పాంప్లెట్ ఫిష్: సత్పతి తీరంలో ఈ చేపలు ఎందుకు తగ్గిపోయాయి? అలా చేస్తే ఎక్కడైనా ఇదే పరిస్థితి వస్తుందా?

చేపల మార్కెట్

ఫొటో సోర్స్, SHARDUL KADAM/BBC

    • రచయిత, ప్రజక్త పోల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ముంబయి

ఉదయం 6 గంటలవుతోంది. వేటకు వెళ్లిన మత్స్యకారుల బోట్లు సత్పతి పోర్ట్‌(మహారాష్ట్ర)లో వచ్చి ఆగాయి. అప్పటికి పూర్తిగా తెల్లారలేదు. మత్స్యకారులు చేపల ట్రాలర్లను బయటికి తీస్తున్నారు. వేలం మొదలు కాబోతోంది. మేమందరం సిల్వర్ పాంప్లెట్ ఫిష్(చందువా) కోసం వేచిచూస్తున్నాం.

ఉత్తర ముంబయి ప్రాంతం పాల్ఘడ్ జిల్లాలోని సత్పతి గ్రామం సిల్వర్ పాంప్లెట్‌ ఎగుమతికి బాగా ప్రసిద్ధి.

ఎనిమిది నుంచి పది వరకు చిన్న వాగులు, ఈ ఇంటర్‌టైడల్ జోన్‌లో కలుస్తాయి. ఈ ప్రాంతంలో సముద్రపు పాచి ఎక్కువగా పుడుతుంది. పాంప్లెట్‌ చేపలకు ఇదే ఆహారం. చాలా వరకు సిల్వర్ పాంప్లెట్‌లను ఈ ప్రాంతంలో చూడొచ్చు. సూపర్ పాంప్లెట్‌ 500 నుంచి 600 గ్రాముల వరకు ఉంటుంది.

అయితే, చేపల ట్రాలర్స్‌ను తీస్తున్నప్పుడు, చాలా మంది సిల్వర్ పాంప్లెట్ కోసమే చూస్తున్నారు. బోట్లలో ఉన్న వలల నుంచి బొంబిల్ ఫిష్, ఇతర చిన్న చేపలు వస్తున్నాయి తప్ప ఈ సిల్వర్ పాంప్లెట్ కనపడటం లేదు.

ఈ చేప తగ్గిపోవడానికి కారణమేంటి?

పెద్ద బోటులోని చేపల టబ్స్‌‌ను జాగ్రత్తగా బయటికి తీస్తున్నారా? శీతలీకరణ ప్రాంతాలకు సరిగ్గా పంపిస్తున్నారా? అంటూ పంకజ్ పాటిల్ అనే వ్యక్తి పర్యవేక్షిస్తున్నారు. తనకు 15 ఏళ్లు ఉన్నప్పటి నుంచి పంకజ్ ఈ పని చేస్తున్నారు.

గత 26 ఏళ్లుగా చేపల వేట కోసం పంకజ్ సముద్ర వేటకు వెళ్తున్నారు. సిల్వర్ పాంప్లెట్ గురించి ఆయన్ను అడిగినప్పుడు, తన అనుభవాన్ని పంచుకున్నారు.

‘‘అంతకుముందు, ఏడాదంతా పాంప్లెట్ పడేది. 500 గ్రాముల నుంచి 600 గ్రాములుండే పాంప్లెట్‌ను సూపర్ పాంప్లెట్‌గా పిలుస్తాం. ఇది ఎక్కువ క్వాలిటీ ఉన్న పాంప్లెట్. అంతకుముందు టన్నులలో ఈ పాంప్లెట్‌ చేపలు పడేవి. కేవలం పాంప్లెట్ల కోసమే బోట్లు ఉండేవి’’ అని చెప్పారు.

