UCC: ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టడానికి ఉత్తరాఖండ్‌నే బీజేపీ ఎందుకు ఎంచుకుంది?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ - యూసీసీ) బిల్లును మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఉమ్మడి పౌర స్మృతి చట్ట రూపం దాలిస్తే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇటువంటి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది.
అనంతరం ఉత్తరాఖండ్‌లో నివసించే అన్ని మతాల వారికి విడాకులు, వివాహం వంటి అన్ని విషయాల్లో ఒకే చట్టం వర్తిస్తుంది.
2022లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం బీజేపీ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 479 పేజీల ముసాయిదా నివేదికను ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అందజేసింది.
ఈ ఉమ్మడి పౌరస్మృతిలో ఉన్న నిబంధనలేంటి?
- ఉత్తరాఖండ్ నివాసితులకు కులం, మతంతో సంబంధం లేకుండా చట్టం వర్తిస్తుంది.
- వివాహం చేసుకోవాలంటే పురుషులకు కనీస వయస్సు 21 , స్త్రీలకు 18 సంవత్సరాలు ఉండాలి.
- వివాహ నమోదు తప్పనిసరి.
- సహజీవనం చేయాలనుకొనే వ్యక్తులు వారి వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి.
- సహజీవనం ద్వారా పుట్టిన బిడ్డకు చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది.

ఫొటో సోర్స్, ANI
ఉత్తరాఖండ్‌లోనే ఎందుకు?
ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఉత్తరాఖండ్ మంత్రి సత్పాల్ మహరాజ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని అభినందించారు.
“ఈ దేవభూమి నుంచి ఒక చరిత్రాత్మక బిల్లు ఆమోదం పొందుతోంది, దీనిపై సభలో చర్చ జరుగుతోంది. సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మహిళా సాధికారత లక్ష్యంతో ఈ బిల్లు ఆమోదం పొందుతుంది. ఇందులో చాలా నియమాలు ఉన్నాయి. ఇది ఉత్తరాఖండ్ నుంచే ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి అభినందనలు'' అని అన్నారు సత్పాల్.
అయితే, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు 17 రాష్ట్రాల్లో ఉండగా, ఉత్తరాఖండ్ అసెంబ్లీలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడం వెనుక కారణాలేంటి?. దీనిపై సీనియర్ జర్నలిస్ట్ నీర్జా చౌదరి సమాధానమిచ్చారు.
“యూసీసీ అనేది బీజేపీ అజెండాలో పూర్తి కాని అంశాల్లో ముఖ్యమైనది, అది ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. ట్రిపుల్ తలాక్ పూర్తయింది. ఇంతకుముందు, యూసీసీపై అడుగులేసినపుడు గిరిజనుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది'' అని గుర్తుచేశారు నీర్జా చౌదరి.
“అందుకే, అలా ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే గిరిజనులు బీజేపీకి ముఖ్యమైన ఓటర్లు. అయితే, ఉత్తరాఖండ్‌లో గిరిజనులకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో ముస్లిం జనాభా కూడా ఎక్కువగా లేదు. ఇక్కడ బిల్లు తీసుకురావడం ఒక ప్రయోగం లాంటిది" అని అన్నారు.
అయితే, ఉత్తరాఖండ్‌లో ఈ బిల్లును ఆమోదించడం ద్వారా బీజేపీ ఏం సాధించాలనుకుంటోందనే ప్రశ్నకు నీర్జా చౌదరి, “ఈ బిల్లును ఉత్తరాఖండ్‌లో ఆమోదించి, దీనిపై అక్కడ స్పందన ఎలా ఉంటుందో బీజేపీ చూడాలనుకుంటోంది. ఒక కమ్యూనిటీని దూరంగా ఉంచి యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయవచ్చా లేదా ఇది కొన్ని సంఘాలకే వర్తింపచేయవచ్చా? కోర్టులో ప్రాథమిక హక్కుల కోణంలో ఎలా నిలుస్తుంది? ఇలా చట్టపరమైన అంశాలను కూడా పరిశీలించాలనుకుంటోంది. అటువంటి పరిస్థితిలో ఇది ఒక విధంగా ప్రయోగమే. కానీ, అదే సమయంలో ఇది తాము ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నామని చూపించే ప్రయత్నం కూడా'' అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఉత్తరాఖండ్‌లో హిందూ మెజారిటీ
ఉత్తరాఖండ్ జనాభాలో ముస్లింల వాటా దాదాపు 13 శాతం, అంటే ఉత్తరప్రదేశ్‌తో పోలిస్తే కేవలం 6 శాతమే తక్కువ. మరి బీజేపీ ఉత్తరాఖండ్‌నే ఎందుకు ఎంచుకుంది? ఈ ప్రశ్నకు అమర్ ఉజాలా వార్తాసంస్థ డెహ్రాడూన్ ఎడిటర్ దినేష్ జుయాల్ వివరణ ఇచ్చారు.
