టైమ్ ట్రావెల్: భవిష్యత్తులోకే కాదు, గతంలోకీ ప్రయాణించవచ్చా, సైన్స్ ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Getty images
గతం, వర్తమానం, భవిష్యత్తు. ఈ మూడింటి చుట్టూ మనం తిరుగుతుంటాం. గతంలో చేసిన తప్పులను వర్తమానంలో తలుచుకుని బాధపడుతుంటాం. అలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటాం. వర్తమానంలోని సమస్యలు భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు తెచ్చిపెడతాయోనని బెంగటిల్లుతుంటాం.
వీటన్నింటినీ సరి చేసుకునే అవకాశం ఉంటే ఎంత బావుంటుందో అనుకుంటాం.
మరి ఈ అవకాశం నిజంగా వచ్చేస్తే ఏం చేస్తారు? గతంలోని తప్పులు సరిచేసుకుంటారా, మరి ఆ తప్పుల వల్ల ఎదురయిన పరిణామాలు వర్తమానంలో చెరిగిపోతాయా? అసలు గతంలోకి ప్రయాణిస్తే ఏం జరుగుతుంది?
అప్పుడెప్పుడో ఆదిత్య 369 అనే టైమ్ మెషీన్ సినిమా వచ్చింది. అందులో హీరో గతంలోకి, భవిష్యత్తులోకి ప్రయాణిస్తాడు. ఇలాంటి టైమ్ ట్రావెల్ కథలు ప్రేక్షుకులకు ఆసక్తి కలిగిస్తాయి. నిజానికి ఇవి ఫాంటసీగా అనిపించినా ఇలాంటివి జరిగితే బావుండనిపిస్తుంది కదా.
ఇంతకీ మనం గతంలోకి, అలాగే భవిష్యత్తులోకి ప్రయాణిస్తే ఏమవుతుంది. అసలిది సాధ్యమేనా?
బ్రిటన్‌లో కూడా డాక్టర్ హు అనే టీవీ షో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ షో కూడా కాలప్రయాణం గురించినదే.
ఇందులోని టైమ్ మెషీన్ గతంలోకి, భవిష్యత్తులోకి కూడా ప్రయాణిస్తుంది.
సరే ...ఇవ్వన్నీ కాల్పనిక సినిమాలు, కథలు. మరి నిజ జీవితం మాటేమిటి? మనం టైమ్ మెషీన్‌ను తయారు చేసుకుని గతంలోకి, అలాగే భవిష్యత్తులోకి ప్రయాణించి మన తాతలను, మన ముని ముని మనవళ్ళను చూడగలిగితే? ఇది జరగాలంటే ముందు మనం కాలం అనేది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి.
ఇప్పటిదాకా మనం ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగింది ఏమైనా ఉందా అంటే భవిష్యత్తులోకి ప్రయాణించడం సాధ్యమేనని చెప్పగలగడం.
కానీ గతంలోకి ప్రయాణించడం చాలా కష్టంతో కూడుకున్న పని. దాదాపు అసాధ్యమైనది కూడా.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కాల ప్రవాహం స్థిరంగా ఉండదు
ఒకసారి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్దాంతాన్ని గుర్తు చేసుకుందాం. ఆయన స్థలం, కాలం, ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ గురించి చెప్పారు.
సాపేక్ష సిద్ధాంతంలోని కీలకమైన విషయం ఏమిటంటే కాల ప్రవాహం స్థిరంగా ఉండదు. పరిస్థితులను బట్టి కాల వేగం మారుతుంది.
‘‘సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే టైమ్ ట్రావెల్ వస్తుంది. ఇది శాస్త్రీయంగా కచ్చితమైననది, అది నిజ ప్రపంచ పరిణామాలను ప్రతిబింబిస్తుంది’’ అంటారు యూనివర్సిటీ ఆఫ్ యార్క్ కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఎమ్మా ఓస్బోర్న్ .
దీన్ని మరి కొంచెం సరళంగా అర్థం చేసుకుందాం.
