ఐక్యరాజ్య సమితి సిబ్బంది హమాస్‌కు సాయం చేశారన్న ఇజ్రాయెల్...నిధులు నిలిపివేసిన అమెరికా సహా ఎనిమిది దేశాలు

ఫొటో సోర్స్, Reuters
గాజాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితికి చెందిన యూఎన్ఆర్‌డబ్ల్యూఏకు చెందిన సిబ్బంది కొందరు హమాస్‌కు సాయం చేశారన్న ఆరోపణలతో తొమ్మిది దేశాలు ఏజెన్సీకి నిధుల సాయం నిలిపివేశాయి.
అయితే, ఆ దేశాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూఎన్ఆర్‌డబ్ల్యూఏ కార్యకలాపాలు కొనసాగేందుకు సాయం అవసరమని ఐక్యరాజ్య సమితి అధ్యక్షులు ఆంటోనియో గుటెర్రెస్ విజ్ఞప్తి చేశారు.
“గాజాలో ప్రాంతంలో ఉన్న జనాభాకు సిబ్బంది సేవలు కచ్చితంగా అందాలి. వారి అవసరాలు తీర్చడంలో సమస్య రాకూడదు” అన్నారు గుటెర్రెస్.
గతేడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై జరిపిన దాడుల్లో యూఎన్ఆర్‌డబ్ల్యూఏలో విధులు నిర్వర్తిస్తున్న కొందరి పాత్ర ఉందని ఇజ్రాయెల్ వెల్లడించిన నేపథ్యంలో అమెరికా, బ్రిటన్ సహా తొమ్మిది దేశాలు ఆ ఏజెన్సీకి సాయం నిలిపివేశాయి.
అయితే, ఇప్పటికే ఆ బాధ్యులను గుర్తించి, వారిని విధుల్లో నుంచి తొలగించామని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ చెప్పింది.
ఇజ్రాయెల్ ప్రకటనల నేపథ్యంలో ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్‌లాండ్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, అమెరికా, బ్రిటన్ దేశాలు తమ నిధుల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

ఫొటో సోర్స్, Getty Images
1949లో ఏర్పాటైన ‘ది యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్కర్స్ ఏజెన్సీ’ గాజా కేంద్రంగా పనిచేసే అతిపెద్ద ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ
గాజా, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్, లెబనాన్, సిరియాలోని పాలస్తీనియన్లకు విద్య, వైద్యం, మానవతా సాయాన్ని అందజేస్తోంది యూఎన్ఆర్‌డబ్ల్యూఏ.
అక్కడి పౌరులకు సేవలు అందడం కోసం గాజాలో13 వేల మందికిపైగా ఉద్యోగులను నియమించుకుంది యూఎన్ఆర్‌డబ్ల్యూఏ.
గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడులు మొదలయ్యాక ఆ ఏజెన్సీ కేంద్రాలు నిరాశ్రయులైన వేలమందికి ఆశ్రయం కల్పించే కేంద్రాలుగా మారాయి.
అయితే, ఇజ్రాయెల్ మాత్రం ఐక్యరాజ్య సమితిలోని కొన్ని అనుబంధ సంస్థలు 'పక్షపాతం'గా, 'యూదులకు వ్యతిరేకం'గా వ్యవహరిస్తున్నాయని చాలాకాలంగా ఆరోపణలు చేస్తోంది. ఆ జాబితాలో యూఎన్ఆర్‌డబ్ల్యూఏ కూడా ఉంది.
ఇజ్రాయెల్ ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ, ఇజ్రాయెల్ మీడియా యూఎన్ఆర్‌డబ్ల్యూకు చెందిన వాహనాలు, శిబిరాలను హమాస్ మిలిటెంట్లు దాడుల కోసం వినియోగించుకుని ఉండొచ్చని కథనాలు ప్రచురించింది.
గతేడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 1300 మంది చనిపోగా, వారిలో పౌరులే ఎక్కువ ఉన్నారు. మరో 240 మందిని బందీలుగా తీసుకుని వెళ్లారు హమాస్ మిలిటెంట్లు.

