సీత కోసం ప్రత్యేక ఆలయం... అక్కడే హనుమంతుడి ఆకారంలో పర్వతం

- రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
- హోదా, బీబీసీ కోసం
సీతను రావణుడు అపహరించి శ్రీలంకలో బంధించినట్లు రామాయణంలో పేర్కొన్న అశోక వనాన్ని ఇప్పుడు అక్కడ ‘సీతా ఎలియా’ అని పిలుస్తున్నారు.
శ్రీలంక మధ్యలోని పర్వత ప్రాంతాన్ని రామాయణంలోని ఈ అశోక వనంగా పరిగణిస్తున్నారు.
సీతా ఎలియాని 'అశోక ఫారెస్ట్' అని కూడా పిలుస్తారు. ఇది ఎత్తయిన పర్వత ప్రాంతంలోని నువారా ఎలియా నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో 'బదుల్లా' రహదారిపై ఉంది. ప్రపంచంలోనే సీతాదేవికి ఆలయాన్ని నెలకొల్పిన ప్రదేశంగా ఇది చరిత్రలో నిలిచిందని చెబుతారు.
నువారా ఎలియా నుంచి బదుల్లా రోడ్డులో వెళ్తున్నప్పుడు రహదారికి ఎడమ వైపున ఈ ఆలయం ఉంది. పర్వతాలు, నదీ ప్రవాహం వంటి ప్రకృతి రమణీయతతో ముడిపడి ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత.
రావణుడు సీతను అపహరించి సుమారు 11 నెలల పాటు ఈ అశోక వనంలో దాచి ఉంచినట్లు విశ్వసిస్తారు. సీతాదేవిని వెతుక్కుంటూ శ్రీలంకకు వచ్చిన హనుమంతుడు అశోక వనంలో ఉన్నట్లు కనుక్కుని, ఆమెను కలిసిన ప్రాంతంలోనే ఈ సీతాదేవి ఆలయం ఉంది.
సీతా దేవి ఆలయానికి సమీపంలో ఉన్న రాతిపై 'హనుమాన్ పాదం' అనే చిహ్నం కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో సీత, హనుమంతుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు.
అలాగే, సీతాదేవి స్నానమాచరించేవారని చెప్పే గంగ కూడా ఆలయానికి సమీపంలో ఉంది. ఆలయాన్ని సందర్శించే భక్తులు ఇక్కడి గంగలో స్నానం చేయడం, ఆలయానికి వెళ్లేముందు కాళ్లు, చేతులు కడుక్కోవడం వంటివి చేస్తుంటారు.

ఆలయానికి ఎదురుగా ఉన్న పర్వత శ్రేణి హనుమంతుడి ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇది హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోసుకెళ్తుండగా కిందపడిన భాగమని భక్తుల నమ్మకం.
అశోక వనంగా పిలిచే ఈ ప్రాంతంలో ఇప్పటికీ అశోక వృక్షాలు కనిపిస్తాయని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
ఆలయానికి సమీపంలో ఈ అశోక వృక్షాలు ఉన్నాయి.
ఈ అశోక వృక్షాలు ఆలయానికి సమీపంలోని నది వద్ద సీతను హనుమంతుడు కలుసుకున్నట్లు చెప్పే ప్రదేశంలో కనిపిస్తాయి.
అలాగే, ఈ ఆలయ పరిసరాల్లో చాలా కోతులు పెద్ద సంఖ్యలో తిరుగుతుంటాయని, అవి హనుమంతుని అవతారమని భక్తులు విశ్వసిస్తారు.

