ఇమ్రాన్ ఖాన్: బ్యాట్ గుర్తు పోయింది, బయటకొస్తే దాడులు.. ట్విటర్, టిక్‌టాక్, వర్చువల్ ర్యాలీలనే నమ్ముకున్న ‘పీటీఐ’ అభ్యర్థులు

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి 8న జరిగే పాకిస్తాన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పీటీఐ నాయకత్వం ఈసారి డిజిటల్ మాధ్యమాల ప్రచార విధానాన్ని ఎంచుకుంది.
    • రచయిత, కరోలిన్ డేవిస్
    • హోదా, బీబీసీ న్యూస్, పాకిస్తాన్

రెండేళ్ల కాలంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి జైలు వరకు వెళ్లారు. ఆయన స్థాపించిన పీటీఐ పార్టీ కోలుకోలేని రీతిలో పతనమైంది.

అయితే, విశ్వాసాన్ని కోల్పోబోమని, వారంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం తమదేనని పీటీఐ నాయకత్వం నమ్మకంగా ఉంది.

ఓ వైపు పార్టీ అధ్యక్షుడు జైలులో ఉన్నారు. ఆయన కూడా విజయంపై నమ్మకంగా ఉన్నారని పార్టీ వెల్లడించింది.

రాజకీయ ప్రోద్భలంతోనే తనపై కేసులు బనాయించారని, ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించారని ఇమ్రాన్ ఖాన్ గతంలో వ్యాఖ్యానించారు.

తమపై ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తమను గెలిపించాలని కోరుతూ పార్టీ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

వారిలో పంజాబ్ ప్రావిన్స్‌లోని సియాల్కోట్‌కు చెందిన రెహెనా దార్ ఒకరు. ఆమె తనను గెలిపించాలని కోరుతూ, సియాల్కోట్‌లోని ఇరుకైన వీధుల్లో ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

ఆమె మద్దతుదారులు ఇమ్రాన్ ఖాన్ ఫోటో, పార్టీ జెండా పట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

70 ఏళ్ల వయసులో ఆమె ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.

ఇతర ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులు భయంతో వీధుల్లోకి రాకుండా, అజ్ఞాతంలో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం సాగిస్తుంటే, ఆమె మాత్రం ధైర్యంగా వీధుల్లో పర్యటిస్తున్నారు.

పాకిస్తాన్ ఎన్నికలు

పార్టీ గుర్తును రద్దు చేసిన ఎన్నికల కమిషన్..

“సియాల్కోట్‌లోని నా సోదర సోదరీమణులు, నా బిడ్డల్లాంటి ప్రజలు నాతో నడుస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది” అని చెప్పారామె.

“నేను ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలుస్తున్నాను. ఆయనకే నా పూర్తి మద్దతు. ఒకవేళ నడివీధిలో నేను ఒక్కదాన్నే ఉన్నా కూడా ఆయన ఫొటో, పార్టీ జెండా పట్టుకుని ధైర్యంగా ముందుకు వెళ్తాను” అన్నారు.

నిజానికి ఆమె పీటీఐ అభ్యర్థిని కాదు, ఆమె ఒక్కరే కాదు ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్నవారంతా స్వతంత్య్ర అభ్యర్థులకిందే లెక్క. ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రకారం పార్టీకి కేటాయించిన బ్యాట్ గుర్తును రద్దు చేశారు. అందువల్ల ఆ పార్టీ అభ్యర్థులంతా స్వతంత్ర అభ్యర్థులే. వారికి ఆయా నియోజకవర్గాల వారీగా ఎన్నికల గుర్తుల కేటాయింపు జరుగుతుంది.

అయితే, నిరక్ష్యరాస్యత రేటు 58 శాతం ఉన్న పాకిస్తాన్ దేశంలో స్థానాల వారీగా అభ్యర్థులకు మంచం, సాక్సాఫోన్, కెటిల్ వంటి గుర్తుల కేటాయింపు జరిగా, ఓటర్లకు బ్యాలెట్ పేపర్లపై అవగాహన కల్పించడమనేది సాధారణమైన విషయమేమీ కాదు.

