మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలోని పన్ను రాబడిలో తమకు తక్కువ వాటా ఇస్తున్నారని తమిళనాడుతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆర్థిక సమాఖ్య ఏర్పాటు చేయాలని కూడా కర్ణాటక డిమాండ్ చేస్తోంది.

పన్నుల ద్వారా తమకు రావాల్సిన వాటాలో తక్కువ నిధులు పంపిణీ చేస్తున్నారని గత కొద్దిరోజులుగా కేరళ, కర్నాటక రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.

తమిళనాడు చాలాకాలంగా ఈ ఆరోపణ చేస్తుండగా, తాజాగా ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా మద్దతుగా నిలిచాయి. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక సమాఖ్య ఏర్పాటుకు కర్నాటక ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఈ వివాదం ఏంటి, దాని నేపథ్యం ఏమిటి?

2024 ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మధ్యంతర ఆర్థిక బడ్జెట్ సమర్పించిన తర్వాత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలను ఇలా నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక దేశం డిమాండ్‌ను లేవనెత్తాల్సి వస్తుందని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

అంతేకాదు, నిధుల పంపిణీలో కర్ణాటకను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిబ్రవరి 7న దిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఆ మరునాడు కేరళకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం దిల్లీలో నిరసనకు దిగారు. ఆ కార్యక్రమానికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించారు. తమిళనాడులోని డీఎంకే కూడా ఈ నిరసనలో పాల్గొంది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే రకమైన ప్రకటన చేశారు.

ఇదే సమయంలో #SouthTaxMovement అనే హ్యాష్‌ట్యాగ్ సోమవారం ఎక్స్(ట్విట్టర్‌)లో ట్రెండ్ అయ్యింది.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (ఫైల్)

నిధుల కేటాయింపుపై చర్చ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపకానికి సంబంధించి గత కొన్నేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రాల నుంచి సేకరించిన నిధులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత రాష్ట్రాలకు పంపిణీ అవుతాయి. ఈ నిధుల కేటాయింపు వివిధ ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఈ నిధుల కేటాయింపు ఎలా చేయాలో నిర్ణయించడానికి ప్రతి ఐదేళ్లకు ఒక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పంచుకుంటాయి.

ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు (2021-2026) అమలులో ఉన్నాయి. అయితే, 13వ ఆర్థిక సంఘం ఉన్నంత వరకు ఆదాయంలో 32 శాతం మాత్రమే రాష్ట్రాలకు పంపిణీ అయ్యేది.

14వ ఆర్థిక సంఘం ఈ విధానం మార్చింది. రాష్ట్రాలకు నిధుల కేటాయింపును 32 నుంచి 42 శాతానికి పెంచింది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

జనాభా, పన్నులు

ప్రతి రాష్ట్రం ఈ 42 శాతం నిధులను ఎలా పంచుకోవాలో ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ భాగస్వామ్యం ఆరు అంశాలను దృష్టిలో ఉంచుకుని చేస్తారు. అందులో రాష్ట్రాల విస్తీర్ణం (15 శాతం), రాష్ట్రాల జనాభా (15 శాతం), అత్యల్ప తలసరి ఆదాయం (45 శాతం), అటవీ, పర్యావరణం (10 శాతం), పన్ను వసూలులో రాష్ట్రాల సామర్థ్యం (2.5 శాతం) ఉన్న రాష్ట్రానికి అదనపు నిధులు, జనాభా నియంత్రణలో రాష్ట్రాల పనితీరు (12.5 శాతం) ఉన్నాయి.

70వ దశకం మధ్యలో భారతదేశం తన జనాభా పెరుగుదలను నియంత్రించే ప్రయత్నాలను తీవ్రతరం చేయడం ప్రారంభించింది. మొదటి జాతీయ జనాభా విధానాన్ని 1976లో రూపొందించారు. దీని తర్వాత ఒక్కో రాష్ట్రం ఒక్కో స్థాయిలో జనాభా నియంత్రణ ప్రారంభించింది. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గడం ప్రారంభమైంది. కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో అలా జరగలేదు. జనాభా వేగంగా పెరగడం కొనసాగింది.

ఆ విధంగా 1976 తర్వాత ఏర్పాటైన ఫైనాన్స్ కమిషన్లు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా ఉపయోగించాయి. 14వ ఆర్థిక సంఘం వరకు ఇదే పద్దతి ఉంది. కానీ, 15వ ఆర్థిక సంఘం తాజా జనాభా లెక్కలను ఉపయోగించాలని ఆదేశించింది. దీంతో 2011 జనాభా లెక్కలు తీసుకున్నారు.