ఆలయంలో సీత, రామ, లక్ష్మణ విగ్రహాలు
ఆలయ మూలస్థానంలో రాముడు, సీత, లక్ష్మణ విగ్రహాలు ఉన్నాయి. అలాగే, ఇక్కడ వినాయకుడు, హనుమంతుడు మొదలైన విగ్రహాలు కూడా కనిపిస్తాయి.
రామ, సీత, లక్ష్మణుల స్వయంభు విగ్రహాలు ఇక్కడ బయటపడినట్లు ఆలయ పూజారి సుదర్శన శర్మ తెలిపారు.
''నేను సీతను చూశాను, అని రామాయణంలో ఒక శ్లోకం చెబుతుంది. అంటే, సీతను ఆంజనేయుడు మొదటిసారి చూసిన ప్రదేశం ఇదేనని అంటున్నారు. అశోక వనంలో ఉన్న సీత కోసం హనుమంతుడు వెతుకుతుండగా ఇక్కడే మొదటిసారి సీతను చూశారు. అందుకే సీతను తొలిసారిగా దర్శించిన ప్రాంతంగా కూడా 'కందెన్' ప్రసిద్ధి చెందింది’’ అన్నారు.
అలాగే " ఇక్కడ హనుమంతుడి పాదముద్ర ఉంది. సీతను దర్శించిన హనుమంతుడు తన విశ్వరూపాన్ని చూపించిన ప్రదేశం ఇదేనని, అందుకే విశ్వరూప పాదం ఇక్కడ ఉందని చెబుతారు" అని సుదర్శన శర్మ తెలిపారు.
పవిత్ర గంగానది
"ఈ గంగ ఉన్న ప్రదేశాన్ని పవిత్ర ప్రదేశంగా పిలుస్తారు. ఆమె ఈ గంగలో స్నానం చేసి ఉండొచ్చని చెబుతారు. అందుకే ఈ నదిని కూడా నేటికీ సీతాదేవి పేరుతో పిలుస్తారు. ఈ గంగను 'సీతా పవిత్ర గంగ' అని పిలుస్తారు" అని ఆలయ పూజారి చెప్పారు.

అశోక వృక్షాలు
‘‘సీతాదేవి ఇక్కడ ఉందనేందుకు ఇక్కడి అశోక వృక్షాలు ఇప్పటికీ నిదర్శనంగా నిలుస్తున్నాయి. అది చాలా గొప్ప విజయం”అని ఆయన చెప్పారు.
మూల విరాట్టులు
''అశోక వనంలోని ఈ విగ్రహాలన్నింటినీ స్వయంభు విగ్రహాలుగా గుర్తించారు. స్వయంభు అంటే వాటంతట అవే వెలసినవి. రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలను స్వయంభు విగ్రహాలుగా చెబుతారు.
ఇతర దేవాలయాలలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. కానీ, మా ఆలయంలో రెండు మూర్తులున్నాయి. ఒకటి ప్రతిష్ఠా మూర్తి, మరోటి స్వయంభు విగ్రహం'' అని ఆలయ పూజారి సుదర్శన శర్మ తెలిపారు.

భారత్ నుంచి పెరిగిన యాత్రికులు
సీతాదేవి ఆలయానికి స్వదేశీ భక్తులే కాకుండా విదేశీ భక్తులు కూడా ఎక్కువగా వస్తుంటారు. ఈ ఆలయాన్ని భారతీయులు ఎక్కువగా సందర్శిస్తారు.
ఉత్తర భారతదేశం నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.
ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయం గురించి తమ అభిప్రాయాలను బీబీసీ తమిళ్‌తో పంచుకున్నారు.
''రాముడు, సీత, హనుమంతుడి గురించి చాలా విన్నాం. రామాయణం, అందులో సుందర కాండని చదువుకున్నాం. శ్రీలంక వెళ్లి అశోక వనాన్ని సందర్శించాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. ఇప్పుడు ఆ కల నెరవేరింది'' అన్నారు.
"ఇప్పుడే అశోకవనాన్ని చూశాను. ఇక్కడ చాలా మంచి 'పాజిటివ్ ఎనర్జీ' వచ్చింది. ఇక్కడికి వచ్చి అరగంటపైనే అయింది. కానీ, ఇక్కడి నుంచి వెళ్లాలని అనిపించట్లేదు. హనుమంతుని పాదాలకు నమస్కరించాం. కళ్లలో నీళ్లు తిరిగాయి. రాముడు, సీత, హనుమంతుడిని దర్శించుకున్నాం" భారత్‌కు చెందిన రోను మహత్త అన్నారు.
''మేం అశోకవనాన్ని సందర్శించేందుకు వచ్చాం. రాముడి కోసం సీత ఏడాది పాటు ఎదురుచూసిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని సందర్శించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. సీతాదేవి మమ్మల్ని అనుగ్రహించినట్లు భావిస్తున్నాం. ఆమె రాక్షసుల మధ్య అడవిలో ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని మహిళలకు ఆదర్శంగా నిలిచింది" అని ఆలయాన్ని సందర్శించిన విజయవాడకు చెందిన భక్తుడు మదన్ కుమార్ బీబీసీ తమిళ్‌తో చెప్పారు.
"ఎన్ని కష్టాలు ఎదురైనా సీతాదేవిలా ధైర్యంగా ఉండి జీవితంలో ముందుకెళ్లాలి. అంతదూరం నుంచి హనుమంతుడు ఇక్కడికి వచ్చి సీత పరిస్థితి గురించి రాముడికి తెలియజేసిన ఈ ప్రదేశాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నాం" అని ఆయన అన్నారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగాధర్ సీతాదేవి ఆలయం గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
‘‘అశోక వనంలో సీత ఉన్న ప్రదేశంలో ఆలయం నిర్మించారు. ఇక్కడే హనుమంతుడు సీతను కలుసుకుని రాముడికి ఆమె సందేశాన్ని తీసుకెళ్లారు. ఇక్కడి నది సీతాదేవి స్నానం చేసిన నది. అందులో నీరు చాలా చల్లగా ఉంది. ఈ చోటు అద్భుతంగా ఉంది" అని ఆయన అన్నారు.

