బీజేపీ 'వైట్ పేపర్' x కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్': ఆర్థిక వ్యవస్థ ఎవరి పాలనలో ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ ఇమాందార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ఆర్థిక పరిస్థితిపై ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పార్లమెంటులో పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఆర్థిక ప్రగతికి తామే బాటలు వేశామని ఎన్డీయే చెప్పుకుంటే, తమ హయాంలోని విధానాలే మెరుగైనవని కాంగ్రెస్ వాదించింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 మధ్య కాలంలో భారతదేశ ఆర్థిక స్ధితిగతులపై బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.
అందులో 2004 నుంచి 2014 మధ్య పాలనను ‘వినాశ్‌కాల్’గా, 2014 నుంచి 2023 వరకు సాగిన తమ పాలన కాలాన్ని ‘అమృత్‌కాల్’గా పేర్కొన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ పేపర్ ప్రకటించింది. ఇందులో, 2014 నుంచి 2024 మధ్య ఉన్న పదేళ్ల కాలాన్ని 'అన్యాయ్ కాల్'గా పేర్కొన్నారు.
ఈ రెండు పత్రాలు దాదాపు 50 నుంచి 60 పేజీలు ఉన్నాయి. బొమ్మలు, చార్టులతో వివరిస్తూ ఆరోపణలు, అనేక వాదలను వాటిలో పొందుపరిచారు. మీరు బీజేపీ విడుదల చేసిన శ్వేతపత్రాన్ని, యూపీఏ విడుదల చేసిన బ్లాక్ పేపర్‌ను ఇక్కడ చూడవచ్చు.

పదేళ్ల బీజేపీ పాలనలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్యాయాలను గురించి కాంగ్రెస్ పార్టీ తన బ్లాక్ పేపర్‌లో ప్రస్తావిస్తే, ఎన్డీయే ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం పదేళ్ల యూపీఏ ప్రభుత్వ పాలనలోని ఆర్థిక తప్పిదాలను మాత్రమే ఎత్తిచూపింది.
ఎకానమీ పరంగా ప్రధాని మోదీ హయాంలో దేశంలో భారీగా నిరుద్యోగం పెరగడం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని అర్ధాంతరంగా అమలు చేయడం, పేద-ధనికుల మధ్య అంతరాలు పెరిగిపోవడం, ప్రైవేట్ పెట్టుబడులు తగ్గిపోవడం వంటి వినాశకర నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో బ్యాంకుల్లో మొండి బకాయిల పెరుగుదల, లోటు బడ్జెట్‌ను అధిగమించలేకపోవడం, బొగ్గు దగ్గరి నుంచి 2జీ స్పెక్ట్రమ్ వరకూ వరుస కుంభకోణాలు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి ఆరోపణలు చేస్తోంది బీజేపీ. వాటి కారణంగా దేశంలో పెట్టుబడుల వేగం మందగించిందని బీజేపీ చెబుతోంది.
రెండు పార్టీల పరస్పర వాదనలు కొంతమేరకు నిజమేనని కొన్ని శిశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.
రెండువర్గాల వాదనల్లో కొంత నిజముంది. రెండు ప్రభుత్వాలు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాయి. కాంగ్రెస్ హయాంలో టెలికాం, బొగ్గు, బీజేపీ పాలనలో నోట్ల రద్దు'' అని అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్‌కి చెందిన మిహిర్ శర్మ చెప్పారు.
యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల పదేళ్ల చొప్పున పాలనా కాలంలో ఎకానమీ గణాంకాలను పోల్చిచూస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థికాభివృద్ధిని పరిశీలిస్తే...
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్), మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్(ఎంఓఎస్‌పీఐ) గణాంకాల ప్రకారం:
యూపీఏ పదేళ్ల పాలనలో (2008-09 మధ్య ప్రపంచ ఆర్థిక సంక్షోభం మినహా) జీడీపీ సగటు 8.1 శాతం.