మీరు వేగంగా ప్రయాణించారనుకోండి. సమయం నెమ్మదిగా కదులుతుంది. ఇందులో మీరు గణనీయమైన ప్రభావాన్ని చూపాలంటే మీరు కాంతివేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది.
ఇక్కడో ఉదాహరణ చూద్దాం.
ఇద్దరు కవలలు ఉన్నారు. వారిలో ఒకరు వ్యోమగామిగా అంతరిక్షంలో కాంతివేగానికి ఇంచుమించు సమానంగా ప్రయాణించారనుకుందాం. మరొకరు భూమిపైనే ఉన్నారు.
‘‘అంతరిక్షంలో గడిపి వచ్చినతను కచ్చితంగా భూమి మీద ఉన్న తన కవల సోదరుడికంటే తక్కువ వయసు కలిగిన వాడై ఉంటాడు’’ అని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో క్వాంటం భౌతికశాస్త్రవేత్త వ్లాట్కో వెడ్రాల్ చెప్పారు. స్కాట్, మార్క్ కెల్లీ అనే కవల సోదరులు నిజంగానే ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. స్కాట్ కొన్ని నెలలపాటు అంతరిక్షంలో గడిపారు.
అలాగే మీరు బ్లాక్ హోల్‌లాంటి తీవ్రమైన గురుత్వాకర్షణ ఉన్న ప్రాంతంలో గడిపితే ‘‘ మీ తల మీ పాదాల కంటే త్వరగా వృద్ధాప్యానికి లోనవుతుంది. దీనికి కారణం మీ కాళ్ల దగ్గర భూ గురుత్వాకర్షణ చాలా ఎక్కువగా ఉండటమే’’ అని ఆస్బ్రోన్ తెలిపారు.
డాక్టర్ హు సీజన్ 10 చివరి భాగం ‘వరల్డ్ ఎనఫ్ అండ్ టైమ్’ లో ఇదే అంశాన్ని చూపుతారు. ఇందులో డాక్టర్, అతని స్నేహితులు ఓ అంతరిక్ష నౌకలో బ్లాక్ హోల్‌కు దగ్గరగా చిక్కుకుపోతారు.
ఈ నౌక ముందుభాగం బ్లాక్ హోల్‌కు దగ్గరగా ఉండటం వల్ల సమయం నెమ్మదిగా గడుస్తుంటుంది. కానీ నౌక చివరి భాగంలో సమయం వేగంగా గడుస్తుంది. దీంతో చివరి భాగంలో ఉన్న సైబర్ మెన్ నిమిషాలలోనే ఓ పెద్ద సైన్యంలా తయారుకాగలరని డాక్టర్ అంచనా వేస్తాడు.
‘ఇంటర్‌స్టెల్లార్’ సినిమాలో కూడా సమయంపై గురుత్వాకర్షణ ప్రభావాన్ని చూపిస్తారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అంతరిక్ష గడియారం వేగం ఎక్కువా?
మన నిత్యజీవితంలో సాపేక్ష సిద్ధాంత ప్రభావం మనం గమనించలేనంతగా ఉంటుంది. కానీ దాని ప్రభావం మనకు దారిచూపడానికి ఉపయోగపడుతున్న గ్లోబల్ పొజినిషింగ్ సిస్టమ్ (జీపీఎస్) ఉపగ్రహాలపై పడుతుంది.
‘‘ అంతరిక్షంలోని గడియారాలు భూమి మీద గడియారాలకంటే వేగంగా తిరుగుతాయి వాటిని కచ్చితంగా భూమ్మీదున్న గడియారాలకు అనుగుణంగా సరిదిద్దాలి’’ అంటారు అబ్స్రోన్.
‘‘వీటిని మనం సరిచేయకపోతే గూగూల్ మ్యాప్ ప్రతిరోజూ దాదాపు పదికిలోమీటర్ల మేర దూరాన్ని తప్పుగా చూపుతుంది’’అని చెప్పారు.
