ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నారా

మహిళా ఓటర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళా ఓటర్లు
    • రచయిత, దిగవల్లి పవన్ కాంత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రలో మహిళా ఓటర్లు ఎక్కువ. మహిళలకు పథకాలూ ఎక్కువే. ఇంతకీ పురుషుల కన్నా ఎక్కువ ఉన్న ఈ మహిళా ఓటర్లు ఏ వైపు మొగ్గే అవకాశం ఉంది. మహిళల ఓట్లను ఆయా కుటుంబాల్లోని పురుషులే ప్రభావితం చేస్తారనే పాత వాదనలో పస ఎంత?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి తాజాగా విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం ఓటర్ల సంఖ్య 4.08 కోట్లకుపైగా ఉంది (4,08,07,256). వీటిలో మహిళా ఓటర్లు 2.07 కోట్లకుపైగా ఉన్నారు. అంటే మొత్తం ఓట్లలో సగానికిపైగా మహిళలే ఉన్నారు. పురుషుల కన్నా 6.5 లక్షలకుపైగా మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య 3 లక్షలు ఎక్కువగా ఉండగా, 2024లో ఈ తేడా రెట్టింపు అయింది.

రాష్ట్రంలోని మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య 2019లో దాదాపు 2 కోట్లు (1,98,80927) ఉంది. ఈ సంఖ్య 2024లో మరో 8 లక్షలకుపైగా పెరిగింది.

మహిళా ఓటర్లు

ఫొటో సోర్స్, Jagadeesh NV/EPA-EFE/REX/Shutterstock

గతంలో 9 సార్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1957 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికలకు సంబంధించి, జాతీయ ఎన్నికల కమిషన్ డేటాను పేర్కొంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

దాని ప్రకారం.. 1957 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, అనంతరం రాష్ట్ర విభజన తరువాతి ఆంధ్రప్రదేశ్‌లోను కలిపి మొత్తం తొమ్మిది సార్లు పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

1977, 1980, 1984, 1996, 1998, 1999, 2004, 2009, 2019 ఎన్నికల సంవత్సరాలలో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల కంటే ఎక్కువ ఉంది.

మహిళా ఓటర్లు

ఫొటో సోర్స్, Harish Tyagi/EPA-EFE/REX/Shutterstock

కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో ప్రభావం

కర్ణాటకలో 2023లో జరిగిన ఎన్నికలలో మొత్తం 224 స్థానాల్లో 136 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ విజయంలో మహిళా ఓటర్లే కీలకంగా మారారని అనేక నివేదికలు, ఎన్నికల సర్వేలు తెలిపాయి.

కర్ణాటకలోని మొత్తం మహిళా ఓటు బ్యాంకులో 44 శాతం కాంగ్రెస్‌కు ఓటు వేయగా, 33 శాతం బీజేపీకి ఓటు వేశారని యాక్సిస్ ఇండియాటుడే చేసిన పోస్ట్ పోల్ సర్వే తెలిపింది. గత కొన్ని దశాబ్దాల్లో ఇంత స్థాయిలో మహిళా ఓటర్ల శాతం ఒక పార్టీవైపు మళ్లడం ఇదే మొదటిసారని కూడా ఆ సర్వే చెప్పింది.

ఇక 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్ల ప్రభావం ఎన్నికల ఫలితాలపైన స్పష్టంగా కనిపించిందని ద హిందూ వార్తా పత్రిక పేర్కొంది.

తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓటు వేసిన 56 నియోజకవర్గాల్లో 37 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుందని ద హిందూ తెలిపింది.

మహిళా ఓటర్లు

ఫొటో సోర్స్, Jagadeesh NV/EPA-EFE/REX/Shutterstock

మహిళా ఓటర్ల సంఖ్య ఎందుకు ఎక్కువ?

మహిళల ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మహిళల ఆయుర్దాయం పురుషుల కన్నా ఎక్కువగా ఉండటం, మహిళల్లో రాజకీయ అవగాహన పెరగడం లాంటి కారణాలను చెబుతున్నారు.