సీతాదేవి ఆలయం నుంచి అయోధ్యకు శిల
ఇక్కడి సీతాదేవి ఆలయం నుంచి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరానికి ఓ శిలను పంపారు. పార్లమెంట్ సభ్యులు, సీతాదేవి ఆలయ హెడ్ వి.రాధాకృష్ణన్ కొలంబోలోని భారత హైకమిషన్ ద్వారా ఈ శిలను అయోధ్యకు పంపించారు.
ఎంపీ రాధాకృష్ణన్ ఈ శిలను 2021 మార్చి 18న భారత హైకమిషనర్‌కి అందజేశారు. రామాయణ చరిత్రలో భారత్, శ్రీలంక భాగమని, అందుకే శ్రీలంక నుంచి ఒక శిలను అయోధ్య రామాలయానికి పంపినట్లు వి.రాధాకృష్ణన్ చెప్పారు.
భారత ప్రభుత్వ సహకారంతో సీతాదేవి ఆలయ పునర్నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
''ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రామాయణంలోని సుందర కాండలో ఈ ప్రదేశానికి ప్రాముఖ్యత ఉంది. ఏప్రిల్ 17న ఆలయ కుంభాభిషేకం జరగనుంది. శ్రీరామ నవమి రోజున కుంభాభిషేకం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఇటీవల ప్రారంభించిన ఆలయానికి ఇక్కడి నుంచి శిలలు వెళ్లాయి.
ప్రాముఖ్యం కలిగిన దేవాలయం కావడంతో భారతీయులు ఎక్కువగా వస్తున్నారు. అలాగే, ఆలయ కుంబాభిషేకానికి రావాల్సిందిగా భారత ప్రధానికి ఆహ్వానం వెళ్లింది'' అని సీతాదేవి ఆలయ హెడ్ రాధాకృష్ణన్ తెలిపారు.

హిస్టరీ ప్రొఫెసర్ల వాదనేంటి?
సీతను అశోక వనంలో నిర్బంధించినట్లుగా నువారా ఎలియాలోని ఈ ప్రదేశం గురించి చెబుతున్నప్పటికీ పురావస్తు శాఖ ఇంతవరకూ దానిని ధ్రువీకరించలేదని శ్రీలంకకు చెందిన హిస్టరీ ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు.
పురాణాల ఆధారంగా ఈ ప్రదేశంలో సీతాదేవిని నిర్బంధించి ఉండొచ్చని నమ్ముతున్నారని, అయితే రామాయణంలో శ్రీలంకలో జరిగినట్లు చెబుతున్న సంఘటనలకు పురావస్తు ఆధారాలు లేవని వారు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం:ధోనీ హెలీకాప్టర్ షాట్లను పరిచయం చేసిన ఈ స్టేడియం పిచ్ బ్యాటర్ల పాలిట స్వర్గమా?
- 7 వేల మంది మిస్సింగ్, 50 మందే అంటున్న తాత్కాలిక ప్రధాని.. వారంతా ఏమైనట్లు?'
- పిల్లలు పుట్టాక కూడా ప్రెగ్నెన్సీకి ముందున్న శరీరాకృతి పొందడం ఎలా? మహిళలపై ఇలాంటి ఒత్తిడి ఎందుకు?
- రూ.33 వేల కోట్లు పెట్టి అమెరికా నుంచి ఈ డ్రోన్లను భారత్ ఎందుకు కొంటోంది? వీటిని ఎక్కడ వాడతారు?
- మోదీని ఎదుర్కోవడానికి ఏర్పాటైన 'ఇండియా' కూటమికి అసలు సమస్య కాంగ్రెస్సేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















