మీరు కొనే ఈ వస్తువులలో కొన్ని ఉత్తర కొరియాలో తయారవుతున్నాయని తెలుసా

ఫొటో సోర్స్, Getty Images
అణ్వాయుధ పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా ఈసారి మాత్రం అందుకు భిన్నంగా తెర వెనుక కథతో వార్తల్లో నిలిచింది.
ఇప్పుడు నకిలీ విగ్గులు, కృత్రిమ కనురెప్పల తయారీతో మరోసారి వార్తల్లో నిలుస్తోంది.
ఉత్తర కొరియాలో తయారైన కృత్రిమ కనురెప్పలు, నకిలీ విగ్గులు ప్రపంచమంతటా విక్రయమవుతున్నాయి.
అయితే... అవి ఉత్తర కొరియాలో తయారైనట్లుగా కాకుండా చైనా తయారీ వస్తువులుగా చలామణీ అవుతున్నాయి.
ఆ ఉత్పత్తులపై ‘మేడ్ ఇన్ నార్త కొరియా’ అని ఉండాల్సిన చోట ‘మేడ్ ఇన్ చైనా’ అని కనిపిస్తుంది.
ఇటీవలి కాలంలో ఇలాంటి వ్యాపారంతో ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడమే కాక, ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.
రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఉత్తర కొరియా నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న ఈ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ చైనాలో పూర్తి చేసుకుని, మేడ్ ఇన్ చైనా పేరుతో ప్రపంచ దేశాలకు చేరుతోంది.
ఆ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం, అంతర్జాతీయంగా ఆంక్షలున్నప్పటికీ కిమ్ ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలతో తమ దేశానికి అవసరమైన విదేశీ కరెన్సీని సమకూర్చుకుంటోంది.
తమ అధ్యయనంపై స్పందించాల్సిందిగా రాయిటర్స్ వార్తా సంస్థ ఐక్యరాజ్య సమితిలోని ఉత్తర కొరియా కమిషన్‌ను, చైనాలోని ఎంబసీతోపాటు దాంతోంగ్‌లోని కౌన్సిలర్ కార్యాలయాన్ని సంప్రదించింది. వారి నుంచి స్పందన రాలేదని వార్తా సంస్థ నివేదికలో పేర్కొంది.
అయితే, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆ నివేదిక విషయంలో స్పందించారు.
“చైనా, ఉత్తరకొరియాలు మిత్ర దేశాలని, రెండు దేశాల పరస్పర సహకారాన్ని మరో కోణంలో చూడటం సరికాదు” అని అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS/TINGSHU WANG
నివేదికలో ఏముంది?
తమ పరిశోధన కోసం ఇరవై మందితో మాట్లాడగా, వారిలో 15 మంది కృత్రిమ కనురెప్పల వ్యాపారంలో ఉన్నావారేనని రాయిటర్స్ తెలిపింది.
అంతేకాకుండా, ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థపై సమగ్రమైన అవగాహన ఉన్న నిపుణులు, బిజినెస్ లాయర్లను కూడా రాయిటర్స్ వార్తా సంస్థ సంప్రదించింది.
చైనా సంస్థలు ఉత్తర కొరియా నుంచి ముడి సరకులను దిగుమతి చేసుకుని, వాటిని చైనాలో ప్రాసెస్, ప్యాకెజింగ్ పూర్తి చేసి, మేడ్ ఇన్ చైనా అని ట్యాగ్ వేసి, ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని నిపుణులు చెప్తున్నారు.
గతకొన్నేళ్లుగా ఆ వ్యాపారం రెండు దేశాలకు లాభాల్ని తెచ్చిపెట్టే మార్గంగా మారింది.
ఆ ఉత్పత్తులు పశ్చిమదేశాలు, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల్లోని సౌందర్య ఉత్పత్తుల విక్రయశాలలకు చేరుతున్నాయి.
‘ది వాయిస్ ఆఫ్ అమెరికా’ సంస్థ సెప్టెంబర్ 2023లో ప్రచురించిన నివేదికలో అమెరికా స్టోర్‌లలో ‘మేడ్ ఇన్ చైనా’ ట్యాగ్‌తో కృత్రిమ కనురెప్పలు, నకిలీ విగ్‌ల ఉత్పత్తుల అమ్మకంతో ఉత్తర కొరియా ఆంక్షల ఉల్లంఘనకు పాల్పడుతోందని పేర్కొంది. వాటి ఉత్పత్తి ఉత్తర కొరియాలోనే జరిగింది కాబట్టి, అది ఆంక్షల ఉల్లంఘనేనని నివేదికలో పేర్కొన్నారు.
ఏప్రిల్ 2023లో చైనా కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన వివరాలను కూడా నివేదికలో ప్రస్తావించింది ది వాయిస్ ఆఫ్ అమెరికా సంస్థ.