“యూసీసీ బిల్లును మొదట ఉత్తరాఖండ్‌లో తీసుకురావడానికి కారణం అది చిన్న రాష్ట్రం. రెండోది ఇది ఒక విధంగా హిందూ ప్రాంతం. ఇక్కడ చార్ధామ్, దేవస్థలి, దేవభూమి ఉన్నాయి. ఒకరకంగా హిందువుల కోట. మైదాన ప్రాంతంలో కొద్దిపాటి ముస్లిం జనాభా ఉంది. అందుకే ఇక్కడ యూసీసీపై ఎక్కువ వ్యతిరేకత ఉండకపోవచ్చు'' అన్నారు.
ఉత్తరాఖండ్ ముస్లిం జనాభా సాంద్రత ఎక్కువగా నగరాల్లో ఉంది. డెహ్రాడూన్, హరిద్వార్, ఉధమ్ సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది ముస్లింలు నివసిస్తున్నారు. అలాగే హల్ద్వానీ,అల్మోరాలో కూడా ముస్లిం జనాభా ఉంది.
అదే సమయంలో హిందువుల జనాభా పరిశీలిస్తే మైదానాల నుంచి పర్వతాల వరకు ప్రతిచోటా ఉంది, దీంతో ఇక్కడ బీజేపీ తన బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.
“రాష్ట్రాన్ని పూర్తిగా హిందూమతం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ బలమైన ప్రయత్నాలు చేశాయి. ఇక్కడ మోదీ మ్యాజిక్ ఉంది, మహిళలతో పాటు మాజీ సైనికోద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు ప్రభుత్వం చాలా పనులు చేసింది. వ్యవసాయం పెద్దగా లేని కొండ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు అందడంతో ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు'' అని చెప్పారు జుయాల్.

ఫొటో సోర్స్, ANI
ఎన్నికలే కారణమా?
2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రచారానికి ముందే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించుకుందా?
ఈ ప్రశ్నకు నీర్జా చౌదరి సమాధానమిస్తూ “బీజేపీ తాను చేసిన వాగ్దానాలపై సీరియస్‌గా ఉన్నట్లు చూపించాలనుకుంటోంది. ఉత్తరాఖండ్‌లో బిల్లు ఆమోదం పొందితే, అది తన అజెండాపై సీరియస్‌గా ఉన్నట్లు ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవచ్చు'' అని అభిప్రాయపడ్డారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహానికి యూసీసీ ఎంత వరకు ముఖ్యం? దీనిపై జుయాల్ స్పందిస్తూ, ‘‘రాబోయే ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో గెలవాలనుకుంటోంది. ఒకవైపు శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠను ఘనంగా నిర్వహిస్త ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూనే మరోవైపు ప్రత్యర్థి పార్టీలకు ఎన్నిలకు సిద్ధమయ్యే సమయాన్ని ఇవ్వాలనీ ఆ పార్టీ కోరుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన ఉదాహరణలు బిహార్ నుంచి జార్ఖండ్, దిల్లీ రాష్ట్రాల వరకూ కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ, బీజేపీకి ఇంకా ఏదో వెలితి కనిపిస్తోంది. అందుకే యూసీసీ పేరుతో హిందూ-ముస్లింల పునరేకీకరణ ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ఏ అవకాశాన్ని వదలుకోకూడదని చూస్తోంది" అని అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- ఫుడ్ ప్యాకెట్ల మీద ధరతోపాటు చూడాల్సిన కీలక అంశాలు ఇవీ
- రొమ్ము క్యాన్సర్: బ్రాలో పెట్టుకొనే ఈ సరికొత్త పరికరం వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తుంది
- 10 క్యాన్సర్ లక్షణాలు... వీటిలో ఏది కనిపించినా నిర్లక్ష్యం చేయకండి
- బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? బీర్ ఒంటికి చలువ చేస్తుందా
- పిల్లలు పుట్టాక కూడా ప్రెగ్నెన్సీకి ముందున్న శరీరాకృతి పొందడం ఎలా? మహిళలపై ఇలాంటి ఒత్తిడి ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














