మాల్దీవులు: భారత సైన్యం విషయంలో ముయిజ్జు మెతక వైఖరి భారత్‌ సాధించిన దౌత్య విజయమా

మొహమ్మద్ ముయిజ్జు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆదర్శ్ రాఠౌర్
    • హోదా, బీబీసీ కోసం

మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సోమవారం తొలిసారిగా దేశ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ భారత్ పేరును ప్రస్తావించారు.

‘‘మేం విదేశీ సేనను దేశం నుంచి తరిమేస్తామని, దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించే ఎలాంటి ఒప్పందాలను చేసుకోమనే నమ్మకంతో చాలా మంది మాకు ఓటు వేసినట్లుగా నేను నమ్ముతున్నా’’ అని ముయిజ్జు అన్నారు.

భారతీయ సైన్యాన్ని మాల్దీవుల నుంచి తొలగించడం గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘మేం మాల్దీవుల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారత్‌ను అధికారికంగా కోరాం. ఇప్పటివరకు జరిగిన చర్చల ప్రకారం, మూడు ఏవియేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకదాని నుంచి సైన్యాన్ని 2024 మార్చి 10 సరికి ఉపసంహరిస్తారు. మిగతా రెండు ప్లాట్‌ఫారమ్‌లలోని సైన్యాన్ని 2024 మే 10లోగా ఉపసంహరిస్తారు’’ అని చెప్పారు.

దీనికంటే ముందు ఫిబ్రవరి 2న దిల్లీలో భారత్, మాల్దీవులకు చెందిన ఉన్నత స్థాయి కోర్ గ్రూప్ రెండో సమావేశం జరిగింది.

మొహమ్మద్ ముయిజ్జు

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

ఫొటో క్యాప్షన్, మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ

ఈ సమావేశం తర్వాత ముయిజ్జు ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో రెండు పక్షాలు సైనికులను రీప్లేస్ చేయడానికి అంగీకరించినట్లు పేర్కొంది.

నివేదికల ప్రకారం, ఈ భారత సైనికుల స్థానంలో సివిల్ ఆపరేటర్లు లేదా మాజీ సైనికులను మోహరించవచ్చు.

భారత సైన్యం అసలే వద్దు అన్న మొయిజ్జు దీనికి అంగీకరించడం మాల్దీవుల వైఖరిలో వచ్చిన మార్పుగా చెప్పొచ్చని, భారత్ సాధించిన దౌత్య విజయంగానూ చూడొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

జాతీయ ప్రయోజనాల పరంగా ఇది మంచి ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

సంబంధాలు పరిమితికి మించి క్షీణించకుండా ఉండాలంటే మాల్దీవులు ఇలా చేయాల్సిన అవసరం ఉందని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ చైనీస్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ అరవింద్ యెల్లేరి అన్నారు.

భారత సైన్యం ఉపసంహరణ విషయంలో తొలుత మొండిగా ఉన్న మాల్దీవులు, ఇప్పుడు అక్కడ సైన్యంలో క్రియాశీలంగా లేని వ్యక్తుల మోహరింపునకు అంగీకరించడం చాలా పెద్ద విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.

మోదీ

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

‘‘సైన్యంలో పనిచేస్తున్నవారిని మోహరిస్తే ఆందోళన ఉండటం సహజమే. రిటైర్డ్ అధికారులు, కోస్ట్‌గార్డ్ లేదా ఇతర పారామిలిటరీ బలగాల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే, ఇలాంటి ఏర్పాటుకు అంగీకరించడం మాల్దీవుల దృఢత్వానికి సంకేతం. ఇది ఒక విధంగా, ఈ క్షేత్రంలో భారత ప్రయోజనాలను పూర్తిగా తిరస్కరించలేమని మాల్దీవులు అంగీకరించినట్లు అర్థం’’ అని ఆయన చెప్పారు.

మాల్దీవుల వైఖరిలో వచ్చిన ఈ మార్పు, మాల్దీవుల అంతర్గత రాజనీతి, హిందూ మహా సముద్రంలో భారత స్థితిని ప్రతిబింబిస్తుందని అరవింద్ యెల్లేరి అన్నారు.

‘‘మేం మీ దేశ విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదు, సంబంధాలను ఏ రకంగానూ ఉద్రిక్తంగా మార్చాలనుకోవట్లేదు అనే ధోరణిని భారత్ కొనసాగించింది. భారత్ ప్రాధాన్యాన్ని మాల్దీవులు అర్థం చేసుకుంది. ఇందులో చైనా కోణాన్ని కూడా విస్మరించలేం.

భారత్‌తో చైనా పోటీపడుతోంది. కానీ, భారత్‌ విషయానికొచ్చేసరికి హద్దుల్లో ఉంటుంది. హిందూ మహాసముద్రం లేదా మరెక్కడైనా చైనాకు సవాళ్లు పెరిగే విధంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించకూడదని చైనా కోరుకుంటుంది.

రెండు మూడు నెలలుగా భారత్ మంచి వైఖరిని కొనసాగించింది. దీంతో భారత్‌కు మంచి ఇమేజ్ ఏర్పడింది. మాల్దీవుల దూకుడు వైఖరి కారణంగా చైనాపై వ్యతిరేకత కూడా పెరుగుతోందని చైనా గుర్తించింది. మాల్దీవుల తాజా వైఖరి విషయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి’’ అని ఆయన వివరించారు.

