలయం పైకప్పుపై చెక్కిన పుష్పాల ఆకారాలన్ని చూసేందుకు ఒకేలా కనిపించినా, నిశితంగా పరిశీలిస్తే దేనికవే భిన్నమని అర్థమవుతుంది.

బీబీసీ బృందం అక్కడికి వెళ్లినప్పుడు పెద్దగా భక్తుల తాకిడి లేదు. వచ్చిన వారు దర్శనం అనంతరం, ఎక్కువ సమయం ఆలయ గోడలపై ఉన్న విగ్రహాలనే పరిశీలించడం కనిపించింది. మరి కొందరు అక్కడున్న విగ్రహాలు, వాటి విశేషాలను ఆలయ పూజారిని అడిగి తెలుసుకుంటున్నారు.

ఆలయ నిర్మాణమంతా కళింగ నిర్మాణ శైలిలో ఉంటుందని, ఆలయాన్ని 1840లో నిర్మించినట్లు బీబీసీతో చెప్పారు ఆలయ ప్రధాన పూజారి గోపినాథ్ రథో

కళింగ నిర్మాణల సౌందర్యం

ఫొటో సోర్స్, LakkojuSrinivas

ఫొటో క్యాప్షన్, కళింగ నిర్మాణశైలితో రూపుదిద్దుకుంది ఆలయం

మహారాణి కోరడంతో..

ఆలయ చరిత్ర గురించి ప్రధాన పూజారి తెలిపిన వివరాల ప్రకారం.. 1840ల కాలంలో మెళియాపుట్టి ప్రాంతం పర్లామికిడి మహారాజు వీరవీరేంద్ర ప్రతాప రుద్ర గజపతి నారాయణ దేవ్ పరిపాలనలో ఉండేంది.

అక్కడ శిల్ప సౌందర్యం ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మించాలని మహారాణి విష్ణుప్రియ మహారాజుని కోరారని, ఆమె కోరిక ప్రకారమే ఆలయాన్ని నిర్మించారని పూజారి గోపినాథ్ రథో చెప్పారు.

"మహారాజు ఆలయ నిర్మాణం కోసం, ఒడిశాలోని పూరీకి చెందిన శిల్పకారులను పిలిపించారు. ఆలయంలో 64 కళలపై ఆలయానికి వచ్చే వారికి అవగాహన కలిగేలా శిల్పాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలా చతుష్షష్టి(64) కళలకు చెందిన శిల్పాలను పూరిలోనే చెక్కి, వాటిని ఇక్కడకి తీసుకుని వచ్చారు. ఆలయంలోని నాలుగు గోడలపై ఉంచి, నిర్మాణాన్ని పూర్తి చేశారు" అని గోపినాథ్ రతో అన్నారు.

ఆలయంలో కొలువైన కృష్ణుడిని రాధావేణుగోపాలస్వామిగా పూజిస్తారు.

గోపినాథ్ మాట్లాడుతూ, “ఈ ఆలయ మెట్ల మార్గం నుంచి మొదలుకొని, శిఖరం వరకు ప్రతి భాగం ఏదో ఒక విజ్ఞానాన్ని అందిస్తుంది. అడుగు పొడవు, అడుగు వెడల్పుతో ఆలయపు నాలుగు గోడలపై ఉన్న విగ్రహాల్లో 64 కళలకు సంబంధించినవి చూడొచ్చు. దర్శనానికి వచ్చే భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తూ, ఈ విగ్రహాలను తిలకిస్తూ ఎక్కువ సమయం గడుపుతారు” అన్నారు.

కామశాస్త్రం

ఫొటో సోర్స్, LakkojuSrinivas

ఆలయ ప్రదక్షిణ తర్వాతే తొలిరాత్రి

ఆలయానికి వచ్చేవారికి వేద శాస్త్రాల సారం, 64 కళలపై అవగాహన కల్పించాలనే వాటిని శిల్పాల రూపంలో చెక్కించి, నిర్మాణంలో భాగమయ్యేలా చూశారని గోపీనాథ్ రథో అన్నారు. వీటిలో శృంగారానికి సంబంధించిన శిల్పాలు కూడా ఉంటాయి.

ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) ప్రతినిధి వావిలపల్లి జగన్నాథనాయుడు మాట్లాడుతూ, “ఆ రోజుల్లో లైంగిక విజ్ఞానం పట్ల అవగాహన తక్కువే. అలాగని, అది బహిరంగంగా చర్చించుకునే విషయం కూడా కాదు. అందుకే వాటిని ఆలయ గోడలపై శిల్పాలుగా మలిచారు. ఆలయానికి వచ్చేవారు, వాటి ద్వారా అవగాహన పొందుతారని వారి ఉద్దేశం. ఆలయంలో ఆ శిల్పాలు ఎక్కువగానే కనిపిస్తాయి” అని తెలిపారు.

గోపినాథ్ మాట్లాడుతూ, “మెళియాపుట్టితోపాటు చుట్టుపక్కలున్న దాదాపు 50 గ్రామాల్లో నూతన వధూవరులు తొలుత ఈ ఆలయానికి వస్తారు. ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఆ సమయంలో లైంగిక విజ్ఞానానికి సంబంధించిన శిల్పాలను కూడా గమనిస్తారు. ఆ తర్వాత ఆ దంపతుల తొలిరాత్రికి ఏర్పాట్లు జరుగుతాయి” అని చెప్పారు.

ఆలయం నిర్మించినప్పుడు మొదలుపెట్టిన ఈ ఆచారాన్ని నేటికి కొనసాగిస్తున్నారని తెలిపారు. సంతానం పొందిన దంపతులు కూడా ఆలయానికి వచ్చి ప్రదక్షిణలు చేస్తుంటారని ఆయన చెప్పారు.

మెళియాపుట్టి

ఫొటో సోర్స్, LakkojuSrinivas

'అన్నాచెళ్లెల్లు, అక్కాతమ్ముళ్లు కలిసి రారు'

ఆలయానికి తోబుట్టువులు ముఖ్యంగా అన్నాచెళ్లెల్లు, అక్కాతమ్ముళ్లు కలిసి రాకపోవడానికి గల కారణాన్ని తెలిపారు గోపినాధ్ రథో.

"ఆలయ గోడలపై శృంగార భంగిమలతో కూడిన శిల్పాలు ఉన్నాయి. అందువల్ల ఆలయానికి వచ్చిన యువతీ యువకులు కాస్త ఇబ్బంది పడతారు. అన్నాచెల్లి, అక్కాతమ్ముళ్లు ఆలయానికి వచ్చి, ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల వారు ఆలయానికి కలిసి రాకూడదనే నిబంధన అప్పట్లో ఉండేది. ఆ కారణంగా చాలామంది యువతీ యువకులు బయటి నుంచే నమస్కారం పెట్టుకుని వెళ్లిపోతుంటారు" అని చెప్పారు.

ఆలయ ప్రధాన పూజారీ

ఫొటో సోర్స్, LakkojuSrinivas

ఫొటో క్యాప్షన్, ఆలయ ప్రధాన పూజారీ గోపినాథ్ రథో

ఆయన మాట్లాడుతూ, “ఆలయంలో ఎక్కువగా శృంగారానికి సంబంధించిన శిల్పాలే ఉండటం చేత, తోబుట్టువుల రాకపై ఆంక్షలు ఉండేవి. ప్రస్తుతం ఆ నిబంధనలేమీ లేదు. కానీ, ఎప్పటి నుంచో వస్తోన్న ఆచారమని భావిస్తూ, కొంతమంది ఇప్పటికీ దానిని పాటిస్తుంటారు. మరి కొందరు పెద్దగా పట్టించుకోరు. ఏటా హోలీ పండుగనాడు జరిగే ఉత్సవంలో మాత్రం యువత పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తారు” అని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా

ఫొటో సోర్స్, LakkojuSrinivas

శిల్ప సౌందర్యం

ఆలయాన్ని ఒకప్పుడు ‘ఆంధ్రా ఖజురహో’ అని పిలిచేవాళ్లని, ప్రస్తుతం ఆ పిలుపు తక్కువగా వినిపిస్తుందని అన్నారు గోపినాధ్ రథో.