‘‘అయితే, క్రమంగా ఈ పాంప్లెట్లు తగ్గిపోయాయి. 90 శాతం తమ సత్పతి పాంప్లెట్లు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. పాంప్లెట్లు తగ్గిపోవడం ఆదాయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది’’ అని పంకజ్ పాటిల్ తెలిపారు.

చేపలకు పెరుగుతున్న డిమాండ్ వల్ల ఆధునిక చేపల వేట విధానం, నిబంధనల ఉల్లంఘన ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి.

పెద్ద ప్రాజెక్టులు వేగంగా చేపడుతున్నారు. బోయిసర్, తరాపుర్ ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రాలు, రసాయన కర్మాగారాలు పెరిగాయి. రసాయన కాలుష్యం సముద్ర జలాల్లో కలుస్తోంది. దీని వల్ల పాంప్లెట్ ఉత్పత్తి తగ్గిపోతోంది.

పాంప్లెట్ ఫిష్

ఫొటో సోర్స్, SHARDUL KADAM/BBC

పాంప్లెట్‌కు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉంది. సత్పతి తీరంలో ఈ చేప దొరకకపోతున్నప్పటికీ, వివిధ పరిమాణాల్లో వలలను, బోట్లను, చేపల వేటలో ఆధునిక విధానాలను వాడుతున్నారు.

‘‘ఆధునిక విధానంలో చేసే చేపల వేట సముద్ర సహజ సమతౌల్యానికి హాని కలిగిస్తుంది. అసలు ఆధునిక చేపల విధానమంటే ఏమిటి’’ అని అఖిల్ మహారాష్ట్ర ఫిషర్‌మెన్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర తాండెల్ చెప్పారు.

చేపలు వలలో చిక్కుకున్నప్పుడు మత్స్యకారులు ఎక్కువ శ్రమించాల్సినవసరం లేకుండా, ఆటోమేటిక్ సిస్టమ్‌ను తీసుకొచ్చి ఆధునిక వలలను ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం ఆధునిక వలలను వాడుతున్నారు. వలలో చేపలు చిక్కుకున్నప్పుడు ఎక్కువ శ్రమించాల్సినవసరం లేకుండా మత్స్యకారుల కోసం ఆటోమేటిక్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. కానీ, ఆధునికత పేరుతో, సముద్రపు సహజ సమతౌల్యాన్ని, నిబంధనలను ఉల్లంఘించడం సరికాదు కదా.

‘‘మహారాష్ట్ర అంతటా 18 వేల మంది మత్స్యకారులు ఉంటారు. చేపల సంఖ్య తగ్గడంతో, ప్రభుత్వం అధికారికంగా 494 బోట్లు చేపల వేటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

కానీ, రోజూ అనుమతి లేకుండా చేపల వేట కోసం 1,300 వరకు బోట్లు సముద్రంలోకి వెళ్తుంటాయి. ఎందుకు వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకంటే, వాటిని అడ్డుకునే వ్యవస్థ ప్రభుత్వం వద్ద లేదు’’ అని తాండెల్ అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఆధునిక చేపల వేట వల్ల ప్రభావమెంత?

అనాదిగా చేపల వేట చేసే మత్స్యకారులు, వలను ఒక నిర్దిష్ట పరిమాణంలో వాడేవారు. ఆటుపోట్లు తక్కువున్న దగ్గర వలను వేసి, ఆటుపోట్లు ఎక్కువున్న దగ్గర బలంగా బయటికి లాగేవారు. ఇది పెద్ద సైజున్న చేపలు పడేందుకు సహకరిస్తుంది.

అదే విధంగా, ఈ రకమైన చేపల వేటను బ్రీడింగ్ సీజన్‌లో(చిన్నచేపలు పుట్టే సీజన్‌లో) పూర్తిగా నిలిపివేస్తారు. 100 గ్రాముల కంటే తక్కువ పరిమాణంగల పాంప్లెట్ చేపలను పట్టడానికి వీలులేదు.

