ఇజ్రాయెల్-గాజా యుద్ధం: 'మిలటరీ ట్యాంకు ఇటే వస్తోంది, నాకు చాలా భయంగా ఉంది.. ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి' -దాడుల మధ్య చిక్కుకున్న ఆరేళ్ళ చిన్నారి

హింద్ రజాబ్

ఫొటో సోర్స్, RAJAB FAMILY

ఫొటో క్యాప్షన్, పాప హింద్ రజాబ్
    • రచయిత, లూసీ విలియమ్‌సన్
    • హోదా, బీబీసీ న్యూస్, జెరూసలేం

కాల్‌లో అవతలి వైపు గొంతు చాలా సన్నగా, బలహీనంగా వినిపిస్తోంది. ఆ స్వరం ఆరేళ్ల పాపది. గాజాలో ఒక మొబైల్ ఫోన్ నుంచి ఆమె కాల్ చేసి తనను కాపాడమని కోరింది.

‘‘నా పక్కనే ఒక మిలటరీ ట్యాంక్ ఉంది. అది కదులుతూ ఉంది’’ అని ఆ పాప చెప్పింది.

పాలస్తీనా రెడ్ క్రెసెంట్‌కు చెందిన ఎమర్జెన్సీ కాల్ సెంటర్‌లో కూర్చున్న రాణా అనే వ్యక్తి ఆ పాపకు ధైర్యం చెబుతూ, భయపడకుండా ఉండేందుకు చూస్తున్నారు.

‘‘అది నిజంగా నీకు దగ్గరగా ఉందా?’’ అని ఆయన అడిగారు.

‘‘చాలా, చాలా దగ్గరగా‘‘ అంటూ ఆ పాప చిన్న స్వరంతో సమాధానమిచ్చింది. ‘‘మీరు వస్తారా, నన్ను తీసుకెళ్తారా? నాకు చాలా భయంగా ఉంది’’ అని ఆ పాప అంటోంది.

ఆ పాపతో సంభాషణను కొనసాగించడమే తప్ప రాణా చేయగలిగిందేమీ లేదు.

మృతదేహాల మధ్యలో చిన్నారి

ఆరేళ్ల పాప హింద్ రజాబ్ గాజా నగరంలో జరుగుతున్న దాడుల్లో చిక్కుకుపోయింది. సాయం కోసం ప్రాధేయపడుతోంది. తన అంకుల్ కారులో దాక్కుని రెడ్ క్రెసెంట్‌ సభ్యునితో ఫోన్ మాట్లాడుతోంది. ఈ పాప చుట్టూ చనిపోయిన బంధువుల మృతదేహాలున్నాయి.

ఆమెకు పరిచయమైన ఈ ప్రపంచంలో కేవలం రాణా స్వరం మాత్రమే పాపకు ధైర్యాన్ని, ఊరటనిస్తోంది.

హింద్ తన అంకుల్, ఆంటీ, ఐదురుగు కజిన్లతో కలిసి గాజా నగరంలో తన ఇంటి నుంచి బయలుదేరింది.

ఆ రోజు జనవరి 29 సోమవారం. నగరంలోని పశ్చిమ ప్రాంతాలన్నీ ఖాళీ చేయాలని, తీర ప్రాంత రహదారి గుండా దక్షిణానికి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ఆ రోజు ఉదయం గాజా నగర ప్రజలను ఆదేశించింది.

తమ ప్రాంతంలో భీకర దాడులు జరిగాయని హింద్ తల్లి విస్సమ్ గుర్తుకు చేసుకున్నారు.

‘‘మేం చాలా భయపడ్డాం. అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలనుకున్నాం’’ అని ఆమె చెప్పారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులను తప్పించుకునేందుకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తూ ఉన్నామని తెలిపారు.

నగరంలో తూర్పుకు ఉన్న అహ్లి ఆస్పత్రికి వెళ్లాలని ఆ కుటుంబం నిర్ణయించింది. ఆశ్రయం పొందేందుకు అదే సురక్షితమైన ప్రాంతమని వారు భావించారు.

విస్సమ్, ఆమె పెద్ద బిడ్డను తీసుకుని నడుచుకుంటూ వెళ్లాలని అనుకున్నారు. హింద్‌ను ఆమె అంకుల్ కారు బ్లాక్ కియా పికాంటోలో ఎక్కించారు.

‘‘ఆ రోజు బయట చాలా చల్లగా, వర్షం పడేలా ఉంది’’ అని విస్సమ్ చెప్పారు. ‘‘కారులో వెళ్లాలని నేనే హింద్‌కు చెప్పాను. ఎందుకంటే వర్షంలో ఆమెను ఇబ్బంది పెట్టాలనుకోలేదు’’ అని తెలిపారు.

కారు బయలుదేరిన వెంటనే, వారు వెళ్లిన వైపు నుంచి పెద్ద కాల్పుల శబ్దం వచ్చిందని చెప్పారు.