సాపేక్షికత అనేది మనం భవిష్యత్తులోకి ప్రయాణించడం సాధ్యమే అని చెబుతోంది. ఇందుకోసం మనకు కచ్చితంగా టైమ్ మెషీన్ లాంటివి కూడా అక్కరలేదు. కాకపోతే మనం కాంతివేగానికి సమానంగా ప్రయాణించాలి. లేదంటే తీవ్రమైన గురుత్వాకర్షణ శక్తి ఉన్న ప్రాంతంలో సమయాన్ని గడపాలి. సాపేక్షికంగా ఈ రెండు చర్యలు సమానమైనవే.
మీరు అక్కడున్న సమయంలో విశ్వంలోని మిగిలిన భాగాలలో దశాబ్దాలు, లేదా శతాబ్దాలు కూడా గడిచిపోవచ్చు. ఇప్పటి నుంచి వందల ఏళ్ళ తరువాత ఏం జరుగుతుందో తెలియాలంటై పైన చెప్పినట్టు కాంతివేగానికి సమానంగానైనా ప్రయాణించాలి, లేదా తీవ్రమైన గురుత్వాకర్షణ ప్రాంతాలోనైనా సమయాన్ని గడపాలి.
అయితే భవిష్యత్తులోకి ప్రయాణించినంత తేలికగా భూతకాలంలోకి ప్రయాణించడం చాలా చాలా కష్టంతో కూడుకున్నది.
‘‘ఇది సాధ్యమవచ్చు, లేదా సాధ్యపడకపోవచ్చు’’ అని కెనడాలోని సెయింట్ కేథరిన్స్‌లోని బ్రాక్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రవేత్త బరాక్ షోషానీ చెప్పారు. ‘‘ ప్రస్తుతం మన దగ్గర సరిపడా నాలెడ్జ్ లేదు. అలాగే సరైన సిద్ధాంతాలు కూడా లేవు’’ అంటారాయన.
సాపేక్షికత మీరు గతంలోకి ప్రయాణించడానికి కొన్ని అవకాశాలు కల్పిస్తోంది కానీ అవ్వన్నీ సిద్ధాంతపరమైనవే. ‘‘ప్రజలు తమను తాము బంధించేసుకుని గతంలోకి ప్రయాణించడానికి, విశ్వం సమయాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని అంతరిక్ష సిద్ధాంతవేత్త కాటే మాక్ చెప్పారు. ఈయన కెనడాలోని వాటర్‌లూ లోని పెరీమీటర్ ఇనిస్టిట్యూట్ ఫర్ థీరిటికల్ ఫిజిక్స్ విభాగంలో పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కాల వక్ర రేఖలు
గతంలోకి ప్రయాణించేందుకు కాల వక్ర రేఖలను సృష్టించడం ఒక మార్గం. ఇది విశ్వం ద్వారా ప్రయాణించి తిరిగి మొదలైన చోటుకు చేరుకునే రేఖ. ఈ రేఖ ద్వారా ప్రయాణించిన వ్యక్తి అంతిమంగా అదే సమయంలో అదే ప్రదేశంలో కనిపిస్తారు. ఈ కాల వక్రరేఖ సంబంధించిన గణితశాస్త్ర వివరణను తర్కశాస్త్రవేత్త కుర్ట్ గోడెల్ ‘ఏ 1949 స్టడీ’లో ప్రచురించారు. దీనిని అనేకమంది అనుసరించారు.
కానీ అనేక కారణాల వల్ల ఈ పద్ధతి అంత ఆమోదనీయంగా కనిపించలేదు.
‘‘ఇది విశ్వంలో ఎక్కడైనా మనుగడలో ఉందో లేదో మనకు తెలియదు’’ అని వేడ్రాల్ చెప్పారు. ‘‘ ఇది పూర్తిగా సైద్ధాంతికమైది. దీనికి ఆధారాలు లేవు’’
అసలు దీనిని మనం ఎలా సృష్టించగలమనేది అర్థం కావడం లేదు. ‘ఇప్పుడున్న వాటికంటే కూడా మనకు గొప్ప సాంకేతిక శక్తులు ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా క్లోజ్డ్ టైమ్ లాంటి వక్రతలను సృష్టించడమనేది అసాధ్యంగా కనిపిస్తోంది’’ అని అమెరికాలోని కాలిఫోర్నియాలోని చాప్‌మాన్ యూనివర్సిటీలో తత్త్వవేత్త గా పనిచేస్తున్న ఎమలీ అడ్లామ్ చెప్పారు.