కానీ, ప్రస్తుతం చేపల సంఖ్య తగ్గింది. డిమాండ్ పెరిగింది. అందుకే, కొత్త రకం చేపలు పట్టే విధానాలు అమల్లోకి వస్తున్నాయి. పర్స్‌సీన్ ఫిషింగ్, ఎల్ఈడీ, ట్రాల్, ఫిష్ ఫైండింగ్(చేపలు కనుగొనడం) వంటి విధానాలను మత్స్యకారులు అందిపుచ్చుకుంటున్నారు.

పర్స్‌సీన్‌ ఫిషింగ్ విధానంలో.. పైనుంచి మెష్‌ను మూసివేస్తారు. దీని డయామీటర్ చిన్నగా ఉంటుంది. దీనిలో చిన్న చేపలు కూడా చిక్కుకుపోగలవు.

సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో నాలుగు నెలల పాటు వెంగుర్లా, మురుద్ జంజిరా ప్రాంతాల్లో బంగ్డా, టార్లి చేపలను పట్టుకోవడానికి మాత్రమే ఈ విధానానికి ప్రభుత్వం అనుమతిస్తుంది.

కానీ, 12 నెలల పాటు ప్రతి దగ్గర ఈ విధానాన్ని వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి.

ట్రాల్ విధానంలో బాక్స్ నెట్ ఉంటుంది. బోటు సాయంతో సముద్రంలోకి దీన్ని పంపిస్తుంటారు. బోటు ముందుకు కదిలినప్పుడు, పలు సముద్రపు మొక్కలు, చేపలు, సముద్రంలోని ఇతర జీవులు, పాచి దీనిలో కూరుకుపోతుంటాయి. దీని వల్ల సముద్రపు చైన్ దెబ్బతింటుంది.

ఎల్‌ఈడీ ఫిషింగ్‌లో.. సముద్రంలోకి ఎల్‌ఈడీ లైట్లను వేస్తారు. చేపల కదలిక చంద్రుని వెలుతురు బట్టి ఉంటుంది. పున్నమి రోజు చేపలన్నీ పైకి వస్తాయి. అమావాస్యకు సముద్రం లోపలికి వెళ్తాయి. సముద్రంలోకి ఎల్‌ఈడీ లైట్లను వేసినప్పుడు, ఆ వెలుతురుకు చేపలు ఆకర్షితమవుతాయి.

చేపల బోట్లు

ఫొటో సోర్స్, SHARDUL KADAM/BBC

ఇది చిన్న, పెద్ద చేపలన్నింట్లో జరుగుతుంది. చేపలకు ఆహారంగా ఉండే సముద్రపు పాచి, క్షీరదాలు కూడా వలల్లో కూరుకుపోతాయి.

చేపలకు ఆహారంగా ఉండే సూక్ష్మ క్షీరదాల నుంచి ఎన్నో జీవులు దీనిలో చిక్కుకుపోతాయి. ఆ తర్వాత చిన్న చేపలను సముద్రంలోకి వదులుతారు. వీటిని సముద్రంలోకి వదిలే సమయంలో కొన్ని చేపలు, ఇతర జీవులు చనిపోతాయి. అందుకే, ఈ ఫిషింగ్ విధానాన్ని అసహజమైనదిగా చూస్తారు.

‘ఫిష్ ఫైండింగ్’ యాప్ లేదా ‘సోనార్ సిస్టమ్’ సముద్రంలో చేపలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో చూపిస్తుంది. ఈ విధానం వల్ల భవిష్యత్తులో చేపలు దొరకడం కష్టమవుతుంది.

‘‘డీప్ సీ ఫిషింగ్‌లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ అత్యధికంగా చేపల వేట జరుగుతుంది. దీంతో, చేపల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. చివరికి పెద్ద బోట్లను నీళ్లలోకి వెళ్లడాన్ని కూడా చైనా నిలిపివేసింది. మనం చర్యలు తీసుకోకపోతే, భారత్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని చాలా మంది శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు’’ అని ఓషియానోగ్రాఫర్ భూషణ్ భోయిర్ అన్నారు.