అందులో, ఉత్తర కొరియా నుంచి 22.7 కోట్ల డాలర్ల విలువైన 30 టన్నుల నకిలీ విగ్గులు, కృత్రిమ కనురెప్పలను దిగుమతి చేసుకున్నట్లు చైనా వెల్లడించిన వివరాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, ED JONES/AFP VIA GETTY IMAGES
చైనా, ఉత్తరకొరియా మధ్య బలమైన సంబంధాలు..
ఉత్తర కొరియాకు చైనా ప్రధాన వ్యాపార భాగస్వామి..
కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ తెలిపిన వివరాల ప్రకారం, కొరియా యుద్ధకాలం అంటే, 1950-53 మధ్య కాలంలో చైనా, ఉత్తర కొరియాల మధ్య స్నేహసంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. మిత్రదేశానికి సాయం చేసేందుకు చైనా సైన్యం ఉత్తర కొరియాకు వెళ్లింది.
ఉత్తర, దక్షిణ కొరియాల విభజన అనంతరం చైనా దేశం ఉత్తర కొరియాకు ప్రధాన మిత్ర దేశంగా మారింది.
అయితే, 2006లో ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించడంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాలన్న యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతిపాదనకు చైనా కూడా అంగీకారం తెలిపింది.
2017లో ఉత్తర కొరియా చేపడుతున్న అణ్వాయుధ పరీక్షలను వెంటనే నిలిపివేయాలని అప్పటి చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి కోరారు.
అయితే, ఉత్తర కొరియాపై ఆ సమయంలో విమర్శలు చేసినప్పటికీ, దక్షిణ కొరియా దేశం అమెరికా నుంచి యాంటీ మిసైల్ సిస్టమ్ (టీహెచ్ఏఏడీ) ఏర్పాటు చేసుకుని పొరపాటు చేస్తుందని అన్నారు.
ఆ సమయంలోనే ఉత్తర కొరియా నుంచి కొన్ని సౌందర్య ఉత్పత్తుల దిగుమతులపై చైనా నిషేధం విధించింది.

ఫొటో సోర్స్, API/GAMMA-RAPHO VIA GETTY IMAGES
రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక వాణిజ్య విధానంలో ఎలాంటి మార్పులు జరగలేదు.
స్టాటిస్టా డేటా ప్రకారం 2000 నుంచి 2021 మధ్య కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడుతూనే వస్తున్నాయి.
2000లో చైనాతో ఉత్తర కొరియా వాణిజ్యం 24.4 శాతం ఉండగా, 2018 నాటికి అది 95.8 శాతానికి పెరిగింది.
కోవిడ్ సమయంలో ఉత్తర కొరియా సరిహద్దులను పూర్తిగా మూసివేసిన కారణంగా వాణిజ్య శాతం తగ్గింది. 2020లో 88.2 శాతం నమోదైంది.
కానీ, 2023లో మాత్రం ఇరుదేశాల వాణిజ్యం విపరీతంగా పెరిగిందని నివేదికల ద్వారా తెలుస్తోంది. జనవరిలో విడుదల చేసిన వివరాల ప్రకారం గతేడాది ఇరు దేశాల మధ్య 2.295 బిలియన్ డాలర్ల మేర వ్యాపారం జరిగింది.
ది డిప్లమాట్ పత్రికలో నివేదికను ప్రచురించిన కొరియా ఎకనామిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికాకు చెందిన ట్రోయ్ స్టాంగ్రూన్ విశ్లేషణ ప్రకారం, 2017 కన్నా ముందు ఉత్తర కొరియా గడియారాల తయారీ యంత్రాలను చైనాకు విక్రయించేది కాదు. కానీ, మరుసటి ఏడాది, అంటే 2018లో ఉత్తర కొరియా ఎగుమతుల్లో అత్యధిక వాటా ఆ మిషన్లదే.
అవి మాత్రమే కాక ఉత్తర కొరియా ఎగుమతుల్లో మాలిబ్డినమ్, ఫెర్రోసిలికాన్, దుస్తులు, విగ్గులు, కృత్రిమ కనురెప్పల ఉత్పత్తులు ఉన్నాయి. 2019 నుంచి గడియారాల తయారీ మిషన్ల ఎగుమతి తగ్గింది.
2021లో చైనా ప్రపంచంలోనే సౌందర్య ఉత్పత్తుల దిగుమతుల్లో 13.2 బిలియన్ డాలర్లతో తొలిస్థానంలో ఉంది.
ఎగుమతుల్లో 2.87 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉంది.
ఓఈసీ విడుదల చేసిన డేటా ప్రకారం 2022తో పోలిస్తే, నవంబర్ 2023లో ఉత్తర కొరియా నుంచి చైనాకు ఎగుమతి చేసిన సౌందర్య ఉత్పత్తుల్లో 404 శాతం పెరుగుదల నమోదైంది.
2023 నవంబర్ డేటా ప్రకారం చైనా ఎగుమతులను పరిశీలిస్తే, అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ దేశాలకు సౌందర్య ఉత్పత్తులు భారీగా ఎగుమతయ్యాయి.

ఫొటో సోర్స్, RODONG SINMUN
ఉత్తర కొరియాపై ఆంక్షలు..
