అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: యూఎస్ దళాలు ప్రతిదాడులు చేయడానికి వారం వరకు ఎందుకు ఆగాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెర్డ్న్ డెబుస్‌మాన్ జూనియర్ & కల్యా ఎప్‌స్టీన్
- హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్, న్యూయార్క్
ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు జోర్డాన్‌లో జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మరణించిన వారం తరువాత అమెరికా ప్రతిదాడులు ప్రారంభించింది.
తమ సైనికుల మరణం తరువాత అమెరికా వెంటనే స్పందించకపోవడంపై విమర్శలు మొదలయ్యాయి. బైడెన్ ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంది.
అయితే, అందుకు కారణముందని విదేశాంగ విధాన నిపుణులు అంటున్నారు. ఇరాన్ సిబ్బందిని పంపేందుకు, భవిష్యత్తుల్లో ఇరాన్-అమెరికాల మధ్య తలెత్తే సంఘర్షణలో అమెరికాపై ఒత్తిని తగ్గించుకునేలా వ్యూహం సిద్ధం చేసుకునేందుకు ఆ సమయం పట్టినట్లుగా భావిస్తున్నారు.
“ఇరాన్‌ను ఇరుకున పెట్టే వ్యూహంతో అమెరికా దళాలపై దాడి చేసిన ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ల సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నం జరిగింది. తీవ్రతను తగ్గించడంలో ఇది ఓ ప్రయత్నం. ఎందుకంటే, అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష యుద్ధాన్ని నివారించడమే అంతిమ లక్ష్యం” అన్నారు డిఫెన్స్ ఫర్ ది మిడిల్ ఈస్ట్ మాజీ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ మిక్ ముల్రోయ్.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ప్రతీకార దాడులు ప్రారంభించాక, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కుడ్స్ ఫోర్స్, ఇరాక్, సిరియాల్లోని అనుబంధ మిలటరీ సంస్థలకు చెందిన ఏడు ప్రదేశాల్లో దాడులు చేసింది. అమెరికా డిఫెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాంబర్లు 85 వ్యక్తిగత స్థావరాలపై దాడులు చేశారు.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్, మాకు హాని తలపెట్టాలనుకునే వారికిదే చెప్తున్నాం. మీరు ఒక్క అమెరికా పౌరుడికి హాని కలిగించినా, మేం ప్రతిస్పందిస్తాం అన్నారు.
జోర్డాన్‌లో జరిగిన దాడికి ఇరాన్ మద్దతు ఉన్న ది ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ మిలిటెంట్ సంస్థ కారణమని అమెరికా అధికారులు ఆరోపించారు.
ఆ సంస్థ పలు మిలిటెంట్ సంస్థలకు మద్దతుగా నిలుస్తోందని, ఈ సంస్థల మనుగడ, ఆయుధాలు, నిర్వహణకు ఇరాన్ నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆరోపణలు చేస్తోంది.
జోర్డాన్‌లో జరిగిన డ్రోన్ దాడుల పట్ల అమెరికా చేసిన ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది.
ప్రతికూల వాతావరణం కారణంగా, ప్రతీకార దాడులు చేపట్టడంలో ఆలస్యం జరిగిందని, శుక్రవారం పరిస్థితులు అనుకూలించడంతో దాడులు ప్రారంభించామని రక్షణ, భద్రతా అధికారులు వెల్లడించారు.
అయితే, వైట్ హౌస్, పెంటగాన్‌లు పదేపదే తామెలాంటి టెలిగ్రాఫింగ్ ఆపరేషన్లను అమలుచేయడం లేదని చెప్పినప్పటికీ, నిపుణులు మాత్రం ఇరాన్‌తో విస్తృతస్థాయిలో యుద్ధాన్ని
నివారించాలని అమెరికా ప్రయత్నించిందని అంటున్నారు.

ఫొటో సోర్స్, US Central Command via X/Reuters
అమెరికా ఎందుకు ఆలస్యం చేసింది?
అరేబియన్ గల్ఫ్ స్టేట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు హుస్సేన్ ఐబిష్, ఇరాన్‌లో దాడులు చేయడానికి వారు ఇష్టపడటం లేదు. అందుకే ప్రతిస్పందన ఆలస్యమైంది అన్నారు.
