గ్రేట్‌ వాల్ ఆఫ్ చైనా: 5 అపోహలు, అసలు నిజాలు

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా

ఫొటో సోర్స్, GETTY IMAGES

‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ గురించి చాలామందికి తెలుసు. ఉత్తర చైనాలో నిర్మించిన పురాతన గోడలు, కోటల సమాహారమే ఈ కట్టడం. 500 ఏళ్ల కిందట దీన్ని నిర్మించారు.

మొదట్లో దీని పొడవు సుమారు 2,400 కి.మీల నుంచి 8,000 కి.మీల మధ్య ఉంటుందని అంచనా వేశారు. కానీ, 2012లో చైనా ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక వారసత్వ విభాగం చేపట్టిన పురావస్తు శాస్త్ర అధ్యయనంలో ఈ గోడ పొడవు దాని కంటే చాలా ఎక్కువని, అంటే 21 వేల కి.మీల పైనే ఉంటుందని తేలింది.

ప్రపంచంలో ఎక్కువమంది చర్చించిన కట్టడంగా దీనికి పేరుంది. అందుకే దీనికి సంబంధించి తప్పుడు సమాచారం కూడా సర్క్యులేట్ అవుతూ వస్తోంది.

‘ది గ్రేట్ వాల్’ అనే పుస్తకాన్ని రచించిన జాన్ మాన్ సాయంతో ఈ అద్భుత కట్టడం గురించి ఉన్న కొన్ని అపోహలను మీతో పంచుకుంటున్నాం. అవేంటో చూద్దాం...

చంద్రుని నుంచి దీన్ని చూడలేం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంద్రుని నుంచి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చూడలేం

అపోహ 1. చంద్రుడి నుంచి చూస్తే కనిపిస్తుంది

‘‘బిలీవ్ ఇట్ ఆర్ నాట్!” అనే యానిమేటెడ్ సినిమాతో తన తలరాతను మార్చేసుకున్న అమెరికన్ చిత్రకారుడు లీరాయ్ రాబర్ట్ రిప్లీ... గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను మనిషి చేపట్టిన అత్యంత శక్తిమంతమైన కట్టడంగా అభివర్ణించారు.

చంద్రుడి నుంచి మనుషులు చూడగలిగే ఏకైక కట్టడం ఇదన్నారు. కానీ, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు.

చైనాకు చెందిన ప్రముఖ సైనాలజిస్ట్ (చరిత్ర, భాష, సంస్కృతిపై అధ్యయనం చేసే వ్యక్తి), ‘సైన్స్ అండ్ సివిలైజేషన్ ఇన్ చైనా’ రచయిత జోసెఫ్ నీధమ్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఖగోళ శాస్త్రజ్ఞులు అంతరిక్షం నుంచి గుర్తించగలిగే ఒకే ఒక్క మానవ నిర్మితం ఈ గోడ అని చెప్పారు.

ఈ విషయాన్ని వ్యోమగాములు కొట్టివేసినప్పటికీ, ఇప్పటికీ చంద్రుని నుంచి చూడగలిగే కట్టడం ఇదని చాలా మంది నమ్ముతూ ఉన్నారు.

2003లో చైనా తొలి అంతరిక్ష విమానాన్ని ఆకాశంలోకి పంపినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంతరిక్షం నుంచి తాము ఏమీ చూడలేకపోయామని ఖగోళ శాస్త్రజ్ఞుడు యాంగ్ లివే చెప్పారు.

లక్షల మంది పర్యాటకులు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శిస్తారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, లక్షల మంది పర్యాటకులు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శిస్తారు

అపోహ 2: ఇది ఒకటే గోడ

ఇది ఒకటే గోడ కాదు. చాలా గోడల కలయిక. వీటిలో చాలా విభాగాలున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే అద్భుతమైన నిర్మాణంతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ గోడలో ఎవరికీ కనిపించకుండా, దాచి ఉంచిన కొన్ని విభాగాలు శిథిలావస్థకు కూడా చేరుకున్నాయి. ఈ గోడపై నడుచుకుంటూ వెళ్లే వారికి వాటివైపు వెళ్లడం నిషేధం.

చాలా ప్రాంతాల్లో ఈ గోడలు రెండింతలు, మూడింతలు, కొన్నింటి దగ్గర నాలిగింతలు ఎక్కువ వెడల్పులో ఉంటాయి. ఈ విభాగాలన్ని ఒకదానిపై ఒకటి ఓవర్‌ల్యాప్(విస్తరించి) అయి ఉంటాయి.

బీజింగ్‌లో మనకు కనిపించే కొన్ని భవనాలు చాలా పురాతనమైనవి. అందులో కొన్ని చైనా వాల్‌లో భాగంగా ఉంటాయి.

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా

అపోహ 3: గోడ లోపల శవాలు

గోడ లోపల కార్మికులను సమాధి చేసినట్లు చాలా రూమర్లు చక్కర్లు కొట్టాయి.

హన్ రాజవంశం కాలం నాటి ప్రముఖ చరిత్రకారుడు సిమా కియాన్ నుంచి ఈ కట్టు కథలు పుట్టుకొచ్చి ఉంటాయని చరిత్రకారులు నమ్ముతుంటారు.

ఈ చరిత్రకారుడి మాటలు ఎలా ఉన్నా, ఈ గోడ లోపల మాత్రం ఎక్కడా మనుషుల ఎముకలు కనిపించలేదు. దీనికి ఎలాంటి పురావస్తు లేదా రాతపూర్వక ఆధారాలు కూడా లేవు. ఇది పూర్తిగా అవాస్తవమని తేలింది.

చైనా గోడ

ఫొటో సోర్స్, GETTY IMAGES

అపోహ 4: మంగోలులను అడ్డుకోవడానికి కట్టారు

210 B.Cలో చనిపోయిన తొలి చక్రవర్తే ఈ గోడ కట్టడాన్ని ప్రారంభించారు. మంగోలులు 800 A.D. నుంచి మంగోలులు చరిత్రలో కనిపిస్తారు.

చైనీయులకు, మంగోలులకు మధ్య ఘర్షణ 14వ శతాబ్దం చివరి నుంచి మొదలైంది. మింగ్ వంశపాలకులు అప్పట్లో మంగోలులను చైనా నుంచి బహిష్కరించారు.

మార్కో పోలో

ఫొటో సోర్స్, Getty Images

అపోహ 5: మార్కో పోలో దీన్ని సందర్శించారు.

మార్కో పోలో ( వెనీస్‌కు చెందిన యాత్రికుడు,రచయిత, వర్తకుడు.) దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నది నిజం. ఆయన దీని గురించి చెప్పకపోవడంతో మార్కో పోలో ఎప్పుడూ చైనా వెళ్లలేదనే వాదన కూడా ఉంది.

మార్కోపోలో పలు‌సార్లు బీజింగ్ నుంచి కుబ్లా ఖాన్ ప్యాలస్‌ వరకు ప్రయాణించినప్పటికీ ఈ గోడను చూసేందుకు ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపించ లేదు.

కాబట్టి ఆయన ఈ గోడను సందర్శించారని చెప్పడం నమ్మదగినదిగా కనిపించదు.

13వ శతాబ్దం చివరి కాలంలో చైనాను మంగోలులు పాలించే వారు. జెంఘిజ్ ఖాన్ నేతృత్వంలో ఉత్తర చైనాపై దాడికి పాల్పడినప్పుడు ఈ గోడ ధ్వంసమైంది.

వీడియో క్యాప్షన్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిజంగా గ్రేట్ కాదా, 5 అపోహలివే....

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)