కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎందుకు ధర్నా చేస్తున్నారు?

ఫొటో సోర్స్, GETTY IMAGES/ANI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
- నుంచి, బెంగళూరు
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతం నిరసనలకు పెట్టింది పేరు. దేశ రాజధానిలో ఏ నిరసన అయినా ఈ ప్రాంతంలోనే జరుగుతూ ఉంటుంది. కానీ, బుధవారం జరుగిన నిరసన ప్రత్యేకమైనది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడ నిరసన చేపట్టారు. గురువారం కేరళ ముఖ్యమంత్రి కూడా ఆందోళనకు దిగనున్నారు. కేంద్రం చేతిలో తాము ఆర్థిక అన్యాయానికి గురవుతున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు.
తమ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్లకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వం వహిస్తున్నారు.
అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి పీ. విజయన్, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ కేబినెట్‌తో కలిసి నిరసనలో పాల్గొననున్నారు.
రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తమ రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక వనరులను కేంద్రం అందించాలని ఈ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తున్నారు.
తమిళనాడులో కూడా ఈ నిరసనలు వినిపిస్తున్నాయి. అధికారిక డీఎంకేకు చెందిన కార్మికులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు చేస్తున్నారు.
ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలు ఒకే రకమైన డిమాండ్‌తో ఈ ఆందోళన చేస్తున్నాయి. ‘మై ట్యాక్స్, మై రైట్’ పేరుతో క్యాంపెయిన్ హ్యాష్‌ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.
ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ప్రమోట్ చేయడం కోసం వార్తాపత్రికల్లో ఫుల్ పేజీ వ్యాపార ప్రకటనను ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం.
ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న రాష్ట్రాల నుంచి సేకరించిన పన్ను వసూళ్ల ద్వారా ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలు నిధులు ఎందుకు పొందాలన్న దానిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఆర్థిక పరిస్థితి బాగున్న రాష్ట్రాలు నష్టపోకుండా ఉండాలంటే, రాష్ట్రాలకు ఆర్థిక వనరులు అందించేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలను మార్చాల్సి ఉందని ఈ దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
పైన పేర్కొన్న విషయాన్ని వివరిస్తూ, ‘‘ఒకవేళ కేంద్ర బడ్జెట్ పరిమాణం పెరిగినప్పుడు, రాష్ట్రాలకు అందించే మొత్తం, గ్రాంట్స్ పెంచాల్సి ఉంది’’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు.
‘‘వెనుకబడిన రాష్ట్రాలకు ఎందుకు అదనపు డబ్బులను అందిస్తున్నారన్న విషయంలో మాకు అభ్యంతరం లేదు. కానీ, సమస్య ఏంటంటే, కేంద్రానికి కర్ణాటక రాష్ట్రం రూ.100ను అందిస్తే, మాకు తిరిగి రూ.12 నుంచి 13 మాత్రమే వస్తున్నాయి. ఇలా జరగకూడదు’’ అని ఆయన అన్నారు.
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాలు సంపన్నవని చాలా మందికి తెలుసు. ఇది మాత్రమే కాక, మానవ అభివృద్ధి సూచిక (హ్యుమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్)లో కూడా ఈ రాష్ట్రాలు పైస్థానాల్లో ఉంటున్నాయి.
‘‘జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనలు రాజకీయమైనవి కావు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో జరిగే కొట్లాట కూడా కాదు. ఇది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ చేపడుతున్న నిరసన’’ అని సిద్ధరామయ్య చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాలపై ప్రస్తుత విధాన ప్రభావమెంత?
రాష్ట్రాలకు ఆర్థిక వనరులు అందించేందుకు 14, 15వ ఆర్థిక సంఘాలు రూపొందించిన ఫార్ములాను ప్రస్తుతం వాడుతున్నట్లు ఈ దక్షిణాది రాష్ట్రాలు చెబుతున్నాయి.
ఈ ఫార్ములా కింద రాష్ట్రాలకు సరిపడినంత నిధులు అందడం లేదు. ఆదాయపు పన్నును, కార్పొరేట్ పన్నును, జీఎస్టీని, డీజిల్, పెట్రోల్ సెస్‌ను, సర్‌ఛార్జ్‌ను రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేస్తుంది. సర్‌ఛార్జ్ రేటు అత్యధికంగా ఉంటుంది. కానీ, రాష్ట్రాల నుంచి సేకరించిన ఈ వసూళ్ల నుంచి కొంత మొత్తాన్ని మాత్రమే తిరిగి రాష్ట్రాలకు ఇస్తుంది.
