శ్రీలంకలో రోజుకు ఒక ఏనుగు ఎందుకు చనిపోతోంది?

ఏనుగులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంకలో అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నఏనుగులు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయి
    • రచయిత, అంబరసన్ ఎతిరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
    • నుంచి, శ్రీలంక నుంచి

సుమిత్ర మల్కంది తన భర్తను నిరుడు మార్చిలో ఏనుగులు తొక్కి చంపిన ఘటన గురించి వివరిస్తూ కంట నీరు పెట్టుకున్నారు.

ఆ దంపతులిద్దరూ సెంట్రల్ శ్రీలంకలోని ఒక వ్యవసాయ గ్రామంలో నివసించే వాళ్లు.

ఆ రోజు ఆమె వంటగదిలో ఏదో పనిలో ఉంది. ఆమె భర్త తిలక్ కుమార, బయట వాళ్ల ఆవులకు మేత వేస్తున్నారు. అప్పుడే ఆమెకు ఏనుగు ఘీంకారం వినిపించింది.

తాను భర్తను అప్రమత్తం చేయబోయానని, అయితే "నిమిషాల్లోనే జరగరానిది జరిగిపోయింది" అని ఆమె చెప్పారు. గ్రామస్థుల కేకలు విని ఏనుగు పారిపోయిందని తెలిపారు.

తన కుటుంబం ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదని ముగ్గురు కూతుళ్లు ఉన్న 45 ఏళ్ల మల్కంది చెప్పారు. ఇలాంటి ఘటన మళ్లీ జరగవచ్చని ఆమె ఆందోళన చెందుతున్నారు

చుట్టూ కొబ్బరి, మామిడి, అరటి చెట్లు ఉన్న వాళ్ల ఇల్లు ఒక పొలంలో ఉంది. అది దట్టమైన అడవికి కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉంది. ఏనుగులకు అలాంటి ప్రదేశాలను చూస్తే విందు భోజనమే.

కురునెగల జిల్లాలోని ఆమె గ్రామం తల్గస్వేవా. ఇప్పుడు మనుషులు-ఏనుగుల మధ్య జరుగుతున్న తీవ్రమైన సంఘర్షణకు కేంద్రంగా ఉంది.

గత రెండేళ్లలో తల్గస్వేవా, సమీప గ్రామాలలో ముగ్గురు వ్యక్తులు, పది ఏనుగులు మృతి చెందాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.

గ్రామస్థులు ఇప్పుడు సూర్యాస్తమయం తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

కానీ సమస్య ఈ చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు.

మల్కంది

ఫొటో సోర్స్, BBC/ ANBARASAN ETHIRAJAN

ఫొటో క్యాప్షన్, గత ఏడాది తన భర్తను చంపేసిన ఏనుగుల దాడిని మల్కంది ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు.

గత ఏడాది శ్రీలంకలో ఏనుగుల కారణంగా 176 మంది మరణించగా, వారిలో తిలక్ కుమార ఒకరు. ఇదే కాలంలో, 470 ఏనుగులు చనిపోయాయి. వాటిలో సగం మనుషుల చేతుల్లో చనిపోతే, మిగిలినవి అనారోగ్యం లేదా ప్రమాదాల కారణంగా మరణించాయి.

సగటున, రోజు ఒకటి కంటే ఎక్కువ ఏనుగులు చనిపోతే, ప్రతి రెండు రోజులకూ ఒక మనిషి ప్రాణాలు కోల్పోయారు.

వ్యవసాయం విస్తరించే కొద్దీ, ఏనుగుల ఆవాసాలు ఆక్రమణకు గురై, వాటి ఆహారం, నీటి వనరులు కుంచించుకుపోయాయి. ఈ పరిణామం ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది.

"మేము పండించే అన్ని ఆహార పంటలూ వాటికి చాలా ఇష్టం" అని శ్రీలంక ఏనుగుల నిపుణుడు పృథ్వీరాజ్ ఫెర్నాండో తెలిపారు.

కానీ ఈ పరిణామం ఎంతో పేరొందిన శ్రీలంక ఏనుగుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని 2023లో రికార్డు స్థాయిలో సంభవించిన వాటి మరణాల తాజా గణాంకాలు చెబుతున్నాయి.

దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పర్యావరణ పరిరక్షకులు కోరుతున్నారు. ఎందుకంటే మనుషుల, ఏనుగుల మరణాలు ఇప్పటివరకూ ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

ప్రజలు, ఈ జంతువులు ఒకరికొకరు ఎదురుపడితే సంభవించే ప్రాణాంతకమైన పరిణామాలను ఇవి గుర్తు చేస్తున్నాయి.

"(2009లో) అంతర్యుద్ధం ముగిసిన తర్వాత ప్రభుత్వం ప్రజలకు మరింత భూమిని ఇవ్వడం మొదలు పెట్టింది. యుద్ధ సమయంలో ఆ భూములు నిషేధిత ప్రాంతాలుగా ఉండేవి" అని శ్రీలంక కన్జర్వేషన్ సొసైటీ పర్యావరణ శాస్త్రవేత్త చండిమా ఫెర్నాండో చెప్పారు.

దీని వల్ల వ్యవసాయం, నివాస స్థలాలకు ఎక్కువ భూమి అందుబాటులోకి వచ్చిందని, దీంతో ప్రజలు, ఏనుగులు ఒకరికొకరు ఎదురు పడడం ఎక్కువైందని వివరించారు.

క్రమంగా అంతరించిపోయే ముప్పును కలిగి ఉన్న ఏనుగులను చంపడం, శ్రీలంకలో చట్ట ప్రకారం శిక్షార్హం. అక్కడ వాటికి మతపరమైన ప్రాధాన్యంతో పాటు ఆర్థిక విలువ ఉంది.

అక్కడ పెంపుడు ఏనుగులు తరచూ మతపరమైన ఊరేగింపులలో భాగం కావడమే కాకుండా, పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మరణించిన ఏనుగుల సంఖ్య
ఫొటో క్యాప్షన్, నాటు బాంబుల కారణంగా మరణించిన ఏనుగుల్లో 70% ఇంకా యవ్వన దశకు చేరుకోలేదు

2023లో నాటు బాంబుల కారణంగా మరణించిన ఏనుగుల వయసు:

  • 0-10 ఏళ్లు – 30 మరణాలు
  • 11-15 ఏళ్లు – 3 మరణాలు
  • 16-40+ ఏళ్లు – 14 మరణాలు

మూలం: శ్రీలంక అటవీ ప్రాణుల సంరక్షణ విభాగం

అయితే ఇదంతా రైతులు తమ పంటలను, తమ ప్రాణాలను రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోకుండా ఆపలేదు.

జంతువులను పొలాలు, గ్రామాలకు దూరంగా ఉంచడానికి శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ కంచెలను అనుమతించింది. ఆ విద్యుత్ కంచెలు వాటికి తీవ్ర గాయాలు చేయకుండా, కేవలం వాటిని ముందుకు రాకుండా నిలువరిస్తుంది.

ఈ దేశంలో దాదాపు 5,000 కి.మీ (3,100 మైళ్లు) విద్యుత్ కంచె ఉండగా, ప్రభుత్వం దానిని విస్తరించాలని యోచిస్తోంది. తల్గస్వేవాలోనూ ఇళ్ల చుట్టూ విద్యుత్ కంచె ఉంటుంది.

కానీ రైతులు ఏనుగులను చంపేందుకు ఎక్కువ వోల్టేజీతో అక్రమంగా కంచెలను ఏర్పాటు చేసుకున్నారని పర్యావరణ కార్యకర్తలు అంటున్నారు.

అంతే కాకుండా వాళ్లు విషాన్ని, "నాటు బాంబులు" అని పిలిచే పేలుడు పదార్థాలను వాటికి ఆహారపు ఎరగానూ ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు.

కొన్నిసార్లు జంతువుల్ని తరిమికొట్టడానికి వాటిపై తుపాకీతో కాల్పులూ జరుపుతున్నారు.

చండిమా ఫెర్నాండో వంటి నిపుణులు "సిట్రస్ పండ్లు లేదా ఏనుగులను ఆకర్షించని ఇతర పంటలను పండించడం" వంటి పద్ధతులను అనుసరించాలని సిఫార్సు చేస్తున్నారు.

శ్రీలంకలోని రక్షిత ఆవాస ప్రాంతాలైన చిత్తడి నేలలు, గడ్డి భూములు, ఎత్తైన ప్రాంతాలు, పొదలలో సుమారు 5,800 ఏనుగులు సంచరిస్తూ ఉంటాయని అంచనా. అయితే వాస్తవ సంఖ్య దానికన్నా తక్కువగా ఉండొచ్చని కొందరు నిపుణుల అనుమానం.