పీటీఐ ఎన్నికల వ్యూహానికి ఇది పెద్ద అవరోధంగా చెప్పొచ్చు.

తమ నాయకుడు పార్టీలో ఉన్నప్పటికీ టెక్నాలజీ సాయంతో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన ప్రసంగాలను ప్రసారం చేస్తూ, ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

పాకిస్తాన్ ఎన్నికల ప్రచారాలు

రెహెనా దార్ కుమారుడు ఉస్మాన్ సీనియర్ నాయకుడు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న ప్రభుత్వంలో యూత్ ఎఫైర్స్ విభాగంలో ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు.

గతేడాది అక్టోబర్‌లో ఆయన మూడు వారాలపాటు కనిపించకుండా పోయారని రెహెనా దార్ కుటుంబం తెలిపింది.

అనంతరం టెలివిజన్‌లో కనిపించి, “మే 9న జరిగిన అల్లర్ల వెనకున్న ప్రధాన సూత్రధారి ఇమ్రాన్ ఖాన్” అని వాంగ్మూలం ఇచ్చారు.

ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల్లో గతేడాది ఇమ్రాన్‌ఖాన్‌ను మొదటిసారి అరెస్ట్ చేశారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా నిరసనలు, అల్లర్లు జరిగాయి. వందల మంది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను అరెస్ట్ చేశారు. మిలటరీ కార్యాలయాలు, లాహోర్‌లోని సీనియర్ మిలటరీ అధికారి గృహంపై దాడి జరిగిన ఘటనలకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేశారు.

అనంతరం ఇమ్రాన్ ఖాన్ విడుదలైనప్పటికీ పార్టీలో సంక్షోభం మొదలైంది.

పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది వరుసగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

పార్టీ అధిష్టానం మాత్రం ఆ రాజీనామాల వెనుక కొన్ని శక్తుల ప్రోద్బలం ఉందని ఆరోపించింది.

తన కుమారుడు ఉస్మాన్ ప్రకటన పట్ల రెహెనా దార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

“అలాంటి తప్పుడు ప్రకటన చేయడం కన్నా ప్రాణాలు తీసుకుని ఉండాల్సిందని నేను నా కుమారుడికి చెప్పాను” అన్నారామె.

కానీ, ఆమె లాగా మిగిలిన అభ్యర్థులకు ఆ స్థాయిలో ప్రచారం చేయడం సాధ్యం కాకపోవచ్చు.

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

ఫొటో సోర్స్, EPA

'పీటీఐ నేతలు, కార్యకర్తలపై దాడులు'

ఉత్తర పాకిస్తాన్‌లోని ఖైబెర్ పఖ్తుంఖ్వాకు చెందిన మంత్రి అతీఫ్ ఖాన్ ఎన్నికల ప్రచారం మరోలా సాగుతోంది.

ఆయన మద్దతుదారుల సహకారంతో మూడు మీటర్ల డిజిటల్ తెరపై వీడియో సందేశాల ద్వారా ఆయన ప్రచారం చేయాల్సి వస్తోంది. ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.

అధికార యంత్రాంగాలను ఆయన్ను పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొన్నారు.

ఒకవేళ తాను లొంగిపోతే, విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తనకు నమ్మకం లేదని బీబీసీతో చెప్పారు అతీఫ్ ఖాన్.

ఖాన్ బీబీసీతో మాట్లాడుతూ, “ప్రజల మధ్యన లేకుండా ఇలా వర్చువల్‌గా ప్రచారం చేయడం భిన్నమైన అనుభూతి. కానీ, నా శక్తిమేర ప్రయత్నం చేస్తున్నాను. పీటీఐకు యువ ఓటర్లే ప్రధాన మద్దతుదారులు. వారంతా డిజిటల్ మీడియా, మొబైల్ ఫోన్లను వాడతారు. అందుకే మేం వారిని చేరుకునే విధానాన్ని ఎంచుకున్నాం. డిజిటల్ మీడియా ద్వారా మా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం” అని చెప్పారు.

