మిస్ జపాన్: వివాహితుడితో అఫైర్ బయటపడినందుకు ‘కిరీటం’ కోల్పోయిన విజేత

ఫొటో సోర్స్, MISS NIPPON ASSOCIATION
- రచయిత, ఫ్రాన్సెస్ మావో
- హోదా, బీబీసీ న్యూస్
‘మిస్ జపాన్’ అందాల పోటీల విజేత, యుక్రెయిన్ సంతతికి చెందిన కరోలినా షినోకు ఒక వివాహితుడితో అఫైర్ ఉండేదనే వార్తలు రావడంతో ఆమె ఆ కిరీటాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
వివాహితుడితో ఆమె డేటింగ్ చేయడంపై ఒక టాబ్లాయిడ్ రిపోర్టు చేసింది.
కరోలినా షినోకు ప్రస్తుతం 26 ఏళ్లు. రెండు వారాల క్రితమే ఆమె మిస్ జపాన్ టైటిల్‌ను గెలుపొందారు. కానీ, ఈ గెలుపు తర్వాత ఆమె నేపథ్యం జపాన్‌లో చాలా చర్చకు దారితీసింది.
కరోలినా యుక్రెయిన్‌లో పుట్టారు. ఐరోపా సంతతికి చెందిన వారికి ‘మిస్ జపాన్’ టైటిల్ దక్కడం ఇదే తొలిసారి.
కరోలినా జపాన్‌లో పుట్టనప్పటికీ, ‘నేచురలైజ్డ్ సిటిజన్’ కింద అంటే చట్టబద్ధంగా ఆమె జపాన్ పౌరురాలు అయినందున ఈ కిరీటాన్ని ఆమెకు ఇవ్వొచ్చంటూ కొందరు స్వాగతించారు. మరికొందరేమో సంప్రదాయ జపనీస్ అందాల పోటీలకు ఆమె ప్రాతినిధ్యం వహించకూడదంటూ వ్యతిరేకించారు.
తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత కరోలినాకు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి జపాన్‌కు తరలివెళ్లారు. తన సవతి తండ్రి జపనీస్ సంతతికి చెందినవారు. ఆయన ఇంటి పేరులోని షినోనే ప్రస్తుతం కరోలినా పూర్తి పేరులో భాగంగా ఉంది.
జపనీస్‌ను కరోలినా అనర్గళంగా మాట్లాడగలరు, రాయగలరు. 2022లో ఆమె చట్టబద్ధంగా జపాన్ పౌరురాలు అయ్యారు.
‘‘జపాన్ యువతిగా నన్ను చాలా సార్లు అంగీకరించలేదు. కానీ, ఇవాళ నన్ను ఒక జపాన్ పౌరురాలిగా గుర్తిస్తున్నందుకు కృతజ్ఞతా భావంతో నా మనస్సు నిండిపోయింది’’ అని మిస్ జపాన్ టైటిల్‌ను స్వీకరించే సమయంలో కరోలినా చెప్పారు.
ఆమె విజయంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే, పెళ్లయిన వ్యక్తితో ఆమె డేటింగ్ విషయం గురించి ఒక స్థానిక మేగజీన్ కథనం రాసింది.

ఫొటో సోర్స్, INSTAGRAM
క్షమాపణ కోరిన కరోలినా: నిర్వాహకులు
డాక్టర్‌గా పనిచేసే ఒక పెళ్లయిన ఇన్‌ఫ్లుయెన్సర్‌తో కరోలినాకు అఫైర్ ఉండేదని జపనీస్ వీక్లీ టాబ్లాయిడ్ షుకాన్ బున్షన్ ఒక కథనంలో రాసింది. ఈ విషయంపై ఆ వ్యక్తి బహిరంగంగా స్పందించలేదు.
ఈ కథనంపై స్పందించిన అందాల పోటీల నిర్వాహకులు కరోలినాకు మద్దతుగా నిలిచారు. ఆ వ్యక్తికి పెళ్లయిందని, కుటుంబం ఉందన్న విషయం ఆమెకు తెలియదని చెప్పారు.
ఈ విషయంలో కరోలినా తప్పేమీ లేదని తాము నమ్ముతున్నట్లు మిస్ జపాన్ అసోసియేషన్ తన వెబ్‌సైట్లో తెలిపింది.
నిర్వాహకుల నుంచి సోమవారం అందుకు భిన్నమైన ప్రకటన వెలువడింది. ఆయనకు పెళ్లయిందని, కుటుంబం ఉందన్న విషయం తెలిసి కూడా ఆయనతో డేటింగ్ చేశారని కరోలినా అంగీకరించారని వారు అందులో చెప్పారు. ఈ విషయంలో అబద్ధం చెప్పినందుకు కరోలినా క్షమాపణ కోరినట్లు తెలిపారు.
టైటిల్‌ను వదులుకుంటూ కరోలినా చేసిన రాజీనామాకు తాము ఆమోదం తెలిపినట్లు మిస్ జపాన్ అసోసియేషన్ తెలిపింది.

ఫొటో సోర్స్, MISS NIPPON ASSOCIATION
భయంతో నిజం చెప్పలేకపోయా: కరోలినా
కరోలినాకు మిస్ జపాన్ కిరీటాన్ని జనవరి 22న అలంకరించారు. తాజా పరిణామాల అనంతరం తన అభిమానులను, సామాన్య ప్రజలను కూడా కరోలినా క్షమాపణ కోరారు.
భయం, కన్‌ఫ్యూజన్‌తో తాను నిజం చెప్పలేకపోయానంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.
‘‘ఇంత పెద్ద సమస్యను కలిగించినందుకు, నాకు మద్దతుగా నిలిచిన వారికి ద్రోహం చేసినందుకు నేను నిజంగా క్షమాపణ చెబుతున్నాను’’ అని ఆమె రాశారు.
ఈ అందాల పోటీలో పలువురు రన్నర్-అప్‌లుగా నిలిచిననప్పటికీ, మిస్ జపాన్ టైటిల్ ఏడాది కాలంపాటు ఎవరికీ అందించరు.
ఇవి కూడా చదవండి:
- రోడ్డు ప్రమాదంలో నడుము నుంచి కింది భాగమంతా చచ్చుబడిపోయిన యువ రైతు కోసం కొలంబియా నుంచి ఇండియా వచ్చి సేవలు చేస్తున్న భార్య
- పూనమ్ పాండే: మరణించినట్లు ఫేక్ పోస్ట్ పెట్టడం ఎంతవరకు సమంజసం?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నారా
- మాల్దీవులు: భారత సైన్యం విషయంలో ముయిజ్జు మెతక వైఖరి భారత్ సాధించిన దౌత్య విజయమా
- కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్, చికిత్స చేస్తున్న వైద్యులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














