పెరిమెనోపాజ్: బాడీబిల్డింగ్ వల్ల మహిళల్లో పీరియడ్స్ ముందే ఆగిపోయే ప్రమాదం ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, యాంజీ బ్రౌన్
- హోదా, బీబీసీ స్కాట్లాండ్, ఎడిన్‌బర్గ్, ఈస్ట్ రిపోర్టర్
అడెల్ జాన్‌స్టన్ బాడీబిల్డర్‌గా ఉన్నప్పుడు కఠినమైన ఆహార నియమాలు, ఫిట్‌నెస్ విధానాలను పాటించారు. అది ఆమెను అలసిపోయేలా చేయడమే కాకుండా ఆకలిగా అనిపించేది.
స్కాటిష్ డబుల్ గోల్డ్ బాడీబిల్డింగ్ ఛాంపియన్ అయిన అడెన్ జుట్టు రాలడం మొదలైంది. చిగుళ్లలో రక్తస్రావం, గుండె దడ, దురదలు, జననేంద్రియాలు వాచి నొప్పి పుట్టేవి.
ఏళ్ల తరబడి స్కానింగ్‌లు, పరీక్షల తర్వాత ఇవి పెరిమెనోపాజ్ ప్రారంభ లక్షణాలని తేలింది. స్త్రీకి రుతుస్రావం ఆగిపోయే ముందు దశ అది.
ఈ దశ మహిళల్లో సగటున 46 ఏళ్ల వయసులో ప్రారంభమవుతుంది. అడెల్‌కు ఇద్దరు పిల్లలు. ఆమె వయసు 30 ఏళ్లు దాటాయి.
"ఎన్నో ఏళ్లుగా నా శరీరాన్ని శారీరకంగా, మానసికంగా పరిమితికి మించి ఇబ్బందిపెట్టాను. బాడీబిల్డింగ్ గొప్ప క్రీడ, కానీ నేను ఆరోగ్యంగా లేను" అని ఆమె బీబీసీ స్కాట్లాండ్ న్యూస్‌తో అన్నారు.
"నా ఎముకల నిర్మాణాన్ని చూడండి, చిక్కి కృశించిపోయా. నా శరీరం అందంగా, ఆరోగ్యంగా కనిపించడం లేదు. నా తెలివితేటలు, జ్ఞానానికి విరుద్ధంగా కఠిన ఆహార నియమాలు పాటించా. ఎప్పుడూ ఆకలితో ఉండేదాన్ని, ఎప్పుడూ సంతృప్తికరంగా తినలేదు.''
5 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న అడెల్ బాడీబిల్డర్‌గా ఉన్నప్పుడు 53 కేజీల బరువు ఉండేవారు. ఆమె ఇప్పుడున్న బరువు కంటే సుమారు 13 కిలోలు తక్కువ.
''నాలో పెరిమెనోపాజ్ దశ అప్పుడే ఎందుకు ప్రారంభమైంది? అందుకు నా బాడీ బిల్డింగే కారణమా? అని చాలా మంది డాక్టర్లను అడిగాను. ''అందుకు అవకాశం ఉంది, కానీ కచ్చితమైన నిర్ధారణలు లేవు'' అని ఆమె చెప్పారు.
విపరీతమైన బాడీబిల్డింగ్ అడెల్ రుతుచక్రం ఆగిపోవడానికి కారణమై ఉండొచ్చని ఎన్‌హెచ్ఎస్ డమ్‌ఫ్రైస్ అండ్ గాలోవేలో స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ హెదర్ క్యూరీ అభిప్రాయపడ్డారు.
''ఏదైనా పరిమితికి మించి ఉంటే, దానివల్ల ఇతర ప్రభావాలు ఏమైనా ఉంటాయా అని ప్రశ్నించుకోవాలి. అలాగే ప్రతీదీ మితంగా ఉండాలని ఎప్పుడూ చెబుతుంటా'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, ADELE JOHNSTON
ఏదైనా ఎక్కువగా ఉండడం, లేదా అవసరమైనంత లేకపోవడం అనేవి మంచిది కాదు.
అడెల్ బాడీబిల్డింగ్‌ను ఆపేసిన తర్వాత అండాశయాలు తిరిగి సాధారణ స్థితికి వస్తాయని మెనోపాజ్, మహిళల ఆరోగ్యంపై స్కాటిష్ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే డాక్టర్ క్యూరీ చెప్పారు.
"బాడీబిల్డింగ్ ప్రభావం చూపగలదు, కానీ అది ఆమెకు తెలియదు'' అని ఆమె అన్నారు.
అడెల్ ప్రస్తుతం బాడీబిల్డింగ్ చేయడం ఆపేశారు, కానీ ఆమె పెరిమెనోపాజ్ లక్షణాలను తగ్గించేందుకు పీరియడ్లను పూర్తిగా ఆపేసే హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ(హెచ్‌ఆర్‌టీ), మిరెనా కాయిల్ (గర్భ నివారణ మార్గం) వంటి మార్గాలను అనుసరించారు.
