తెలంగాణ తల్లి, తెలుగు తల్లి, ఆంధ్ర మాత... భాషా రాష్ట్రాల్లో ఈ విగ్రహాల సంప్రదాయం ఎప్పుడు మొదలైంది, ఎలా మారుతోంది?

తెలంగాణ తల్లి

ఫొటో సోర్స్, UGC/Revanth ReddyFB

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ తల్లి మారిపోనుంది. కాస్త ఆశ్చర్యంగా, కొందరు నొచ్చుకునేలానూ ఉన్నప్పటికీ వాస్తవం అదే.

గతంలో ఆంధ్రా తల్లి కూడా మారింది. ఇప్పుడు తెలంగాణ తల్లి వంతు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈ తల్లుల మార్పు విషయం చర్చనీయాంశం అయింది.

భారతదేశంలో బ్రిటిష్ కాలంలో స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా దేశభక్తి ఉద్యమాలు బాగా జరిగాయి. ఆ క్రమంలో భారతమాత వంటి భావనలను విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చారు. ప్రాచీన భారతదేశంలో భారతమాత అనే భావన లేదు.

అయితే, రాజ్యలక్ష్మి, భూదేవి అనే భావనలు విస్తృతంగా ఉండేవి. ‘‘రాజులు తమ రాజ్యలక్ష్మి చేజారిపోకుండా చూడాలనుకోవడం’’ వంటి రిఫరెన్సులు ప్రాచీన కవిత్వంలో చాలా కనిపిస్తాయి.

మాతృభూమిని తల్లిగా, దేవతగా పూజించే భావనకు హిందూ మతంలోని దుర్గ, కాళీ, భూదేవి ఆరాధనకు దేశభక్తిని మేళవించి భారతమాత అనే భావనను బ్రిటిష్ కాలంలో విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చారు.

ఇక స్వాతంత్య్ర ఉద్యమం కాస్త తగ్గిన తర్వాత, ప్రాంతాల వారీగా ఆయా భాషల వారు కూడా తమ భాష పేరుతో తల్లి అనే భావనను ముందుకు తీసుకురావడం ప్రారంభించారు.

తెలుగు తల్లి

ఆంధ్ర మాత నుంచి తెలుగు తల్లి

నిజానికి తెలుగు వారికి తల్లి కాన్సెప్టు మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రా వాళ్లు ఉన్నప్పుడు ప్రారంభం అయింది.

అప్పట్లో ఆంధ్రమాత అనే పేరుతో కేవలం ఆంధ్ర రాష్ట్రం మ్యాపులో ఒక మహిళ చిత్రాన్ని ప్రచారంలోకి తెచ్చారు కొందరు. ఆ మ్యాపులో తెలంగాణ ఉండదు.

అప్పటికి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉంది. మద్రాసు రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఉండేవి.

కానీ, ఆ భావన అంత ప్రాచుర్యంలోకి రాకముందే, తెలుగు తల్లి వచ్చేసింది. గుర్రం జాషువా స్వయంగా ఆంధ్ర మాత పేరుతో కవిత రాశారు. అందులో తెలుగు వారి చరిత్ర వర్ణించారు.

‘‘ప్రసిద్ధ పరిశోధకులు సురవరం ప్రతాప రెడ్డి ఆంధ్ర మాత అనే పదాన్ని వాడారు. మహా ఘనత వహించిన నిజాం ప్రభువరేణ్యుల పాలనలోని ఆంధ్ర ప్రాంతము (అంటే ప్రస్తుత తెలంగాణ) పూర్వకాలము నుండియు ఆంధ్ర భాషామతల్లికి విహార రంగస్థలమై యొప్పారిచున్నది అని గోలుకొండ కవుల సంచికలో రాశారు.

అంటే తెలంగాణను ఆంధ్ర భాషా తల్లికి కార్యక్షేత్రంగా సురవరం వారు చెప్పారు’’ అని బీబీసీకి తెలుగు జంబూద్వీపం అనే చరిత్ర పరిశోధక ట్విట్టర్ హ్యాండిల్ నిర్వాహకులు చెప్పారు.

