నాగోబా జాతర: కుమ్రం భీం మరణానికి, నాగోబా దర్బార్‌కు ఉన్న సంబంధం ఏంటి?

నాగోబా

ఫొటో సోర్స్, DPRO/Adilabad

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణలో ఆదివాసీల భారీ ఉత్సవాల్లో ‘నాగోబా జాతర’ ఒకటి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజు అర్ధరాత్రి ఈ జాతర ప్రారంభమవుతుంది. గోండ్, పరదాన్ తెగల్లోని ‘బోయ్ గోయితా శాఖ’ మేస్రం వంశ ఆచారాల ప్రకారం ఈ వేడుకలు నిర్వహిస్తారు.

‘శ్రీషేక్’ రూపంలో సర్ప దేవతను ఆరాధించే సంస్కృతి ఈ జాతరలో కనిపిస్తుంది. గోండు జాతి మధ్య భారతంలో విస్తరించిన అతిపెద్ద ఆదివాసీ సమూహం. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత పెద్ద ఆదివాసీ సమ్మేళనంగా దీన్ని భావిస్తారు.

ఐదు రోజులు కొనసాగే ఈ జాతరకు మేస్రం వంశస్థులతో పాటు హాజరయ్యే మైదానప్రాంతాల వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. దేవాదాయశాఖ లెక్కల ప్రకారం గతేడాది ఆరు లక్షల మంది ఈ జాతరలో పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకను ‘రాష్ట్ర పండుగ’ గా గుర్తించింది. ఈ జాతర ప్రధాన ఘట్టాల్లో ప్రజాదర్బార్ ఒకటి. దీన్నే ‘నాగోబా దర్బార్’ అని పిలుస్తారు. ఇంతకూ నాగోబా దర్బార్‌కు కుమ్రం భీంకు ఉన్న సంబంధం ఏంటి?

నాగోబా

ఫొటో సోర్స్, SHAILENDER

ఫొటో క్యాప్షన్, ప్రధాన దైవం నాగోబా (శ్రీషేక్), రాతి ఆలయం

నాగోబా చరిత్ర

గోండుల చరిత్ర, సంప్రదాయాలకు లిఖిత పూర్వక ఆధారాలు తక్కువ. వీరి ఆశ్రిత కులాలైన పరదాన్, తోటి తెగల మౌఖిక సాహిత్యమే ప్రధాన ఆధారం.

నాగోబా ఆవిర్భావం గురించి తరతరాలుగా చెప్పుకుంటున్న కథలు గోండుల్లో ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి, మేస్రం వంశానికి చెందిన నాగాయి మేతిరాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్ప రూపంలో జన్మించాడన్నది.

మరో కథనం ప్రకారం నాగలోకానికి ఈ జాతికి చెందిన పడియోరు వెళ్లి నాగరాజు ఆగ్రహానికి గురయ్యారట. దీంతో ఆయనను శాంతింపజేసేందుకు పడియోరు ఏడు రకాల నైవేద్యాలు సమర్పించారు. ప్రతిఏటా పుష్యమాసం అమావాస్య రోజు గోదావరి జలాలలో అభిషేకించి, ఏడు రకాల నైవేద్యాలు సమర్పించాలని చెప్పి, కేస్లాపూర్ గుట్టల వైపు నాగరాజు వెళ్లిపోయాడట.

నాగరాజును శాంతింప చేసేందుకు ప్రతి ఏటా మేస్రం వంశస్తులు జాతర నిర్వహిస్తారు.

నాగోబా

ఫొటో సోర్స్, DPRO/Adilabad

ఫొటో క్యాప్షన్, కొత్త మట్టి కుండలో పవిత్ర జలాలతో ఆదివాసీ మహిళలు

మర్రి చెట్టుపై కలశం

ఈ జాతరకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ది చెందినా ఇప్పటికీ జాతర తేదీల వివరాలను ఎడ్లబండిపైనే సమీప గూడేల్లో ప్రచారం చేస్తారు.