ఒకవేళ మనం ఈ పని చేయగలిగినా అలాంటిదానిని మేం కోరుకోవడం లేదు. ‘‘మీరు అదే పనిని పదేపదే చేస్తారు’’ అంటారాయన.
ఇక ఇదే పద్ధతిలో కాస్మిక్ తీగల ప్రయోగం గురించి చెప్పారు భౌతికశాస్త్రవేత్త రిచర్డ్ గాట్. ఈయన ‘ఏ 1991 స్టడీ’లో ఓ ఆశ్చర్యకర రూపంలో కాస్మిక్ తీగల గురించి గణితశాస్త్ర వివరణ ఇచ్చారు.
‘‘ఈ కాస్మిక్ తీగలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో వేగంగా గతాన్ని దాటాయి.’’ అని ఆయన చెప్పారు. ఆయన లెక్క ప్రకారం ఇలాంటివి క్లోజ్డ్ టైమ్ లాంటి వక్రతలను వీటిపక్కన సృష్టిస్తాయని సిద్ధాంతరీకరించారు.
ఇది వినడానికి బానే ఉంది. కానీ ఈ కాస్మిక్ తీగలనేవి మనకు ఎక్కడ దొరుకుతాయి? ఇది పూర్తిగా ఊహాజనిత భావన. ఇది కొన్ని సిద్ధాంతాల ప్రకారం విశ్వం ప్రారంభంలో ఈ తీగలు ఉన్నట్టుగా చెప్పారు. కానీ ఇప్పటిదాకా వాటినెవరూ కనుగొనలేదు. ‘‘కాస్మిక్ తీగల ఉనికిని నమ్మేందుకు మన దగ్గర ఎటువంటి కారణాలు లేవు’’ అని మాక్ చెప్పారు. ఒకవేళ అవి ఉనికిలో ఉన్నా అవి రెండు సమాంతరంగా చక్కగా కదులుతున్నట్టుగా చూడటం కూడా నమ్మలేని విషయమే అవుతుంది. అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty images
వామ్ హోల్స్
సాపేక్షికత అంగీకరించే మరో విషయం వామ్ హోల్స్. స్పేస్ టైమ్‌ను ఓ పేపర్‌లా మడతపెట్టడం సాధ్యమవుతుంది. ఇదో రెండు కొసల మధ్య సొరంగం లాంటి దానిని సృష్టించి ఆ కొస, ఈ కొస మధ్య ఓ దగ్గరి దారిని సృష్టిస్తుందని సిద్ధాంతరీకరించారు.
‘‘ సాధారణ సాపేక్షికతలో వామ్ హోల్స్ అనేవి సిద్ధాంతపరంగా సాధ్యమైనవే’’ అని వెడ్రాల్ చెప్పారు.
కానీ ఈ భావనలో కూడా త్వరగానే సమస్యలు తలెత్తుతాయి. ముందుగా అసలు వామ్ హోల్స్ ఉనికి ఉందనేందుకు మన దగ్గర ఎటువంటి ఆధారమూ లేదు. ‘‘ వాటి ఉనికి కేవలం గణిత శాస్త్రంలోనే చూపారు. కానీ అవి భౌతికంగా ఉండటమనేది ముఖ్యం’’ అంటారు అబ్స్రోన్.
వామ్ హోల్స్ ఉనికి ఉంటే, వాటి జీవితం కాలం స్వల్పం. ‘‘తరచూ వామ్ హోల్స్‌ను రెండు కృష్ణ బిలాలు ఒకదానికొకటి అనుసంధానించేవిలా వర్ణిస్తారు’’ అని అబ్స్రోన్ చెప్పారు. అంటే దీనర్థం వామ్ హోల్స్ అద్భుతమైన గురుత్వాకర్షణ ప్రాంతంలో ఉండి ఉండాలి. ‘‘ అది తన సొంత గురుత్వాకర్షణలో నాశనమైపోతుంది’’.