అలా పార్టీ ప్రచారానికి టెక్నాలజీ కీలకంగా మారింది.

పార్టీ అధికారిక ట్విటర్ (ఎక్స్), టిక్‌టాక్ ఖాతాలకు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. పాకిస్తాన్‌లోని మిగిలిన ప్రధాన రెండు పార్టీలైన పీపీపీ, పీఎంఎల్-ఎన్‌ల కన్నా కూడా ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

ఇతర నాయకులతో పోలిస్తే ఇమ్రాన్‌ఖాన్‌ వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లకు ఫాలోవర్ల సంఖ్య భారీగా ఉంది. నేరుగా సందేశం ప్రజలకు చేరేందుకు ఇది అవకాశంగా మారింది.

మరోవైపు టెక్నాలజీ సాయంతో ఎన్నికల కమిషన్ బ్యాట్ గుర్తును పార్టీ అభ్యర్థులకు కేటాయించకపోయినా, ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, ఆయా స్థానాల వారీగా అభ్యర్థులు, వారికి ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తుల వివరాలను ఒకేచోట ఉంచారు.

ఇక ర్యాలీల విషయంలోనూ పార్టీకి సమస్య ఎదురైంది. పాకిస్తాన్‌లో రాజకీయాలు ఆ నాయకుడి వ్యక్తిత్వంతో ముడిపడి ఉన్నాయి.

ఇమ్రాన్ ఖాన్ క్రికెటర్‌గా, రాజకీయ నాయకుడిగా ప్రజలకు తెలుసు. అలా ఆయన ర్యాలీల్లో పాల్గొన్నప్పుడు వేలమందిని ఒకేచోట చేర్చగలిగారు. కానీ, ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. గతేడాది ఆగస్టు నుంచి జైలు జీవితం గడుపుతోన్న ఇమ్రాన్‌ఖాన్‌కు మరో 14 ఏళ్లు జైలు, దానితోపాటు మరో రెండు, మూడు జైలుశిక్షలు విధించింది న్యాయస్థానం.

ఆ పరిస్థితుల్లో పార్టీ తరఫున ర్యాలీలు నిర్వహించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఇబ్బందులు ఎదురయ్యాయి.

జనవరిలో కరాచీలో వందల మంది పీటీఐ కార్యకర్తలు ర్యాలీకి సిద్ధమైన సమయంలో వారిపై టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది. ర్యాలీ నిర్వహణకు వారు అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు.

తమ పట్ల కొనసాగుతున్న ఆంక్షలకు అదే తాజా ఉదహరణ అని పీటీఐ ఆరోపించింది. తాము వేధింపులను ఎదుర్కోవల్సి వస్తోందని ఆరోపించింది. అరెస్టులు, అభ్యర్థులపై బెదిరింపులు, అపహరణలకు పాల్పడుతున్నారంటూ పీటీఐ చేసిన ఆరోపణల్ని తాత్కాలిక మంత్రి ముర్తాజా సోలంగి ఖండించారు.

ఆయన బీబీసీతో, "ఆ ఆరోపణలన్ని నిరాధారం. నిజమే, అరెస్టులు చేస్తున్నాం. ఎవరైతే మే 9వ తేదీ అల్లర్లకు కారణమయ్యారో వారినే అరెస్ట్ చేస్తున్నాం. కొంతమంది ఇతర నేరాల్లో నిందితులు. అయినప్పటికీ వారికి అవకాశం ఉంది కదా? న్యాయస్థానాలను వారు ఆశ్రయించొచ్చు" అన్నారు.

పాకిస్తాన్ సైన్యం

ఫొటో సోర్స్, EPA

వర్చువల్ ర్యాలీలు ఫలితాన్నిస్తాయా?

పీటీఐ సోషల్ మీడియా బాధ్యులు జిబ్రాన్ ఇలియాస్ షికాగో నుంచి బీబీసీతో మాట్లాడుతూ.. “మేం వర్చువల్ ర్యాలీల ద్వారా ఎన్నికల ప్రచారం చేపడుతున్నాం. నిజానికి ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సురక్షితం. ప్రత్యక్ష ర్యాలీలతో పోలిస్తే, తక్కువ ప్రభావమే చూపుతుంది కానీ, మా శక్తిమేర ప్రయత్నిస్తున్నాం” అన్నారు.