గోదావరి జలాల సేకరణ జాతర ప్రారంభానికి ముందు జరిపే మరో ప్రధాన ఘట్టం.

తెల్లని వస్త్రాలు ధరించి, చెప్పులు లేకుండా కాలినడకన జన్నారం మండలం కలమడుగు సమీపంలోని హస్తినమడుగు వెళ్లి అక్కడ గోదావరి జలాలను కలశంలో సేకరిస్తారు. సుమారు 100 కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర సాగుతుంది.

ఆ నీటి కలశాన్ని ఎక్కడా నేలపై పెట్టకుండా, మర్రి చెట్టుపై జాగ్రత్తగా దాచిపెడతారు.

నాగోబా ఆలయ సమీపంలోని మర్రిచెట్ల కింద కొన్ని రోజుల ముందు నుంచే బసచేస్తారు.

జాతర పూజాతంతుల కోసం వాడే కొత్త కుండలను సిరచెల్మ గ్రామానికి చెందిన కుమ్మరులకు ఆర్డర్ ఇస్తారు. ఈ కుండల్లోనే నైవేధ్యాలు వండుతారు.

జాతరకు ముందు రోజు తమ వంశ పెద్దలను తలుస్తూ పిండ ప్రధానాన్ని పోలిన ‘తూమ్’ కార్యక్రమం నిర్వహిస్తారు. పుష్యమాస అమావాస్య ఘడియల్లో అర్ధరాత్రి సంప్రదాయ వాయిద్యాలతో ఆలయ ప్రవేశం చేస్తారు.

ప్రధాన దైవం నాగోబాకు గోదావరి నీటి అభిషేకంతో (మహాపూజ) మొదలయ్యే జాతర ‘భేతాళ్ పూజ’ తో ఐదో రోజు తెర పడుతుంది.

నాగోబా

ఫొటో సోర్స్, SHAILENDER

ఫొటో క్యాప్షన్, నాగోబా ఆలయ ప్రాంగణంలో మట్టి పుట్టలను ఏర్పాటు చేస్తున్న మేస్రం వంశ ఆడపడుచులు

‘భేటింగ్ కొరియాడ్’

నాగోబా జాతరలో సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తారు. అందులో ఒకటి ఆడపడుచు చేతుల మీదుగా మట్టి పుట్టల నిర్మాణం.

ఆలయ ఆవరణలోని కోనేరు నుంచి కొత్త కుండల్లో తెచ్చిన నీటితో మట్టిని తడిపి పుట్టలను తయారు చేస్తారు. వారికి మేస్రం వంశం ఇంటి అల్లుళ్లు సహాయపడతారు.

మరో ఆసక్తికరమైన సంప్రదాయం భేటింగ్ కొరియాడ్.

మేస్రం వంశ కొత్త కోడళ్లను నాగోబా, సతీదేవి, తెగ పెద్దలకు పరిచయం చేసే తంతు ఇది. మేస్రం వంశ కట్టుబాట్ల ప్రకారం ‘భేటింగ్’ పూర్తయ్యేంత వరకు వారికి పూజాధికాల్లో పాల్గొనే అర్హత ఉండదు. ఈ సందర్భంగా కొత్త కోడళ్లు కొబ్బరి ,నాణెం, అద్దం ముక్క, కాటుక దేవతలకు సమర్పిస్తారు.

‘తెల్లని వస్త్రాలతో పూర్తిగా కప్పిన కొత్త కోడలిని నాగోబాకు పరిచయం చేస్తే తప్ప వారికి ఆలయ ప్రవేశం ఉండదు. ఇది మా నియమం’’ అని మేస్రం దాదేరావ్ అన్నారు.

నాగోబా

ఫొటో సోర్స్, SHAILENDER

ఫొటో క్యాప్షన్, ఆలయ ప్రవేశం చేస్తున్న కొత్త కోడళ్లు

నాగోబా దర్బార్

నాగోబా జాతరలో చాలా ప్రాధాన్యం ఉన్న కార్యక్రమం దర్బార్. అటవీ భూములపై హక్కుల కోసం జరిగిన పోరాటంలో 1940 లో కుమ్రం భీంను నిజాం పోలీసులు కాల్చిచంపారు.