తమిళనాడు సీఎం స్టాలిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తమిళనాడు సీఎం స్టాలిన్ (ఫైల్)

తమిళనాడు నుంచి మొదటి వాయిస్

దీన్ని చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా జనాభా నియంత్రణలో ప్రభావవంతంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

దీంతో ప్రతి రాష్ట్రం జనాభా నియంత్రణ అమలును పరిగణనలోకి తీసుకుంటామని 15వ ఆర్థిక సంఘం హామీ ఇచ్చింది.

అయితే, ఫైనాన్స్‌ కమిషన్‌లోని 2011 జనాభా లెక్కల అంశం తమకు ప్రతికూలంగా ఉందంటూ మొదట గళం విప్పింది తమిళనాడు.

15వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పుదుచ్చేరి, దిల్లీ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ఎంకే స్టాలిన్ లేఖ రాశారు.

1971కి బదులు 2011 జనాభా లెక్కలను రిఫరెన్స్ పాయింట్‌గా ఉపయోగించడం, అలాగే జనాభా నియంత్రణలో మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు ప్రోత్సాహాకాలు లేకపోవడం ప్రతికూలంగా ఉందని లేఖలో తెలిపారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్తగా సామాజిక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతోంది. వేరే పార్టీలో అధికారంలో ఉన్న తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఆ పథకాల అమలు కుదరదు, ఎందుకంటే అలాంటివి ఇప్పటికే అమల్లో ఉన్నాయి. అందువల్ల దీని ద్వారా లభించే ప్రోత్సాహకాలు కూడా లభించడం లేదని స్టాలిన్ లేఖలో తెలిపారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (ఫైల్)

దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారా?

‘‘కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్నిచ్చే రాష్ట్రాలు దక్షిణ భారత రాష్ట్రాలు. కానీ వాటిని ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగిస్తున్నారు’’ అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ఆరోపించారు.

15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన సిఫార్సులు ఈ రాష్ట్రాలకు మరో షాక్‌ ఇచ్చాయి. జనాభా నియంత్రణలో మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు అదనపు పాయింట్లు ఇస్తామని ఫైనాన్స్ కమిషన్ చెప్పగా, ప్రారంభ సంవత్సరంగా 1976కి బదులు 2011ని ఉపయోగించారు. ఫలితంగా 70, 80లలో జనాభాను భారీగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు ప్రయోజనం పొందలేదు.

అనంతరం మీడియాలో దీనికి సంబంధించిన చర్చలు, కథనాలు వచ్చాయి, కానీ రాజకీయంగా ముందుకు కదల్లేదు.

అయితే పన్నుల వసూళ్లు పంచివ్వడంలో దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారనే వాదన గత కొద్ది రోజులుగా మళ్లీ మొదలైంది.

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,12,680 కోట్లు కేటాయించారు.

రూ. 1,92,514 కోట్లు కర్ణాటక రాష్ట్రానికి పంపిణీ అయ్యాయి. రూ. 2,34,013 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేశారు.

గుజరాత్‌కు 1,84,154 కోట్లు పంపిణీ చేశారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు రూ. 8,55,000 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.3,82,010 కోట్లు, బిహార్‌కు రూ.4,78,751 కోట్లు పంపిణీ చేశారు.

పుస్తకం

ఫొటో సోర్స్, AMAZON.COM

ఫొటో క్యాప్షన్, 'సౌత్ వర్సెస్ నార్త్: ఇండియాస్ గ్రేట్ డివైడ్' పుస్తకాన్ని ఆర్.ఎస్. నీలకందన్ రచించారు.

ఇతర దేశాల్లో ఎలా ఉంది?

అయితే, దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలా? ఈ ప్రశ్నకు 'సౌత్ వర్సెస్ నార్త్: ఇండియాస్ గ్రేట్ డివైడ్' రచయిత ఆర్.ఎస్. నీలకంఠన్ వివరణ ఇచ్చారు.

‘‘నిజమే, కాదనలేం. ఎక్కడ అసమానతలు ఉన్నా అది ప్రతిచోటా జరగాలి. కానీ దానికి రకరకాల కోణాలుంటాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రాల నుంచి ఎంత తీసుకుని అభివృద్ధి చెందని రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి అనేది మొదటి అంశం. రెండోది అభివృద్ధి చెందిన రాష్ట్రాల నుంచి నిధులు ఎప్పుడు వెనుకబడిన రాష్ట్రాలకు బదిలీ అవ్వాలి? ఆ నిధుల ఉపయోగంపై వాటిని ఇస్తున్న రాష్ట్రాలకు నియంత్రణ లేదు. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు పెద్ద మొత్తంలో నిధులు అందజేస్తున్నా, వాటిని ఖర్చు చేసే విషయంలో వాటికి నియంత్రణ అధికారాలు లేవు. ఏ నియంత్రణలు లేకుండా ఆ నిధులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. అయితే, ఇక్కడ నిధులు ఇస్తున్న రాష్ట్రాల్లో కూడా రోడ్లు, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి" అని అన్నారు.

"వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు సమకూర్చినప్పుడు, వాటిని అక్కడ అభివృద్ధి పనులకే ఉపయోగించాలి. ఆ విధంగా అభివృద్ధి చెందని, చెందిన రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గించాలి. కానీ, అలా జరగడం లేదు. జరగకపోయినా మళ్లీ అదనపు నిధులు కేటాయించేలా నిబంధనలున్నాయి" అని నీలకంఠన్ వివరించారు.

మరోవైపు అదనపు పన్నులు చెల్లించే దక్షిణాది రాష్ట్రాలకు విధాన రూపకల్పన, వ్యయంపై నియంత్రణలో తక్కువ ప్రాతినిధ్యం ఉందని నీలకంఠన్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలోని అనేక దేశాలలో అభివృద్ధి చెందిన, చెందని ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తారు. మరి భారత్‌లో ఎందుకు సమస్యగా మారింది?

దీనికి నీలకంఠన్ ఇలా బదులిచ్చారు: "అమెరికాలో ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలకు అదనపు నిధులిస్తారు. తూర్పు జర్మనీ కంటే పశ్చిమ జర్మనీ అభివృద్ధి చెందింది. ఇక్కడ కూడా ప్రభుత్వం అదనపు నిధులు కేటాయిస్తుంది. చైనాతో సహా అన్ని దేశాల్లో ఇలానే ఉంది. అయితే అక్కడికి, ఇక్కడికి వ్యత్యాసం ఉంది. ఆయా దేశాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఎక్కువ మంది నివసిస్తున్నారు. కాబట్టి, అభివృద్ధి చెందిన, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు తక్కువ జనాభా రాష్ట్రాలకు అదనపు నిధులు ఇవ్వడం సమస్య కాదు. కానీ భారత్‌లోని పేద రాష్ట్రాలలో ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు తక్కువ జనాభాతో ఉన్నాయి. కాబట్టి నిధులను బదిలీ చేయడం సమస్యని సృష్టిస్తోంది."

బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి
ఫొటో క్యాప్షన్, బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి

బీజేపీ ఏం చెబుతోంది?

ఈ వాదనను బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి వ్యతిరేకిస్తున్నారు.

"కర్ణాటక, తమిళనాడు మొదలైనవి అధిక ఉత్పత్తి కలిగిన రాష్ట్రాలు. అందువల్ల, అక్కడ పన్ను ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నివాసితులు ఈ రాష్ట్రాల్లోని ఉత్పత్తులను కొని పన్నులు చెల్లిస్తారు. తమిళనాడు తీరప్రాంత రాష్ట్రం, ఇక్కడ ఓడరేవులు ఉన్నాయి. ఓడరేవులు ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఫ్యాక్టరీలు ఏర్పాటవుతాయి, కాబట్టి నిధులను పంచుకోవాలి'' అంటున్నారు.

''మరోవైపు తమిళనాడు వంటి రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఉన్న కార్ల వంటి ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయం ఎక్కువగా జరుగుతుంటుంది. వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను లేదు. కాబట్టి రెండు రాష్ట్రాలను పోల్చలేం. అంతేకాకుండా ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల మధ్య నిధులు పంపిణీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. నిజానికి కాంగ్రెస్ హయాంలో కంటే ఎక్కువ నిధులు పంపిణీ చేస్తున్నారు’’ అని నారాయణన్ అన్నారు.

ఇపుడు దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక సమాఖ్యను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా పెరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రికి ఆ వివరాలు అందజేస్తామని ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు బసవరాజ రాయరెడ్డి చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

2018లో కేరళ ప్రభుత్వం కూడా ఇలాంటిదే ప్రతిపాదించింది. 2018లో 15వ ఆర్థిక సంఘం నిబంధనలను విడుదల చేసినప్పుడు, దక్షిణాది రాష్ట్రాలు అసంతృప్తితో ఉన్నందున ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ సూచించారు. ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు.

అయితే, దక్షిణాది రాష్ట్రాల పన్నుల విషయం తెరపైకి తేవడం ఎప్పటిలాగే కాంగ్రెస్ విభజన స్వభావాన్ని ప్రతిబింబిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.

"కాంగ్రెస్ అధికారంలో లేనందున వారు విభజన గురించి మాట్లాడటం ప్రారంభించారు, వారు అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తారని ఇది నిరూపిస్తోంది" అని నారాయణన్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)