ఎన్డీఏ పదేళ్ల పాలనలో (2020-21 మధ్య కోవిడ్ సమయం మినహా ) జీడీపీ సగటు 7.1 శాతం
అయితే, అప్పటి ఆర్థిక సంక్షోభం కంటే కోవిడ్ మహమ్మారి వినాశనం భారత ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపించిందనేది వాస్తవం. అందువల్ల ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జీడీపీ సగటు తక్కువగా నమోదవడంలో ఆశ్చర్యం అవసరం లేదు.
"ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం చాలా ఎక్కువ. దీని కారణంగా ఈ దశాబ్దంలో కొన్నేళ్లు ఆర్థిక పరిస్థితి మందగించింది" అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన మాజీ ఆర్థికవేత్త బృందా జాగీర్దార్ అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ ప్రభుత్వం ఇతర అంశాలతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పాలనాపరమైన విధానాలతో "వేగవంతమైన అభివృద్ధికి" పునాది వేసిందని బృందా జాగీర్దార్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ద్రవ్యోల్బణం కట్టడిలో మెరుగ్గా మోదీ ప్రభుత్వం
ప్రపంచ బ్యాంకు, పీఐబీ లెక్కల ప్రకారం, యూపీఏ హయాంలో సగటు ద్రవ్యోల్బణం రేటు 7.9 కాగా, ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో సగటు ద్రవ్యోల్బణం రేటు 4.7 శాతంగా ఉంది.
నిజానికి, యూపీఏ రెండోసారి పాలన సాగించిన కాలంలో ద్రవ్యోల్బణం సగటు రేటు రెండంకెలలో ఉంది.
అయితే, బీజేపీ హయాంలో చమురు ధరలు తక్కువగానే ఉన్నాయని, కానీ కాంగ్రెస్ హయాంలో ద్రవ్యోల్బణం, బడ్జెట్ లోటు ఈ కారణంగానే ఎక్కువగా ఉన్నాయని మిహిర్ శర్మ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
రోడ్డు నిర్మాణాల వంటి మూలధన వ్యయంలో...
ఇండియా స్పెండ్, రోడ్డు రవాణా - రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం,
2014 నుంచి 2024 మధ్య 54,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు నియమితమయ్యాయి.
అంతకు ముందుకు పదేళ్లలో 27,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే నిర్మితమయ్యాయి.
ఎన్డీఏ హయాంలో, దేశ జీడీపీలో తయారీ రంగం వాటా తగ్గింది.
ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో తయారీ రంగం సగటు వృద్ధి 15 నుంచి 17 శాతం మధ్య ఉంది.
మోదీ ప్రభుత్వ హయాంలో 'మేక్ ఇన్ ఇండియా' వంటి కార్యక్రమాలకు, సబ్సిడీలకు బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించినప్పటికీ, 2022కి సంబంధించి అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారం, జీడీపీలో తయారీ రంగం వాటా 13 శాతానికి పడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎగుమతుల వృద్ధి రేటు..
పీఐబీ, బడ్జెట్ పత్రాల ప్రకారం,
2004 నుంచి 2014 వరకు, భారతదేశ ఎగుమతులు దాదాపు మూడున్నర రెట్లు పెరిగి 80 బిలియన్ డాలర్ల నుంచి 300 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
కానీ, గత పదేళ్లలో ఎగుమతుల వృద్ధి రేటు ఒకటిన్నర రెట్లు పెరిగింది. అంటే, 300 బిలియన్ డాలర్ల కంటే 437 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
భూసేకరణలో ఇబ్బందులు, ఫ్యాక్టరీలకు పర్యావరణ అనుమతుల వంటి అనేక కారణాలు ఎగుమతుల వృద్ధి రేటుపై ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా, ప్రపంచ వాణిజ్యంతో భారత్ అనుసంధానం కాలేదన్నది కూడా నిజం.
ఇవే చాలాకాలంగా, దేశంలో తయారీ, ఎగుమతి వృద్ధి రేటు తగ్గడానికి కారకాలుగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మానవాభివృద్ధి సూచీ ఎలా ఉంది?