ఆదివాసీల తిరుబాటుపై అధ్యయనం చేయడానికి లండన్ విశ్వవిద్యాలయ ఆసియా మానవ పరిణామ శాస్త్ర విభాగాధిపతి ‘క్రిస్టాఫ్ ఫాన్ ఫ్యూరర్- హైమన్ డాఫ్’ (Christoph Von Furer-Haimendorf)ను నిజాం రాజు సలహాదారుగా నియమించారు.

కొమ్రుం భీం

ఫొటో సోర్స్, PraveenShubham

ఫొటో క్యాప్షన్, జోడెన్ ఘాట్‌లో కుమ్రం భీం విగ్రహం

హైమన్ డాఫ్ రాసిన ‘మనుగడ కోసం పోరాటం’ (Tribes of India: The struggle for Survival) అనే గ్రంథంలో ఆదివాసీల తిరుగుబాటుకు కారణాలను వివరించారు. ఈ గ్రంథాన్ని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రచురించింది.

‘తరతరాల నుంచి వస్తున్న భూముల్లోంచి నిర్దాక్షిణ్యంగా గెంటేయడంతో కుమ్రం భీం ఆధ్వర్యంలో 1940 ‘జోడేఘాట్(బాబేఝరి) సాయుధ తిరుగుబాటు’ అనివార్యమైంది. పోడు భూముల నుంచి ఖాళీ చేయకుండా ఉండేందుకు నిజాం ఫారెస్ట్ గార్డ్ తొలుత 500 రూపాయల లంచం తీసుకున్నారు. కొంతకాలానికి వారి తాహతుకు మించి రూ. 2 వేలు డిమాండ్ చేశారు. దీంతో కుమ్రం భీం మరో నలుగురు హైదరాబాద్ బయలు దేరి జోడేఘాట్‌లో సాగు చేసుకునేందుకు అధికారికంగా అనుమతి తీసుకున్నారు.

ఆ పత్రాలను ఫారెస్ట్ వారికి చూపించినా ఫలితం లేకపోవడంతో ఆ తర్వాతి క్రమంలో ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారు. అనంతరం అధికారులతో చర్చలు విఫలమవుతాయి. ఈ క్రమంలో తిరుగుబాటును అణిచేందుకు వచ్చిన పోలీసు బృందం కాల్పుల్లో భీంతో పాటు పది మంది గోండులు మరణించారు’. (మనుగడ కోసం పోరాటం-హైమన్ డాఫ్ పేజీ 76,77,78)

హైమన్ డాఫ్ దంపతులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హైమన్ డాఫ్ దంపతులు

హైమన్ డాఫ్ సూచనల మేరకు 1942-1946 మధ్య కాలంలో నాగోబా జాతర వేదికగా ఆదివాసీ సమస్యల పరిష్కారానికి దర్బార్ ప్రారంభమైంది.

అయితే, ఇలాంటి దర్బార్‌ను పోలిన వ్యవస్థ ఒకటి అప్పటికే నాగోబా జాతరలో కొనసాగుతోందని ఆసిఫాబాద్‌కు చెందిన ఆదివాసీ నాయకుడు ‘సిడాం అర్జు’ బీబీసీతో చెప్పారు.

‘ఆదివాసీ సమూహాల్లో పేరుపొందిన లక్కారంకు చెందిన గోండ్ రాజు ‘ఆత్రం జగపత్ రాజా’ ఆధ్వర్యంలో నిర్ణయాలు జరిగేవని, నిజాం ప్రభుత్వ ఆధ్వర్యంలో 1943లో అధికారిక దర్భార్ ఏర్పాటు తర్వాత దీనికి మరిన్ని అధికారాలు వచ్చాయని ఆయన అన్నారు.