చేపల మార్కెట్

ఫొటో సోర్స్, SHARDUL KADAM/BBC

చేపల సంరక్షణకు చేయాల్సిందేంటి?

పాంప్లెట్ చేపను మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చేపగా ప్రకటించింది. కానీ, అంతకుముందు ఎక్కువగా దొరికే ప్రాంతాల్లో ఈ చేపలు వేగంగా తగ్గిపోతున్నాయి.

సత్పతి గ్రామంలో అంతకుముందు టన్నుల కొద్దీ దొరికిన సూపర్ పాంప్లెట్ చేపలు, ఆ తర్వాత తగ్గిపోయాయని సత్పతి ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ సొసైటీ గణాంకాల్లో తేలింది. కరోనా కాలంలో ఈ సంఖ్య కాస్త పెరిగినా, ఆ తర్వాత మళ్లీ తగ్గిపోయింది.

పర్యావరణంలో వస్తున్న మార్పులు, చేపల వలసపై చేపల నిపుణుడు డాక్టర్ మంగేష్ శ్రీధంకర్ మాట్లాడారు. ‘‘పర్యావరణ మార్పు వల్ల చాలా చేపలు వలస వెళ్తున్నాయని నిపుణుల అధ్యయనాలు చెబుతున్నాయి. జూన్ నుంచి ఆగస్ట్ మధ్య కాలంలో పాంప్లెట్‌ బ్రీడింగ్ సీజన్ ఉంటుంది. చేపలు పిల్లలకు జన్మనిచ్చే సమయంలో ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో వేటను ఆపేయాలి’’ అని ఆయన చెప్పారు.

తన పరిధిలోని సముద్ర ప్రాంతాల్లో ఈ చేపలు తగ్గిపోతుండటంతో, మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని కాపాడేందుకు రాష్ట్ర చేపగా ప్రకటించింది. చేపల వేటను ఎక్కువగా చేపడుతుండటంతో దీని పునరుత్పత్తికి ఆటంకం కలిగి, కొత్తగా పుట్టే చేపలు తగ్గిపోతున్నాయని సెంట్రల్ మెరీన్ ఫిషరీస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఎంఎఫ్ఆర్ఐ) తన నివేదికలో తెలిపింది.

అదే విధంగా ఈ చేపలు బాగా తగ్గిపోతుండటంతో చేపలు పట్టే సమయంలో చిన్న పరిమాణంలో ఉన్న వాటిని పట్టుకోవద్దని సూచించింది.

ఈ నివేదికలోని సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 2023 నవంబర్ 2న 54 రకాల చిన్న చేపల ఫిషింగ్‌ను రద్దు చేసి, డీనోటిఫై చేసింది. దీనిలో పాంప్లెట్ కూడా ఉంది.

చేపలు

ఫొటో సోర్స్, SHARDUL KADAM/BBC

ఈ చేపల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మత్స్య శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ చెప్పారు.

ప్రభుత్వం ఇప్పటివరకు 609 మందిపై చర్యలు తీసుకుందని, అనధికారికంగా మత్స్య వేట సాగిస్తున్న వారి నుంచి రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్లను వసూలు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

మత్స్య సంరక్షణ కోసం ఏడు తీర ప్రాంత జిల్లాల్లో ‘ఆర్టిఫిషియల్ రిప్స్’ను ఏర్పాటు చేసింది. దీని కోసం రూ.52.42 కోట్లను జారీ చేసింది. దీనిలో చేపలను ఉత్పత్తి చేయొచ్చు.

సైజులో 13.5 సెంటీమీటర్ కంటే తక్కువగా ఉన్న పాంప్లెట్లను చంపడానికి వీలు లేదు. ఒకవేళ చంపితే, ఈ చేప కొన్నేళ్లలో అంతరించిపోయే ప్రమాదముంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా పాంప్లెట్ లాంటి చేపలను సంరక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)