తెలుగు తల్లి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తెలుగు తల్లి

తెలుగు తల్లి ఎలా పుట్టింది?

మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోవాలనుకున్నప్పుడు ఆంధ్రమాత భావన మొదలై తరువాత క్రమంగా తెలుగు తల్లి భావనగా స్థిరపడింది.

అదే సమయంలో వి. నాగయ్య నటించిన దీనబంధు సినిమాకు హెచ్ఎం రెడ్డి డైరెక్టర్. ఆ సినిమా కోసం 1942లో శంకరంబాడి సుందరాచారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట రాశారు.

ఆ పాటే తెలుగు తల్లి భావనను విస్తృతంగా ప్రచారంలోకి తేవడానికి సాయపడింది. అయితే, అది ఆ సినిమాలో వాడలేదు.

తరువాత కాలంలో హెచ్ఎంవీ వారు టంగుటూరి సూర్యకుమారి చేత ఆ పాట రికార్డు చేయించి క్యాసెట్ విడుదల చేశారు.

‘‘వాస్తవానికి 1975 ముందు మా తెలుగు తల్లికి పాట అంత ప్రాచుర్యం సంతరించుకోలేదు. స్వాతంత్ర్య పోరాటం మొదలుకుని మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోయే వరకూ అంటే ప్రత్యేక ఆంధ్రోద్యమంలో మాత్రమే ఆ పాటకు ప్రజాదరణ మొదలైంది.

ఎప్పుడైతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో ఆ పాట వాడకం తగ్గింది. తిరిగి జలగం వెంగళ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల తరువాత మళ్లీ ఆ పాటకు ప్రాధాన్యం పెరిగింది’’ అని బీబీసీకి చెప్పారు ఆచార్య పులికొండ సుబ్బాచారి.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, FB/Anumula Revanth Reddy

ఫొటో క్యాప్షన్, రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి

మా తెలుగు తల్లి పాటను ఏ సినిమా కోసం రాశారో అందులో వాడనప్పటికీ, తరువాత కాలంలో చాలా సినిమాల్లో వాడారు. యన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు కూడా విస్తృతంగా ఆ పాటను వాడారు.

ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ తమ కార్యాలయంలో ప్రతి సమావేశంలో తప్పకుండా ఈ పాట వాడుతుంది. రాష్ట్రం విడిపోక ముందు ప్రభుత్వ కార్యక్రమాల్లో, విద్యాలయాల్లో ఈ పాట పాడించేవారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో మా తెలుగు తల్లి పాట, తెలుగు తల్లి భావన మీద వ్యతిరేకత మొదలైంది. దీంతో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ప్రాంతంలో ఈ పాట పాడడం తగ్గింది.

అయితే, ఆ పాట స్ఫూర్తితోనే తెలుగు తల్లి రూపం పుట్టింది. 1975లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహా సభలు ఎంతో వైభవంగా జరిగాయి.

‘‘ఆ సభల కోసం ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరి రావు తెలుగుతల్లి చిత్రాన్ని మొట్టమొదట చిత్రించారు.’’ అని బీబీసీకి చెప్పారు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో శిల్ప శాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ బీవీఆర్ చారి.

చిత్రం ఏంటంటే ఆ కొండపల్లి శేషగిరి రావు కూడా తెలంగాణకు చెందిన వ్యక్తే. ఆ చిత్రపటం ఆధారంగానే తెలుగు తల్లి శిల్పం రూపొందించారు.

అయితే, తెలుగు తల్లి విగ్రహం ఎవరు రూపొందించారన్నదానిపై సమాచారం అందుబాటులో లేదు. తెలుగు తల్లి చేతిలో పూర్ణ కుంభం, వరి కంకులు ఉంటాయి.

అంతేకాదు, ఆమె చీరకట్టు కూడా గోచి కట్టు తరహాలో ఉంటుంది. ప్రస్తుత వ్యవహారంలోని చీరకట్టులాగా ఉండదు.