ఏనుగు సాధారణంగా రోజూ 48 కిలోమీటర్ల వరకు తిరుగుతూ, మంచి నీటి పరిసరాలలోనే ఉంటుంది. ఆహారం అయిపోతే తప్ప అవి ఎక్కువ దూరం నడవవు. కానీ కరువు కారణంగా సురక్షిత ప్రాంతాలకు దూరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు, అవి సమీపంలోని పొలాలకు వెళ్తుంటాయి.

రక్షిత ప్రాంతాల నుంచి బైటికి వచ్చి సంచరించే ఏనుగుల గురించి శ్రీలంక ప్రభుత్వమే ప్రజలను హెచ్చరిస్తోంది. ఎందుకంటే కుంచించుకుపోతున్న అడవులు ఎక్కువ ఏనుగులకు ఆహారాన్ని ఇవ్వలేవు.

ఏనుగులు

ఫొటో సోర్స్, BBC/ANBARASAN ETHIRAJAN

ఫొటో క్యాప్షన్, తరచూ మనుషుల కంటపడడం, కుంచించుకుపోతున్న ఆవాసాలు, కరువులు జంతువుల మనుగడకు ప్రమాదకరంగా పరిణమించాయి

పృథ్వీరాజ్ ఫెర్నాండో 2020లో మనుషులు-ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఏర్పాటు చేసిన అధికారిక కమిటీకి హెడ్‌గా ఉన్నారు.

శ్రీలంక ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నందు వల్ల కొన్నేళ్లుగా ఈ ప్రణాళికను పక్కన పెట్టారు. అయితే ఏనుగుల మరణాలు పెరగడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటోంది.

వరల్డ్‌వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రకారం, 19వ శతాబ్దం ప్రారంభం నుంచి దేశంలో ఏనుగుల జనాభా దాదాపు 65% తగ్గిపోయింది.

ఒక దశాబ్దం క్రితం, శ్రీలంక సంవత్సరానికి 250 ఏనుగులు కోల్పోతే, ఇటీవలి కాలంలో ఆ సంఖ్య బాగా పెరిగింది.

ఇప్పుడు వరుసగా రెండో సంవత్సరం ఏనుగుల మరణాల సంఖ్య 400 దాటింది. ఏనుగుల మరణాలు ఇదే విధంగా కొనసాగితే, శ్రీలంకలోని 70% ఏనుగులు కనుమరుగైపోతాయని పృథ్వీరాజ్ ఫెర్నాండో అన్నారు.

నిపుణులను ఆందోళనకు గురిచేసే మరో విషయం – చనిపోతున్న ఏనుగుల్లో మగ ఏనుగులు ఎక్కువగా ఉంటున్నాయి. దీని వల్ల వాటి మనుగడ ప్రమాదంలో పడుతోంది.

మగ ఏనుగులు తరచూ గ్రామీణ ప్రాంతాలలో ఒంటరిగా తిరుగుతుంటాయి, దీని వల్ల ఆడ ఏనుగులతో పోలిస్తే వాటికి హాని కలిగే అవకాశం ఎక్కువ.

మధ్య శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో ఒక్క మగ ఏనుగు కూడా కనిపించలేదని చండిమా ఫెర్నాండో తెలిపారు. కోవిడ్ మహమ్మారికి ముందు, అవి ఎక్కువగా కనిపించేవి.

రక్షిత ప్రాంతాల వెలుపల ఏనుగుల మరణాలను లెక్కించవచ్చు కానీ, అడవులలో ఏం జరుగుతోందో తగినంత సమాచారం లేదని పరిశోధకులు అంటున్నారు. అక్కడ అనారోగ్యం, అంతర్గత పోరు లేదా కరువు వంటివి మరణానికి కారణాలు కావచ్చని అన్నారు.

తల్గస్వేవా విషయానికి వస్తే, మరోసారి ఏనుగు కంటపడితే ఏం ప్రమాదం జరుగుతుందో అని మల్కంది భయపడుతున్నారు.

"పొలంలోకి చాలా ఏనుగులు వస్తూనే ఉన్నాయి" అని ఆమె అన్నారు. "మాకు ఇక్కడ ఉండాలంటేనే భయంగా ఉంది" అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)