పూనమ్ పాండే: మరణించినట్లు ఫేక్ పోస్ట్ పెట్టడం ఎంతవరకు సమంజసం?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, చెరిలాన్ మొలన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గర్భాశయ క్యాన్సర్‌తో మోడల్, నటి పూనమ్ పాండే చనిపోయారంటూ ఆమె సోషల్ మీడియా ఖాతాలోనే పోస్ట్ కనిపించడం.. ఆ తర్వాత తాను చనిపోలేదని చెబుతూ ఆమె వీడియో విడుదల చేయడం అంతా ‘ఆన్‌లైన్ పబ్లిసిటీ’లో నైతికతపై చర్చకు దారితీసింది.
32 ఏళ్ల పూనమ్ పాండే సర్వికల్ క్యాన్సర్‌తో పోరాడి చనిపోయారంటూ శుక్రవారం ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ కనిపించింది.
ఆ పోస్టును చాలా మంది నిజమేనని నమ్మేశారు. నిమిషాల్లోనే మీడియా సంస్థలు ఆమె చనిపోయారన్న వార్తలు ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలో ఆమెకు నివాళులు చెబుతూ పోస్టులు వెల్లువెత్తాయి.
పాండే నటించింది తక్కువ సినిమాల్లోనే అయినప్పటికీ, తన వివాదాస్పద పోస్టులు, పబ్లిసిటీ కార్యక్రమాలతో ఆన్‌లైన్ సెన్సేషన్‌గా మారారు.
2011 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజయం సాధిస్తే తన దుస్తులు విప్పేస్తానంటూ ఒక ప్రకటన చేశారు.
ఇప్పుడు కూడా ఆమె చనిపోయారంటూ పోస్టు చేసిన తర్వాతి రోజు అదంతా అబద్ధమని, ఈ సోషల్ మీడియా ప్రచారం తన 13 లక్షల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు సర్వికల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగమని చెబుతూ పూనమ్ పాండే ఓ వీడియో పోస్టు చేశారు.
హఠాత్తుగా మనందరం సర్వికల్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం, కాదా? అని ఆ వీడియోలో పాండే అన్నారు. తన మరణవార్త ద్వారా అనుకున్న లక్ష్యం సాధించినందుకు గర్వంగా ఉందని అన్నారామె.

ఫొటో సోర్స్, Getty Images
గర్భాశయ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్‌గా చెబుతుంటారు. ఈ క్యాన్సర్ బారిన పడినప్పటికీ తొలినాళ్లలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడమే అందుకు కారణం.
భారత్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) తర్వాత ఎక్కువ మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఏడాదికి దాదాపు 77,000 మంది ఈ క్యాన్సర్‌తో చనిపోతున్నారు.
హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సీన్ క్యాన్సర్‌కి కారణమయ్యే వైరస్ స్ట్రెయిన్స్ నుంచి రక్షణ కల్పించగలదు. కానీ క్యాన్సర్ కలిగించే అన్ని రకాల హెచ్‌పీవీ స్ట్రెయిన్స్ నుంచి ఇది రక్షించలేదు, కాబట్టి మహిళలు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని చెబుతారు.
పూనమ్ పాండే అబద్ధపు మరణవార్త వెలువడడానికి ఒకరోజు ముందు 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల బాలికలకు వ్యాక్సీన్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించారు.
సరిగ్గా అదే సమయంలో పూనమ్ పాండే పోస్ట్ చేయడంతో చాలా మంది నెటిజన్లు హెచ్‌పీవీ వ్యాక్సీన్‌కు ప్రచారం కల్పించడం కోసమేనని భావించారు.
అయితే, ప్రభుత్వానికీ, పూనమ్ పాండే పోస్టుకీ మధ్య సంబంధం గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు.
అయితే, పూనమ్ పాండే పోస్టు, వీడియో సర్వికల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్య అందరి దృష్టినీ ఆకర్షించేందుకు అవలంబిస్తున్న పద్ధతులపై చర్చకు కారణమయ్యాయి.
