గాజాలో జాతి హననాన్ని నివారించాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించిన అంతర్జాతీయ న్యాయస్థానం

హేగ్‌లో కోర్టు తీర్పు తర్వాత ఆలింగనం చేసుకున్న పాలస్తీనా మద్దతుదారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హేగ్‌లో కోర్టు తీర్పు తర్వాత ఆలింగనం చేసుకున్న పాలస్తీనా మద్దతుదారులు

గాజాలో నరమేధానికి దారి తీసే ఎలాంటి చర్యలు చేపట్టరాదని అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు కానీ, కాల్పుల విరమణ గురించి కానీ ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో మారణహోమం జరిగిందని ఆరోపిస్తూ సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో కేసు దాఖలు చేసింది. దీంతో ఈ కేసును ఐసీజే విచారించింది.

ఈ కేసును కోర్టు తిరస్కరించడం లేదనే 17 మంది న్యాయమూర్తుల ప్యానెల్ నిర్ణయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షురాలు జోన్.ఇ. డోనోహ్యు ప్రకటించారు.

“ఆ ప్రాంతంలో జరుగుతున్న మానవీయ విషాదం తీవ్రత గురించి మాకు తెలుసు. యుద్ధంలో పోతున్న ప్రాణాలు, ప్రజలు పడుతున్న కష్టాల పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తోంది” అని కోర్టు ఉత్తర్వుల్లో తెలిపారు.

దక్షిణాఫ్రికా కోరినట్లు కోర్టు కాల్పుల విరమణ గురించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయితే కోర్టు ఉత్తర్వులను అనుసరించి తీసుకున్న చర్యలపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది.

ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వులు “మానవీయత, అంతర్జాతీయ చట్టానికి అనుకూలంగా ఉన్నాయని పాలస్తీనా విదేశాంగమంత్రి రియాద్ అల్ మలికీ అన్నారు.

హేగ్‌లోని పీస్ ప్యాలస్‌లో ఈ కేసు విచారణ జరిగింది. నరమేధం అని నిర్వచించగలిగే ఏ కేసు గురించైనా, అది ప్రపంచంలో ఎక్కడ జరిగినా, దానిపై విచారణ చేపట్టే హక్కు తమకు ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు తెలిపారు.

గాజాలో మారణహోమానికి ప్రేరేపించే బహిరంగ వ్యాఖ్యలను నిరోధించాలని, అలాంటి కామెంట్లు చేసిన వారిని శిక్షించాలని, గాజాలో మానవీయ సాయానికి హామీ ఇవ్వాలని కోర్టు ఇజ్రాయెల్‌కు సూచించింది.

కోర్టు ఆదేశాలపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు "అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకోవడం కొనసాగిస్తుంది. గాజాలో సంపూర్ణ విజయం, బందీలందరినీ చెర విడిపించే వరకూ యుద్ధాన్ని కొనసాగిస్తుంది" అని అన్నారు.

ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడిందా లేదా అన్నది ఇంకా నిర్ణయించలేదు, ఎందుకంటే దీనికి సంవత్సరాలు పట్టే ప్రక్రియ.

కేసు విచారణకు ఉపయోగపడే సాక్ష్యాలను ధ్వంసం చెయ్యకుండా చూడాలని కోర్టు ఇజ్రాయెల్‌ను ఆదేశించింది.

కోర్టు హాలులో దక్షిణాఫ్రికా ప్రతినిధులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోర్టు హాలులో దక్షిణాఫ్రికా ప్రతినిధులు

బందీల సంగతేంటి?

హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరుల విషయంలో న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది.

గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత 25,900 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్య విభాగం తెలిపింది.

గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి వచ్చి ఇజ్రాయెల్ పౌరుల మీద దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది మరణించారు. 200 మందిని బందీలుగా పట్టుకెళ్లారు.

 తీర్పు చదువుతున్న జస్టిస్ జాన్ డోనోహ్యు

ఫొటో సోర్స్, reuters

ఫొటో క్యాప్షన్, తీర్పు చదువుతున్న జస్టిస్ జాన్ డోనోహ్యు

జాతి హననం కేసు ఏంటి?

ఇజ్రాయెల్ గాజాలో దాడి చెయ్యడం ద్వారా 1948 జినోసైడ్ కన్వెన్షన్‌ను ఉల్లంఘించిందని సౌతాఫ్రికా చెబుతోంది. ఈ వ్యవహారంలో ఇజ్రాయెల్ మీద విచారణ జరపాలని గతేడాది డిసెంబర్ 29న కేసు దాఖలు చేసింది.

నరమేధం అనేది క్రూరమైన నేరం. ఇది ప్రజలను చంపడంతో పాటు అందులో జాతిని నిర్మూలించాలనే క్రూరమైన ఉద్దేశం ఉంది. ఒక దేశం ఒక జాతిని, మత సమూహాన్ని, సమాజాన్ని మొత్తంగా లేక కొంతభాగాన్ని నాశనం చేసే ప్రయత్నంగానే చూడాలి.

ఇజ్రాయెల్ ప్లాన్ లేదా నమూనా ఎలా ఉందో వివరించగలిగేలా దక్షిణాఫ్రికా కచ్చితంగా ఏదో ఒక ఆధారాన్ని ప్రవేశపెట్టాలి.

దేశాల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ ఏ దేశం కూడా నరమేధానికి పాల్పడినట్లు కోర్టులో తేలలేదు.

సెర్బియా ప్రభుత్వం బోస్నియా, హెర్జిగోవినాలో జరిగిన 1995 స్రెబ్రినికా మారణ హోమాన్ని ఆపడంలో విఫలమైందని 2007లో అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయించింది. ఈ మారణహోమంలో 8వేల మంది ముస్లిం పురుషులు, చిన్నారులను చంపేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)