“ఇమ్రాన్ ఖాన్ లేకుండా గతంలో ఎన్నడూ ర్యాలీలు జరగలేదు“ అన్నారు ఇలియాస్.

“ర్యాలీ అనగానే ప్రజలు ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగం కోసం చూస్తుంటారు” అన్నారు.

అందుకు ప్రత్యామ్నాయంగా గతేడాది డిసెంబర్‌లో ఏఐ సాంకేతిక సాయంతో వర్చువల్ ర్యాలీ కోసం ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని సృష్టించారు.

వాషింగ్టన్‌లోని విల్సన్ సెంటర్ థింక్ ట్యాంగ్‌లోని సౌత్ ఆసియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మైకెల్ మాట్లాడుతూ, “పాకిస్తాన్ జనాభాలో 30 % మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అందువల్ల పీటీఐ వారిని చేరుకోవడంలో పరిమితులు ఉన్నాయి” అని అన్నారు.

అయితే, పాకిస్తాన్‌లో గత ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ జైల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితిని పాకిస్తాన్ ప్రజలు గతంలో చూశారు.

గతాన్ని బట్టి చూస్తే, అప్పటికీ ఇప్పటికీ మార్పులేదు. కాకపోతే, వ్యక్తులే మారారు అన్నారు మైకెల్.

 పాకిస్తాన్ ఎన్నికలు 2024

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి 8వ తేదీన పాకిస్తాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు?

అయితే, చాలామంది రాజకీయ విశ్లేషకుల ప్రకారం పాకిస్తాన్‌లో అధికారం చేతులు మారడంలో సైన్యం పాత్ర కీలకం. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా అధికారంలోకి రావడం వెనుక కూడా అదే ఉంది.

మైకెల్ మాట్లాడుతూ, “2018లో పీటీఐకు ఎన్నికల మద్దతు ఉంది. ఆర్మీ మద్దతుతో వారు ప్రయోజనం పొందారు. దేశంలో అణిచివేతలు, అవకతవకలు జరిగాయి. ఎన్నికలు సమీపించిన సమయంలో నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించారు” అన్నారు.

అయితే, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని మైకెల్ తన అభిప్రాయాన్ని తెలిపారు.

“ఇమ్రాన్ ఖాన్‌ ముఖ చిత్రంగా పీటీఐ విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తోంది. నిజమే, కానీ అది వారికి ఏ స్థాయిలో లాభిస్తుంది?

ఈసారి కుటుంబ సభ్యుల్ని కూడా అందులో భాగం చేశారు. గత ఎన్నికల్లాంటి పరిస్థితి కాదు ఇది.

పాకిస్తాన్ టీవీ ఛానెళ్ల ప్రసారాలన్ని ఎన్నికల ప్రధానంగానే సాగుతున్నాయి. ఓ పక్క నవాజ్ షరీఫ్, మరోపక్క బిల్వాల్ భుట్టోల ప్రసంగాలు ప్రసారమవుతుంటే, ఇమ్రాన్‌ఖాన్‌కు సంబంధించి విచారణలు, న్యాయస్థానం తీర్పులకు సంబంధించిన వార్తలు ప్రసారం అవుతున్నాయి” అన్నారు.

ఆయన అభిప్రాయం ప్రకారం ఎన్నికల్లో పీటీఐ విజయం సాధిస్తుందని ఆశించడంలో అర్థం లేదు.

“ఇమ్రాన్ ఖాన్ విషయంలో జరుగుతున్న దాని గురించి ఓటర్లకు వివరించి, తమ అభ్యర్థులకు ఓటు వేసేలా ఏం చేయగలరన్నది పీటీఐ నాయకులకు ఎదురయ్యే ప్రశ్న. ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటే తమకు అనుకూలిస్తుందని, అద్భుతం జరుగుతుందని పీటీఐ నాయకులు నమ్ముతున్నారు” అన్నారు మైకెల్.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)