‘’ఆంధ్రప్రదేశ్‌లో ఆయుర్దాయం పురుషుల కన్నా మహిళలకు నాలుగేళ్లు ఎక్కువగా ఉంది. కాబట్టి సహజంగానే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర ఎన్నికల చరిత్రను గమనిస్తే, మహిళా ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగానే నమోదవుతోంది’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి, ముఖేష్ కుమార్ మీనా బీబీసీతో చెప్పారు.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కమిషన్ ఫర్ పాపులేషన్ విభాగం 2011 నుంచి 2035 మధ్యలో ప్రతీ అయిదేళ్లకూ రాష్ట్రాల వారీగా ఆయుర్దాయం ఎలా ఉండబోతుందో అంచనా వేస్తూ డేటా విడుదల చేసింది. ఈ అంచనాల ప్రకారం, 2021 నుంచి 2025 మధ్యలో పురుషుల ఆయుర్దాయం 69.5 శాతం ఉండగా, మహిళల ఆయుర్దాయం 73.6 శాతంగా ఉంది.

‘’మొదటిసారి ఓటుని నమోదు చేసుకున్న అమ్మాయిల సంఖ్య పెరగడం, మహిళల్లో రాజకీయ అవగాహన బాగా పెరగడం అందుకు కారణమై ఉండొచ్చు’’ అని నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ జి. అనిత అంటున్నారు.

రాష్ట్రంలో తొలిసారి ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్య మొత్తంగా 8 లక్షలకు పైగా ఉంది (8,13,544).

మహిళఆ ఓటర్లు

ఫొటో సోర్స్, Twitter/ Election Commission of India

ఎన్నికల ఫలితాల్ని శాసించే స్థాయిలో మహిళా ఓటు బ్యాంకు ఉందా?

ఓటర్లలో సగానికి పైగా మహిళలే ఉన్నపుడు, రాజకీయ నిర్ణయాలను మహిళలు పెద్దస్థాయిలో ప్రభావితం చేయగలరనే అవగాహన క్షేత్రస్థాయిలో చాలా తక్కువగా ఉందని ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ పద్మజ షా చెప్పారు.

‘‘మహిళలు రాజకీయ తాయిలాలు, ప్రలోభాలు, ఉచితాలకు లోనవ్వకుండా ఓటు వేసే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు. రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో తమ ఓట్ల సంఖ్య ఉందని మహిళలు గుర్తించట్లేదు. మహిళల ఓట్లు చీలిపోతున్నాయి. ఒకటిగా సంఘటితమై మహిళా సాధికారత, అభ్యున్నతి దిశగా ఓటు బ్యాంకుని మలుచులేకపోతున్నారు’’ అని ప్రొఫెసర్ పద్మజ షా అన్నారు.

‘‘రాజకీయ చైతన్యం, సామాజిక అవగాహన మెరుగవుతున్న మహిళల సంఖ్య బాగా పెరుగుతోంది. నిర్ణయాధికారంలో భాగం కావాలని ఎక్కువ మంది మహిళలు కోరుకుంటున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం చాలా మంచి విషయం’’ అని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, రాయసం పృథ్వీరాజ్ బీబీసీతో అన్నారు.

‘మహిళా సంక్షేమం, పథకాలు కీలకం’

‘’మహిళా ఓటర్లు ఎన్నికల ఫలితాలను చాలా వరకు ప్రభావితం చేస్తారు. కానీ పూర్తిగా మహిళా ఓటు బ్యాంకే విజేతలను నిర్ణయిస్తుందని కచ్చితంగా చెప్పలేం’’ అని ఆలిండియా రేడియోలో పని చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సమ్మెట నాగమల్లేశ్వరరావు అన్నారు.

మహిళా ఓటు బ్యాంకు భారీ స్థాయిలో కాకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలో ఫలితాలను నిర్ధేశిస్తుందని కొందరు అంటున్నారు.

‘‘ప్రభుత్వాల పాలనా తీరుని మహిళలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. మహిళల ప్రయోజనాలకు ఏ పార్టీ పెద్దపీట వేస్తుందో బేరీజు వేసుకుంటున్నారు. మహిళా సంక్షేమాన్ని, తక్షణ ప్రయోజన ప్రథకాలను ఎవరు అమలు చేస్తే వారివైపే ఎక్కువ మంది మహిళలు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈసారి ఎన్నికల ఫలితాలను శాసించే శక్తి మహిళా ఓటు బ్యాంకుకు ఉందనుకోవచ్చు’’ అని జర్నలిజం ప్రొఫెసర్ జి. అనిత విశ్లేషించారు.