ఎట్టకేలకు 40 ఏళ్లకు ఆమె స్వాంతన పొందింది. ఆమె రుతుచక్రం పూర్వ స్థితికి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మందులను ఆపేందుకు ఆమె సిద్ధంగా లేరు.
''నేను భయంకరమైన పెరిమెనోపాజ్ లక్షణాలతో బాధపడ్డాను'' అని ఆమె చెప్పారు.
''గుండె దడగా ఉండేది. గుండెపోటు వచ్చిందేమో అనుకునేదాన్ని, రాత్రిళ్లు నిద్రపట్టక నీరసంగా ఉండేదాన్ని, చలి పుడుతుంది, చెమటలు పడతాయి, శరీరమంతా దురదగా అనిపించేది.
వల్వాలో (యోని దిగువ భాగం) భయంకరమైన నొప్పి. పని ప్రదేశంలో నా డెస్క్ దగ్గర నిల్చోవాల్సి వచ్చేది. పొత్తికడుపు ఉబ్బరం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, జుట్టు రాలిపోయేది. ఆ పరిస్థితి చాలా బాధాకరం.
నాకు మిరేనా కాయిల్ ఉంది, హార్మోన్లు కూడా స్థిరంగా ఉండడం వల్ల, నాకు రక్తస్రావం అవుతుందో లేదో తెలుసుకునేందుకు నేను దానిని తీసేయలేను'' అన్నారామె.

ఫొటో సోర్స్, ADELE JOHNSTON
పెరిమెనోపాజ్ అంటే ఏమిటి?
మెనోపాజ్ అంటే స్త్రీలలో పీరియడ్స్ ఆగిపోవడం, ఇది సాధారణంగా 51 ఏళ్ల వయస్సులో జరుగుతుంది.
పీరియడ్స్ సక్రమంగా రాకపోవడాన్ని పెరిమెనోపాజ్‌గా వ్యవహరిస్తారు. మహిళల సగటు వయసు 46 ఏళ్ల వద్ద ఈ దశ ప్రారంభమవుతుంది.
ఈ దశలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, వచ్చినప్పుడు ఇబ్బందిగా అనిపించడం, ఆ సమయంలో అంతకుముందెన్నడూ లేని శారీరక సమస్యలు ఎదుర్కొంటారు.
వరుసగా 12 నెలల పాటు పీరియడ్స్ రాకపోతే అప్పడు మీరు మెనోపాజ్‌కు చేరుకున్నట్లు అర్థం.
బాడీబిల్డింగ్, ప్రారంభ పెరిమెనోపాజ్ మధ్య ఏదైనా సంబంధం ఉందా అనేది చాలా ఆసక్తికరమైన విషయమని బ్రిటిష్ నేచురల్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ చైర్‌వుమెన్ విక్కీ మెక్‌కాన్ అన్నారు.
''నేను 30 ఏళ్లుగా పోటీ పడుతున్నా. మూడేళ్ల కిందట నుంచే మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తున్నాయి'' అని 54 ఏళ్ల మహిళ చెప్పారు.
"అప్పటి వరకు నాకు ఎలాంటి సమస్యలూ లేవు. నా జీవితమంతా ఆహార నియమాలు పాటించా, శిక్షణ కూడా తీసుకున్నా. నా వయసులో ఎలాంటి సమస్యలూ లేని మరో ముగ్గురి గురించి చెప్పగలను'' అన్నారు.
"అయితే, ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి వ్యక్తీ ఎవరికి వారే ప్రత్యేకం."
అడెల్ వంటి అనేక మంది పరిస్థితి తనకు తెలుసని మెనోపాజ్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ 'గ్లోరియా' సహ వ్యవస్థాపకురాలు జెస్సికా వాట్సన్ అన్నారు.
"ముందస్తు మెనోపాజ్ కారణాలను గుర్తించాలి. దీనిపై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. మా ప్రచారంలో ఇది ప్రధాన అంశం'' అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆత్మవిశ్వాసంతో మానసిక బలంతోపాటు శారీరక సామర్థ్యం, ఎలాగంటే..
- మూత్రం రంగును బట్టి కిడ్నీలు పాడయ్యాయో, లేదో ఎలా తెలుసుకోవచ్చు?
- నెలసరి సెలవులు: మహిళలకు ఆ మూడు రోజులు లీవ్ ఎందుకు ఇవ్వకూడదు?
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
- ఐవీఎఫ్‌కు వయో పరిమితి ఉందా? 50 ఏళ్లు దాటాక ఈ విధానంలో పిల్లలను కంటే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