మాల్దీవులు

ఫొటో సోర్స్, Getty Images

భారత సైనికులను ముయిజ్జు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా భారతీయ సైనికులు ఉన్నారు. వీరిని వెనక్కి పంపాలని ముయిజ్జూ అనుకుంటున్నారు. మాల్దీవుల్లో 88 మంది భారతీయ సైనికులు ఉన్నారని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

నిజానికి, మాల్దీవులకు 2010, 2013లలో రెండు హెలికాప్టర్లను, 2020లో ఒక చిన్న విమానాన్ని భారత్ బహుమతిగా ఇచ్చింది.

వీటిని సహాయక చర్యలు, వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాలని భారత్ చెప్పింది.

ఈ హెలికాప్టర్లు, విమానాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం దాదాపు 75 మంది భారతీయ సైనికులు మాల్దీవుల్లో ఉన్నట్లు 2021లో మాల్దీవుల భద్రతా బలగాలు చెప్పాయి.

అప్పటినుంచి అక్కడి విపక్షాలు మాల్దీవుల్లో భారత సైనికులు ఉండటంపై ప్రశ్నలు వినిపిస్తుంటాయి.

మొమమ్మద్ ముయిజ్జు కూడా 2023 ఎన్నికల సందర్భంగా ‘ఇండియా అవుట్’ నినాదాన్ని ఇచ్చారు.

మాల్దీవుల్లో భారత సైనికులు ఉండాల్సిన అవసరం లేదని, భారత సైన్యం ఉండటం దేశ సార్వభౌమత్వానికి ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముయిజ్జూ ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు. మార్చి 15 నాటికి దేశం నుంచి వెళ్లిపోవాలని భారతీయ సైనికులకు ముయిజ్జూ అల్టిమేటం ఇచ్చారు.

ఆదిత్య శివమూర్తి

ఫొటో సోర్స్, Aditya Shivamurthy

ఫొటో క్యాప్షన్, అబ్జర్వర్ రీజెర్చ్ ఫౌండేషన్ అసోసియేట్ ఫెలో ఆదిత్య శివమూర్తి

అంతర్గత రాజకీయాలు

మాల్దీవుల్లో ఉన్న భారతీయ సైన్యం ఉపసంహరణ కోసం రెండు దేశాలు ఒక ఒప్పందానికి అంగీకారం తెలిపిన రోజే, తమ సార్వభౌమత్వాన్ని భారత రక్షణ దళం ఉల్లంఘించిందని మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపణలు చేసింది.

భారత కోస్ట్‌గార్డ్‌కు చెందిన జవాన్లు మాల్దీవుల సముద్ర జలాల్లో చేపలు పడుతోన్న మూడు పడవల్లోకి చొరబడి అంతర్జాతీయ సముద్ర నియమ నిబంధనల్ని ఉల్లంఘించారని మాల్దీవులు ఆరోపించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

మాల్దీవుల నౌకలను విచారించడానికి భారత కోస్ట్‌గార్డ్‌కు చెందిన 246, 254 ఓడల్ని ఉపయోగించారని మాల్దీవులు విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ విషయంపై భారత్ నుంచి స్పందన కోరినట్లు పేర్కొంటూ మాల్దీవులు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన జారీ చేసింది.

భారతీయ కోస్ట్ గార్డ్ ఈ విషయంలో ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు.

మాల్దీవుల దూకుడు వైఖరి వెనుక అంతర్గత రాజకీయం ఉందని నిపుణులు నమ్ముతున్నారు.

ముయిజ్జూ ప్రభుత్వ విదేశీ విధానాన్ని దేశ రాజకీయాల నుంచి వేరుగా చూడలేమని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్‌ఎఫ్) అసోసియేట్ ఫెలో ఆదిత్య శివమూర్తి అన్నారు.

మాల్దీవులు

ఫొటో సోర్స్, ANI

‘‘ఇండియా అవుట్ ప్రచారం చేసి ముయిజ్జూ అధికారంలోకి వచ్చారు. ఆయన పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేదు. భారత్ వ్యతిరేకతను ఒక సమస్యగా చూపిస్తూ మళ్లీ ఎన్నికల్లో గెలవొచ్చని ఆయనకు తెలుసు. భారత్ గతంలోనూ తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని ఇప్పుడు కూడా అలాగే చేస్తోందని తమ ఓటర్లకు సందేశం ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు’’ అని ఆదిత్య చెప్పారు.

ముయిజ్జూ ప్రభుత్వ దూకుడు వైఖరి వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు ప్రొఫెసర్ సంజయ్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.

‘‘పొరుగు దేశాల మధ్య పరస్పర అవగాహన, నమ్మకం మీద ఆధారపడి మాల్దీవుల్లో భారత బలగాల్ని ఏర్పాటు చేశారు. కానీ భారత్, మాల్దీవుల మధ్య ఈ నమ్మకం దెబ్బతింటోంది. ఎందుకంటే మాల్దీవుల దేశీయ రాజకీయాలు అంతర్గత సంబంధాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

దేశంలో భారతీయ సైనికులు లేకుండా చేస్తామని ఎన్నికల సందర్భంగా ముయిజ్జూ వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం ఆయన ఇలా చేయాల్సి ఉంటుంది’’ అని సంజయ్ భరద్వాజ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, భారత్ వ్యూహాలకు మాల్దీవులు వెనక్కు తగ్గిందా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)