మహిళా ఓటర్లు

ఫొటో సోర్స్, Bhasker Solanki

నమోదైన ఓటర్లంతా ఓటు వేస్తారా?

రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో మహిళా ఓటింగ్ తక్కువగా నమోదవుతోందని ఐద్వా కార్యదర్శి డి.రమాదేవి ఆందోళన వ్యక్తం చేశారు.

‘’ఓటు హక్కుని వినియోగించుకోవడంలో అర్బన్ మహిళల్లో నిర్లక్ష్యం కనపడుతోంది. వారిలో మార్పు రావాలి’’ అని డి.రమాదేవి అన్నారు.

ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల్లో ఉంటోన్న ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లి ఓటు హక్కుని వినియోగించుకోవట్లేదు. అర్బన్ ఓటింగ్ తగ్గడానికి ఇది కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

‘’మా ఒక్క ఓటు పడకపోతే సమాజానికి వచ్చే నష్టమేం లేదనే భావనలో చాలా మంది మహిళలున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి’’ అని ప్రొఫెసర్ పద్మజ షా అంటున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్, జాతీయ ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి మొత్తం 74 శాతం పోలింగ్ నమోదవగా, మొత్తం మహిళా ఓటర్లలో 83 లక్షల మందికిపైగా తమ ఓటు హక్కుని వినియోగించుకోలేదు. అలానే 84 లక్షలకు పైగా పురుషులు తమ ఓటు హక్కుని వినియోగించుకోలేదు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 78 శాతానికిపైగా ఓట్లు పోలవగా, మొత్తం మహిళా ఓటర్లలో 40 లక్షలకుపైగా మహిళలు తమ ఓటు హక్కుని వినియోగించుకోలేదు. 39 లక్షలకుపైగా పురుషులు తమ ఓటు హక్కుని వినియోగించుకోలేదు.

‘‘ఈసారి 82 శాతం పోలింగ్ మా లక్ష్యం’’: ఎన్నికల కమిషన్

2024 అసెంబ్లీ ఎన్నికల్లో 82 శాతం పోలింగ్ లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా బీబీసీతో చెప్పారు. జాతీయ సగటు 68 శాతం ఉందన్నారు.

‘‘రాష్ట్ర ఎన్నికల చరిత్రను గమనిస్తే పోలింగ్ శాతం మెరుగ్గానే ఉంటోంది. పట్టణ, పారిశ్రామిక ప్రాంతాలు మినహా, ఇతర ప్రాంతాల్లో మహిళలు చెప్పుకోదగ్గ స్థాయిలో తమ ఓటుని వినియోగించుకుంటున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో 82 శాతం పోలింగ్ సాధించే ప్రణాళికతో పని చేస్తున్నాం’’ అని ముఖేష్ కుమార్ మీనా బీబీసీతో అన్నారు.

మరికొన్ని రోజుల్లో అర్బన్ ప్రాంతాల్లో కమ్యునిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని ఆయన చెప్పారు.

నగరాల్లోని దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా, మహిళలు, విద్యార్థుల కోసం అపార్టుమెంట్లలోనూ, గేటెడ్ కమ్యునిటీల్లోనూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు సెలవులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, అసంఘటిత మహిళా కార్మికులు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారని ఆయన అన్నారు. కాబట్టి ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ వేతనంతో కూడిన సెలవులు ప్రకటించేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తామని, దీని కోసం జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకుంటామని చెప్పారు.

Mukesh Kumar Meena IAS – AP Chief Electoral Officer
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా

156 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ

మొత్తం 26 జిల్లాల్లోని 8 జిల్లాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 35 వేలకుపైగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 నియోజకవర్గాల్లోని 156 స్థానాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా చెబుతోంది.