వాస్తవానికి మా తెలుగు తల్లి పాటలో కృష్ణ, గోదావరి నదుల ప్రస్తావన సంగతి పక్కన పెడితే, తెలంగాణ గురించి ఒక్క రుద్రమ్మ తప్ప మరే ప్రస్తావన ఉండదు. మొత్తం ఆంధ్రకు సంబంధించిన ప్రస్తావనలే ఉంటాయి.

తెలుగు ప్రజలందరి పాట అయితే ఒకే ఒక్క తెలంగాణ ప్రస్తావన, అది కూడా రెండు ప్రాంతాలను పాలించిన రుద్రమ పేరు తప్ప మరే తెలంగాణ ప్రస్తావన లేకపోవడాన్ని తరచూ తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నించేవారు.

తెలంగాణ తల్లి

ఫొటో సోర్స్, Jakka Reddy

తెలంగాణ తల్లి ఎలా పుట్టింది?

తెలంగాణలో కూడా పూర్వం నుంచి తెలంగాణ తల్లి భావన ఉండేది. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ తల్లి అనే పదాన్ని వాడారు.

తరువాత ఆ భావన మళ్లీ తెలంగాణ ఉద్యమంలో పెరిగింది. దాశరథి ‘‘తెలంగాణ తల్లి, ఆంధ్ర అంబిక అనే పదాలను ఈ రెండు ప్రాంతాలకు పర్యాయ పదాలుగా వాడేవారు. ఆయన రాసిన మహాంధ్రోదయంలో ఇలా రాశారు.

తెలంగాణ తల్లి పేరుతో కవిత కూడా రాశారు. తెలుగు మాత, ఆంధ్ర మాత, తెలంగాణ తల్లి పదాలను ఆయన సమాన అర్థంతో రెండు ప్రాంతాలకు కలిపి వచ్చేలా వాడేవారు. తెలంగాణ తల్లి పదాన్ని రెండు ప్రాంతాలకూ కూడా వాడారు దాశరథి.

ఇక గుంటూరు నుంచి వచ్చి తెలంగాణ సంస్కృతి గురించి విశేషంగా పనిచేసిన శేషాద్రి రమణ కవులు ఈ నేలను తల్లి నిజాము భూమి, నైజాము రాష్ట్ర మాత అని పిలిచేవారు’’ అని బీబీసీకి చెప్పారు తెలుగు జంబూద్వీపం అనే చరిత్ర పరిశోధక ట్విట్టర్ హ్యాండిల్ నిర్వాహకులు.

‘‘ఆంధ్ర మాతే తెలుగు తల్లి అయింది. మేం ఆంధ్ర మాతను గౌరవిస్తాం, కానీ తెలుగుతల్లిని కాదు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఒకసారి కర్నె ప్రభాకర్ అన్నారు.

ఆంధ్ర మాతను ప్రత్యేక ఆంధ్రకు చిహ్నంగా గుర్తించడం వల్ల ఆయన ఆ మాట అన్నారు. తెలుగు తల్లి స్థానంలో తెలంగాణ తల్లి భావనను ప్రచారం చేశారు తెలంగాణ ఉద్యమకారులు.

కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి, తెలుగు తల్లి భావనను ప్రశ్నించి, ఖండించి, తెలంగాణ తల్లి భావనకు ప్రాచుర్యం కల్పించారు.

అదే సమయంలో కొందరు తెలంగాణ ఉద్యమకారులు కూడా తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.

‘‘విశాల సాహితీ ఆఫీసులో సుదీర్ఘ చర్చల తరువాత, తెలంగాణ భవన్లో పలు దఫాలుగా పలువురితో చర్చించిన తరువాత ఈ రూపం దిద్దుకుంది. మొదట మేము తయారు చేసిన రూపాన్ని వార్త పత్రికలో ఉగాది సందర్భంగా ప్రచురించారు. కానీ తెలంగాణ తల్లి అనే పేరు పెట్టలేదు. తరువాత ప్రజాతంత్ర పత్రిక వారు కవర్ పేజీలో ఈ ఫోటో వేసి, తెలంగాణ తల్లి అనే పేరు కూడా పెట్టారు.

