అమెరికా ప్రతీకార దాడులపై ఇరాన్, ఇరాక్ ఎలా స్పందించాయి?

అమెరికా సైన్యం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అమెరికా దాడుల నేపథ్యంలో బైడెన్ ప్రకటన విడుదల చేశారు.
    • రచయిత, జార్జ్ రైట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సిరియా, ఇరాక్‌లలో అమెరికా జరిపిన దాడులను 'వ్యూహాత్మక తప్పిదం'గా ఇరాన్ అభివర్ణించింది.

ఇరాన్ మద్దతున్న మిలీషియా గ్రూపులకు చెందిన అనేక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 2న అమెరికా దాడులు చేసింది.

జనవరి 28న జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరం 'టవర్ 22'పై డ్రోన్ దాడి జరిగింది, ఇందులో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు. దీనికి ప్రతీకారంగా అమెరికా ఈ దాడులు జరిపింది.

జోర్డాన్‌లో తమ స్థావరంపై డ్రోన్ దాడికి ఇరాన్-మద్దతుగల మిలీషియా గ్రూపును బాధ్యులుగా పేర్కొంది అమెరికా.

అయితే, సిరియా, ఇరాక్‌లపై దాడులు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను, అస్థిరతను పెంచడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడవని ఇరాక్ విదేశీ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది.

అంతకుముందు, అమెరికా దాడులు ఈ ప్రాంతానికి 'వినాశకరమైన పరిణామాలకు' దారి తీస్తాయని ఇరాక్ కూడా చెప్పింది.

అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడులు జరిగిన వారం తర్వాత అమెరికా ప్రతీకార దాడులకు ఉపక్రమించింది.

అమెరికా దాడులు దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడంగా ఇరాక్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో అభివర్ణించింది. ఈ దాడులు ఇరాక్, దాని పరిసర ప్రాంతాల భద్రతపై ప్రభావం చూపుతాయని చెప్పింది.

అమెరికా దాడుల్లో పౌరులు సహా కనీసం 16 మంది మరణించారని ఇరాక్ అధికారులు తెలిపారు.

మరోవైపు- తమ ప్రాంతాల్లో అమెరికా 'ఆక్రమణ'ను అడ్డుకుంటామని సిరియా పేర్కొంది.

ఫిబ్రవరి 2న అమెరికా తన సూపర్‌సోనిక్ బాంబర్లతో సిరియాలోని నాలుగు స్థావరాలపై, 85 టార్గెట్‌లపై దాడి చేసింది. ఇరాక్‌లోని మూడు స్థావరాలపై దాడి చేసింది.

అమెరికా ఆర్మీ ప్రకటన ప్రకారం, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జిసి) కుర్ద్స్ ఫోర్స్, ఇరాక్, సిరియాలోని దాని అనుబంధ మిలీషియా గ్రూపులపై దాడులు జరిగాయి.

ఇరాన్ గడ్డపై ఎలాంటి దాడీ జరగలేదు.

అమెరికా, బ్రిటన్‌ యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై మూడోసారి బాంబు దాడి చేశాయి.

పెంటగాన్

ఫొటో సోర్స్, PLANET LABS/AP

'మరిన్ని దాడులు జరుగుతాయి': బైడెన్

తాము ఎంచుకున్న స్థావరాలపై మరిన్ని దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

‘‘పశ్చిమాసియాలో లేదా ప్రపంచంలో మరెక్కడైనా ఉద్రిక్తతలను పెంచాలన్నది మా ఉద్దేశం కాదు’’ అని ఆయన స్పష్టం చేశారు.

తమ సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఉపయోగించిన డ్రోన్ ఇరాన్‌లో తయారైందని, అది రష్యాకు సరఫరా చేసిన డ్రోన్‌ల తరహాలోనే ఉందని అమెరికా అధికారులు చెప్పారు.

మిలీషియా గ్రూపులకు ఐఆర్‌జీసీ ఆయుధాలు, నిధులు, శిక్షణను అందజేస్తోందని అమెరికా భావిస్తోంది.

అయితే, అమెరికా సైనిక స్థావరంపై దాడిలో తమ పాత్ర లేదని ఇరాన్ అన్నది.

ఇరాక్, సిరియా, యెమెన్‌లపై అమెరికా దాడి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సహకరించడానికే జరిగిందని ఇరాన్ విదేశీ వ్యవహారాలశాఖ ప్రతినిధి చెప్పారు.

సిరియా, ఇరాక్‌లపై అమెరికా దాడుల కారణంగా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లినందున భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని తాము కోరినట్లు ఐక్యరాజ్యసమితిలోని మాస్కో దౌత్యవేత్త డిమిత్రి పోలియన్‌స్కీ సోషల్ మీడియాలో తెలిపారు.

రష్యా కౌన్సిల్‌లో శాశ్వత సభ్యదేశం కాగా, ఇరాన్ దానికి సన్నిహిత దేశంగా చెబుతారు.

హూతీ రెబల్స్

ఫొటో సోర్స్, REUTERS/KHALED ABDULLAH

ఫొటో క్యాప్షన్, వాణిజ్య నౌకలపై హూతీల దాడులతో ఎర్ర సముద్రంలో ఉద్రికత్తలు పెరిగాయి.

ప్రతీకార దాడులు చేస్తామన్న హూతీ తిరుగుబాటుదారులు

ఇరాక్, సిరియాల్లోని ఇరాన్‌ మద్దతుగల మిలీషియా గ్రూపులు అమెరికా స్థావరాలపై దాడి చేసిన 24 గంటల్లో అమెరికా, బ్రిటన్‌ యెమెన్‌లలోని 13 ప్రదేశాల్లో 36 లక్ష్యాలపై దాడులు జరిపాయి.

ఎర్ర సముద్రంలో హూతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయి.

ఇరాన్ మద్దతుగల, ఆర్థిక సహాయం పొందుతున్న హూతీ తిరుగుబాటుదారులు ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు. వీరు 2023 నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు.

ఏటా ప్రపంచ వాణిజ్యంలో 15% (సుమారు $1 ట్రిలియన్) ఎర్ర సముద్రం గుండా సాగుతుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)