‘‘అన్ని నియోజకవర్గాల్లో నమోదైన మహిళల ఓట్ల సంఖ్య బాగుంది. మహిళల పోలింగ్ శాతం కూడా బాగా ఉంటే, 150కి పైగా స్థానాల్లో ఎన్నికల ఫలితాలను మహిళలు ప్రభావితం చేసే అవకాశం కచ్చితంగా ఉంది’’ అని ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సనపాల విశ్వనాథ్ అంచనా వేశారు.

పురుషుల కన్నా పదివేల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు దాదాపు 20 ఉంటాయి. చాలా స్థానాల్లో ఈ సంఖ్య పదివేలకు దగ్గరగా కూడా ఉంది.

వీటిలో కొవ్వూరు, ఏలూరు, మంగళగిరి, పెనమలూరు వంటి స్థానాలున్నాయి.

దాదాపు 50 నియోజకవర్గాల్లో పురుషుల కన్నా అయిదువేల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

వీటిలో ఇచ్ఛాపురం, కురుపాం, పార్వతీపురం, శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నంలోని అన్ని జోన్లు, పాడేరు, అనకాపల్లి, పాయకారావుపేట, తుని, రామచంద్రాపురం, రాజమండ్రి రూరల్, రాజానగరం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పోలవరం, గన్నవరం, గుడివాడ, పెనమలూరు, విజయవాడలోని మూడు జోన్లు, నందిగామ, జగ్గయ్యపేట, తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరుపేట, గురజాల, పర్చూరు, ఒంగోలు, కోవూర్, నెల్లూర్ సిటీ, నెల్లూర్ రూరల్, గూడుర్, సూళ్లూరుపేట, వెంకటగిరి, రాజంపేట, కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూర్, నందికొట్కూర్, కర్నూల్, పాన్యం, నంద్యాల, అనంతపుర్ అర్బన్, మదనపల్లె, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు నియోజకవర్గాలున్నాయి.

కొన్నిచోట్ల తక్కువ స్థాయిలో కొన్నిచోట్ల భారీ స్థాయిలో మహిళా ఓటర్ల ప్రభావం ఎన్నికల ఫలితాలపైన ఉంటుందని సనపాల విశ్వనాథ్ అంటున్నారు.

మహిళలు ఓటు ఎవరికి వేయాలో ఇంట్లోని మగవాళ్లే నిర్ణయిస్తారా?

మహిళలు ఎవరికి ఓటు వేయాలో ఇంట్లోని మగవాళ్లే నిర్ణయిస్తారనే వాదన కూడా సమాజంలో బలంగా ఉంది. అయితే ఈ అంశంపైన విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన ఉంది.

‘’తక్కువ ధరకే మద్యం దొరుకుతున్న సమాజాల్లో మగవారు ఇంట్లోని మహిళలపైన ఒత్తిడి చేస్తారు. మద్యం ఏ ప్రభుత్వంలో తక్కువ ధరకు లభిస్తుందో ఆ ప్రభుత్వానికే ఓటు వేయాలంటారు. ఓటు హక్కుని వినియోగించుకునే చాలా మంది మహిళల నిర్ణయాలపై తమ భర్తల ప్రభావం ఇప్పటికీ బలంగానే ఉంటోంది’’ అని ప్రొఫెసర్ పద్మజ షా అభిప్రాయపడ్డారు.

అయితే దీనికి భిన్నంగా, గడిచిన కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో పరిస్థితులు మారాయని, మహిళలు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారని, ఓటు ఎవరికి వేయాలో, తమకు ఎవరి వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో బేరీజు వేసుకుని స్వతంత్రంగానే మహిళలు ఓటు వేస్తున్నారని ప్రొఫెసర్ జి. అనిత చెబుతున్నారు.

‘‘మహిళలు నిర్ణయాధికారంలో భాగం అవ్వాలనుకుంటున్నారు. రాజకీయ చైతన్యం వారిలో బాగా పెరుగుతోంది. మహిళలే మగవారిని ప్రభావితం చేసే స్థాయిలో సమాజంలో మార్పు కనిపిస్తోంది’’ అని సీనియర్ జర్నలిస్ట్ పృథ్వీరాజ్ రాయసం అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)