కృష్ణుడి జీవితంలోని అనేక ఘట్టాలను ఆవిష్కరించే శిలలు ఉన్నాయని, మెళియాపుట్టి రాధావేణుగోపాలస్వామి ఆలయం పేరు చెప్పగానే శిల్ప సౌందర్యమే గుర్తుకు వస్తుందని, అందుకే ఆంధ్రా ఖజురహోగా పిలిచేవారని అన్నారు.

ఆలయానికి ఇంకో విశేషం కూడా ఉందని మరో పూజారి సత్యనారాయణ రతో చెప్పారు. “ఆలయం పైకప్పులో 64 రాతి పువ్వులు కనిపిస్తాయి. అన్ని ఒకేలా కనిపించినా, నిశితంగా గమనిస్తే వేటికవే ప్రత్యేకమని తెలుస్తుంది. అవి 64 కళలకు గుర్తులు. ఈ చుట్టుపక్కల ఏ ఆలయానికి ఈ తరహా నిర్మాణశైలి ఉండదు” అని చెప్పారు.

జగన్నాథ నాయుడు

ఫొటో సోర్స్, LakkojuSrinivas

ఫొటో క్యాప్షన్, జగన్నాథ నాయుడు

శిథిలావస్థకు చేరుతోన్న ఆలయం..

రాతితో నిర్మించిన ఈ ఆలయానికి రంగులు వేశారు. అందువల్ల సహజత్వం పోయిందనే అనుభూతి కలిగింది.

దానిపై గోపినాథ్ రథో మాట్లాడుతూ, “ఆలయం మొత్తం రాతి నిర్మాణమే, కానీ నాచు పట్టడంతో రంగులు వేశారు” అని వివరించారు.

“సరంక్షణ లేక, రాతికి నాచుపట్టి శిథిలావస్థకు వచ్చేసినట్లుగా కనిపించేది. ఓ భక్తుడు ముందుకు వచ్చి, రంగులు వేయించారు.” అని సత్యనారాయణ రథో తెలిపారు.

ఇంటాక్ ప్రతినిధి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ, “ అప్పటి మహారాజు గజపతి నారాయణదేవ్ ఈ ఆలయాన్ని నిర్మించడంలో ప్రధానమైన ఉద్దేశం ప్రజలకు వేదాలు, చతుష్షష్టి కళలు, దంపతులకు లైంగిక జ్ఞానంపై అవగాహన కల్పించడం.

ఆలయ నిర్మాణం నుంచి ఇప్పటివరకు రాజుల కుటుంబమే ఆ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. కానీ, ఇటీవలి కాలంలో వారు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం లేదు. ఆ కారణంగా చరిత్ర, విశిష్టత ఉన్న ఈ ఆలయం శిథిలావస్థకు చేరుతోంది” అన్నారు.

ఆయన మాట్లాడుతూ, “పురావస్తుశాఖ లేదా ఆ తరహా వ్యవస్థలు లేదా ప్రభుత్వమే పూనుకుని ఈ ఆలయాన్ని పరిరక్షించాలి. ఆలయ శిల్పాలలో దాగి ఉన్న జ్ఞానాన్ని, శిల్ప సౌందర్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది” అన్నారు.

వీడియో క్యాప్షన్, ‘ఆంధ్ర ఖజురహో’: మొదటి రాత్రికి ముందు కొత్త దంపతులు దర్శించుకునే ఆలయం

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)