నగరంలోని ప్రముఖ అల్-అజార్ విశ్వవిద్యాలయం వైపు హింద్ అంకుల్ కారు వెళ్లింది. కానీ, అనుకోకుండా వారు ఇజ్రాయెల్ ట్యాంకుల దాడిలో ఇరుక్కుపోయారు.

ప్రాణాలు కాపాడుకోవడానికి సమీపంలోని ఫేర్స్ పెట్రోల్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ కూడా మంటలు చెలరేగాయి.

ఆధారం: ఐడీఎఫ్, ఐఎస్‌డబ్ల్యూ ఫిబ్రవరి 4
ఫొటో క్యాప్షన్, ఆధారం: ఐడీఎఫ్, ఐఎస్‌డబ్ల్యూ ఫిబ్రవరి 4

‘భయంగా ఉంది ఎవరైనా వచ్చి, నన్ను తీసుకెళ్ళండి’

కారులో ఉన్న కుటుంబ సభ్యులు సాయం కోసం బంధువులకు కాల్ చేశారు. వారిలో ఒకరు ఆక్రమిత వెస్ట్ బ్యాంకుకు 50 మైళ్ల దూరంలో ఉన్న పాలస్తీనా రెడ్ క్రెసెంట్ ప్రధాన కార్యాలయంలోని ఎమర్జెన్సీ నెంబర్‌ను సంప్రదించారు.

స్థానిక కాలమానం ప్రకారం సుమారు 2.30 గంటల ప్రాంతంలో రమాల్లాలో ఉన్న రెడ్ క్రెసెంట్ కాల్ సెంటర్‌ వారు హింద్ అంకుల్ మొబైల్ ఫోన్‌కు కాల్ చేశారు. ఆయన మొబైల్‌ను 15 ఏళ్ల కూతురు లయాన్ ఎత్తారు.

రికార్డు అయిన ఆ ఫోన్ కాల్‌లో, తన తల్లిదండ్రులు, తోబుట్టువులు చనిపోయారని లయాన్ రెడ్ క్రెసెంట్‌కు చెప్పింది. తమ కారు పక్కనే ట్యాంకర్ ఉందని తెలిపింది. వారు దాడి చేస్తున్నట్లు చెప్పింది. వారి ఆ సంభాషణ ముగియడానికి ముందు పెద్దగా కాల్పుల శబ్దం, అరుపులు వినిపించాయి.

రెడ్ క్రెసెంట్ సభ్యులు మళ్ళీ ఆ ఫోన్‌ నెంబర్‌కు కాల్ చేయగా.. హింద్ ఆ ఫోన్ ఎత్తింది. ఆమె స్వరం అసలు వినిపించడం లేదు. ఆ పాప భయంతో ఉన్నట్లు తెలుస్తుంది.

ఆమె మాట స్పష్టంగా వినిపించినప్పుడు, ఆ కారులో కేవలం ఆ పాప ఒక్కతే బతికుందని తెలిసింది. ఇంకా కాల్పులు జరుగుతున్నట్లు పాప చెప్పింది.

‘‘సీట్ల కింద దాక్కో’’ అని వారు పాపకు చెప్పారు. ‘‘నిన్నెవరూ చూడకుండా చూసుకో’’ అని తెలిపారు.

పాపకు ధైర్యం చెబుతూ రాణా ఫకీ గంటల పాటు ఫోన్ మాట్లాడారు. ఆ సమయంలో రెడ్ క్రెసెంట్ సభ్యులు, ఆ ప్రాంతానికి తమ అంబులెన్స్ వెళ్లేలా అనుమతివ్వాలని ఇజ్రాయెల్‌ సైన్యాన్ని కోరారు.

‘‘ఆ పాప భయపడుతోంది. బాధతో ఉంది. సాయం కోసం వేడుకుంటోంది’’ అని రాణా పాపతో జరిగిన సంభాషణను గుర్తుకు చేసుకున్నారు. ‘‘తమ బంధువులు చనిపోయినట్లు ఆ పాప మాకు చెప్పింది. కానీ, ఆ తర్వాత వారు నిద్రపోతున్నట్లుందని తెలిపింది. వారిని నిద్రపోనివ్వు అని మేం చెప్పాం’’ అని తెలిపారు.

‘‘ఎవరైనా వచ్చి, నన్ను తీసుకెళ్తండి అని హింద్ పాప చెబుతూనే ఉంది’’ అని చెప్పారు.

‘‘చీకటి పడుతోంది. చాలా భయంగా ఉంది. మా ఇల్లు ఎంత దూరంలో ఉంటుంది' అని ఆ పాప నన్ను అడిగింది. నేను నిజంగా ఏం చేయలేకపోయాను. నిస్సహాయుడిగా మిగిలిపోయినట్లు అనిపించింది’’ అని రాణా బీబీసీకి తెలిపారు.

కాల్ మాట్లాడటం మొదలైన తర్వాత మూడు గంటలకు, హింద్‌ను రక్షించడం కోసం అంబులెన్స్‌ను పంపించామని చెప్పారు.