యూఎన్‌డీపీ గణాంకాల ప్రకారం, మానవాభివృద్ధి సూచీలో భారత్ వెనకబడింది. మొత్తం 191 దేశాల్లో భారత్ 131 స్థానంలో ఉండగా, 2021లో 132వ స్థానానికి తగ్గిపోయింది.
మానవాభివృద్ధి సూచీ పరంగా యూపీఏ కంటే ఎన్డీఏ హయాంలో అభివృద్ధి పేలవంగా ఉంది. ఆరోగ్య రంగంలో పురోగతి, విద్యావకాశాలు, జీవన ప్రమాణాల మెరుగుదల వంటివి ఈ సూచీలో ప్రమాణికంగా తీసుకుంటారు.
2004 నుంచి 2013 మధ్య కాలంలో మానవాభివృద్ధి సూచీ 15 శాతం మెరుగుపడింది.
అయితే, అందుబాటులో ఉన్న యూఎన్‌డీపీ తాజా డేటా ప్రకారం, 2014 నుంచి 2021 మధ్య మానవాభివృద్ధి సూచీలో కేవలం 2 శాతం మాత్రమే మెరుగుపడింది. కోవిడ్ రెండేళ్లను మినహాయించినప్పటికీ 2019 వరకు మానవాభివృద్ధి సూచీ 4 శాతం మాత్రమే మెరుగుపడింది. అంతకుముందు ఐదేళ్ల యూపీఏ హయాంలో 7 శాతంగా ఉంది.
ఈ విషయంలపై ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
'నగదు మూలధనం' (ఫిజికల్ క్యాపిటల్) పెంచడానికి ఎక్కువ సమయం వెచ్చించామని, 'మానవ మూలధనం' (హ్యూమన్ క్యాపిటల్) అంటే విద్య, ఆరోగ్యం వంటి రంగాలను మెరుగుపరచడంలో సరైన శ్రద్ధ చూపలేదని ఆయన అన్నారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆర్థికంగా వెనుకబడిన భారత్‌లో ఆఫ్రికాలోని కొన్నిప్రాంతాల కంటే పోషకాహార లోపం ఎక్కువగా ఉండడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పోలిక గత రెండు దశాబ్దాలుగా అధికారంలో రెండు ప్రభుత్వాల పనితీరుపై సమగ్ర అంచనా కాదు.
అలా పోలిక పెట్టి చూసేప్పుడు, స్టాక్ మార్కెట్ రిటర్న్స్, సబ్సిడీల కోసం పెట్టిన ఖర్చు, కొత్త ఉద్యోగాల కల్పన, వినియోగం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తాయి. ఒక ప్రభుత్వం ఒక అంశంలో మెరుగైన పనితీరును కనబరిస్తే, మరో అంశంలో వెనకబడి ఉంటుంది.
ఆర్థిక విధాన రూపకల్పన అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ప్రతి ప్రభుత్వమూ దాని గత ప్రభుత్వంలోని కొన్ని మంచి, కొన్ని చెడు విధానాలను అనుసరిస్తోంది.
కొన్నిసార్లు ఒక ప్రభుత్వం చేపట్టిన వాటిని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి దానిని బలోపేతం చేస్తుంది. ఉదాహరణకు, యూపీఏ హయాంలో 2009లో ప్రవేశపెట్టిన ఆధార్ ఆధారిత గుర్తింపు కార్డు వ్యవస్థ.
ఈ రకమైన ఆర్ధికాంశాలన్నింటినీ బ్లాక్ లేదా వైట్‌పేపర్‌గా రూపొందించే విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- దివ్య దేశ్‌ముఖ్: చెస్ క్రీడాకారిణులకు ఎదురయ్యే వేధింపులు ఏమిటి? ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టుపై చర్చ ఎందుకు?
- ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?
- రాజ్యసభ ఎంపీలను ఎలా ఎన్నుకుంటారో తెలుసా?
- UCC: ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టడానికి ఉత్తరాఖండ్‌నే బీజేపీ ఎందుకు ఎంచుకుంది?
- పూనమ్ పాండే: మరణించినట్లు ఫేక్ పోస్ట్ పెట్టడం ఎంతవరకు సమంజసం?