జాతర ప్రాంగణానికి పల్లకీలో వచ్చే ‘ఆత్రం గోండు రాజు’ ప్రధాన ఆకర్షణగా ఉండేవారని, ఆ ఏడాది ఆదివాసీ గూడేల్లో పరిష్కారం కాని సమస్యలకు ఆయన తీర్పు చెప్పేవారని హైమన్ డాఫ్ తన పుస్తకంలో ప్రస్తావించారు.

నాగోబా జాతరలో సీఎం రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, CMO,TELANGANA

ఫొటో క్యాప్షన్, నాగోబా గుడిని సందర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కళతప్పిన దర్బార్

‘ది హిందూ’ పత్రిక కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1963 నుంచి దర్బార్ నిర్వహిస్తోంది.

ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరయ్యే నాగోబా దర్బార్ లో తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, భూ తదితర సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తాయి. అయితే, కరోనా సమయంలో రెండేళ్లు దర్బార్ నిర్వహించలేదు.

తొలినాళ్లలో మంచి ఫలితాలను ఇచ్చిన దర్బార్ నిర్వహణ ఆ తర్వాతి కాలంలో మొక్కుబడిగా మారిందన్న విమర్శలు ఆదివాసీ వర్గాల నుంచి ఉన్నాయి.

‘నిజానికి తరతరాలుగా గోండులకు బలమైన పంచుల (పంచాయతీ) వ్యవస్థ ఉంది. ఆదివాసీలకు మేలు జరిగేలా దర్బార్‌లో తీసుకున్న నిర్ణయాలు అప్పటికప్పుడు అమలయ్యేవి. గతంలో ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు దీనికి హాజరయ్యారు. కానీ గత ఇరవై ఏళ్లుగా అనుకున్న స్థాయిలో దీని పని తీరు లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న నాగోబా ఆలయాన్ని సందర్శించి అభివృద్ది పనులను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నాం, అయితే ఆయన నాగోబా దర్బార్‌కు హాజరై ఉంటే విలువ పెరిగేది. గోండ్‌లకు ఇది ప్రపంచ స్థాయి వేదిక. దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది’ అని సిడాం అర్జు బీబీసీతో అన్నారు.

హైమన్ డాఫ్ పుస్తకం

ఫొటో సోర్స్, Hyderabad book trust

‘ఆదివాసీల సంక్షేమం గురించి అధికారులు, నాయకులు ఇచ్చే హామీలు, చేసే ప్రమాణాలు నీటి మూటలని అందరికి తెలుసు. అయితే, అధికారుల చిత్తశుద్దిని నేను శంకించడం లేదు’ అని ఆ తర్వాతి కాలంలో దర్బార్ నిర్వహణ తీరుపై హైమన్ డాఫ్ తన రచనల్లో అభిప్రాయపడ్డారు.

హైమన్ డాఫ్ క్షేత్రస్థాయి పరిశోధన నివేదిక (ట్రైబల్ హైదరాబాద్) ఆధారంగా నిజాం ప్రభుత్వం 1943 నుంచి దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది.

నాగోబా జాతర

ఫొటో సోర్స్, DPRO/Adilabad

ఆదివాసీల జీవితాల్లో మార్పు

’ఆదివాసీల సమస్యల పరిష్కారానికి నిజాం ప్రభుత్వంలో ప్రత్యేకమైన విభాగమంటూ లేదు. దీంతో అప్పుడే ప్రారంభమైన మైదాన ప్రాంతాల వారి చొరబాట్లు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల ఆగడాలతో ఆదివాసీలు తమ భూములు, ఆస్తులు కోల్పోయారు. వారికి న్యాయం అందలేదు. పాలనా యంత్రాంగానికి దూరంగా అడవుల్లో బతకడం దీనికి ఒక కారణమైతే, న్యాయం కోరడం వీరి తాహతుకు మించిన విషయంగా ఉంది’ అని హైమన్ డాఫ్ రాశారు.