రెండు ఆర్థిక సంఘాల మధ్య కాలంలో కర్ణాటకకు కేటాయించిన నిధులు 4.71 శాతం నుంచి 3.64 శాతానికి పడిపోయాయి. తొలి టెన్యూర్‌లో 42 శాతం పన్నును, ఈ తర్వాత టెన్యూర్‌లో 41 శాతం పన్నులను కర్ణాటక చెల్లించింది.
మహారాష్ట్ర తర్వాత అత్యధిక పన్ను రూ.4,34,000 కోట్లను కర్ణాటక చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరం అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ లోటు తమకు రూ.62,098 కోట్లు.
2017-19 నుంచి కర్ణాటకకు వాటిల్లిన నష్టం రూ.1,87,000 కోట్లని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది.
కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ కూడా ఈ విషయంపై అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు.
సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయంలో, కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్ను పంపిణీలో, 10వ ఆర్థిక సంఘం సమయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా ప్రకారం కేరళకు 3.87 శాతం వచ్చేవి. కానీ, 14వ ఆర్థిక సంఘం సమయంలో ఈ వాటా 2.5 శాతానికి, 15వ ఆర్థిక సంఘం సమయంలో 1.925 శాతానికి పడిపోయిందని తెలిపారు.
దేశంలో ప్రజల తలసరి ఆదాయంలో కేరళ పైస్థానంలో ఉంది. కానీ, కేరళ మాత్రం ఈ విషయంలో అన్యాయానికి గురవుతుందన్నారు.
‘‘కేంద్రానికి రాష్ట్రమిచ్చే ప్రతి రూ.65ల్లో, తిరిగి రూ.35 పొందాలి. కానీ, కేరళ నుంచి వసూలు చేసిన రూ.79 పన్నులో కేవలం రూ.21 తిరిగి ఇస్తుంది. యూపీకి రూ.46, బిహార్‌కు రూ.70 అందుతున్నాయి. ఇవి ఆర్‌బీఐ అందించిన గణాంకాలు. దీనికి మించిన ఆధారాలు కావాలా?’’ అని బాలగోపాల్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, MK STALIN @FACEBOOK
కేంద్రం, దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదానికి ఇదే కారణమా?
కేంద్రం, దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదానికి ఇదే కారణమా? కాదు. గత ఏడాది తన 234 తాలుకాల్లో 130 కరువు ప్రభావాన్ని ఎదుర్కొన్నట్లు కర్ణాటక నివేదించింది.
కేంద్ర బృందం దీనిపై తన నివేదికను సమర్పించింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ దీనికి పరిహారాలు చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, అమిత్‌షాను దిల్లీలో కలిశారు. కానీ, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
‘‘రూ.35 వేల కోట్లను మేం నష్టపోయాం. రూ.17,901 కోట్లను ఇవ్వాలని కేంద్రాన్ని అడిగాం. ఇది సెప్టెంబర్ 2023లో జరిగింది. ఇప్పటి వరకు మాకు చిల్లిగవ్వ కూడా రాలేదు’’ అని సిద్దరామయ్య విమర్శించారు.
‘‘జీఎస్టీని అమల్లోకి తెచ్చిన తర్వాత రాష్ట్రాలకు చాలా తక్కువ ఆదాయం వస్తుంది. జీఎస్టీ తర్వాత ప్రతి ఏడాది తమిళనాడు రూ.20 వేల కోట్లు తక్కువగా పొందుతుంది. మరోవైపు జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు తలెత్తే నష్టాలకు పరిహారమిస్తామని కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు’’ అని చెబుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పీ. విజయన్‌కు లేఖ రాశారు.
తమ ఆర్థిక వనరులను వాడుకునేందుకు రాష్ట్రాలకు ఉన్న సామర్థ్యాన్ని కేంద్రం బలహీనం చేయాలనుకుందని ఆరోపించారు.