అమెరికాతోపాటు ఐక్యరాజ్య సమితి దేశాలు కూడా ఉత్తర కొరియాపై పలు ఆంక్షలు విధించాయి.
ఆంక్షలతో ఉత్తర కొరియా కొనసాగిస్తున్న అణ్వాయుధాల పరీక్షలు, బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలకు అవసరమైన నిధులు సమకూరకుండా అడ్డుకోవచ్చని భావించాయి.
ఐక్యరాజ్య సమితి ఆదేశాలను అనుసరించి సభ్యదేశాలు ఉత్తర కొరియా విషయంలో ఆ ఆంక్షలకు అనుగుణంగా ప్రవర్తించాల్సి ఉంటుంది.
ఆ ఆంక్షల్లో భాగంగా సభ్య దేశాలు ఉత్తర కొరియాకు చమురు, చమురు ఉత్పత్తులు, బొగ్గుల ఎగుమతులు చేయకూడదు. అంతేకాకుండా ఉత్తర కొరియా నుంచి బొగ్గు, ఐరన్, ఇతర లోహాల దిగుమతి చేసుకోకూడదు.

ఫొటో సోర్స్, AFP PHOTO/KCNA VIA KNS
ఉత్తర కొరియా ఎలాంటి ప్రయత్నాలు చేసింది?
2000ల్లో దక్షిణ కొరియాలో సౌందర్య ఉత్పత్తుల పట్ల డిమాండ్ గణనీయంగా పెరగడాన్ని గమనించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలోనూ సౌందర్య ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించారు. ఆ సమయంలోనే దేశంలో పెద్ద సంఖ్యలో సంస్థలు ఏర్పాటయ్యాయి.
2018లో చైనా మీడియా సంస్థ-ది గ్లోబల్ టైమ్స్‌ను ఉత్తర కొరియాలోని కాస్మొటిక్ పరిశ్రమ గురించి తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉత్తర కొరియా ఆహ్వానించింది. స్వదేశీ పరిశ్రమ గురించి విదేశీ మీడియాను ఆహ్వానించడం అదే తొలిసారి.
ప్యోంగ్యాంగ్ కాస్మటిక్స్ ఫ్యాక్టరీ సంస్థను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉత్తర కొరియా ఎలాంటి మార్గాన్ని అనుసరించాలని అనుకుంటుందో చెప్పకనే చెప్పిందని ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను నిశితంగా గమనిస్తోన్న నిపుణులు అన్నారు.
2015,17 సంవత్సరాల్లో కిమ్ స్వయంగా ఆ సంస్థను సందర్శించి, ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీ దిశగా సంస్థలో జరగాల్సిన సంస్కరణల గురించి ప్రస్తావించారని కథనాలు వచ్చాయి.
ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదిక ప్రకారం 2022తో పోలిస్తే 2023లో సౌందర్య ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ పెరుగుదల కనిపించింది.
నివేదికపై యూనివర్సిటీ ఆఫ్ నైగటాకు చెందిన ప్రొఫెసర్ మిమురా మిత్స్యుహిరో అభిప్రాయం ప్రకారం, నిరుద్యోగ రేటు నియంత్రణ, విదేశీ కరెన్సీ ఇన్‌ఫ్లోలో ఇబ్బందులు ఎదురవకుండా చూడాలంటే ఉత్తర కొరియా దుస్తులు, ఇతర ఉత్పత్తులకు బదులుగా కృత్రిమ కనురెప్పలు, నకిలీ విగ్గుల ఎగుమతులు చేయడం తప్ప మరో దారి లేదు.
2019లో చైనాకు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన నివేదిక ప్రకారం, ఆంక్షల కారణంగా ఉత్తర కొరియా కెమికల్స్ వంటి చాలా ఉత్పత్తులను దిగుమతులు చేసుకునే అవకాశం లేదు. ఆ కారణంగా వాటి ఆధారిత సౌందర్య ఉత్పత్తుల తయారీ సాధ్యం కాదు. అందువల్లే కెమికల్స్ రహిత సౌందర్య ఉత్పత్తుల తయారీపై ఉత్తర కొరియా ఎక్కువగా ఆధారపడింది. అలాంటి వాటినే ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- 7 వేల మంది మిస్సింగ్, 50 మందే అంటున్న తాత్కాలిక ప్రధాని.. వారంతా ఏమైనట్లు?
- జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను విడుదల చేసిన నాసా.. విశ్లేషిస్తున్న శాస్త్రవేత్తలు
- బుస్రా బీబీ: ‘నన్ను పెళ్లి చేసుకుంటే ప్రధాన మంత్రి అవుతావు’
- మనిషి మెదడులో అమర్చిన వైర్లెస్ చిప్ ఎలా పనిచేస్తుంది?
- మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు అభిశంసనకు ప్రయత్నాలు, ఎన్నికైన మూడు నెలల్లోనే కీలక పరిణామాలు.. ఇండియానే కారణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