ఈ క్రమంలోనే హైమన్ డాఫ్ సూచనలతో ఆదివాసీలు ఏటా కలుసుకునే నాగోబా జాతర వేదికగా దర్బార్ ప్రారంభమైంది.

సంస్కరణల్లో భాగంగా అటవీ భూముల పంపిణీ, గోండి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు, ఏకోపాధ్యాయ బడులు, ఆదివాసీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సాంఘిక సేవల శాఖ( సోషల్ సర్వీస్ డిపార్మెంట్) ను నిజాం ప్రభుత్వం ప్రారంభించింది.

అదే సమయంలో అప్పటి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆదివాసీ ప్రాంతాలను నోటిఫై చేస్తూ ప్రత్యేక రక్షణలు కల్పించింది.

ఇందులో భాగంగా ఆదివాసీ ప్రాంతాల నియంత్రణ చట్టం-1946, 1949లను రూపొందాయి. నిజాం రెవెన్యూ మంత్రి సర్ విల్ ఫ్రిడ్ గ్రిగ్ సన్ దీనికి చొరువ చూపారు.

సిడాం అర్జు

ఫొటో సోర్స్, Praveen/BBC

ఫొటో క్యాప్షన్, సిడాం అర్జు

‘’హైమన్ డాఫ్ సూచనలతో ఏర్పాటైన గోండీ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో మా నాన్న ‘సిడాం మారు మాస్టర్’ ఒకరు. ఆయన గిన్నెధరి స్కూల్ లో చదువుకున్నారు’ అన్నారు సిడాం అర్జు.

‘’కొత్త చట్టాలతో 1949 నాటికి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1.6 లక్షల ఎకరాలకు ఆదివాసీలకు పట్టాలు పంపిణీ అయ్యాయి. భూములు ఆదివాసీల చేతుల్లోనే ఉండటం వల్ల మాత్రమే ఆదివాసేతరులు, వడ్డీ వ్యాపారుల నుంచి ఆదివాసులకు రక్షణ ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ చట్టం ఉద్దేశం అదే’’ అని హైమన్ డాఫ్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

నాగోబా

ఫొటో సోర్స్, DPRO/Adilabad

ఫొటో క్యాప్షన్, ఎద్దుల బండిపై తరలివస్తున్న ఆదివాసీలు.

జాతరపై ఇతరుల ప్రభావం

నాగోబా జాతరలో కాలక్రమంలో హిందు మత ప్రభావానికి లోనైందని హైమన్ డాఫ్ తన రచనల్లో అభిప్రాయపడ్డారు. ఇలా 1940 నుంచి 1980 వరకు హైమన్ డాఫ్ పరిశోధన కాలం కొనసాగింది.

మొదటిసారి 1941లో తాను హాజరైన నాగోబా జాతర నిర్వహణ తీరు, ఆ తర్వాతి కాలంలో తాను గమనించిన మార్పులను ఆయన ‘మనుగడకోసం పోరాటం’, ‘తెలంగాణలో రాజ్ గోండ్‌’లు అన్న పుస్తకాల రూపంలో గ్రంథస్థం చేశారు.

‘నిజాం రాజ్యానికి సమీపాన ఉన్న బ్రిటీష్ పాలన కింద ఉన్న ప్రాంతాల నుంచి ఈ జాతరకు వచ్చేవారు. కోళ్లు, గొడ్లు, ఆవులు, దున్నలు, మేకలు తెచ్చి ఆలయం ముందు భాగంలో బలి ఇచ్చేవారు. జాతరలో వెలిసిన దుకాణాల్లో గోండు స్త్రీలు బట్టలు, ఇత్తడి, వెండి సామగ్రి కొనేవారు. ఇతర ఆదివాసీల తెగలతో పోలిస్తే గోండ్‌లు ఎక్కువగా బయటి సమూహాలతో కలిశారు. తర్వాతి కాలంలో హిందూ మతాచారాలకు అనుగుణంగా జరిగిన సంస్కరణ ఉద్యమాల పట్ల గోండులు ఉత్సాహం చూపారు. సురోజీ మహరాజ్ ఇందులో ప్రముఖ పాత్ర పోషించారు’ అని హైమన్ డాఫ్ తన రచనల్లో తెలిపారు.