సోషల్ మీడియా ప్రచారం ఒక్కసారిగా ప్రజలను షాక్‌కి గురిచేస్తూ సర్వికల్ క్యాన్సర్ గురించి తెలుసుకునేలా చేసిందని కొందరు ప్రశంసిస్తున్నారు.
ఇలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరముందని, ఆ వ్యాధి బారిన పడినవారు, వారి కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని మరికొందరు విమర్శిస్తున్నారు.
''మరణం జోక్ కాదు'' అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. క్యాన్సర్ కారణంగా చిన్నతనంలో తండ్రిని కోల్పోయానని, ఈ సోషల్ మీడియా ప్రచారం ఆ బాధాకరమైన జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసిందని మరొక నెటిజన్ రాశారు.
నిర్ధరణ చేసుకోకుండా మీడియా కూడా వార్తలను ప్రసారం చేయడంపై కొందరు విమర్శలు చేశారు.

ఫొటో సోర్స్, ANI
''పూనమ్ పాండే మరణంతో ఇండియన్ మీడియా కూడా చచ్చిపోయింది. వార్తలను నిర్ధరించుకోరు, నిజమా కాదా అనే ఫ్యాక్ట్ చెకింగ్‌లు ఉండవు, అవన్నీ అసలు సమస్యే కాదు. ఆమె ఇవాళ బతికే ఉంది. ఇక మన జర్నలిజం గురించి నేనేమీ చెప్పలేను'' అని మరో ఎక్స్ యూజర్ రాశారు.
అయితే, ఆ పోస్టు నటి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఉండడంతోనే అలా వార్తలు వచ్చినట్లు కొందరు జర్నలిస్టులు సమర్థించారు.
ఈ ప్రచార కార్యక్రమం వల్ల ఇబ్బందికి గురైన వారికి, దీనికి బాధ్యత వహించిన సోషల్ మీడియా ఏజెన్సీ సచ్‌బాంగ్ శనివారం క్షమాపణలు చెప్పింది.
సర్వికల్ క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించాలనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రచారం నిర్వహించినట్లు ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో ఈ క్యాన్సర్ తీవ్రతను తెలియజేసేలా గణాంకాలను కూడా ప్రస్తావించింది.
పూనమ్ పాండే తల్లి కూడా క్యాన్సర్‌తో బాధపడ్డారని, అందువల్ల వ్యాధి నివారణ ఆవశ్యకత, క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం గురించి ఆమెకు తెలుసని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాక్సీన్ అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు.
కానీ, ఈ ప్రచారంపై విమర్శలు మాత్రం నేటికీ ఆగలేదు.
ఇలాంటి ప్రచారాలు చేసే సమయంలో నైతికతను తుంగలో తొక్కడం సమంజసమేనా? అని ఈ ఉదంతం ప్రజలు ప్రశ్నించేలా చేసింది. ఇలాంటి వాటికి ప్రకటనదారులా? లేక మీడియా? ప్రేక్షకులా? ఎవరిది బాధ్యత అని కొందరు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- రొమ్ము క్యాన్సర్: బ్రాలో పెట్టుకొనే ఈ సరికొత్త పరికరం వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తుంది
- 10 క్యాన్సర్ లక్షణాలు... వీటిలో ఏది కనిపించినా నిర్లక్ష్యం చేయకండి
- బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? బీర్ ఒంటికి చలువ చేస్తుందా
- పిల్లలు పుట్టాక కూడా ప్రెగ్నెన్సీకి ముందున్న శరీరాకృతి పొందడం ఎలా? మహిళలపై ఇలాంటి ఒత్తిడి ఎందుకు?
- పెరిమెనోపాజ్: బాడీబిల్డింగ్ వల్ల మహిళల్లో పీరియడ్స్ ముందే ఆగిపోయే ప్రమాదం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














