తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?

తమిళనాడు

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, సుభాష్ చంద్ర బోస్
    • హోదా, బీబీసీ తమిళ్

తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ ప్రాంతంలో ఐఫోన్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ ప్లాంట్‌ను ఫోకస్ చేస్తూ ‘ద న్యూయార్క్ టైమ్స్‌’లో ఇటీవల ఒక వార్తాకథనం పబ్లిష్ అయింది. తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధిని ఇది కొనియాడింది.

పారిశ్రామిక రంగంలో తమిళనాడు విజేతగా నిలుస్తుందని ఈ కథనం చెప్పింది. దేశంలోనే ఎక్కువ మంది మహిళా కార్మికులు ఈ రాష్ట్రంలో ఉపాధి పొందుతున్నారని తెలిపింది.

దీంతోపాటు తమిళనాడులోని వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న వివిధ పరిశ్రమలను, వాటి అభివృద్ధిని కూడా ఈ కథనం కొనియాడింది.

ఇంతకూ, అభివృద్ధి విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు ఎలా ముందంజలో నిలిచింది? ఈ అభివృద్ధికి ఎప్పుడు బీజం పడింది? యావత్ భారతదేశం ఒక బాటలో పయనిస్తున్నప్పుడు, తమిళనాడు తనదైన బాటను ఏర్పరుచుకుని పురోగతి సాధించడం ఎప్పుడు ప్రారంభించింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

తమిళనాడు అభివృద్ధి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 1960 కాలం నుంచి తమిళనాడులో అనుసరించిన విధానాలు, రాజకీయ మార్పులే అభివృద్ధికి తార్కాణాలు.

తమిళనాడు ప్రత్యేకత ఏమిటి?

ఒక రాష్ట్ర అభివృద్ధిని లెక్కించడంలో విద్య, వైద్యం, ఆరోగ్యం, తలసరి ఆదాయాలు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటి పరంగా చూసుకుంటే, భారత్‌లోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు ముందంజలో ఉంది.

ముఖ్యంగా తమిళనాడులో నవజాత శిశు మరణాల రేటు(ఐఎంఆర్) ప్రతి వెయ్యి మందికి 8.2గా ఉంది. అలాగే తలసరి ఆదాయం ఏడాదికి రూ.1,66,727గా, తమిళనాడు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్‌రోల్‌మెంట్(జీఈఆర్) 47 శాతంగా ఉన్నాయి.

ఈ అభివృద్ధి 1960ల నుంచి తమిళనాడులో అమలైన విధానాలు, రాజకీయ మార్పుల వల్లే సాధ్యమైంది. ఈ విషయంపై మేం ప్రొఫెసర్, ఆర్థికవేత్త జ్యోతి శివజ్ఞానంతో మాట్లాడాం.

ఆర్థికవేత్త జ్యోతి శివజ్ఞానం

ఫొటో సోర్స్, LINKEDIN

ఫొటో క్యాప్షన్, ఆర్థికవేత్త జ్యోతి శివజ్ఞానం

తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం, ఇతర విధానాలతో పోల్చి చూసినప్పుడు మాత్రమే తమిళనాడు ప్రభుత్వ అభివృద్ధిని సరిగ్గా అర్థం చేసుకోగలమని ఆర్థికవేత్త జ్యోతి శివజ్ఞానం అన్నారు.

‘‘కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి బాటలో ఆధునిక విధానాలను 1950, 1960లలో ప్రారంభించింది. వారు చేపట్టిన అభివృద్ధి బాటకు భిన్నంగా మనం చేపట్టిన విధానాలే ప్రస్తుత అభివృద్ధికి తార్కాణాలు’’ అని శివజ్ఞానం అన్నారు.

ఉదాహరణకు, ‘‘గ్రోత్ విత్ డిస్ట్రిబ్యూషన్’’ అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. ‘‘దీని ప్రకారం, తొలుత అభివృద్ధి బాటలో వారు పయనించేవారు, ఆ తర్వాత దాన్ని ప్రజలకు పంపిణీ చేసేవారు. ఈ ప్రాజెక్టు తొలుత అభివృద్ధిని తీసుకొచ్చినప్పటికీ, ఆ వృద్ధి ప్రజలకు చేరువ కాలేదు’’ అని ఆయన చెప్పారు.

