పాకిస్తాన్ ఎన్నికలు: ఇమ్రాన్ ఖాన్ మద్దతుతో గెలిచిన ఇండిపెండెంట్లంతా ఇప్పుడు ఏం చేయబోతున్నారు

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, కరోలిన్ డేవిస్
- హోదా, బీబీసీ పాకిస్తాన్ కరస్పాండెంట్
పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు సంక్లిష్టంగా ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో విజయం సాధించారు.
పార్టీల పరంగా పరిశీలిస్తే నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా నిలిచింది.
ఈ ఎన్నికల ఫలితాలు ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీకి ఉన్న ప్రజాదరణ అనేది సోషల్ మీడియా బబుల్ కాదని, నిజమైనదేనని స్పష్టం చేశాయి.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలోని 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో పీటీఐ మద్దతిచ్చిన 91 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా, నవాజ్ షరీఫ్ పీఎంఎల్ (ఎన్) నుంచి 71 మంది అభ్యర్థులు విజయం సాధించారు.
పీపీపీ 54 స్థానాలు, ఎంక్యూఎం అభ్యర్థులు 17 స్థానాల్లో విజయం సాధించారు.

అనర్హత, జైలు, అజ్ఞాతం
పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అనర్హతకు గురై జైలుకెళ్లారు. ఆయన ఇప్పటికే మూడేళ్ల జైలు శిక్షను అనుభవిస్తుండగా, మరికొన్ని జైలు శిక్షలు కూడా ఇటీవల ప్రకటించారు.
మరోవైపు పీటీఐకి బ్యాట్ గుర్తు సైతం రద్దయింది.
2022లో ప్రధాని పదవిని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్, తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమని చెబుతున్నారు.
పీటీఐ అభ్యర్థులు స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేయాల్సి రావడంతో భారీ ర్యాలీలు తీయలేకపోయారు. కొంతమంది జైల్లో ఉండగా, మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా పోలీసులు బెదిరించారని, ఎత్తుకెళ్లారని పీటీఐ మద్దతుదారులు ఆరోపించారు. అయితే, అధికారులు వారి ఆరోపణలను ఖండించారు.
ఈ పరిస్థితుల్లో కూడా పీటీఐకి మద్దతుగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు ఇతర గ్రూపుల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నట్లు కనిపిస్తోంది.
పాక్ సైన్యం మద్దతు ఉందని భావిస్తున్న పీఎంఎల్-ఎన్ పార్టీ ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇదే సమయంలో బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) మూడో స్థానంలో నిలిచింది.
క్లిష్టమైన విషయమేమిటంటే ఇపుడేం జరగబోతోంది?

ఫొటో సోర్స్, EPA
స్వతంత్రులు ఏం చేయబోతున్నారు
వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేయడంతో రానున్న రోజుల్లో ఆ ఫలితాలు మారవచ్చు.
పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించిన క్షణం నుంచి 3 రోజుల్లోపు స్వతంత్రులందరూ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరవలసి ఉంటుంది లేదా వారు స్వతంత్రంగానే ఉండాలి.
దీంతో పీటీఐ త్వరలో ఏదో ఒక మార్గం వెతుక్కోవల్సి ఉంది.
ఎందుకంటే మిగతా పార్టీలు స్వతంత్ర అభ్యర్థులపై దృష్టి సారించాయి, వారంతా తమ పార్టీలో చేరేలా ఒప్పించగలమని ఆశిస్తున్నాయి, ఒక్కొక్కరితో చర్చలు సాగిస్తున్నాయి.
ఇదే సమయంలో మెజారిటీని చేరుకోవడానికి పీఎంఎల్-ఎన్ పార్టీ పొత్తుల కోసం ప్రయత్నిస్తోంది. పీటీఐ కూడా స్వతంత్రులను ఎవరు ముందుండి నడిపించాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఎందుకంటే ఇమ్రాన్ ఇప్పటికిప్పుడు జైలు నుంచి విడుదలయ్యేలా కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, EPA
అనూహ్యం
ఇక్కడ మరో పెద్ద ప్రశ్న కూడా తలెత్తుతోంది. మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన పీఎంఎల్-ఎన్ పార్టీ నాయకుడు నవాజ్ షరీఫ్‌కు సైనిక మద్దతు ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్వసించారు.
అయినప్పటికీ ఇమ్రాన్ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు. పాకిస్తాన్‌లో మిలటరీ పాత్రను ఇది ఏ విధంగా సూచిస్తోంది?.
సరళంగా చెప్పాలంటే పాకిస్తాన్ రాజకీయాలు విభిన్న అంశాలతో కూడిన సంక్లిష్టమైన ఆటలా ఉంది.
ఎన్నికలను అంచనా వేయగలమనుకున్నారు, కానీ అది ఆశ్చర్యకరంగా,అనూహ్యంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- మాల్దీవులకు సైన్యానికి బదులు టెక్నికల్ టీమ్‌ను పంపించడం వెనుక భారత్ వ్యూహమేంటి?
- పీవీ నరసింహారావుకు భారతరత్న: ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
- శ్రీలంకలో రోజుకు ఒక ఏనుగు ఎందుకు చనిపోతోంది?
- కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎందుకు ధర్నా చేస్తున్నారు?
- ఫుడ్ ప్యాకెట్ల మీద ధరతోపాటు చూడాల్సిన కీలక అంశాలు ఇవీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