కొన్ని రాష్ట్రాలకు న్యాయం జరగలేదని 15వ ఆర్థిక సంఘం కూడా అంగీకరించిందని సిద్ధరామయ్య తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అసలు సమస్యేంటి?
ఆర్థిక సంఘం ఏ సూత్రాలకు అనుగుణంగా కేంద్రం రాష్ట్రాలకు వాటాను అందిస్తుందన్న దానిపైనే సమస్యంతా. ఒక విధానంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వాటాలను పంపుతుంది. అంతేకాక, హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ సూత్రానికి అనుగుణంగా కూడా కేటాయింపు చేస్తుంది. దీనిలో సంపన్న రాష్ట్రాలు పేద రాష్ట్రాలకు సాయం చేయాలని ఆశిస్తుంది.
దీన్ని ‘డిస్టాన్స్ ఫార్ములా’గా పిలుస్తారు. అంటే ధనిక రాష్ట్రాల జీడీపీ లేదా జీఎస్‌డీపీకి, తలసరి ఆదాయానికి పేద రాష్ట్రం ఎంత దూరంలో ఉందో ఈ ఫార్ములా ప్రకారం తెలుసుకోవచ్చు.
‘‘ఈ ఫార్ములా కొనసాగాలా వద్దా? అన్నది ప్రశ్న. దీన్ని సిద్ధరామయ్య సవాలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలన్ని సవాలు చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. కానీ, దీనిలో మరో కోణం కూడా ఉంది’’ అని బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్‌డ్ స్టడీస్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సస్ ప్రొఫెసర్ నరేంద్ర పాణి చెప్పారు.
‘‘ఇది తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల ఉపాధికి సంబంధించిన విషయం. ఈ ఫార్ములాను మీరు సవాలు చేస్తే పేద రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిధులను పంపిణీ చేసేందుకు ఆర్థిక సంఘం ఈ ఫార్ములాను రూపొందించింది. కొత్త ఫార్ములాను ఆర్థిక సంఘం రూపొందిస్తుందా? అన్నది ప్రస్తుత ప్రశ్న’’ అని అన్నారు.
ఆర్థిక సంఘం సభ్యులను కేంద్రమే ఎంపిక చేస్తుందని ప్రొఫెసర్ ఫణి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు దక్షిణాది రాష్ట్రాలు కోపంగా ఉన్నాయి?
వలస కార్మికుల కోసం కేరళ ఇళ్లను నిర్మించాలనుకున్నప్పుడు, విచిత్రమైన పరిస్థితి అక్కడ నెలకొంది. నిరాశ్రయులకు కట్టిస్తున్న ఇళ్లపై ‘‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించివని’’ అని రాయాలని కేరళను కేంద్రం ఆదేశించింది.
‘‘ప్రధానమంత్రి ఆవాస్ యోజనను, ప్రధానమంత్రి ఫోటోను ఈ ఇళ్లపై పెట్టాలని పదేపదే కేంద్రం ఒత్తిడి తెచ్చింది. కేంద్రం ఆదేశాలను మేం అంగీకరించలేదు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఇది ఆర్టికల్ 21 ఉల్లంఘన కిందకు వస్తుంది. గౌరవప్రదంగా జీవించేలా ప్రజలకు ఈ ఆర్టికల్ హామీ కల్పిస్తుంది’’ అని కేరళ మంత్రి ఎంబీ రాజేశ్ తెలిపారు. ఈ విషయంపై మరోసారి ఆలోచించాలని నవంబర్ 2023న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురికి లేఖ రాసినట్లు రాజేశ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రాజ్యసభ ఎంపీలను ఎలా ఎన్నుకుంటారో తెలుసా?
- ఇజ్రాయెల్-గాజా యుద్ధం: 'మిలటరీ ట్యాంకు ఇటే వస్తోంది, నాకు చాలా భయంగా ఉంది.. ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి' -దాడుల మధ్య చిక్కుకున్న ఆరేళ్ళ చిన్నారి
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- బీర్ నిండుకోవడంతో ఈ అద్భుత దీవుల్లో పర్యాటకం దెబ్బతింటోంది
- మిస్ జపాన్: వివాహితుడితో అఫైర్ బయటపడినందుకు ‘కిరీటం’ కోల్పోయిన విజేత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