1960 తర్వాత తమిళనాడు భిన్నమైన విధానాలను అనుసరించింది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం వచ్చినప్పుడు, సామాన్య ప్రజలపై ఎక్కువగా దృష్టి పెట్టింది.

బెగ్గర్స్ రిహాబిలిటేషన్ స్కీమ్(యాచకుల పునరావాస పథకం), స్లమ్ ఎక్స్చేంజ్ బోర్డు, గ్రామాలకు ప్రభుత్వ బస్సు సౌకర్యం, రోడ్ల పథకం లాంటి ఎన్నో పథకాలను అప్పటి తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిందని శివజ్ఞానం చెప్పారు.

డీఎంకే అధికార ప్రతినిధి సేలం ధరణీధరన్

ఫొటో సోర్స్, SALEM DHARANIDHARAN

ఫొటో క్యాప్షన్, డీఎంకే అధికార ప్రతినిధి సేలం ధరణీధరన్

‘‘డీఎంకే అభివృద్ధి గురించి ఆందోళన పడకుండా ప్రజల అవసరాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. అంతకుముందు ప్రభుత్వ ఖర్చులన్నీ మూలధన ఆధారితంగా అంటే డ్యామ్‌లను నిర్మించడం లాంటి వాటిపై ఉండేది. కానీ, ఆ తర్వాత ప్రజల అభివృద్ధిపైనే అంటే విద్యా, వైద్యం వంటి అవసరమైన ఖర్చులపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది’’ అని చెప్పారు.

డీఎంకే అధికార ప్రతినిధి సేలం ధరణీధరన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘1960ల్లో, తమిళనాడు తలసరి ఆదాయం, ఉత్తరప్రదేశ్‌తో సమానంగా ఉండేది. కానీ, 2011లో ఉత్తరప్రదేశ్‌తో పోలిస్తే తమిళనాడు తలసరి ఆదాయం మూడింతలు ఎక్కువగా ఉంది. పారిశ్రామికాభివృద్ధిని తీసుకున్నా భారత్‌లో అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి’’ అని డీఎంకే అధికార ప్రతినిధి అన్నారు.

‘‘దీనికి ప్రధాన కారణం డీఎంకే ఎక్కువగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిపెట్టడమే. రిజర్వేషన్లకు తగు స్థానం కల్పించడం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ఉచిత విద్య, పలు విద్యా పథకాల అమలు వంటి వాటిని తీసుకొచ్చింది. ఆర్థికాభివృద్ధికి మూలధనం, మానవ వనరులు అత్యంత ముఖ్యం. విద్యను, పేదరికాన్ని పారదోలేందుకు చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు ఇవెంతో అవసరం’’ అని తెలిపారు.

తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల సృష్టిపై దృష్టి

సేవా రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సమయంలో, పేదరిక నిర్మూలన, విద్యాభివృద్ధి, ఉపాధికి తగ్గ ప్రాజెక్టులపై తమిళనాడు దృష్టి పెట్టింది. మానవ వనరులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విద్యను ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా చేసింది.

గ్రామాల్లోని ఎంతో మంది ప్రజలను నగరాలకు తీసుకొచ్చింది.

రోడ్డు సౌకర్యాలను, ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపరిచింది.

రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాత ఇక చాలు అనుకోకుండా, ప్రజలకు ఉద్యోగాలను సృష్టించడంపై తమిళనాడు దృష్టి సారించిందని, అలాంటి ఎన్నో పథకాలు అమలు పరిచిందని శివజ్ఞానం చెప్పారు.

కరుణానిధి, ఎంజీ రామచంద్రన్

ఫొటో సోర్స్, DMK / AIADMK

ఫొటో క్యాప్షన్, మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, ఎంజీ రామచంద్రన్

సంక్షేమ పథకాలను కొనసాగించిన డీఎంకే, అన్నాడీఎంకే

తమిళనాడులో పార్టీతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమ పథకాల అమలు కొనసాగుతుందని శివజ్ఞానం తెలిపారు.