ఫొటో సోర్స్, Getty Images
శుక్రవారం ఇజ్రాయెల్ అధ్యక్షులు బెంజమిన్ నెతన్యాహు సలహాదారు బీబీసీతో మాట్లాడుతూ, "అక్టోబర్ 7 హమాస్ దాడుల్లో భాగమైన వారిలో కొందరు యూఎన్ఆర్‌డబ్ల్యూఏ ఉద్యోగులు ఉన్నారు" అని చెప్పారు.
హమాస్ చెర నుంచి విడుదలైన మహిళ, మిలిటెంట్లు తనని యూఎన్ఆర్‌డబ్ల్యూఏ కోసం పనిచేసే వ్యక్తి ఇంట్లో బంధించారని చెప్పినట్లుగా ప్రస్తావించారు.
శనివారం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్ 12 మంది యూఎన్ఆర్‌డబ్ల్యూఏ ఉద్యోగులపై ఆరోపణలు చేసిందని, వారిలో తొమ్మిది మందిని విధుల్లో నుంచి తొలగించామని, ఒకరు మరణించగా, మిగిలిన ఇద్దరు ఎవరో గుర్తిస్తున్నామని వెల్లడించారు..
నిధులు నిలిపివేసిన ఆయా దేశాల ఆందోళన తనకు అర్థమైందని ఈ సందర్భంగా ఆంటోనియో అన్నారు.
"ఆ ఆరోపణలు నన్ను కలవరపాటుకు గురి చేశాయి. బాధ్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది" అన్నారు.
కొంతమంది చేసిన పనికి, మొత్తం ఏజెన్సీలో పనిచేస్తున్న వేలమంది ఉద్యోగులను శిక్షించడం సరికాదని ఆయన అన్నారు.
అంతకుముందు యూఏఆర్‌డబ్ల్యూఏ ఫిలిప్ లజారిని చేసిన ప్రకటనకు కొనసాగింపుగానే ఆంటోనియో కూడా పై విధంగా స్పందించారు.
ఇజ్రాయెల్ కొందరు సిబ్బందిపై ఆరోపణలు చేస్తే, అమెరికా సహా తొమ్మిది దేశాలు ఏకంగా నిధులు నిలిపివేయడం తనను విస్మయానికి గురిచేసిందని ఫిలిప్ అన్నారు.
ప్రతి ఏడాది యూఎన్ఆర్‌డబ్ల్యూఏ కోసం పనిచేసే సిబ్బంది జాబితాను ఇజ్రాయెల్‌కు పంపుతూనే ఉన్నామని, ఆ సమయంలో వారేమీ అభ్యంతరాలే లేవనెత్తలేదని కూడా అన్నారు.
తొమ్మిది దేశాల నిర్ణయం పట్ల ఫిలిప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, మరికొన్ని దేశాలు మాత్రం తమ సాయం కొనసాగుతుందని తెలిపాయి.
యూఎన్ఆర్‌డబ్ల్యూఏ సాయం కీలకమైనదని, కొంతమంది వ్యక్తులు చేసిన పనిని, మొత్తం ఏజెన్సీకి ఆపాదించడ కూడదని అన్నారు పాలస్తీనా అథారిటీకి సంబంధించిన నార్వే ప్రతినిధి.
ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి కట్జ్ మాత్రం, ఫిలిప్ తన పదవికి రాజీనామా చేయాలని, యుద్ధం అనంతరం గాజాలో ఏజెన్సీ కార్యకలాపాలను నిలిపేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సరిహద్దులను ధ్వంసం చేసి, దేశంలోకి ప్రవేశించి, మెరుపుదాడులు చేశారు. అనంతరం ప్రతిదాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించి వైమానిక, భూతల దాడులు ముమ్మరం చేసింది.
ఇప్పటివరకు గాజాలో 26 వేల మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
1.7 మిలియన్ల మందికి అవసరమైన సాయం అందించడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏజెన్సీ తెలిపింది.
దాడులు మొదలైనప్పటి నుంచి మూడోంతుల జనాభా కన్నా ఎక్కువ శాతం నిరాశ్రయులుగా మారారని తెలిపింది.
ఇటీవలే గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో దాడులు జరుగుతున్నందున ఉత్తర గాజా నుంచి అక్కడికి వచ్చిన వారంతా మళ్లీ మరోప్రాంతానికి వెళ్లి తలదాచుకోవాల్సి వచ్చింది.
కొంతమంది దక్షిణ గాజావైపు వెళ్తుండగా, మరికొంతమంది ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫా ప్రాంతానికి వెళ్తున్నారు.
ఇప్పటివరకు గాజాలో హమాస్ ఏర్పాటు చేసుకున్న సొరంగాలను 20-40% మేర పునర్వినియోగానికి వీలులేకుండా ధ్వంసం చేసినట్లుగా ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నట్లు అమెరికా న్యూస్ పేపర్ వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
హమాస్‌ను సమూలంగా నిర్మూలించేవరకు తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ అధ్యక్షులు నెతన్యాహు తమ సైన్యం గాజా సరిహద్దుల్లో ప్రవేశించిన రోజున తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఐకాన్ ఆఫ్ ద సీస్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక తొలి ప్రయాణం షురూ.. దీనిపై విమర్శలు ఎందుకు?
- గురక ఎందుకు వస్తుంది? రాత్రిపూట పదేపదే నిద్ర చెడిపోతే మెదడు పనితీరు దెబ్బతింటుందా?
- పీతలకు ‘రక్షణ కవచం’గా బాటిల్ మూతలు.. హృదయం ముక్కలైందన్న శాస్త్రవేత్తలు
- అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ పాటిస్తుందా?
- ఐఎన్ఎస్ విశాఖపట్నం: 22 మంది భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై హుతీల క్షిపణి దాడి, స్పందించిన భారత నౌకాదళం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















