బీర్ నిండుకోవడంతో ఈ అద్భుత దీవుల్లో పర్యాటకం దెబ్బతింటోంది

ఫొటో సోర్స్, AFP
- రచయిత, అల్ఫ్రెడ్ లాస్టెక్, విక్లిఫ్ ముయా
- హోదా, బీబీసీ ప్రతినిధులు, స్టోన్ టౌన్, నైరోబీ నుంచి
జాంజిబార్ దీవుల్లో ఆల్కహాల్ కొరత ఏర్పటడంతో పర్యాటక రంగం ప్రమాదంలో పడుతుంది.
ఆఫ్రికాలో టాప్ పర్యాటక ప్రదేశాల్లో జాంజిబార్ దీవులు ఒకటి.
టాంజానియా దీవుల సమూహంలో భాగమైన జాంజిబార్ దీవులకు పాక్షిక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ దీవులకు భారత్, రష్యాల నుంచి పర్యాటకుల తాకిడి పెరిగింది.
జాంజిబార్ దీవులకు విదేశీ ఆదాయంలో 90 శాతం పర్యాటకం నుంచే వస్తుంది.
జాంజిబార్ దీవులకు పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న సమయంలో బీరు కొరత సంక్షోభం ఏర్పడింది. గత ఏడాది 6,30,000 మందికి పైగా పర్యాటకులకు ఆ దీవులు స్వాగతం పలికాయని, విదేశీ పర్యాటకులు 16 శాతం పెరిగినట్లు వార్షిక పర్యాటక రిపోర్టులో వెల్లడైంది.
దిగుమతిదారులను అకస్మాత్తుగా మార్చడంతో సరఫరా చైన్‌లో నెలకొన్న ఆటంకాల వల్ల ఈ జాంజిబార్ దీవుల్లో మద్యం ధరలు 100 శాతం పెరిగాయి.
ఈ దీవుల పర్యాటక మంత్రి ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఆల్కహాల్ సరఫరాల్లో సమస్యలతోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారని కొందరు అంటున్నారు. కానీ, వర్కింగ్ కండిషన్స్ బాగోలేవని ఆయన తన రాజీనామా పత్రంలో చెప్పారు.
అద్భుతమైన ఇసుకు బీచ్‌లకు, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి పెట్టింది పేరైన ఈ హిందూ మహాసముద్రపు దీవులు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్లో చాలా ప్రాచుర్యం పొందాయి.
గత ఏడాది పలు పర్యాటక మేగజీన్‌లు ప్రచురించిన ఆఫ్రికాలో టాప్-10 ఉత్తమ పర్యాటక కేంద్రాల జాబితాలో జాంజిబార్ ఒకటిగా నిలిచింది.
ఆల్కహాల్ సరఫరా కొరతతో ఈ దీవులు తమ పర్యాటక ఆకర్షణను కోల్పోయే ప్రమాదం ఉందని స్థానిక హోటల్ యజమానులు హెచ్చరిస్తున్నారు.
జాంజిబార్ ప్రధాన దీవికి ఉత్తరాన ఉన్న మాటెమ్వా బీచ్‌లలో, పలు పర్యాటక హోటళ్లలో కేవలం సాఫ్ట్ డ్రింక్‌లను మాత్రమే అమ్ముతున్నారు.
మద్యం కోసం ప్రధాన నగరమైన స్టోన్ టౌన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆ ప్రాంతంలోని ప్రజలు చెబుతున్నారు. దీని వల్ల బీర్ అమ్మకాలు, సీఫుడ్ వ్యాపారం బాగా దెబ్బతింటాయి.
‘‘నా బార్‌లో బీర్ నిండుకుంది. మా వద్ద కేవలం సాఫ్ట్ డ్రింక్‌ల స్టాక్ మాత్రమే ఉంది’’ అని అక్కడ వ్యాపారం చేస్తున్న మిషెంగా బీబీసీకి చెప్పారు.
‘‘ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇది సీజన్. ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. పర్యాటకులు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కోరుకుంటారు. వారికి ఈ బీచ్‌లలో చల్లటి బీర్ కావాల్సి ఉంటుంది’’ అని తెలిపారు.

ఆల్కహాల్ కొరత ఎందుకు వచ్చింది?
‘‘నాకు జాంజిబార్ అంటే, ఇక్కడి బీచ్‌లంటే చాలా ఇష్టం. ప్రజలు కూడా ఎంతో మంచివారు. ఇక్కడ హార్డ్ లిక్కర్ దొరకకపోవడమే నాకు కష్టంగా అనిపిస్తుంది. నాకు ఆల్కహాల్ తాగాలనిపిస్తుంది. కనీసం విస్కీ అయినా ఉండాలి. కానీ, హోటల్‌లో ఏం దొరకడం లేదు. స్టోన్ టౌన్ నుంచి ఆర్డర్ చేసుకోవాలని వారు నాకు చెబుతున్నారు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అమెరికా పర్యాటకుడు అన్నారు.
జాంజిబార్‌లో స్థానికంగా మద్యం తయారీని రద్దు చేశారు. జాంజిబార్‌లో జనాభాలో ఎక్కువ మంది ముస్లింలు.
ఈ దీవుల్లో విక్రయించే ఆల్కహాల్ ఎక్కువ శాతం టాంజానియా నుంచి వస్తుంది. కొంత దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి అవుతుంది.