‘‘ఉదాహరణకు కుమారస్వామి కామరాజ్ పాఠశాలలను కట్టించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. డీఎంకే, ఏఐఏడీఎంకే పాలనలలో ఎన్నో కొత్త పథకాలు అమల్లోకి వచ్చాయి. విద్యార్థులను స్కూళ్లకు తీసుకొచ్చేందుకు తమిళనాడులో పార్టీలన్ని ఒకే రకమైన అభిప్రాయంతో ఉండేవి’’ అని ఆయన వివరించారు.

డీఎంకే తీసుకొచ్చిన ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ఎంజీఆర్ కొనసాగించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలను డీఎంకే ప్రభుత్వం ప్రారంభించింది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలను ఎంజీఆర్ స్థాపించారు.

ఎంజీఆర్ తీసుకొచ్చిన అన్నా యూనివర్సిటీ దీనిలో కీలక పాత్ర పోషించింది.

‘‘అన్నా యూనివర్సిటీలో తొలిసారి ఎలక్ట్రానిక్స్‌ను బోధించారు. ఫలితంగా ఇక్కడ చదివిన విద్యార్థులు సాంకేతిక సంస్థల్లో ఉద్యోగంలో చేరగలిగారు’’ అని శివజ్ఞానం చెప్పారు.

1990ల్లో సరళీకరణ తర్వాత భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన చాలా కంపెనీలు, దిల్లీ, ముంబయి తర్వాత తమిళనాడుకు వచ్చాయని తెలిపారు.

మానవ వనరుల అభివృద్ధి కోసం గత 30 ఏళ్లలో తమిళనాడులోని ప్రభుత్వాలు అమలు చేసిన విధానాలతో నైపుణ్యవంతులైన ఉద్యోగులు అందుబాటులోకి వచ్చారు.

తమిళనాడు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ప్రపంచ మార్పులను అందిపుచ్చుకోవడం

ప్రపంచ మార్పులను, ట్రెండ్స్‌ను అందిపుచ్చుకోవడంలో తమిళనాడు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చే సాంకేతిక మార్పులకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకోవడానికి తమిళనాడు వెనుకడుగు వేయదని శివజ్ఞానం అన్నారు. అందువ్లలే టైడల్ పార్క్ వంటి ఐటీ కంపెనీ ప్రాజెక్టులు అమల్లోకి వచ్చాయని, ఆటోమొబైల్ రంగంలోని సంస్థల కోసం ఏర్పాట్లు చేశారని ఆయన వివరించారు.

కరుణానిధి పాలనలో తమిళనాడులో భారత్‌లోనే తొలి ఐటీ విధానాన్ని ప్రవేశపెట్టారని సలేం ధరణీధరన్ చెప్పారు. పారిశ్రామిక ఎస్టేట్లను నెలకొల్పారని ప్రస్తావించారు.

స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఇవ్వడం, పెట్టుబడులను ఆకర్షించడం, కొన్ని కులాల వారికి, మహిళా వ్యాపారవేత్తలకు ప్రత్యేక కోటాలు కల్పించడం వంటి చర్యలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చాయన్నారు.

టైడల్ పార్క్

ఫొటో సోర్స్, TIDEL PARK

ఫొటో క్యాప్షన్, టైడల్ పార్క్

ఏఐఏడీఎంకే పాలనలో ఎన్నో ప్రాజెక్టులను చేపట్టినట్లు మాజీ మంత్రి డీ జయకుమార్ తెలిపారు.

పారిశ్రామిక కంపెనీలకు ఆమోదం తెలిపేందుకు సింగిల్ విండో సిస్టమ్‌ను ఏఐఏడీఎంకే పాలనలో తీసుకొచ్చినట్లు చెప్పారు.

‘‘నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు, చాలా కంపెనీలకు తేలికగా అనుమతులు ఇచ్చాం. సిరుసెరీలో హెచ్‌సీఎల్ లాంటి ఎన్నో ప్రముఖ కంపెనీలకు ప్రభుత్వ ధరల్లోనే భూములను అందించాం’’ అని తెలిపారు.