1977లో జరిగిన నాగోబా జాతర సందర్బంగా తన పరిశీలనలను ఆయన వివరించారు.

నాగోబా

ఫొటో సోర్స్, DPRO/Adilabad

ఫొటో క్యాప్షన్, జాతరలో సమాచార శాఖ ఏర్పాటు చేసిన మొబైల్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తున్న ఆదివాసీ మహిళలు

‘ఇప్పుడంతా మారింది. పెద్ద సంఖ్యలో దుకాణాలు వెలిశాయి. జాతర చిన్న పట్టణాన్ని తలపిస్తుంది. జాతర ఆచారాల్లో పెద్దగా మార్పులు లేవు. అయితే పెద్ద జంతువుల బలి (ఆవులు, దున్నలు) కాలక్రమంలో కనుమరుగైంది. శాశ్వత మందిర నిర్మాణం వచ్చింది. సాయంత్రం కాగానే విద్యుత్ దీపాలు ఆదివాసులు వేసుకున్న మంటలను చిన్నబుచ్చుతూ దేదీప్యామానంగా వెలిగేవి. జాతర ప్రారంభం సందర్బంగా నిర్వహించే తూమ్ కార్యక్రమాన్ని ఆలయ ఆవరణలో అనుమతించలేదు’ అని హైమన్ తెలిపారు.

‘1960లో నాగోబా ఆలయాన్ని దేవాదాయశాఖలో విలీనం చేసే ప్రతిపాదన వచ్చింది. కొంత మంది దీన్ని వ్యతిరేకించారు. 1962లో గుడి నిర్మాణం పూర్తయింది. నిర్మాణ పనులకు దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు అందాయి. కాలక్రమంలో హిందూ ఆచారాల ప్రభావంతో బియ్యం, పూలు, కొబ్బరికాయ, దక్షిణాలను నాగోబాకు సమర్పించారు. జాతర జరిగిన పద్దతికీ గోండుల ఆచార సంప్రదాయాలకు ఏమాత్రం పొంతన లేదు’’ అని ఆనాడు హైమన్ అభిప్రాయపడ్డారు.

నాగోబా ఆలయం

ఫొటో సోర్స్, DPRO/Adilabad

ఫొటో క్యాప్షన్, కొత్తగా రాతితో నిర్మించిన ఆలయం.

‘’కొండకోనల్లో నివసించే ఆదివాసీలు ఐదు రోజుల పాటు దగ్గర చేరి మనోభావాలను పంచుకునే జాతర ఇది. గోండులో ఒరిజినాలిటీ అలానే ఉంది. దేవుని పూజా విధానం మారలేదు. మేం వేరే మతాల జోలికి వెళ్లం, వేరే మతాలు మాలో దూరలేవు’’ అని అన్నారు సిడాం అర్జు.

‘హైమన్ డాఫ్ గోండీ ధర్మాన్ని స్వీకరించారు. గోండీ సంప్రదాయాలను పాటించారు. తన కుమారునికి ‘లచ్చు పటేల్’ అని పేరు పెట్టారు. భార్య ‘బెట్టి ఎలిజిబెత్’ కు మరణానంతరం గోండీ సంప్రదాయ తూమ్( కర్మకాండ) పూజ చేశారు’’ అని సిడాం అర్జు వివరించారు.

1950 వరకు నాగోబా ఆలయం కేవలం కలపతో నిర్మించిన గుడిసే. ఆరుబయట ప్రకృతిలో పుట్టకు పూజలు జరిగేవి. 2022లో రాతితో నాగోబా ఆలయాన్ని పునర్నిర్మించారు.

వీడియో క్యాప్షన్, నాగోబా జాతర: గోదావరి నీళ్ళను మర్రిచెట్టు మీద ఎందుకు పెడతారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)