మూడు మద్యం దిగుమతి సంస్థలు వన్ స్టాప్, స్కాచ్ స్టోర్, జెడ్ఎంఎంఐలకు చెందిన అనుమతులను జాంజిబార్ లిక్కర్ కంట్రోల్ బోర్డు(జెడ్ఎల్‌సీబీ) పునరుద్ధరించకపోవడంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆల్కహాల్ కొరత ఏర్పడింది.
రెండు దశాబ్దాలకు పైగా ఈ దీవులకు ఆల్కహాల్‌ను సరఫరా చేస్తున్న ఈ మూడు సంస్థలకు ఎందుకు లైసెన్స్‌లను పునరుద్ధరించలేదన్న విషయం ఇంకా తెలియలేదు.
లైసెన్స్ పొందే ఆల్కహాల్ దిగుమతిదారులు తప్పనిసరిగా జాంజిబార్‌లో పుట్టిన స్థానికులై ఉండాలి. పన్నుల విషయంలో వారు ఎలాంటి అవకతవకలకు పాల్పడి ఉండకూడదు. గిడ్డంగి, డెలివరీ వాహనం ఉండాలి.
అంతేకాక, రెగ్యులేటరీ బోర్డుకు వార్షిక ఫీజు కింద 12 వేల డాలర్లను(భారతీయ కరెన్సీలో రూ.9,96,716) దిగుమతిదారులు చెల్లించాలి.
గత నెల జాంజిబార్ లిక్కర్ కంట్రోల్ బోర్డు మూడు కొత్త కంపెనీలు కిఫారు, బెవ్కో, జాంజి ఇంపోర్ట్స్‌కు లైసెన్స్‌లు జారీ చేసింది.
తమ మద్యం దిగుమతులకు అనుమతులను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అంతకుముందు లైసెన్స్ కలిగిన సంస్థలు అప్పీల్ దాఖలు చేశాయి.
ఈ పరిస్థితుల్లో జాంజిబార్‌లో మద్యం దుకాణాలు ఆల్కహాల్ స్టాక్ లేక నిండుకున్నాయి.
‘‘జాంజిబార్‌లో మద్యం కొరత నెలకొంది. పర్యాటక రంగ పరిస్థితి గురించి అథారిటీలకు మేం తెలియజేశాం’’ అని జాంజిబార్ టూరిజం ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేషన్ చైర్మన్ రహిమ్ బరౌక్ బీబీసీకి చెప్పారు.
జాంజిబార్‌లో బీర్ ధర 2,500 షిల్లింగ్స్(1 డాలర్) నుంచి 5 వేల షిల్లింగ్స్‌కు చేరుకున్నట్లు టాంజానియా నుంచి జాంజిబార్‌కు నిత్యం ప్రయాణించే నీమా మీనా చెప్పారు. సఫారి లాంటి కొన్ని ప్రముఖ ఆల్కహాల్ బ్రాండ్లు అందుబాటులోనే లేవన్నారు.
ఈ కొరత బాగా దెబ్బకొడుతున్నట్లు అమాని ఆల్కహాల్ మర్చెంట్స్ యూనియన్ సెక్రటరీ ఫ్రాంక్ జాన్ కహాము ‘ది సిటిజన్ వెబ్‌సైట్’కు చెప్పారు.
ఒకవేళ ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే 3 వేల మందికి పైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని తెలిపారు. ఒట్టి చేతులతో వేతనాలు చెల్లించలేమని చేతులెత్తేశారు.
ఈ విషయంపై జాంజిబార్ లిక్కర్ కంట్రోల్ బోర్డును బీబీసీ సంప్రదించగా, స్పందించేందుకు ఆ బోర్డు చైర్‌పర్సన్ జుమా చుమ్ నిరాకరించారు.
గత నెలలో పర్యాటక మంత్రి పదవికి రాజీనామా చేసిన సిమై మొహమ్మద్ సైద్, వర్కింగ్ కండిషన్లు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పారు.
మద్యం పరిశ్రమను జాంజిబార్ లిక్కర్ కంట్రోల్ బోర్డు దుర్వినియోగం చేస్తుందని ఆయన ఇటీవల ఆరోపించారు.
‘‘ఒకవేళ మన ప్రణాళికల్లో విఫలమైతే, ఆల్కహాల్ నిల్వలను సరిపడనంత ఉంచకపోతే, మన పర్యాటకులు అసహనానికి గురవుతారు’’ అని ఆయన తెలిపారని ప్రభుత్వ మీడియా చెప్పింది.
అయితే సిమై మొహమ్మద్ బంధువుల్లో ఒకరి కంపెనీకి లైసెన్స్‌ను పునరుద్ధరించలేదని వార్తలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- రోడ్డు ప్రమాదంలో నడుము నుంచి కింది భాగమంతా చచ్చుబడిపోయిన యువ రైతు కోసం కొలంబియా నుంచి ఇండియా వచ్చి సేవలు చేస్తున్న భార్య
- పూనమ్ పాండే: మరణించినట్లు ఫేక్ పోస్ట్ పెట్టడం ఎంతవరకు సమంజసం?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నారా
- మాల్దీవులు: భారత సైన్యం విషయంలో ముయిజ్జు మెతక వైఖరి భారత్ సాధించిన దౌత్య విజయమా
- కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్, చికిత్స చేస్తున్న వైద్యులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