మాజీ మంత్రి జయకుమార్

ఫొటో సోర్స్, D JAYAKUMAR / TWITTER

ఫొటో క్యాప్షన్, మాజీ మంత్రి జయకుమార్

తయారీ రంగంలో మహిళ ప్రాతినిధ్యం

మహిళల చదువుపై ఆంక్షలు కొనసాగుతున్న కాలంలోనే తమిళనాడులో మహిళల పురోగతికి బాటలు ఎలా పడ్డాయో శివజ్ఞానం వివరించారు.

‘‘ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళల ప్రాపర్టీ హక్కుల చట్టాన్ని ప్రకటించింది. కానీ, 1960ల్లోనే, దీని కోసం తమిళనాడులోని మహిళలు పోరాడారు. మహిళలకు వ్యతిరేకంగా సమాజంలో ఉన్న ఎన్నో అన్యాయాలపై వారు పోరాటం చేశారు. ఈ పోరాటాల ఫలితంగా తమిళనాడులోని ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు, కార్యక్రమాలే వారి అభివృద్ధికి ప్రధాన కారణం’’ అని ఆయన వివరించారు.

భారత్‌లో తయారీ రంగంలో ఉన్న మహిళా కార్మికుల్లో 43 శాతం మంది తమిళనాడులో ఉన్నారని కేంద్ర ప్రభుత్వ సర్వే ఒకటి వెల్లడించింది.

2019-20 పరిశ్రమల వార్షిక సర్వే నివేదిక ప్రకారం దేశంలో తయారీ రంగంలో 15.8 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరిలో 6.79 లక్షల మంది తమిళనాడులోనే పనిచేస్తున్నారు.

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఈ నివేదిక వెలువరించింది.

ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, తమిళనాడు అభివృద్ధి గురించి ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ తన పుస్తకం ‘యాన్ అన్‌సర్టైన్ గ్లోరీ’లో రాసిన కొన్ని విషయాలను శివజ్ఞానం ప్రస్తావించారు.

తమిళనాడు అభివృద్ధిపై అమర్త్యసేన్ ఏం రాశారు?

తమిళనాడు అభివృద్ధి గురించి ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ తన పుస్తకం ‘యాన్ అన్‌సర్టైన్ గ్లోరీ’లో రాసిన కొన్ని విషయాలను శివజ్ఞానం బీబీసీతో పంచుకున్నారు.

భారత్ వెనుకబడిన సమయంలో కూడా తమిళనాడు మంచి పనితీరును కనబర్చిందని అమర్త్యసేన్ తన పుస్తకంలో ప్రశంసించారు.

‘‘గుజరాత్ తయారీ రంగంలో ముందంజలో ఉంటుంది. కానీ, అభివృద్ధి పంపిణీ, మానవ వనరుల అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. కేరళ మానవ వనరుల అభివృద్ధిలో ముందంజలో ఉండి, తయారీ రంగం, ఐటీలో వెనుకబడింది. కానీ, అన్నింట్లో అభివృద్ధి సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం తమిళనాడు. ఇదంతా తమిళనాడు రాజకీయ సిద్ధాంతంపైనే ఆధారపడింది’’ అని ఆ పుస్తకంలో అమర్త్యసేన్ విశ్లేషించారు.

తమిళనాడు శకటం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఈ అభివృద్ధి సరిపోతుందా?

ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు తమిళనాడుకు ఈ అభివృద్ధి సరిపోతుందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.

‘‘తమిళనాడు ఇంకా అభివృద్ధి సాధించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు మనం చాలా ముందంజలో ఉన్నాం. సామాజిక, ఆర్థిక అభివృద్ధి అవసరం. ఈ రెండింటి అభివృద్ధిని అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తమిళనాడు’’ అని శివజ్ఞానం చెప్పారు.

వీడియో క్యాప్షన్, విజయ్: హీరోయిజం రాజకీయాల్లో రాణిస్తుందా? - వీక్లీ షో విత్ జీఎస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)