నిజమైన వామ్ హోల్స్ కూడా చాలా సూక్ష్మమైనవి. వాటి ద్వారా మీరు ఓ వ్యక్తిని, లేదా బ్యాక్టిరీయాను కూడా పోల్చలేరు.
సిద్ధాంతపరంగా ఇలాంటి సమస్యలన్నీ తీర్చవచ్చు. కానీ దీనికి చాలా ‘నెగటివ్ ఎనర్జీ’ కావాలి. కానీ మనకు అంతటా పాజిటివ్ ఎనర్జీనే కనిపిస్తుంది. వీటిల్లోనే చిన్న చిన్న నెగటివ్ ఎనర్జీ ఉంటుందని అబ్స్రోన్ చెప్పారు. ‘‘ఈ చిన్నపాటి నెగటివ్ ఎనర్జీనే విస్తరించేలా చేయాలనుకుంటున్నారు’’ అని ఆమె చెప్పారు. ‘‘ కానీ అది సాధ్యమవుతుందని నేనుకోవడం లేదు’’ అని తెలిపారు.
‘‘ఇది ఆమోదనీయమైన ప్రతిపాదనలా అనిపించడం లేదు’’ అని వెడ్రాల్ ముగించారు.

ఫొటో సోర్స్, Getty Images
క్వాంటమ్ మెకానిక్స్ సంగతేంటి?
సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా టైమ్ ట్రావెల్ గురించి అనేక విషయాలు వస్తున్నాయి. కానీ విశ్వానికి సంబంధించి మరో గొప్ప సిద్ధాంతమైన క్వాంటమ్ మెకానిక్స్ సంగతేంటి?
సాపేక్ష సిద్ధాంతం మనుషులు, గెలాక్సీల ప్రవర్తన గురించి వివరిస్తే క్వాంటం మెకానిక్స్ అనేది అణువులు, పరమాణువుల గురించి వివరిస్తుంది.
క్వాంటమ్ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన విషయాలు వెలుగుచూశాయి. అందులో ఒకట నాన్ లోకాల్టీ. అంటే ఒక అణువులో ఏదైనా మార్పు జరిగితే దాని ప్రభావం ఎక్కడో ఉన్న మరో అణువుపై పడుతుంది. దీనినే ఐన్‌స్టీన్ ‘‘స్పూకీ యాక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్’ గా అబివర్ణించాడు. ఇది అనేకసార్లు ప్రయోగాత్మకంగా రుజువైంది కూడా అని అడ్లామ్ చెప్పారు.
‘‘అయితే ఈ నాన్ లోకాల్టీ అనే విషయంపై చాలామంది భౌతిక శాస్త్రవేత్తలకు అసంతృప్తి ఉంది’’ అని అడ్లామ్ చెప్పారు. ఎందుకంటే మార్పు ప్రభావం తక్షణం కనిపించాలి. ఒక సమాచారం కాంతికంటే వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు చేరాలి. ఇది దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
అయితే ఇప్పటిదాకా దీనిపై జరిగిన ప్రయోగాలను వ్యాఖ్యానించడానికి ప్రత్యామ్నాయ పద్దతులు కూడా ఉన్నాయని కొందరు భౌతిక శాస్త్ర వేత్తలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన నాన్ లొకాల్టీ అనే బాధను తొలగిస్తుంది.
‘‘నాన్ లోకల్ ఎఫెక్ట్ ను వెంటనే చూడాలనుకోవడానికి బదులుగా, మీరు మీ ఎఫెక్ట్‌ను భవిష్యత్తులోకి పంపండి. కొంత సమయం తరువాత అది తిరిగి గతంలోకి వెళుతుంది’’ అని ఆడ్లామ్ చెప్పారు. ‘‘అది తక్షణ ప్రతిస్పందనగానే కనిపిస్తుంది’ కానీ వాస్తవంలో ఆ ఎఫెక్ట్ భవిష్యత్తులోకి ప్రయాణించి తిరిగి గతానికి చేరుకుంటుంది.’’ అని చెప్పారు.