కొంగు నడుము చుట్టూ చుట్టుకున్న రైతాంగ మహిళ తరహాలో చేశాం. ఆ తరహా విగ్రహం జనగామ దగ్గర బేగంపేట గ్రామంలో పెట్టారు ఒకరు. ఆ ఫోటోను ఫ్లెక్సీల్లో వేసి తెలంగాణలో బీఆర్ఎస్ సభలు జరిగే చోట ఏర్పాటు చేసేవాళ్లం. తరువాత పలు దఫాల్లో కేసీఆర్ సమక్షంలో నేనూ, ఎక్కా యాదగిరి రావు, కాపు రాజయ్య, జేఎన్టీ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటి ప్రొఫెసర్ గంగాధర్, దుర్గం రవీంద్ర, ఆలె నరేంద్ర, నందిని సిధారెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారు కూర్చుని అనేక చర్చోపచర్చలు, సూచనలు, అభిప్రాయాల తరువాత ప్రొఫెసర్ గంగాధర్ తుదిరూపం ఇచ్చారు తెలంగాణ తల్లికి. ఆ రూపాన్ని బీవీఆర్ చారి విగ్రహంగా మార్చారు. వరంగల్ మాజీ ఎంపీ పసునూరి రవీందర్ విగ్రహాలను విస్తృతంగా వ్యాప్తిలో పెట్టారు.’’ అంటూ విగ్రహ ఏర్పాటు గురించి వివరించారు తెలంగాణ బీసీ కమిషన్ పూర్వ చైర్మన్, రచయిత బీఎస్ రాములు.

తెలంగాణ తల్లి
ఫొటో క్యాప్షన్, తెలంగాణ తల్లి

‘‘తెలంగాణ తల్లి సాధారణ మహిళలా కాకుండా భరతమాత బిడ్డలా, రాజఠీవితో, దైవత్వంతో ఉండాలని కేసీఆర్ అనుకున్నారు. పచ్చ రంగు చీర బదులు మెజెంటా రంగు చీర ఆలె నరేంద్ర సూచించారు. ఇక మేము వజ్రాలు, కిరీటాలు, వెండి ఆభరణాలు, గద్వాల చీర, చేతిలో మెట్ట పంటలు ఇలాంటివి చేర్చాం’’ అన్నారు రాములు.

ఈ తెలంగాణ తల్లి రూపకల్పనకు తెలంగాణ ఉద్యమ కారుల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కేసీఆర్ దగ్గరకు దాదాపు 60 వరకూ నమూనా చిత్రాలు వచ్చాయి.

ఈ శిల్పం రూపకల్పనకు సంబంధించిన ఆనాటి విశేషాలను గుర్తు చేసుకుంటూ బీవీ చారి, ‘‘సాధారణ స్త్రీ కాకుండా దైవత్వం ఉట్టిపడే రూపం కావాలని కేసీఆర్ కోరారు. ఇక నేను స్వయంగా లోహపు పనులు చేసే కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి తెలంగాణ మహిళలు వేసుకునే కంఠాభరణాలు, వడ్డాణం, కాలి ఆభరణాలు అన్నీ తెలంగాణ పద్ధతిలోనే పెట్టాను. ఆ విగ్రహం చూడగానే నిర్మలంగా ఉందని కేసీఆర్ అన్నారు. నేను నిర్మల్ వాడిని కదా అందుకే నిర్మలంగా ఉందని అంటే నవ్వేశారు’' అని బీబీసీతో చెప్పారు.

ఈ శిల్పంలో చీరకట్టు తెలుగు తల్లి మాదిరి గోచి కట్టు కాకుండా, వ్యవహారిక చీరే ఉంటుంది. కానీ, ఒక చేతిలో మొక్కజొన్న, జొన్న కంకులు, మరో చేతిలో బతుకమ్మ ఉంటుంది.