ముల్రోయ్ మాట్లాడుతూ, "అమెరికా దాడులు చేయబోయే ప్రదేశాల్లో ఉండే, ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సైనికులు అక్కడి నుంచి వెళ్లేందుకు అమెరికా సమయం ఇచ్చి ఉండొచ్చు" అని అన్నారు.
ఇరాన్ లాంటి దేశంతో వ్యవహరించే పరిస్థితుల్లో అమెరికా వ్యూహాత్మంగా కదలాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
"టెలీగ్రాఫింగ్ దాడులతో అమెరికా 'గోల్గిలాక్స్' విధానాన్ని అనుసరిస్తోంది. అంటే 'తీవ్రతను మరీ పెంచకుండా, అలాగని తగ్గించకుండా వ్యవహరించడం'" అన్నారు బ్రాడ్లీ బోమెన్. ఆయన వాషింగ్టన్‌లోని డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీకి చెందిన సెంటర్ ఫర్ మిలటరీ అండ్ పొలిటికల్ పవర్ విభాగపు సీనియర్ డైరెక్టర్.
బైడెన్ అనుసరిస్తున్న విధానం నుంచి చూసినప్పుడు, ఇలాంటి దాడులు శత్రువులకు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి దాడులకు వెనకాడతారు. ఒకవేళ దూకుడుగా వ్యవహరిస్తే పరిస్థితి మారి, ప్రాంతీయ యుద్ధానికి దారితీయొచ్చు.
నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ శుక్రవారం మాట్లాడుతూ, అమెరికా టెలిగ్రాఫ్ ఆపరేషన్లకు భవిష్యత్తులో ఆస్కారం ఇవ్వదని, రానున్న రోజుల్లో అదనపు చర్యలు తీసుకుంటామని అన్నారు.
అయితే, బైడెన్ ప్రభుత్వం ప్రతిపక్ష రిపబ్లికన్ కాంగ్రెస్ నుంచి మాత్రం తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది.
రిపబ్లికన్ కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకులు, స్పీకర్ మైక్ జాన్సన్ మాట్లాడుతూ, మితిమీరిన సిగ్నలింగ్ వ్యవహారాలు, నెలల తరబడి సాగే చర్చల ఫలితంగా దాడులకు నిర్ణయాత్మకపు ముగింపు పలికే సామర్థ్యం తగ్గిపోతుందని అన్నారు.
అయితే, ఐబిష్ , బైడెన్ ప్రభుత్వం ప్రతిపక్షం విమర్శల నుంచి తప్పించుకునేందుకు ప్రతీకార దాడుల విషయంలో వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
"ఒకవేళ బైడెన్ ప్రభుత్వం ఇరాన్‌లో దాడులు కొనసాగిస్తే, డొనాల్డ్ ట్రంప్ ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారు. బైడెన్ యుద్ధకాంక్షతో ప్రవర్తిస్తోన్నాడని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తారు. కానీ, అదొక రాజకీయ వ్యూహం. అందరూ ఎదుర్కోవల్సిందే, అయితే, బైడెన్ ప్రభుత్వం మరోలా వ్యవహరిస్తోంది" అన్నారు ఐబిష్.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం:ధోనీ హెలీకాప్టర్ షాట్లను పరిచయం చేసిన ఈ స్టేడియం పిచ్ బ్యాటర్ల పాలిట స్వర్గమా?
- అయోధ్య: సెక్యులరిజం గీత చెరిగి పోతోందా, లౌకికవాదంపై రాజ్యాంగం, కోర్టులు ఏం చెప్పాయి..
- కుమారీ ఫుడ్ కోర్టు: తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింత చర్చ, రేవంత్ రెడ్డి జోక్యం చేసుకునే వరకు ఎందుకు వెళ్లింది?
- రజినీకాంత్‌ను ‘సంఘీ’ అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, తమిళనాడులో జరుగుతున్న రగడ ఏంటి?
- రూ.40 లక్షల ఇన్సూరెన్స్ కోసం శ్మశానం నుంచి శవాన్ని తెచ్చి ఎలా దొరికి పోయాడంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