ఈ ప్రయత్నం ‘రెట్రోకాజువాల్టీ’అని పరిచయం చేయడానికి దోహదపడింది. అంటే దీనివల్ల భవిష్యత్తులోని సంఘటనలు గతంపై ప్రభావం చూపుతాయి. ఇది మన ఆలోచనలకు వ్యతిరేకంగా కనిపిస్తుంటుంది. మన దృష్టిలో సంఘటనలన్నీ సరళరేఖపై ఒకదాని తరువాత ఒకటి జరుగుతాయి. అంటే గతం నుంచి వర్తమానం, వర్తమానం నుంచి భవిష్యత్తు వైపు ఇలా..కానీ ఈ సరికొత్త క్వాంటమ్ సెటప్‌లో సమాచారం ముందుగా భవిష్యత్తులోకి ప్రయాణించి తిరిగి గతానికి చేరుకుంటుంది.
ఈ విషయంలో ముందు మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇది సార్వజనీన ఆమోదానికి చాలా దూరంగా ఉందని. ఈ రెట్రోకాజువాల్టీ కూడా నాన్ లోకాల్టీని పరిచయడం చేయడం లాంటిదేనని చాలామంది భౌతిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
రెట్రోకాజువాల్టీ అనేది నిజమే అయినా అది మనల్ని కాలాధిపతులుగా మార్చడానికి సహాయపడలేదు. రెట్రోకాజువాల్టీ అనేది టైమ్ ట్రావెల్ లాంటిది కాదు’’ అని ఆడ్లామ్ చెప్పారు.
నాన్ లోకాల్టీపై జరిగిన పరిశీలనలన్నీ పరమాణువులకు సంబంధించినవే. వీటిని విస్తరించి మానవులు, లేదంటే కాగితం ముక్కలకంటే చిన్నవాటిపై ప్రయోగిస్తే దానిలో చాలా పెద్ద సవాళ్ళు ఎదురవుతాయి.
గతంలోకి సమాచారం పంపడం సాధ్యమయ్యే పనికూడా కాదంటారు ఆడ్లామ్.
ప్రస్తుతం మనకు ప్రపంచాన్ని అర్థం చేసుకున్నంతమేరకు మనకు భవిష్యత్తులోకి ప్రయాణించే శక్తి ఉంది కానీ, గతంలోకి ప్రయాణించడమనేది అసాధ్యం.
విశ్వానికి సంబంధించి సాపేక్ష సిద్ధాంతం, క్వాంటం సిద్ధాంతాలు ఎన్నో విషయాలు చెప్పాయి. కానీ అవికూడా ఈ విషయంలో సరిపోవడం లేదు. ఈ రెండింటిని ఏకం చేసే పూర్తి లోతైన పరిశోధన కావాల్సిన అవసరం ఉంది.
కానీ దశాబ్దాల తరబడి సాగిన పరిశోధనలు వీటిని ఏకం చేయలేకపోతున్నాయి. ‘‘అలాంటి సిద్ధాంతం పురుడుపోసుకునే వరకు మనం ఈ విషయంలో గ్యారంటీగా ఉండలేం’’ అని షోషానీ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పీతలకు ‘రక్షణ కవచం’గా బాటిల్ మూతలు.. హృదయం ముక్కలైందన్న శాస్త్రవేత్తలు
- దళితులు ప్రవేశించారని ఓ గుడిని వదిలేసి కొత్తది కడుతున్న ఇతర కులస్తులు
- Cervical Cancer: నిర్మల సీతారామన్ 2024 బడ్జెట్లో ప్రస్తావించిన ఈ వ్యాధి ఏమిటి? ఎవరికి వస్తుంది? వ్యాక్సీన్‌తో పూర్తిగా తగ్గించవచ్చా
- కాఫీ ఒక్కసారిగా ఆపేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులు ఏమిటి?
- క్యాష్‌లెస్ ఎవ్రీవేర్: హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఇకపై నెట్వర్క్ హాస్పిటల్స్‌లోనే కాదు, దేశంలో ఎక్కడైనా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్... 48 గంటల నిబంధన గుర్తుంచుకోండి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