2003లో ఈ విగ్రహాన్ని మొదటిసారి టీఆర్ఎస్ ఆఫీసు అయిన తెలంగాణ భవన్‌లో ప్రతిష్టించారు. ఇక అక్కడ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఊరూరా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ఇటీవలే నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం దగ్గర కూడా బంగారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు.

అయితే, ప్రస్తుతం తెలంగాణ తల్లి రూపం మార్చాలనే అంశంపై ఆ విగ్రహాన్ని రూపొందించిన చారి మాట్లాడటానికి నిరాకరించారు.

అయితే చాకలి ఐలమ్మ విగ్రహాన్నే తెలంగాణ తల్లిగా స్వీకరించాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

బంగారు నగలతో ఉన్న ఈ రూపం ఎవర్నో ఊహించి తయారు చేసిందనీ, అసలైన తెలంగాణ తల్లిని మేం తీసుకువస్తాం అంటూ సరికొత్త ప్రకటన చేశారు అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి.

2022 సెప్టెంబరులో గాంధీ భవన్‌లో తెలంగాణ తల్లి పేరిట వేరే శిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు.

అందులో చేతులో జొన్న కంకి, మెడలో వెండి కడియం, బంగారు నగలు కిరీటం లేకుండా, పాపిడ తీసిన జుట్టు, మూడు రంగుల చీర, ఒక చేతిలో అభయ ముద్రతో, కాలికి కడియాలు, చేతికి సాదా గాజులు వేసుకున్న రూపాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి.

తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

‘‘కేసీఆర్ నియంతృత్వ పోకడల ఆధారంగా ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపొందింది. మేం అందర్నీ సంప్రదించి విగ్రహంలో మార్పులు చేస్తాం’’ అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.

కేవలం విగ్రహమే కాదు, అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా తీసుకుంటామని కూడా ప్రకటించిన రేవంత్ రెడ్డి దానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేయించారు.

నిజానికి తెలంగాణ ఏర్పడగానే ఈ పాటను రాష్ట్ర గీతంగా తీసుకుంటారని ప్రచారం జరిగినా ఎందుకో అది అమలు కాలేదు.

‘‘వందనమిది వందనమిది తెలంగాణ తల్లి’’ అంటూ ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి కూడా తెలంగాణ తల్లిపై ఒక ప్రార్థనా గీతం రాసి వీడియో విడుదల చేశారు.

ఇక రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు ఉంటాయని ప్రభుత్వం అంటోంది. కాకతీయ తోరణం మాత్రమే మొదట్లో ఉండేది. అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి తరువాత చార్మినార్ అందులో చేర్చారు.

చిహ్నాలు, గీతాలు సరే కానీ విగ్రహంలో మార్పులు చేస్తే, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టించిన వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు, కొత్తగా ప్రతిష్టించబోయే విగ్రహాల సంగతేంటి?

ఒక వేళ మళ్లీ ప్రభుత్వం మారి పాత విగ్రహాలనే కొనసాగించాలనుకుంటే ఏంటి అన్న ప్రశ్నలకు సమాధానం లేదు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, FB/Anumula Revanth Reddy

ఏయే రాష్ట్రాలకు తల్లులున్నారు?

ఈ తల్లి భావన తెలుగు, తమిళ, కన్నడల్లోనే ఎక్కువ ఉంది. ఆంధ్ర-తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలకు వారి వారి మాతల భావనతో పాటూ కొన్ని రూపాలు, విగ్రహాలు ఉన్నాయి.

తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, కన్నడతాయి – ఈ మూడు రూపాలు నిల్చొని ఉంటాయి. కిరిటాలు సహజం.

కానీ, తమిళతాయి మాత్రం కూర్చొని ఉండే రూపంలో ఉంటుంది. తమిళ తాయి విగ్రహం దాదాపు హిందువులు పూజించే అమ్మవారి విగ్రహానికి దగ్గరగా ఉంటుంది.

ఇక ఒడిశా వారికి ఉత్కళ జనని ఉన్నప్పటికీ ఇంత పాపులర్ కాదు. బెంగాలీలకు వంగ మాత కూడా ఉంది. కానీ వంగ మాతకు ప్రధానంగా విగ్రహాలు, రూపాలు లేవు.