అదే సమయంలో రెడ్ క్రెసెంట్ టీమ్ హింద్ తల్లి విస్సమ్ వద్దకు చేరుకుని, ఆమెతో ఫోన్‌లో మాట్లాడించారు. తల్లి గొంతు వినగానే హింద్ గట్టిగా ఏడ్చిందని రాణా చెప్పారు.

హింద్ తాత బహా హమాదా
ఫొటో క్యాప్షన్, హింద్ తాత బహా హమాదా

సాయం చేసేందుకు వెళ్లిన అంబులెన్స్, పాప అదృశ్యం

‘‘ఫోన్ పెట్టేయొద్దని హింద్ కోరుతూనే ఉంది’’ అని విస్సమ్ బీబీసీకి చెప్పారు. ‘‘దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయని నేను అడిగాను. ఆమెతో పాటు ఖురాన్ చదువుతూ హింద్‌ను భయం నుంచి బయటికి తీసుకురావాలని చూశాను. ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. నేను చెప్పిన ప్రతి పదాన్ని హింద్ తిరిగి చెప్పింది’’ అని విస్సమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

అంబులెన్స్ సిబ్బంది యూసఫ్, అహ్మద్ చేరుకున్నప్పుడు అక్కడ చీకటి పడింది. వారు పాప ఉన్న ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్నారు. ఆ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ బలగాలు వారిని తనిఖీ చేయాల్సి ఉంది.

ఆ తర్వాత ఆరేళ్ల పాప వద్దకు వారు చేరుకున్న విషయంతో కాల్ కట్ అయింది.

‘‘పాపతో తల్లి కొన్ని గంటల పాటు మాట్లాడింది. చివరి నిమిషంలో కారు డోరు తెరుచుకున్న శబ్దం విస్సమ్ వినింది. కొద్ది దూరంలో అంబులెన్స్‌ కనిపిస్తుందని పాప తల్లికి చెప్పింది’’ అని హింద్ తాత బహా హమాదా బీబీసీకి తెలిపారు.

‘‘ప్రతి క్షణం నా గుండె తరుక్కుపోతోంది’’ అని పాప తల్లి విస్సమ్ తాను అనుభవించిన బాధను బీబీసీకి చెప్పారు.

‘‘అంబులెన్స్ శబ్దం వినిపించిన ప్రతిసారి కూడా, తనే అయిండొచ్చని అనుకుంటున్నాను. ప్రతి శబ్దం, ప్రతి గన్‌షాట్, పడుతున్న ప్రతి క్షిపణి, ప్రతి బాంబు కూడా.. నా కూతురు వైపు వెళ్తుందా? ఒకవేళ తనపై పడిందా.. అని నేను ఆలోచిస్తూ ఉన్నాను’’ అని చెప్పారు.

ఇజ్రాయెల్ సైన్యం ఆధీనంలో ఉన్న ఆ యాక్టివ్ కంబాక్ట్ జోన్‌ లోపలికి గాజాలోని రెడ్ క్రెసెంట్ సభ్యులు కానీ, హింద్ కుటుంబం కానీ చేరుకోలేదు.

‘‘మాకు ఆ రాత్రి చాలా కష్టంగా గడిచింది’’ అని కాల్ ఆపరేటర్ రాణా చెప్పారు. ‘‘నేను లేచినప్పుడు, నాకు పాప స్వరమే వినిపిస్తుంది. ఎవరైనా వచ్చి నన్ను తీసుకెళ్ళండి అనే మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి’’ అని తెలిపారు.

‘‘ఆ రోజు ఆ ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ వివరాల గురించి ఇజ్రాయెల్ సైన్యాన్ని మేం కోరాం. ఆమెను కాపాడేందుకు పంపిన అంబులెన్స్ గురించి, హింద్ కనిపించకుండా పోవడాన్ని ప్రశ్నించాం. 24 గంటల తర్వాత మళ్లీ అడిగాం. ఇంకా చెక్ చేస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చారు" అని రాణా చెప్పారు.

‘‘న్యాయం చేయడానికి అంతర్జాతీయ కోర్టులు ఎక్కడ ఉన్నాయి? దేశాల అధ్యక్షులు అంతా కుర్చీల్లో కూర్చుని ఏం చేస్తున్నారు’ అని పాప తల్లి విస్సమ్ ప్రశ్నించారు.

తన కూతురు కనిపించకుండా పోయిన వారం రోజులుగా విస్సమ్ అహ్లి ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు. అక్కడ కూర్చుని తన కూతురు హింద్ ప్రాణాలతో తిరిగి వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు.

‘‘హింద్ వస్తువులను తీసుకొచ్చాను, ఆమె కోసం ఇక్కడ ఎదురుచూస్తున్నాను’’ అని విస్సమ్ చెప్పారు. ‘‘ప్రతి క్షణం నా బిడ్డ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. ఏ క్షణమైనా నా బిడ్డ రావచ్చు. నా కూతురు సంగతి ఎవరూ మర్చిపోవద్దని ముక్కలైన గుండెతో నేను వేడుకుంటున్నాను’’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)