పాకిస్తాన్ ఎన్నికలు: పోలింగ్‌కు ముందు రోజు బలూచిస్తాన్‌లో భీకర బాంబు దాడులు, 22 మంది మృతి

బాంబు దాడి బాధితుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్వెట్టాలో బాంబు దాడిలో గాయపడ్డ ఒక వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
    • రచయిత, సిమోన్ ఫ్రాసెర్, కరోనిల్ డేవీస్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు, లండన్, ఇస్లామాబాద్‌ల నుంచి...

పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుండగా, దానికి ఒక్క రోజు ముందు బుధవారం బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో రెండు భీకర బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 22 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

పిషిన్ జిల్లాలోని ఖెనుజాయ్ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థి కార్యాలయానికి ఎదుట జరిగిన మొదటి బాంబు దాడిలో 14 మంది మృతి చెందారు. 35 మంది గాయాలపాలైనట్లు అధికారులు చెబుతున్నారు.

మొదటి దాడి జరిగిన ప్రాంతానికి 150 కిలోమీటర్ల దూరంలో ఖిల్లా సైఫుల్లా జిల్లాలో రెండో దాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మంది చనిపోయారు.

ఈ రెండు దాడుల్లో చాలా మంది ప్రజలు గాయాల పాలయ్యారు.

బలూచిస్తాన్‌లో బాంబు దాడి
షిపిన్ జిల్లాలో దాడి జరిగిన ప్రాంతం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిషిన్ జిల్లాలో బాంబు దాడి జరిగిన ప్రదేశం

పిషిన్‌ దాడి: ఎగిరిపడ్డ కార్లు, బైక్‌లు

పిషిన్‌లో దాడికి ఏ గ్రూప్‌ కూడా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేయలేదు. పిషిన్ పట్టణం క్వెట్టా నగరం నుంచి 50 కి.మీ., అఫ్గానిస్తాన్ సరిహద్దుకు ఆగ్నేయంగా 100 కి.మీ. దూరంలో ఉంది.

రెండో దాడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రెండు దాడులకు కారణం తెలియలేదు.

పిషిన్‌లో దాడి జరిగినప్పుడు కార్లు, మోటార్ బైక్‌లు ఎగిరిపడ్డ చిత్రాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

స్థానిక స్వతంత్య్ర అభ్యర్థి ఎన్నికల కార్యాలయం బయట ఈ దాడి జరిగిందని, ఈ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఎన్నికల కార్యాలయం బయట ఉన్నట్లు బీబీసీకి అధికారులు తెలిపారు.

ప్రస్తుతం జరిగిన రెండు దాడులకు కారణమేంటన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

ఓటింగ్ ప్రణాళికబద్ధంగా జరుగుతుందని బలూచిస్తాన్ ప్రభుత్వం తెలిపింది.

‘‘ఈ కీలకమైన ప్రజాస్వామ్యబద్ధమైన ప్రక్రియను దెబ్బతీసేందుకు లేదా వారు నిర్ణయించేందుకు ఉగ్రవాదులకు మేం అనుమతించం’’ అని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో బలూచిస్తాన్ స్థానిక సమాచార మంత్రి జాన్ అచాక్జాయ్ పోస్టు చేశారు.

పాకిస్తాన్‌లో బాంబు దాడి
పోలీస్ స్టేషన్‌పై తీవ్రవాదుల దాడి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఇటీవల పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌పై తీవ్రవాదులు చేసిన దాడిలో 10 మంది పోలీసు అధికారులు చనిపోయారు.

గత వారం రోజుల్లో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

రెండు రోజుల క్రితం పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఒక పోలీస్ స్టేషన్‌పై తీవ్రవాదులు చేసిన దాడిలో 10 మంది పోలీసులు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. దాడికి కారణం తెలియలేదు. సార్వత్రిక ఎన్నికలతో దీనికి సంబంధం ఉందా, లేదా అనేది కూడా వెల్లడి కాలేదు.

జనవరి 31 బుధవారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని నేషనల్ అసెంబ్లీకి చెందిన అభ్యర్థిని చంపేశారు.

ఖైబర్ ఫఖ్తుంఖ్వా‌లో చౌద్వాన్ పోలీసు స్టేషన్‌ను మూడు దిక్కుల నుంచి 30 మందికి పైగా తీవ్రవాదులు చుట్టుముట్టారని ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రొవిజనల్ పోలీసు చీఫ్ అఖ్తర్ హయత్ గందాపూర్ తెలిపారు. తొలుత స్నైపర్ గన్‌లతో కాల్పులు జరిపారని, ఆ తర్వాత గ్రనేడ్లతో దాడి చేసినట్లు చెప్పారు.

దాడి జరిగిన సమయంలో పోలీసు స్టేషన్‌లో 30 మందికి పైగా పోలీసులున్నారని ఆ ప్రాంత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అనిసుల్ హసన్ బీబీసీ ప్రతినిధి అజిజుల్లా ఖాన్‌కు చెప్పారు.

పోలీస్ స్టేషన్‌కు దగ్గర్లోని భవనం నుంచి తీవ్రవాదులు దాడి జరిపినట్లు తెలిపారు.

రెండేళ్లుగా తీవ్రవాదుల దాడులు, భద్రతా బలగాలతో, పోలీసులతో ఘర్షణలు, చంపడమే లక్ష్యంగా జరుగుతున్న ఘటనలు ఖైబర్ ఫఖ్తుంఖ్వా దక్షిణ ప్రాంతంలో బాగా పెరుగుతున్నాయి.

పాకిస్తాన్‌లోని 90,675 పోలింగ్ స్టేషన్లలో సగం స్టేషన్లను ‘సున్నితమైన’ అంటే ఘర్షణలు జరిగే ముప్పున్న స్టేషన్లుగా, లేదా ‘అత్యంత సున్నితమైన’ అంటే ఎక్కువ ముప్పున్న స్టేషన్లుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. స్థానిక భద్రతా పరిస్థితులు, ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనల చరిత్రను పరిగణనలోకి తీసుకుని వీటిని ఇలా వర్గీకరించింది.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో రెండు భీకర బాంబు దాడులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)