కేవలం బెంగాలీల ఐక్యత ప్రస్తావన వచ్చినప్పుడు వంగ మాత అనే పేరు వాడతారు. కాకపోతే ఈ వంగ మాత భారతీయులకు పరిమితం కాదు. ఇటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, అటు బంగ్లాదేశ్ దేశం ఈ ఇద్దరికీ ఉమ్మడిగా వంగ మాత వర్తిస్తుంది.

మిగిలిన భాషా రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, గుజరాత్ వంటి చోట్ల ఈ భావన లేదు. ఆయా భాషల, రాష్ట్రాల ప్రఖ్యాతి, గర్వాన్ని చాటడానికి వేరే పదాలు ఉన్నాయి.

కేరళ మాతను కూడా అప్పట్లో ఒకరిద్దరు చిత్రించారు కానీ, అంత పాపులర్ కాలేదు. ఇక విగ్రహం లేకపోయినా, శ్రీలంకకు కూడా మాత ఉంది.

ఈ శ్రీలంకమాత మీద సింహళ, తమిళాల్లో పాట కూడా ఉంది. ఈ భావన కూడా అక్కడ 1950లలోనే పుట్టింది. 100-150 ఏళ్ల నుంచే ఈ భారతమాత, ఇతర రాష్ట్రాల మాతల భావనలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.

1882 బెంగాలీ నవల ఆనంద మఠ్‌లో దుర్గామాత - కాళీమాత తరహాలో భారత మాతను వర్ణించారు. 1904లో చేతిలో జపమాల, తాళపత్రాలతో భారతమాత పెయింటింగ్ వేశారు. తరువాత సింహం జెండా కిరీటం ఉన్న మహిళగా భారతమాత చిత్రాన్ని మార్చారు.

రాష్ట్రాల తల్లుల్లోకెల్లా తమిళ తల్లి కాస్త పాతవారు. 1891లో ప్రచురించబడిన మనోన్మణియం అనే నాటికంలో తమిళ తల్లిని పొగుడుతూ ఉండే పాట ఉంది.

అప్పటి నుంచి తమిళ తల్లి ఆరాధన వచ్చింది. ఆవిడకు కూర్చుని ఉండే విగ్రహాలు పెట్టారు.

తమిళతాయివళ్తు అనే పాట ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్‌లో బయటకు వచ్చింది. శివగంగ దగ్గర కారైకుడిలో గుడి కూడా కట్టారు.

విచిత్రం ఏంటంటే తమిళ తల్లి రూపం మీద కూడా రకరకాల వివాదాలు ఉన్నాయి.

ఇక రాష్ట్ర గీతాల సంస్కృతి కూడా దక్షిణ భారతదేశం నుంచే ఎక్కువగా మొదలైంది. చాలా ఉత్తరాది రాష్ట్రాలు ఈ మధ్యే రాష్ట్ర గీతాలను ఎంపిక చేసుకుంటున్నాయి.

ఈ సంస్కృతి కూడా మరీ పాతది కాదు. ప్రభుత్వ కార్యక్రమాలు రాష్ట్ర గీతంతో మొదలై జాతీయ గీతమైన జనగణమనతో ముగిసే సంప్రదాయాన్ని కరుణానిధి తమిళనాడులో 1970లలో ప్రారంభించారు.

కానీ తమిళనాడు కూడా తమ రాష్ట్ర గీతానికి అధికారిక హోదాను 2021లోనే ఇచ్చింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలూ దాదాపు 2000 తరువాతే తమ రాష్ట్రాలకు అ‌‍ధికారిక గీతాలను పెట్టుకోవడం ప్రారంభించాయి.

భాషామ తల్లి భావన లేని రాష్ట్రాలు కూడా పాటలు మాత్రం చేయించుకుంటున్నాయి. దక్షిణ భారతదేశంలో భాషకు తల్లి, పాట రెండూ లేనిది కేరళ మాత్రమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)